"ఆ రోజే ఇచ్చాను."
"ఏమంది?"
"నా అభిప్రాయం అడిగింది. తరవాత చెపుతానని వచ్చి వేశాను. మళ్ళీ వెళ్ళలేదు."
"ఎందుకు వెళ్ళలేదు?"
"నాకు తీరిక లేదక్కా ఉన్న సమయంలో నేనూ కథలు వ్రాయాలని ప్రయత్నిస్తున్నాను" అని, "అదిసరే, ఇంతకీ ఉత్తరంలో విషయం చెప్పలేదు. విశేషం లేనిదే ఈ వేళప్పుడు రావుగదా!" అన్నాడు.
"నజ్ మా వాళ్ళన్నయ్య మెడ్రాసులో అన్నయ్య వాళ్ళింటి దగ్గర్లోనే ఉంటున్నాడట. రెండు నెలల నుండి నజ్ మా అన్నతోనే ఉంటూందట. అదే వ్రాశాడు.... సరే, నువ్వు వ్రాసుకో" అని వెళ్ళిపోయింది.
క్రిందికి వచ్చిన తరవాత లత మళ్ళీ రాజా వ్రాసిన ఉత్తరం చదవటం మొదలుపెట్టింది.
"చెల్లీ,
నీ ఉత్తరాలు చూస్తుంటే నీవు సంపాదించిన ఆ తమ్ముడిని చూడాలని మనస్సు తొందర పెడుతూందమ్మా. కాని, ఏం చెయ్యను? ఇప్పుడు రాలేను. ఏదో ఒక రోజు నీకు చెప్పకుండా దిగి ఆశ్చర్యపరుస్తాను. సరేనా?
చెల్లీ! రెండు నెలలనుండీ నజ్ మా ఇక్కడే ఉంది. ఈమధ్య భాషా కనిపించి ఇంటికి తీసుకెళ్ళాడు. అతనికి ఇక్కడే ఉద్యోగం. నజ్ మా వెనకటికంటే కూడా ఇప్పుడు మరీ పాడైపోయింది. బాషా ఆమెను సంతోషంగా చూడాలని సర్వవిధాలా ప్రయత్నిస్తున్నాడు. నజ్ మా నన్ను చూడగానే నీ సంసారం గురించి, రమాకాంత్ గురించి ఎన్ని ప్రశ్నలు వేసిందో చెప్పలేను. అన్నిటికి జవాబులు విపులంగా చెప్పాను. అయినా 'లత సంగతులు ఇంకా చెప్పమని' ఒకటే గొడవ. అప్పటి నుండి అప్పుడప్పుడు వాళ్ళింటికి వెళుతున్నాను. ఒక రోజు గీతనుకూడా తీసుకెళ్ళాను. గీతకు నజ్ మా నచ్చింది. ఇది గొప్ప సంగతి. ఒక రాత్రి ఆమె కథనంతా చెప్పించుకొని వింది. ఇది నెల రోజుల క్రిందటి సంగతి. అప్పటినుండి గీతకు నజ్ మా ప్రియస్నేహితురాలైంది. ఇక ఉంటాను, చెల్లీ. గీత భోజనానికి కేకలు పెట్టుతూంది. ఈమధ్య ఆమె నాకు స్వయంగా వడ్డిస్తూంది. అది మరో విశేషం.
-నీ అన్న."
తృప్తిగా నిట్టూర్చి మంచంపై పడుకొన్న లత పక్కకు తిరిగింది, ఈజీ చైరులో పడుకొన్న రమాకాంత్ ఆమె వంకే చూస్తున్నాడు.
"ఎప్పుడు వచ్చారు మీరు? పిల్లిలా వచ్చి కూర్చుని దొంగచూపులు చూస్తున్నారే? ఎప్పుడు నేర్చారివన్నీ?"
"నీవు నా హృదయాన్ని దొంగిలించినప్పుడు."
కళ్ళతోనే నవ్వాడు రమాకాంత్. హృదయం ఆనందంతో ఉప్పొంగినా అది కనబడనీయకుండా అతనికి కాఫీ తేవడానికి లేచింది లత.
"లతా డియర్! ఆ రోజు నా కథను విమర్శించావు కానీ చూశావా, ఎన్ని ప్రశంసలు వచ్చినవో" అంటూ ఉత్తరాలకట్ట బల్లమీద పడేసి లత ఇచ్చిన కాఫీ అందుకొన్నాడు.
