"థాంక్స్" అంటూ అక్కడినుండి వెళ్ళి పోయింది మీర.
మీర వెళ్ళిపోగానే శాము మనస్సును ఏదో మబ్బు ఆవరించినట్టయింది. అతను పల్లెటూరి వాడవటంవల్ల సామాన్యంగా ఆడపిల్లలతో మాట్లాడుతూన్నప్పుడు మచ్చుకైనా అలాంటిభావం కలుగలేదు. ఆమెతో తను ధైర్యంగా మాట్లాడటాన్ని తలచుకొని అతనికే ఆశ్చర్యం వేసింది. మీరనుచూసినపు డతనికి ఆమె అపరిచితురాలన్న భావనే కలుగలేదు. ఎంతోకాలంగా తామిద్దరూ చిరపరిచితులమన్న భావన కలిగి ధైర్యంగా మాట్లాడ గలిగాడు. అంతకుముందు తనకు కలలో కనిపించి పూలు అడగని పల్లె మొహానికి, మీర మొహానికి పోలిక లుండటం గమనించి శాము చకితుడయ్యాడు.
మీర సాయంత్రం నాలుగింటికి ఇంటినుండి బయలుదేరింది. వెల్లేముందు, శాము గదిముందు నిలబడి.
"మీకు కాలేజీ ఎక్కడుందో తెలుసుగదూ?" అని అడిగింది.
శాము మీదనే తదేకంగా చూస్తూ, "నాకు సరీగ్గా తెలీదు" అన్నాడు.
"శ్రీపాదు, శ్రీహరి వస్తారు. వాళ్ళతో మీరు కూడ తప్పకుండా రండి" అని మరీ మరీ చెప్పి వెళ్ళింది.
ఆమె ఉంగరాల జుత్తు నిలవక నుదుటిని ఆక్రమింప చూస్తున్నాయ్. ఉత్సాహంతో మొహంలోని కాంతి అధికమయింది. కాలేజీకి వెళ్లటానికోసం చేసుకున్న ముస్తాబు వల్ల మరింత ఆకర్షణీయనగా కనిపిస్తున్న ఆమె రూపాన్ని తలచుకుంటూ అకాగే ఉండిపోయాడు శాము. ఆమె రమ్మని మరీ మరీ చెప్పినప్పుడు బదులుచెప్పే శక్తి కూడా లేకుండా పోయిందతనికి.
సాయంత్రం శ్రీహరి, శ్రీపాదు, శాము ముగ్గురూ కాలేజీకి బయలుదేరారు.
కృష్ణయ్యగారు ఆశ్చర్యంతో,
"ఎక్కడమ్మా బయలుదేరావ్?" అని అడిగారు.
"కాలేజీలో నాటకం ఉందటకదూ? మీ అమ్మాయి నాక్కూడా ఓ టికెట్టు అమ్మారు!"
"ఓ! భలే చాలా గడుసుపిల్ల మీర. తప్పక వెళ్ళిరండి. కాలేజీలో పేరుమోసిన నటి మా మీర."
నవ్వుతూ సంతోషంగా అన్నారు కృష్ణయ్య గారు.
శ్రీపాదుకు మీరా నాటకాలంటే ప్రాణం. దారి పొడుగునా మీరను ఒకటే పొగడేస్తున్నాడు.
"మా మీర ఎంత బాగ వేస్తుందనీ? కాలేజీలో ఏ నాటకం వేసినా తనదే నాయిక పాత్ర."
"అలాగా? అయితే ఈరోజు నాటకంలో ఆమె కూడ వేషం వేస్తున్నారన్నమాట."
"కాకపోతే ఏమిటనుకున్నారు మీరు? మీరలేకపోతే నాటకమే వెయ్యరు తెలుసా?"
"ఈరోజు నాటక మేమిటి?"
"హూనిన ఆసె" (పుష్పకాంక్ష) అన్న కన్నడ నాటకం. యం.వీ. సీతారామయ్యగారు రాసింది. మీకు తెలిసే ఉంటుంది.
"నేను చదువలేదు. కథేమిటి?"
"సీత తండ్రి సూరప్ప పూర్వాచార పరాయణుడు. మొదటి భార్య కూతురయిన సీతను చిన్నప్పుడే ఓ వయసు మళ్ళిన వాడికిచ్చి పెళ్ళి చేస్తారు. పన్నెండేళ్ళ వయస్సులోనే, విధవవుతుంది సీత. 'విధవ' అన్న పదానికి అర్ధం కూడ తెలియని ఆ అమ్మాయికీ పూలంటే మహా ఇష్టం.
