
7
తెలుగు దేశంలో తిరుపతి వాసిగన్న పుణ్యక్షేత్రం. ఆ తిరుపతి కొండల మీద వెలసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆంధ్రులకే గాక అంన్రేతరులకు గూడా ఆరాధ్య దైవం. ఆ మహాభాగుని కటాక్ష వీక్షణాలు ఎవరిపై ప్రసరిస్తాయో వారి జీవితాలు పునీతములు. ఇక జీవితంలో కొరతంటూ ఏమీ ఉండదు. ఆ స్థల మహత్యం, ఆ స్వామి మహత్యం సంకలనం చేస్తే కొన్ని గ్రందాలవుతాయి.
భారతదేశంలో ఉండే రకరకాల భాషలకు నాగరికతలకు, ఆచార వ్యవహారాలకు తిరుపతి కూడలి. భారతీదేవి తన ముద్దు బిడ్డలందరి తోనూ, స్వామి దర్శనానికి వచ్చిందేమో అనిపిస్తుంది చూస్తుంటే. కొండపైన దేవాలయం దగ్గర నిల్చుంటే గంటలు క్షణాల్లా జరిగిపోతాయి. ఒక చైతన్య వాహినిలా కదిలిపోయే జన ప్రవాహాన్ని చూస్తుంటే జీవితంలో ఎంతటి విరాగకైనా సరే, ఆశ కలిగి తీరుతుంది. భక్తుల హృదయ సాగరాల్లో [పొంగి పోరలుతున్న భక్తీ ప్రవాహం నాస్తికుల శుష్కించిన హృదయసరోవరాలను నింపి చేతులెత్తి మ్రొక్కేటట్లు చేయిస్తుంది.
ఇక ప్రకృతి కన్నె గూడా స్వామి దర్శనానికి వచ్చి, తిరిగి వెళ్ళలేక స్వామిని సేవిస్తూ , అక్కడే స్థిరనివాసం ఏర్పరచుకొన్నట్టుంది. కొండ ఎక్కడం మొదలు పెట్టినప్పటికీ నుండి గమ్యం చేరేవరకూ, ఆ ప్రకృతి బాల మనోహర సౌందర్యాస్వాదనలోనే యాత్రిక బృందం కాలమంతా హరించిపోతుంది.
ఆ ప్రకృతి లలన ముగ్ధ మధుర రూపానికి హృదయాలనే పోగొట్టుకున్న కళాకారులు పదే పదే ఆమె దర్శనార్ధం వస్తుంటారు.
కవితా కన్నె ఆ ప్రకృతి కన్నియ సాంగత్యంలో ఎన్నో అందాలను రంగరించుకుంటుంది.
చిత్రలేఖాదేవి ఆ ప్రకృతి బాలలో ఐక్యమైపోయి, సౌందర్య రాణిలా వెలిగిపోతుంది.
సంగీత సరస్వతి అక్కడ కోకిల కూజితమునే దిక్కరిస్తుంది. నాట్యరాణి అక్కడ మయూరి యై ప్రపంచాన్నే మరిచిపోతుంది.
కొండ మీద ప్రశాంత వాతావరణం లో ఏకాంతంగా ఆ ప్రకృతి విలాసాన్ని నిర్నిమేష దృష్టితో వీక్షిస్తూ . ఆలోచనా డోలికల్లో తేలిపోతుంది సుధీర. కాసేపటికి ఊహాలోకంలో తేలిపోతూ నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ వస్తున్న చంద్రశేఖరం సుధీర దృష్టిలో పడ్డాడు.
"హలో! కవీ!' నవ్వకుండా ఎంతో గంబీరంగా ఉండాలనుకున్న సుధీర ప్రయత్నం ఫలించలేదు. ఆ కంఠంలోని వ్యంగ్యమూ, ఎగతాళి చంద్రశేఖరం కు అర్ధం కాకపోలేదు. తలెత్తి చురచురా చూశాడు. సుధీర ముఖంలోకి.
"మీ స్నేహితులు గదికి తిరిగి వచ్చారా?" లేదా?"
"వచ్చారు."
"ఎవన్నారు?"
"ఇంకెప్పుడు అలాంటి పని చెయ్యమని లెంపలేసుకున్నారు."
"మీ విషయం?' క్రింది పెదవి నొక్కి అంది సుధీర'.
"నా విషయమా? నా కందులో భాగం లేదని ఆరోజే మీతో చెప్పాను. మీరు నమ్మలేకున్నారు. అది నా దురదృష్టం." తల వంచుకుని గొణిగాడు.
సుధీర ఓరగా, పరీక్షగా చూసింది చంద్ర శేఖరం ముఖంలోకి. నిర్మలంగా, అమాయకంగా ఉంది అతని ముఖం. సుధీర హృదయం ఎందుకనో తప్పు చేసినట్లు బాధపడింది.
"ఇలా వచ్చారేం? మొక్కుబడి గానీ ఉందేమిటి?' అంది.
"నాలాంటి దరిద్రుడు స్వామికిచ్చే మొక్కుబడులేముంటాయి?' సజల నయనాలతో అన్నాడు.
సుధీర మనసు చివుక్కు మంది. "చంద్ర శేఖరం పరోక్షంగా తన ఐశ్వర్యాన్ని ఎత్తి చూపుతున్నాడేమో' అని అనిపించకపోలేదు. తను మరీ మొరటుగా , కఠినంగా ప్రవర్తించి , అతని మమకోమల హృదయాన్ని గాయపరుస్తున్నానేమో అని కూడా అనిపించక పోలేదు." ధన, కనక వస్తు వాహనాదులను సమర్పించుకోలేక పోవచ్చు. కాని, మీ కవితా కన్నె స్వామిని సేవిస్తే అంత కన్నా అమూల్యమైన కానుక మరొక టేముంటుంది?"
చంద్రశేఖరం ఆశ్చర్యంగా చూశాడు సుధీర వేపు. పరిచయమైన క్షణం నుండీ తన్ను ఏడిపించి తన హృదయంతో ఆడుకొన్న ఆమెనా తనతో ఇలా మాట్లాడ్డం? ఈ సానుభూతి కూడా తన్ను ఏడిపించటం లో ఒక భాగమా? ఎటూ నిర్ణయించుకోలేక సందిగ్ధ మానసుడై సుధీర వేపు చూస్తూ ఉండిపోయాడు.
"అలా చూస్తారేం? అసత్యం చెప్పానా?"
"లేదు"
"ఏమిటో అలోచిస్తున్నట్లుందే? నేనిక్కడకు ఎందుకోచ్చాననా?"
'అలాంటి ఆలోచనలు నాకెందుకొస్తాయి?'
"అవును. సాధారణ మానవుని ఆలోచనా విధానానికి, మీకూ ఎంతో తారతమ్యం ఉంటుందనుకుంటాను."
ఆ మాటా వ్యంగ్యమో కాదో తేల్చుకోలేని స్థితిలో పడ్డాడు చంద్రశేఖరం.
"ఏవంటారు?"
"కావచ్చు." నసిగాడు.
"మీ పేరేమిటో మరిచిపోయాను."
"చంద్రశేఖరం."
"అంటే అర్ధమేమిటో?"
దూరంగా కొండలవేపు చూస్తున్న చంద్రశేఖరం సుధీర కళ్ళల్లోకి సూటిగా చూశాడు. కిలకిలా నవ్వుతున్నట్లున్నాయి ఆ కళ్ళు! లేక ఆ కళ్ళల్లోని కాంతే అలాంటిదేమో? తిరిగి సందేహం! ఈ అమ్మాయి మళ్ళీ తన్ను ఏడిపిస్తుంది. డబ్బున్నవాళ్ళకు మరీ గర్వం.
"తెలీదా?"
"ఏమిటి?"
"మీ పేరు కర్ధం?"
"శివుడు."
"వ్యుత్పత్తర్ధం?"
చంద్రశేఖరానికి ఈసారి బాగా కోపం వచ్చింది. స్కూలు మాస్టార్లా ఏమిటిది? ఆమాత్రం తనకు తెలీక పోతుందా? అంతగా తెలీకుంటే డిక్షనరీ చూస్తె సరి! తనేం స్కూలు పిల్లాడా , ఈవిడ గారి ప్రశ్నలకు చేతులు కట్టుకుని జవాబు చెప్పను? ఇక్కడనుంచి వెళ్ళిపోవటం మంచిది. ఎలా తప్పించుకోడం?"
"చెప్పకూడదేమిటి?" కంఠంలో మార్దవం.
చంద్రశేఖరం కోపంగా - "చంద్రుడు కిరీటముగా కలవాడు " అన్నాడు.
"ఏ సమాసమో?' క్రీగంట చూస్తూ అంది సుధీర.