"నేను మీ కథనేమీ విమర్శించలేదు. నాకు నచ్చలేదు అన్నాను. అంతేగా?"
"అవును అంతే అన్నావు. కాని స్త్రీలకే అది ఎక్కువ వచ్చింది. చూడరాదూ?" అంటూ ఆ ఉత్తరాలు అందిచ్చాడు.
లత ఒక్కొక్క ఉత్తరమే చదువుతూంది. ఒక దానిలో, "ఎన్నో కథలు పత్రికలలో చదువుతూ ఉంటాం. కాని కొన్ని కథలే హృదయ ఫలకంపై ముద్రపడి పోతాయి. అలాటి అరుదైన కథలలో మీ కథ ఒకటి" అని ఉంటే, మరొక దానిలో, "పుష్పభరిత మైన సాహితీవనంలో మీ కథ సౌరభాలు వెదజల్లే సంపెంగ" అని ఉంది.
"రచనలు చాలామంది చేస్తారు. కాని పాఠకుల హృదయాలను కొందరే ఆకర్షించగలరు. ఆ కొందరిలో మీ రొకరు." ఒక బి. ఎ. విద్యార్ధిని వ్రాసింది.
"నిజాన్ని నిర్భయంగా చెప్పగలగటానికి ధైర్యం కావాలి. ఆ నిజాన్ని కాగితం మీద పెట్టటానికి సాహసం కావాలి." అది ఒక గృహిణి లేఖ.
"కథ లెప్పుడూ ఊహాలోకంలో విహరించేటట్లు ఉండకూడదు. సహజత్వాన్ని ప్రతిబింబింపజేసే మీ కథలు నా కెంతో ఇష్టం." ఒక పి. యు. సి. అమ్మాయి వ్రాసింది.
అంతవరకు చదివిన లత నవ్వుతూ "బాగుంది. చాలా బాగుంది. మరి నే నెలా ప్రశంసించను?" అంది.
"నాకు కావలసింది నీ ప్రశంస కాదు, ప్రోత్సాహం."
"కరెక్ట్, బావగారూ. అది ఎప్పుడూ మీ కుంటుంది" అంటూ వచ్చాడు మధు.
"మామయ్యా, సినిమా కెళదాం అన్నావుగా? మరి రావూ?" ముద్దుగా అడిగింది సుధ.
"ఇదుగో, మమ్మీని, డాడీనికూడా తీసుకువెళదాం. త్వరగా రెడీ అవ్వాలి మీ రిద్దరూ" అన్నాడు లతా రమాకాంత్ లను చూసి.
"ఇప్పుడెలా రావటం? నాకు ముందు చెప్పావా ఏమన్నానా? ఇంతవరకు వంటే మొదలుపెట్టలేదు. నా వంట పూర్తయ్యేసరికి ఆ సినిమా మొదలు పెట్టి అరగంట అవుతుంది" అని లేచి వంటఇంటివైపు వెళ్ళబోయింది. వెళుతున్న ఆమె పమిట పట్టుకొని ఆపాడు రమాకాంత్.
"అది కాదక్కా. ఈ ఒక్క రోజుకు హోటల్లో తినచ్చు లేదూ. పద, త్వరగా బయల్దేరు." మళ్ళీ అడిగాడు మధు.
"అసలు, మధూ! రెయిన్ బోను చూస్తే మీ అక్క వదులుతుందా అని. ఇంద్ర ధనుస్సు ఆకారంలో ఉన్న ఆ అందమైన హాలు! అసలు ఆ ఆకారంలో హాలు నువ్వెక్కడా చూసి ఉండవు, లతా. హాలు నలు పక్కలా ధనుస్సుల ఆకారంలో అమర్చిన మొక్కలు. ఆ మొక్కలపై విడిలిన పూలు పరిచిన పూలధనుస్సులా సునాసనలు గుబాళిస్తుంటే నువ్వు కళ్ళు మరల్చుకోలేక అటే నిలబడి చూస్తావంటే నమ్ము. ఓ లతా, వింటున్నావా?" అని ఆమె నొకసారి కదిలించి మళ్ళీ చెప్పాడు.
