Previous Page Next Page 
ఎండమావులు పేజి 11


    ఇది అట్లా కాదు. తన పెద్దకొడుకు బ్రతికుండి కూడా తమకు ఉపయోగం లేకుండా పోయాడు. ఇది ప్రతినిత్యమూ రగిలే చిచ్చు, ఆరని మంట.
    ఆయన కాసేపు అట్లాగే కూచుని "మీ వదిన కనబడలేం తల్లీ" అన్నాడు శ్రీలక్ష్మివైపు చూసి.
    "పుట్టింటికి వెళ్ళింది" అన్నది శ్రీలక్ష్మి. జానకిరాంవైపు చూస్తూ. జానకిరాం మాట్లాడలేదు.
    "సంక్రాంతి ఇంకా నెలరోజులకు పైగా ఉండగా అప్పుడే పండక్కి వెళ్ళిందా?"
    "పండక్కి కాదు నాన్నా వదిన తనంతట తానే వెళ్ళింది. వాళ్ళమ్మ రమ్మనలేదు" అన్నది శ్రీలక్ష్మి.
    జానకిరాం అక్కడినుంచి లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. జానకిరాం వెళ్ళాక శ్రీలక్ష్మి తండ్రితో చెప్పింది.
    "గౌతమి వదినె, అన్నయ్యతో కొంచెం ఘర్షణ పడి వెళ్ళిపోయింది నాన్నా, అన్నయ్య ఉద్యోగంలో చేరింతరువాత ఉత్తరం రాస్తేనే వస్తుందట. లేకపోతే ఎంతకాలమైనప్పటికీ పుట్టింట్లోనే ఉంటుందిట."
    ఈ విషయం ఆయనకు ఆశ్చర్యాన్ని కలిగించలేదు.
    "ఈ ఇంట్లో అందరి మనస్తత్వాలూ నాకు తెల్సు తల్లీ. ఈ పని జరుగుతుందనీ నాకు తెల్సు. ఒక కొడుకు ఆ తీరుగా వెళ్ళిపోయాడు కష్టపడి జీతాలు కట్టి, ఎకరాలు అమ్మి చదువు చెప్పించిన వీడు ఇట్లా వేధిస్తున్నాడు. కడుపున బుట్టిన కొడుకులే ఇట్లా కాల్చుకు తింటుంటే పరాయి పిల్ల గౌతమి ఇట్లా చేసినందుకు బాధపడక్కర్లేదమ్మా. దైవచింతనా, వేదాంత వ్యాసంగమూ ఉద్యోగం చెయ్యకుండా ఉంటేనే గాని వంటబట్టనని ఏ శాస్త్రాల్లోనూ చెప్పలేదు. ఏ దేవుడూ శాసించలేదు. దేనికయినా ప్రాప్తం ప్రధానం, అదీ లేనినాడు మనిషి అసమర్ధుడుగానే బ్రతుకు తాడు" అంటూ కుర్చీలోంచి లేచాడు గోపాల శాస్త్రి. తండ్రికి స్నానానికి నీళ్ళతోడటానికి వెళ్ళింది శ్రీలక్ష్మి, జానకిరాం ఆలోచిస్తూ కూర్చున్నాడు తన గదిలో.
    ఎన్నడూ తమ ఇంటికిరాని జానకిరాం ను చూసేసరికి స్వాతికి ఆశ్చర్యం కలిగింది. సాదరపూర్వకంగా ఆహ్వానించింది. తమ్ముడ్ని చూడంగానే కృష్ణమూర్తికి సంభ్ర మాశ్చర్యాలు కలిగినయ్యి.
    "వంట్లో కులాసాగా ఉంటోందా అన్నయ్యా" అంటూనే పక్కనున్న కుర్చీలో కూర్చున్నాడు జానకిరాం. తమ్ముడి ముఖంలోకి సంతోషంగా నవ్వుతూ చూస్తూ,
    "అమ్మ, నాన్న కులాసాగా ఉన్నారా జానకీ. శ్రీలక్ష్మి కులాసాగా ఉందా. మా మరదలు గౌతమి ఏమంటున్నది" అన్నాడు కృష్ణమూర్తి.
    ముభావకంగానే అన్నింటికీ సమాధానం చెప్పాడు. జానకిరాం.