ఓ మారు గులాబీ పూలను పెట్టుకుని, సవతి తల్లి కమలమ్మచేత తిట్టించుకుంటుంది. 'సుబ్బు' సూరప్ప మేనల్లుడు. సీత అంటే ప్రేమ అతడికి. 'వాణి సుబ్బు స్నేహితుడు. సంఘ సంస్కరణ, దేశసేవ చెయ్యాలనే ఉత్సాహంవున్న యువకుడు. ఇతడు సీతకు మళ్ళీ పెళ్ళి చేయమని సూరప్ప గారిని అడుగుతాడు. ఆయన వప్పుకోడు. సనాతనురాలైన తల్లితో సీతను పెళ్ళాడాలన్న తన కోరిక తెల్పి దెబ్బలాట తెచ్చుకుంటాడు.
ఓమారు సూరప్ప జబ్బు పడ్డప్పుడు తను చనిపోతే నాద అయిన సీత గతేమిటనే ఆలోచనవచ్చి సీత మళ్ళీ పెళ్ళి చేసుకోడానికి ఒప్పుకుంటాడు. 'వాణి' సీతతో తన పెళ్ళి గురించి కలలు కంటూండగానే 'సుబ్బు' వచ్చి తను సీతను పెళ్ళి చేసుకోబోతున్న విషయం చెపుతాడు. 'వాణి' తన బాధను అణచుకొని సుబ్బుకు మల్లెపూల దండ ఇచ్చి సీత తల్లో పెట్టమని కోరుతాడు.
ఇదీ 'హూవివఆసె' నాటకం కథ.
"నాయకుడి పాత్ర ఎవరు వేస్తున్నారు?" సంశయిస్త్జూనే ప్రశ్నించాడు శాము.
"సుబ్బారావుగా రమ్మాయి నర్మద."
"అందరూ అమ్మాయిలే అన్నమాట" శాము తేలిగ్గా నిట్టూర్చాడు.
కాలేజీ ముందర తోరణాలతో అలంకరించారు. రంగు రంగుల చీరలు కట్టుకున్న అమ్మాయిలు సీతాకోకచిలకల్లా తిరుగుతూ కనిపిస్తున్నారు.
శ్రీపాదు, శ్రీహరీ తమ మూడు రూపాయల టిక్కెట్టు చూపించగానే నీలం మైసూరు క్రేప్ చీర కట్టుకున్న అమ్మాయి "రండి చూపిస్తాను" అంటూ వాళ్ళను తీసుకు వెళ్ళింది.
శాము ఎటు వెళ్ళాలో తోచక అలాగే నుంచుండి పోయాడు. పసుపురంగు సిల్కు చీర కట్టుకున్న రెండు జడల అమ్మాయి అక్కడే తిరుగుతున్నా, అడగడానికి బిడియపడ్డాడు. ఆ అమ్మాయి నవ్వులు, చిలిపి మాటలు, రక రకాల ముస్తాబులు అన్ని చూస్తూ ఆశ్చర్యపోతున్నాడు.
నక్షత్రాలతో నిండిన పూర్ణిమాకాశంలో వెంటనే కనిపించే చంద్రునిలా ఆ అమ్మాయిల మధ్యనున్న మీరను వెంటనే గుర్తించాడు శాము. వాళ్ళందరికన్నా పొడుగ్గాఉన్న మీర గంభీరంగా నడుస్తూ పక్కనున్న అమ్మాయితో ఏదో చెపుతూ, నవ్వుతూ వస్తోంది. తనవేపే చూస్తున్న శామును గమనించగానే చిరునవ్వు నవ్వి, దగ్గరగా వచ్చి,
"ఎంత సేపయింది వచ్చి?" అనడిగింది.
"పది నిమిషాలవుతుంది."
"శ్రీపాదు, శ్రీహరి ఏరి?"
"వాళ్ళు లోపలికి వెళ్ళారు."
మీర తనతోవున్న పిల్లతో, "చంపా ఒక్క నిమిషం. ఆగు వస్తున్నా" అని శామువేపు తిరిగి "రండి" అంది.
లోపల సోఫాలున్న చోటికి శామును తీసుకువెళ్ళింది మీర. శాము కూర్చోగానే,
"ఇక నేను వస్తానండి" అని చెప్పి వెళ్ళిపోయింది.
చంపా మీరకోసం కాచుకుని నుంచుంది. మీర రాగానే,
"ఎవరే అతను?" అనడిగింది.
"మా పెదనాన్న స్నేహితుల అబ్బాయి."
"అబ్బ! ఎంత మంచి పర్సనాల్టీ! ఆ హైటు, కలరు......"
అంతలోనే మీర "ఆపవే తల్లీ నా ముందర పొగిడి ఏం లాభం. అతనికే పరిచయం చేస్తాను రా" అంది.
"వద్దులే తరువాత నువ్వు 'జలస్' అవ్వొచ్చు" మీర నవ్వి "అసంభవం" అంది.