"హాలు పై భాగాన రంగురంగులతో అమర్చిన పెద్ద సిమెంట్ ధనుస్సు. ఆ రంగులలో కలిసిపోతూ వరసగా ఊదా, నీలం, ఆకాశపురంగు, ఆకుపచ్చ, పసుపుపచ్చ, నారింజ, ఎరుపు రంగుల బల్బులు వెలుగుతూ, ఆరిపోతూ 'రెయిన్ బో' అనే అక్షరాలను మనకు చూపిస్తూ ఉంటే వచ్చినవాళ్ళు ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూస్తారంటే నమ్ము. ఇక లోపల అంటావా- ఫుష్ బాక్ ఛెయిర్స్..."
"ఆఁ. ఇంక ఆపండి. ఈ వర్ణనంతా నా కెందుకు? అది నేను చూసిన హాలేనని మీరు మరిచిపోయారులా ఉంది. మీ కథలలో ఎక్కడైనా వరిస్తే అప్పుడు చదివిన పాఠకులంతా ఓ రమాకాంత్ గారూ, ఆ "పుష్పభరిత రెయిన్ బో నిజంగా ఎక్కడైనా ఉందా అంటూ సౌరభాలు మీకు వ్రాస్తారు. మీరు చూపించండి. అప్పుడు మధు తుక్కుపిక్చర్లు తెప్పించినా హాలు చూడడానికి జనం ఎగబడతారు" అంది రమాకాంత్ ను ఎగతాళి చేస్తూ.
"ఇంత కష్టపడి వర్ణించినా రావన్న మాట. చూశావా, మధూ?" అన్నాడు బిక్కముఖంతో.
"ఎందుకు రాదూ! ప్లీజ్, త్వరగా రా, అక్కా అసలు అప్పుడప్పుడు బావగారికి హోటలు తిండి రుచి చూపిస్తూ ఉండాలి. అప్పుడుగాని ఆయనకు నీ చేతి వంట రుచి గొప్పతనం కనిపించదు."
"మీ అక్క చెయ్యి అమృతహస్తమని ఏనాడో ఒప్పుకొన్నానయ్యా."
లతతోపాటు రమాకాంత్ కూడా లోపలకు వెళ్ళాడు బట్టలు మార్చుకోడానికి.
* * *
మధ్యాహ్నం రెండు గంటలు దాటింది. అప్పుడే వాన కురిసి వెలిసింది. వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది. ఉండి ఉండి చెట్ల మీద నిలిచిన నీరు మంద పవనానికి క్రింద జల్లులు జల్లులుగా పడుతూ వింతైన శబ్ధాలు కలుగుతున్నాయి. అప్పటి వరకు వ్రాస్తున్న మధు కలం ఒక్కసారి ఆగిపోయింది. ఆ కథను ఆ రోజు పూర్తి చేద్దామని ఎంత ప్రయత్నించినా మరి అతని కలం ముందుకు సాగలేదు. వెనక్కు వాలి అంతవరకు వ్రాసిన కథను ఒక్కసారి చదువుకొన్నాడు. పర్వాలేదనిపించింది. ఇది తన మొదటి ప్రయత్నం. ఆమాత్రం వ్రాయగలిగి నందుకు తనను తనే అభినందించుకొన్నాడు. కాగితాలన్నీ వరసగా పేర్చి, లేచి బట్టలు మార్చుకొన్నాడు. అద్దంలో చూసుకొంటూ అందమైన క్రాపును మరొక సారి దువ్వుకొని బయటకు వచ్చాడు. ఏమీ తోచటం లేదు. ఈ వేళప్పుడు పడుకొన్నా నిద్ర రాదు. నడుచు కొంటూ దగ్గర సినిమా హాలుకు వెళ్ళాడు. మాటినీ మొదలుపెట్టారు. ఆఖరి వరసలో ఖాళీగా ఉన్న సీట్లో కూర్చుని సినిమా చూడటం మొదలుపెట్టాడు. ఇంటర్ వెల్ లో లైట్లు వెలిగి సునీత పలకరించేవరకు తన పక్క సీట్లో ఉన్నది సునీత అని గుర్తించలేక పోయాడు.
"మీ రెప్పుడూ ఒంటరిగా రారుగా?" ఆశ్చర్యం గానే అడిగాడు.