    "రాకరాక మా యింటికి నచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అన్నదమ్ము లిద్దరూ ఇట్లా కల్సి మాట్లాడుకోటం యిదే మొదలు. ఈ అన్న, వదినెల మీద అంతమాత్రం దయ ఉన్నందుకు అంతేచాలు. మా చెల్లెలు గౌతమి నీళ్ళు పోసుకుందా" నవ్వుతూ అడిగింది స్వాతి.
    "నీళ్ళకేం భాగ్యం వదినా, రెండు పూట్లా చక్కగా స్నానం చేసేది గౌతమీ" అన్నాడు జానకిరాం.
    స్వాతి కిలకిల నవ్వింది పొట్ట చేత్తో పట్టుకుని.
    "అదికాదు మహానుభావా, ఏమయినా....." అర్దోక్తిలోనే ఆగింది స్వాతి.
    "అదా, చంపేశావ్ పో వదినా. ఈ నిర్భాగ్యులకి పిల్లలు కూడా ఎందుకులే? మా జీవితం ఇట్లా వెళ్ళిపోతే చాలు."
    కాఫీ కాయటాని క్కామాలు స్వాతి వంటింట్లోకి వెళ్ళింది.
    "తమ్ముడూ."
    "ఏం అన్నయ్యా!"
    "అమ్మ నన్నెప్పుడయినా తల్చుకుంటుందా నాన్నకు నేనంటే ఇష్టం లేదనుకో" ఆశగా, అసంతృప్తిగా చూస్తూ ఒక్క నిట్టూర్పు విడిచాడు కృష్ణమూర్తి.
    "భవబంధాలు తెంచుకున్నా మనుకోటం బాహ్యం గానే గాని, ఆంతర్యంలో కాదు. అమ్మ నిన్నెప్పుడూ తల్చుకుంటూనే ఉంటుంది. ఆమెకు మనిద్దరమూ రెండు కళ్ళు, కాని, ఆ కళ్ళు కనుపించేవి కావు, కళ్ళున్న అంధురాలు అమ్మ" అన్నాడు జానకిరాం.
    "నే నెట్లాగూ అమ్మనీ, నాన్ననీ దూరం చేసుకున్నాను. నువ్వయినా ఈ వృద్ధాప్యంలో వాళ్ళని కనిపెట్టి ఉండు జానకీ. నీ అంత చదువు నాకు అబ్బలేదు. నా జీవితం యిట్లా వెళ్ళిపోవాల్సిందే. అమ్మా, నాన్నా పూర్వాచార పరాయణులు. నా చేతి గంగ తాగితేనే వాళ్ళు భ్రష్టులైపోతారు. నువ్విక్కడి కొచ్చావని నాన్నకు తెలిస్తే నిన్ను ఇంట్లో ఉండనిస్తారా. అమ్మ కుళ్ళికుళ్ళి ఏడుస్తుంది."
    మనస్సులోని వ్యధను మాటలతో వెళ్ళబుచ్చాడు కృష్ణమూర్తి, జానకిరాం మాట్లాడలేదు.
    "ఒకే రక్తాన్ని పంచుకుని పుట్టాం. కాని, నాకాయింట్లో స్థానం లేదు. నీకున్న స్థానం పోగొట్టుకోకు. అమ్మనూ, నాన్ననూ సంతోషపెట్టటమే నీ జీవిత పరమావధి, ఈ భ్రష్టుడికి వాళ్ళ పాదాలు తాకే యోగ్యత కూడా లేదు." అన్నాడు మళ్ళా కుమిలి, కుమిలి వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ.
    "ఈ రకమైన భావాలు మనం తెచ్చిపెట్టుకున్నవే గాని ఆ పరమాత్ముని దృష్టిలో అంతా సర్వ సమానులే. ప్రేమ అనేదీ, కాముకత్వ మనేదీ సృష్టిలో ప్రతి జీవికీ ఉండనే ఉంటుంది. హద్దుల్లో ఉండి ఆ కోరికలు తీర్చుకునేవార్నే సంఘం హర్షిస్తుంది. హద్దుమీరిన వారి ఆడిపోసుకుంటుంది. ఈ కారణంచేతనే వ్యక్తుల మంచి చెడ్డలను, గుణగణాలను బేరీజు వేసుకుని ఒక నిర్ణయానికి రావటం సమంజిసమైన పనీ కాదు. అది మనం ఆలోచించే తీరునిబట్టి ఉంటుంది. ఆత్మ పరిపక్వత పొంది మనస్సులో కాలుష్యాన్ని చేరనీయనంతవరకూ భ్రష్టత్వమనే సంఘపు ముద్ర మనమీద ఎన్నటికీ పడదు" అన్నాడు జానకిరాం.