ఆరు గంటలకు కార్యక్రమం ప్రారంభమయింది. ప్రార్ధనానంతరం అధ్యక్షులు ఆటల పోటీల్లో గెలిచినవారికి బహుమతులు పంచిపెట్టారు. మీరకు నాలుగయిదు బహుమతులు వచ్చాయి. వార్షిక నివేదిక చదివించి మీర. తరువాత నృత్యం, ఆర్కె స్ట్రాపార్టీ, టాబ్లో అయ్యాక "హుదిన ఆపై" డ్రామా ప్రారంభమయ్యింది.
మొదటి దృశ్యంలో కథా నాయకుడు 'సుబ్బు' పుస్తకం చదువుతూ కూర్చున్నాడు. బాల విధవ 'సీత' నెమ్మదిగా స్టేజిమీదికి ప్రవేశించింది. తెల్లచీర, తెల్ల జాకెట్టు వేసుకొని, వదులుగా జడ వేసుకొని, మెల్లిగా నడచి వచ్చింది. చప్పుడు చేయకుండా పిల్లిలా అడుగు వేసుకుంటూవచ్చి వెనుకనుండి సుబ్బు కళ్ళు మూసింది.
మీర రంగం మీదికి ప్రవేశించగానే శాము సర్దుకు కూర్చున్నాడు. ప్రతి దృశ్యమూ మీర అభినయంతో జీవం పోసుకుంది. శాము మనసులో మీర పాత్ర చెరగని ముద్ర వేసింది.
ఆఖరి దృశ్యంలో మీర తన వేపు చూసి నవ్వి నట్టనిపించిందతనికి. నాటకం అయిపోయింది. ప్రేక్షకుల చప్పట్లతో హాలు మారుమ్రోగింది.
అందరూ వెళ్ళిపోతున్నారు. శాము కూడ లేచి బయలుదేరాడు. అంతలో మీర గబ గబా వచ్చి తన చేతిలోని బహుమతి పుస్తకాలను అతని చేతికిస్తూ.
"రంగు కడుక్కొని వచ్చేస్తాను. కాస్త ఆగమని చెప్తారా శ్రీపాదుతో? మీకేమీ అభ్యంతరము లేకపోతే కాస్సేపాగండి. ఇప్పుడే వచ్చేస్తాను" అంది.
"ఫరవాలేదు ఉంటాను" అన్నాడు శాము.
మీర కృతజ్ఞతతో అతనివేపు చూసి, లోపలికి వెళ్ళిపోయింది.
శాము చేతిలోని పుస్తకాల పేజీలు తిప్పుతూ నుంచున్నాడు. "ఇక వెడదామాండి" అంటూ వచ్చాడు శ్రీపాదు.
"మీ అక్కయ్య కూడా వస్తారట. కాస్సేపు ఉండమన్నారు."
ముగ్గురూ మీర కోసం కాచుకొని నంచున్నారు.
మీర రంగు కడుగుకొని రావటం కాస్త ఆలస్య మయింది. రాగానే,
"క్షమించండి. మిమ్ములను చాలాసేపు నిలబెట్టాను." అంది.
"ఏం ఫరవాలేదు."
"శ్రీపాదూ, నాటకం ఎలా ఉందిరా? నువ్వూ శ్రీహరి కనిపించనేలేదు, నాకు, వీరిని మట్టుకు చూశాను."
"మేము వెనుక కూర్చున్నాము. అందుకే నీకు కనిపించలేదేమో. నాటకం చాలా బాగుంది. నువ్వు వేశాక బాగాలేకేం చేస్తుందిలే."
"అదేమిటి నేనున్న మాత్రాన నాటకం బాగుండాలా?"
"మీరు నాయికగా వేస్తున్నప్పుడు నాటకం బాగుండకపోవటం అసంభవం" అన్నాడు శాము.
సంతోషంతో మీర మొహం వికసించింది. అయినా తన ఆనందాన్ని కప్పిపుచ్చుకుంటూ "అబ్బే అంత పొగడ్తకు అర్హురాలిని కాను, నేను" అంది.
మరుసటిరోజు ఉదయమే శాము వూరికి బయలుదేరాడు. కృష్ణయ్యగారితోనూ, కమలమ్మ గారితోనూ వెళ్ళొస్తాను అని చెప్పేటప్పుడు అతని కళ్ళు మీరకోసం చుట్టూ వెతికాయి.
అదే నిముషంలో మీర వెచ్చగా దుప్పటి కప్పుకొని హాయిగా నిద్రపోతోంది.
శాము మరోసారి అందరితోను చెప్పి చుట్టూ కలయచూసి, నిరాశచెంది బయలుదేరాడు.
శాము వెళ్ళిపోగానే, కృష్ణయ్యగారు ఆతృతతో వంటగదిలోకి వచ్చారు. కమలమ్మగారు కాఫీ గ్లాసు కడుగుతున్నారు.
"కమలా, మన మీరకు ఎన్నేళ్ళిప్పుడు?"
"పదిహేడు వెళ్ళాయి."