ఈసారి చంద్రశేఖరం అభిమానం బాగా దెబ్బ తినింది. "వెళ్ళాలి" అన్నాడు ముఖం ప్రక్కకు తిప్పుకుని.
"ఎక్కడకు?"
"బాగుంది! తనేక్కడికి వెళ్తే ఈవిడ కెందుకు? "స్నేహితుల్ని కలుసుకోవాలి....' గొణిగాడు.'
"మీ గదిలో స్నేహితుల్నా?" ఫక్కున నవ్వి అంది సుధీర.
అంత కోపంలోనూ ఆమె నవ్వగానే ముత్యాలు రాలాయా అనిపించింది చంద్రశేఖరానికి. "ఊహు కాదు."
"మరి? కాంటీన్ వెళ్ళి కాఫీ తాగొద్దాం రండి!"
"ఇప్పుడే త్రాగాను."
"అబద్దం!"
"ఎందుకూ?"
"కాంటీన్ ఈవైపు ఉంది. మీరీ వైపు నుండి వస్తున్నారు."
తను చేసిన తప్పిదమేమిటో తెలిసింది. చంద్రశేఖరానికి. ఊరికే కాఫీ త్రాగడం నా వొంటికి పడదు."
"పాలు తీసుకోవచ్చుగా?"
"అజీర్తి చేస్త్గుంది."
"పోనీ, టీ?"
"చంపారు! రాత్రికి నిద్ర పట్టదు."
"మంచిదేగా? కూర్చుని కవిత్వం రాసుకోవచ్చు!"
మళ్ళీ కంఠం లో అదే హేళన. చంద్రశేఖరం తన్ను తానె తిట్టుకున్నాడు.
"రండి!"
"నాకు హోటలు సరుకు బొత్తిగా పడదు."
"వంట ఎవరు చేసి పెడుతున్నారో? స్వయం పాకమా?"
"ఆ!"
"మీ గదిలో కనీసం ఒక్క పాత్రన్నా నాకు కనిపించలేదు!"
"సరిగా చూసి ఉండరు."
"పోన్లెండి! నాతొ రావడం ఇష్టం లేదు గాబోలు!"
అవును, సరిగ్గా అదే! కానీ ఎలా చెప్పడం?
ఆ మాట మోహన్నే చెప్పేస్తే ఆ అమ్మాయి నొప్పి పడదూ? తన జేబులకు కన్నం మటుకు లేదు గానీ, రాగి నయాపైసా గూడా అందులో లేదు! ఒకసారి చొక్కా జేబువంక చూసుకున్నాడు. తీరా కాంటీన్ కు వెళ్ళాక టికెట్లు కొనుక్కు రమ్మని తన్ను పంపితే? అంతకన్నా అవమానకరమైన విషయం మరొక టి ఉంటుందా? తన స్నేహితులు చేసిన కొంటె పనికి ఈవిడ తన మీద ప్రతీకారం తీర్చుకుంటుందా? ఏమో.... ఏం జవాబు చెప్పక ఆలోచిస్తూ ఉండిపోయాడు.
"పోన్లెండి! నేనే వెళ్తాను." నిష్టూరంగా అంది సుధీర.
"పదండి!" తనకు తెలీకుండానే అనేశాడా మాట. వెళ్తున్నాడన్నమాటే గానీ, గుండెల్లో గుండెలు లేవు. ఎలాంటి అవమానకరమైన పరిస్థితిని ఎదుర్కొనవలసి వస్తుందోనని బెంగ! కాంటీన్ లో అడుగుపెట్టగానే కళ్ళల్లో నీళ్ళు తిరిగినంత పనయింది.
"కూర్చోండి! నే వెళ్ళి టిక్కట్లు కొనుక్కోస్తాను."
చంద్రశేఖరానికి ఆ మాటలు అమృత సేవనంలా ఉన్నాయి. గుండెల మీద నుండి పెద్ద బరువు తొలగిపోయినట్లు ఊపిరి తీసుకుని కుర్చీల్లో కూర్చున్నాడు.
రెండు గ్లాసుల్లో కాఫీ తీసుకు వచ్చి చంద్రశేఖరాని కెదురుగా కూర్చుంది సుధీర. సుధీర బలవంతం మీద చంద్రశేఖరం కాఫీ త్రాగాడు.
"ఏం చదువుకున్నారు?"
"బి.ఏ. ఫెయిలు."
"పూర్తిగా ?"
"ఉహూ. గ్రూపు మటుకే."
"ఏ గ్రూపు?"
"లెక్కలు."