    కృష్ణమూర్తి తేలికపడిన హృదయంతో కళ్ళు తుడ్చుకున్నాడు. పది సంవత్సరాలనాటి జీవిత సంఘటనలు అతని హృదయ కవాటాన్ని తట్టి తలుపులు తెరుచుకుని లోపలికి వచ్చినయ్యి.

                                 *    *    *

    స్కూలు ఫైనలు ప్యాసయ్యిం తరువాత తను సెకండరీ గ్రేడు ట్రైనింగులో చేరాడు. తను ట్రైనింగు స్కూల్లో చేరిన కొద్ది రోజులకే ఒక సంఘటన జరిగింది. అప్పటికి సత్తి కూడా ట్రైనింగ్ చదువుతున్నది. సత్తికీ, రాజేశ్వరికీ పరిచయం. సత్తి హాష్టల్లో ఉండే చదువు కునేది. రాజేశ్వరి అన్నగారింట్లో ఉండి చదువుకునేది. సత్తి హరిజన విద్యార్ధిని. చాలా తెలివి కలది. అంత అందమైన వాళ్ళూ, అణుకువ గలవాళ్ళూ తెలివితేటలు కలవాళ్ళూ, వినయవిధేయతలు కలవాళ్ళూ ఉంటారా అని ఆశ్చర్యపడే తీరుగా ఉండేది సత్తి. ఆమె అంటే అందరికీ గౌరవమూ, అభిమానమూ, హాస్టల్లో ఉండే విద్యార్ధినుల కందరకూ ఆమె నాయకురాలు. తెలియని పాఠాలు అందరికీ తను చెప్పేది. క్రమశిక్షణ అంటే ఏమిటో అందరికీ నూరిపొయ్యటమే గాకుండా ఆచరణలో పెట్టి చూపించేది. ఆమె ప్రవర్తన చేతా, తెలివితేటల చేతా అందరి మనస్సుల్లోనూ సదభిప్రాయం కలిగేటట్లుగా చేసుకోగలిగింది. కాని ఆమె అందం కొంతమందికి కన్నెర్రగా ఉండేది. ఆమెను అనుభవించాలనీ, ఆమెతో స్నేహం చెయ్యాలనీ కొంతమందికి తహతహ కొంతమంది కాముక జ్వాలలు నాలుకలు జాచుకొని ఆమెను దహించాలని ఉవ్విళ్ళూరుతూ ఉండేవి. అలాంటివారిలో రాజేశ్వరి అన్నగా రొకరు.
    రాజేశ్వరి వితంతువు. తన కాళ్ళమీద తను నిలబడి స్వతంత్రజీవనం చెయ్యాలనే పట్టుదలతో భర్త పోయాక ఫస్టు ఫారంలో చేరింది. క్రమేపీ స్కూలుఫైనలు ప్యాసయి సెకండరీ గ్రేడు ట్రైనింగులో చేరింది. రాజేశ్వరి అన్న పేరు విష్ణురావు. అతను బి. యే పాసయి బి. ఇడి చదువుతున్నాడు అన్నాచెల్లెళ్ళిద్ధరూ ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. రాజేశ్వరి వంటచేసి స్కూలుకు వెళుతూ ఉండేది.