"ఈ రోజు కూడా అన్నయ్య వస్తానని టైమ్ కు రాలేదు. వదిన ఊర్లో లేదు. ఈ పిక్చర్ ఈ రోజుతో ఆఖరు గదా? చూడాలని వచ్చాను."
కొంచెంసేపు ఇద్దరి మధ్యా మౌనం.
"మీ రసలు ఈమధ్య కనిపించటమే లేదు. ఎన్నో విషయాలు చెప్పాలనుకొన్నాను" అంటూ ఆమె అతని ముఖంలోకి చూసింది. కాని అతడు ఆమె మాటలు వింటున్నట్లు లేదు. ఇక సునీత కూడా మాట్లాడక ఊరుకొంది. ఇరువురూ ఏదో ఆలోచిస్తూనే సినిమా చూశారు. సినిమా పూర్తి అయిన తర్వాత మధుతో "ఇంటికి వెళదాం, రండి" అంది సునీత.
"ఇప్పుడా?"
"అవును మీరు వచ్చి చాలా రోజులైందిగా? రండి!" ఆమె అలా అడిగితే రాననలేక ఆమె ననుసరించాడు మధు.
మధుకు కాఫీ కప్పు అందించి తానొక కప్పు తీసుకొంటూ "'పగిలిన హృదయాలు' పాఠకులను బాగా ఆకర్షించింది. ఎంతో సహజంగా ఉందని, హృదయాన్ని కదిలిస్తూందని వ్రాస్తున్నారు. మీరూ చదువుతున్నారా?" అని కుతూహలంగా అడిగింది సునీత.
"ఆఁ ..." నిర్లిప్తంగా అన్నాడు మధు.
"మీ రీవేళ అదోలా ఉన్నారు. ఒంట్లో బాగుండలేదా?"
"అబ్బే, అదేం లేదు. చాలా ఆరోగ్యంగా ఉన్నాను."
"మరయితే ..."
"అయితే గియితే ఏమీ లేడు. నేను బాగానే ఉన్నాను." నవ్వటానికి ప్రయత్నిస్తూ అన్నాడు. సునీతకు ఆ సమాధానం తృప్తి నివ్వలేకపోయినా మరేమీ మాట్లాడలేదు. అతనితో ఎంతోసేపు, ఎన్నో విషయాలు మాట్లాడాలని ఇంటికి పిలిచింది. ఏమీ అడగలేకపోయింది. మనస్సంతా ఆందోళనతో, మెదడంతా ఆలోచనలతో నిండి ఉండగానే మధు వెళ్ళటానికి లేచాడు. ఆమె కూడా లేచి అతనిని గేటు వరకూ అనుసరించింది. మధు గేటులో ఆగి "నే కథ వ్రాస్తున్నాను. అది రెండు రోజులో పూర్తిచేసి మీ కిస్తాను. ఏమైనా పొరపాట్లు ఉంటే సరిచేసి తగిన సలహాలు ఇవ్వాలి. అలా దిద్దిపెట్టగలరా?" అన్నాడు.

"ఓ. తప్పక, నాకు తోచినది చెబుతాను. మధు బాబూ, మీరు చిత్రకారులు. కథకులు కూడా అయ్యారంటే నా కెంత ఆనందం!"
"ఇది నా ప్రథమ ప్రయత్నమే సుమండీ. అదీ ఎలా వ్రాశానో మీరు చూడకుండానే కథకులు అంటున్నారు."
"ఎలాగో ఒక లాగ వ్రాయగలిగారు గదా! అందరూ మొదట భయపడినవారే. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారు?"
"త్వరలోనే."
ఆనందంగానే ఇంట్లోకి వచ్చింది, విషాదంగా మధును అనుసరించిన సునీత.
మధు ఇంటికి వచ్చేటప్పటికి టెలిగ్రాఫ్ ఫ్యూన్ తిరిగి వెళుతున్నాడు. అరుగుమీద స్తంభానికి చేరగిల పడి దిగులుగా నిలుచుంది లత చేతిలో టెలిగ్రామ్ తో. పిల్లలిద్దరూ బిక్కముఖాలతో గోడ పక్కగా నిలుచున్నారు.
"ఏమైందక్కా?" ఆదుర్దాగా అడిగాడు మధు,