    ఒకరోజున సత్తి రాజేశ్వరికోసం వాళ్ళింటికి వెళ్ళింది. ఆ సమయంలో రాజేశ్వరి ఆస్పత్రికి వెళ్ళింది. అంతకు క్రితం రోజు నుంచీ ఆమెకు జ్వరం. విష్ణురావు ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. సత్తిని సాదరపూర్వకంగా ఆహ్వానించి మర్యాదగా, చక్కగా మాట్లాడుతూనే, వీధి తలుపు గడియ వేసి తన కోరిక చెబుదామనుకున్నాడు విష్ణు రావు, నిశ్చేష్టురాలై చూస్తున్నది సత్తి. మెల్లిగా ఆమె చెయ్యి పట్టుకోబోయాడు. బిత్తరి చూపు లతో అతన్ని చూస్తూనే పిడికిలి బిగించి పొట్టలో ఒక్క పోటు పొడిచింది. సత్తి తన సత్తున కొద్దీ. అతని ప్రాణం దిమ్మరపోయి పొట్ట చేత్తో పట్టుకుని అట్లాగే కూర్చుండిపోయాడు. బంగారుపడింది సత్తి. వెళ్ళిపోదామని వీధి తలుపు గడియ తీసింది. అప్పుడే ఆస్పత్రి నుంచి రాజేశ్వరి వచ్చింది. బావురుమని ఏడ్చి సంగతంతా చెప్పింది సత్తి. అవమానంతో కుమిలిపోయింది. అన్నగార్ని ఎన్నో చివాట్లు పెట్టింది. రాజేశ్వరి. అతను కిక్కురుమనలేదు. రాజేశ్వరి సహాయంతో హాస్టలు చేరింది సత్తి. పరాభవ వేదనతో స్కూలుకు వెళ్ళలేదు. ఎవ్వరితోనూ ఈ సంగతి. చెప్పలేదు. ఏమని చెపుతుంది? సత్తికి మొదట్నుంచీ కృష్ణ మూర్తి అంటే గౌరవం. అతని చదువేమో, అతని గొడవేమో తప్ప ఏ విషయం పట్టించుకునే వాడు కాదు. ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడే వాడు కాదు. ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడే వాడు కాదు. కాని, తన దృష్టికి ఏదయినా అన్యాయంగా కనిపించితే తనంతట తానుగా ఆ వ్యవహారంలో జోక్యం కలుగజేసుకుని, సవ్యంగా సరిదిద్దేవాడు. కృష్ణమూర్తి ఇలాంటి స్వభావం కలవాడని రాజేశ్వరికి తెలుసు. ఈ సంగతి అతని చెవిని వేస్తే అన్నగారికి బుద్ధి చెబుతాడని ఆశించింది రాజేశ్వరి.
    రెండు రోజులు మధనపడి చివరకు ఈ జరిగిన విషయమంతా రాజేశ్వరి కృష్ణమూర్తితో చెప్పింది. ఉగృడైపోయాడు కృష్ణమూర్తి. రాజేశ్వరితో అప్పటి కప్పుడే సత్తి ఉన్న హాస్టలుకు వెళ్ళి ఊరడించి, సానుభూతి చూసి, ఈ దారుణ సంఘటనకు పూనుకున్న విష్ణురావుకు ప్రాయశ్చిత్తం చేస్తానన్నాడు. అంతవరకూ తను చెప్పి నట్లుగా వినమన్నాడు కృష్ణమూర్తి మతిపోయిన పరిస్థితిలో ఉన్న సత్తి కృష్ణమూర్తి చెప్పి నట్లుగా నడుచుకోటానికి అంగీకరించింది. ముగ్గురూ కలిసి విష్ణురావు వద్దకు వెళ్ళారు. భీషణ స్వరంతో ఉగ్రుడైన కృష్ణమూర్తి "సత్తి యందు అంత మక్కువ ఉంటే ఆమెను వివాహం చేసుకోరాదా" అన్నాడు విష్ణురావు భుజం పట్టుకుని ఊపుతూ, విష్ణురావు చలించలేదు. తనకేమీ తెలీదన్నాడు. ఈ అవమానం భరించలేక సత్తి ప్రాణత్యాగం చేసుకుంటుందనీ, ఈ విషయ మంతా రిపోర్టు చేసి జైలుకు పంపుతాననీ విష్ణు రావుకు నయానా భయానా చెప్పాడు కృష్ణ మూర్తి. తన నోటికి వచ్చినట్లుగా సత్తిని దూషించి ఆమెను పరమ వ్యభిచారిగా చిత్రించి, వ్యభిచార జీవితమే సత్తి గడుపుతున్నదనీ వాదించాడు విష్ణురావు. సత్తిని ఉద్ధరించా లనుకుంటే ఆమెయందు అంత ఆదరాభిమనలుంటే ఆమెను నువ్వే ఎందుకు పెళ్ళి చేసుకోకూడదని ఎదురు ప్రశ్న వేశాడు. విష్ణురావు, కృష్ణమూర్తి, సత్తి, రాజేశ్వరీ అంత నిర్ఘాంతపోయారు. విష్ణురావు వికటాట్టహాసంగా నవ్వుతూ మాటలతో మళ్ళీ రెచ్చగొట్టి తన నోటికి అడ్డు లేనట్లుగా మాట్లాడి సత్తికీ, కృష్ణమూర్తికీ సంబంధం ఉన్నట్లుగా చిత్రించి వారిద్దర్నీ తూలనాడాడు. ఈ వాతావరణంలో పత్తి మతిభ్రమించిన దానిలా వెక్కివెక్కి ఏడుస్తూ కూర్చుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS