నాలుగు రోజులు గడిచిపొయినాయి. సాధ్యమైనంత వరకు నీరజను తప్పుకుని తిరగసాగింది ఇందిర తలనొప్పిగా, జ్వరం వచ్చినట్టుగా ఉండటం వలన హాస్పిటల్ కు ఆరోజు శలవు పెట్టి ఇంట్లోనే ఉంది. అంతకు క్రితం రోజే వచ్చిన రాజారావు ఆఫీసు కెళ్ళిపోయాడు. అప్పుడే వచ్చిన శేఖర్ తో మాట్లాడుతూ పడుకున్నది ఇందిర. ఆమెకు ఇంజక్షన్ చేసి చేతులు కడుక్కుని కూర్చున్నాడు శేఖర్.
"అక్కా! అన్నయ్య కు చాలా జ్వరంగా ఉంది. అసలు మన స్పృహే లేదు. పెద్దమ్మ ఇంకా ఊరి నుంచి రాలేదు. నాకు చాలా భయంగా ఉంది. నువ్వు రా అక్కా!' బయట నుంచి ఏడుస్తూ వినిపిస్తున్న మాటలకు ఇద్దరూ ఒకరి మొఖాలోకరు చూసుకున్నారు ఇందిరా, శేఖర్ లు.
"భార్గవి గొంతులా ఉంది..." కొద్దిగా మంచంమీద నుంచి లేస్తూ అంది ఇందిర.
"నేను చూసోస్తాను- మీరు పడుకోండి" శేఖర్ బయటకు వెళ్ళిపోయాడు. ఇంతలో నీరజ, భార్గవి ఇద్దరూ లోపలి కొచ్చారు. భార్గవి బుగ్గల మీద కన్నీటి చారికలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ స్థితిలో భార్గవి ని చూసిన శేఖర్ హృదయం జాలితో నిండిపోయింది.
"ఇందూ! అప్పుడు చెప్పలేదూ -- భార్గవిని తీసు కెళ్ళటానికి వాళ్ళన్నయ్య వస్తున్నట్టుగా -- వాళ్ళ పెద్దమ్మ ఊరి కెళ్ళారుట -- ఆవిడ వచ్చిన తరువాత భార్గవి ని తీసుకెళ్ళాలని ఆగాడుట. ఇంతలో జ్వరం ముంచుకొచ్చి స్పృహ లేకుండా ఉన్నాడుట -- పాపం - ఎట్లా?' ఆందోళన గా అంది నీరజ. ఇందిరకేం చేయ్యాలో పాలు పోలేదు. తను వెళ్ళగలిగే స్థితిలో లేదు.
"నేను వెళ్ళి చూస్తాను. మీరు విశ్రాంతి తీసుకోండి అంటూ బయలుదేరాడు శేఖర్. భార్గవి కి శేఖర్ రావడం ఇష్టం లేకపోయినా తప్పలేదు.
"అక్కా! నువ్వు కూడా రావా!" జాలిగా దీనంగా అంది భార్గవి నీరజ నుద్దేశించి.
"ఇందిర కిలా ఉంది, రెండు రోజుల నుంచీ సుందరమ్మ గారు కూడా లేరు. పాపకి పక్కలు వెచ్చగా ఉన్నాయి. ఇల్లెలా వదిలి రానమ్మా? ఫరవాలేదు. శేఖరం గారున్నారుగా -- మీ అన్నయ్య కేం భయం లేదు" ధైర్యం చెప్పి పంపించింది . భార్గవి ని నీరజ.
శేఖర్ కారులోనే ఇద్దరూ వెళ్ళారు. ఒక ఇంటి ముందు కారాపించి "రండి" అంది భార్గవి లోపలికి దారి తీస్తూ.
ముందు డ్రాయింగ్ రూం లో నాలుగైదు కుర్చీలు, ఒక బల్ల ఉన్నాయి. ఒక మూలగా చిన్న టేబులు మీద రేడియో ఉంది. డ్రాయింగు రూములో నుంచి రెండు గదులు దాటి వెనక ఉన్న గదిలోకి దారి తీసింది భార్గవి. కొంచెం పెద్దగా ఉన్న ఆ గది చాలా శుభ్రంగా ఎక్కడి వస్తువు లక్కడ అమర్చబడి ప్రశాంతంగా ఉంది. ఆ గది మధ్యలో ఫాను కింద మంచం మీద పడుకున్న వ్యక్తీ దగ్గరకు నడిచాడు శేఖర్.
స్టేత స్కోప్ తీసుకుని పరీక్ష చేశాడు.
వెంటనే బాగ్ తెరిచి ఇంజక్షను తీసి చేశాడు.
"కొంచెం షొప్ కావాలి -- ఇస్తారా" సిరంజ్ పక్కన పెడ్తూ అన్నాడు శేఖర్.
ఆత్రంగా అన్నయ్య వంకే చూస్తున్న భార్గవి ఉలిక్కిపడి తెస్తానన్నట్టు తలూపి వెళ్ళి షొప్, నీళ్ళు తీసుకు వచ్చింది.
టవల్ అందించి లోపలి కెళ్ళింది భార్గవి. పది నిముషాల తర్వాత కాఫీ తీసుకొచ్చిన భార్గవి ని "ఇప్పుడివన్నీ ఎందుకండీ" అన్నాడు శేఖర్. భార్గవి మాట్లాడలేదు.
"మీరు మొత్తం మీద చాలా తమాషాగా ప్రవర్తిస్తుంటారు" శేఖర్ నవ్వుతూ కాఫీ కప్పు చేతిలోకి తీసుకున్నాడు. భార్గవి కళ్ళేత్తి అతని వంక చూసి తల దించుకుంది.
"మీరు చాల తక్కువ మాట్లాడతారల్లె వుందే! ఓ.కే వస్తాను. సాయంత్రం మళ్ళీ వస్తాను. ఇంకో గంటలో టెంపరేచర్ బహుశా తగ్గవచ్చు" అని వెళ్ళిపోయాడు.
సాయంత్రం 4 గంటకు నీరజకు ఫోను చేసి చెప్పింది కొంచెం జ్వరం తగ్గిందని.
6 గంటలు దాటుతుండగా శేఖర్ వచ్చాడు స్టేతస్కోపు ఊపుకుంటూ.
"హల్లో! ఎలా వుంది మీ అన్నయ్య కు" అన్నాడు వస్తూనే. భార్గవి నెమ్మదిగా లోపలకు నడిచింది.
"ఓ! సారీ" మీరు మాట్లాడరు కదూ" అంటూ భార్గవి ననుసరించాడు.
ఎంత గంబీరంగా ఉండామనుకున్నా భార్గవి పెదవుల మీద చిరునవ్వు తళుక్కు మనకుండా ఉండలేక పోయింది.
పరీక్ష చెయ్యటం పూర్తీ చేసి కాగితం మీద కొన్ని మందులు వ్రాసి ఈ రాత్రికి ఈ మందులు వెయ్యండి" రేపు మళ్ళీ ఇంజక్షను చెయ్యవచ్చు.
ఎందుకో అతని ముఖం గంబీరంగా మారినట్టు కనపడ్డది భార్గవి కి.
మందు చీటీ చేతిలోకి తీసుకుని లోపలికి వెళ్ళబోతున్న భార్గవి ని "ఈ మందులు ఈ రాత్రికి తప్పకుండా వెయ్యాలి! వింటున్నారా?" అన్నాడు శేఖర్.
భార్గవి తల ఊపింది. విసుగ్గా కళ్ళెత్తి ఆమె వంక నిశితంగా చూశాడు.
"మరి మీ అన్నయ్య ను ఒంటరిగా వదిలి వెళ్తారా? ఇంట్లో ఎవరూ లేరులా ఉందే?" అన్నాడు లేస్తూ.
భార్గవి సమాధానం చెప్పే లోపలే "ఎవరూ లేరా?' అన్నాడు శేఖర్.
లేరని తలూపింది భార్గవి.
భార్గవి ని వింత మృగాన్ని చూసినట్టు చూసి వెళ్ళిపోయాడు శేఖర్.
అప్పుడే పాలు తాగి అలిసిపోయిన పాపాయిలా. నిర్మలంగా పడుకుని ఉన్న అన్నయ్యను చూసి నిద్రపోతున్నాడు కదా, వెళ్ళి రావచ్చని బయలుదేరింది భార్గవి మందులకు.
తలుపులు దగ్గరగా వేసి పక్కింటి నారాయణ ను కూర్చోబెట్టి వెళ్ళవచ్చునని భార్గవి ఆలోచన. ఆ పిల్లాడు ఎక్కడకు పోయాడో -- ఇంట్లో లేడు. అబ్బ బాగా చీకటి పడిపోయినది. వీధి లైట్లు గుడ్డిగా వెలుగుతున్నాయి. ఎందుకో భయమనిపించింది భార్గవికి. ఇల్లు కూడా ఆ సందు చివర ఉండటం వలన నిర్మానుష్యంగా కూడా ఉంది. అసలు తన దురదృష్టం కాకపోతే పెద్దమ్మ కు ఆ పొలంవ్యవహరం గొంతు మీద కత్తిలా ఇలా ముంచుకు రావాలా? అన్నయ్య ఇలా ఒళ్ళు తెలియకుండా పడిపోవటమేమిటి? ఎవ్వరూ తోడూ లేకుండా ఒంటరిగా ఎలా ఉండాలి...." ఈ విధంగానే ఆలోచిస్తుండగానే నల్లని కారు వచ్చి వాకిలి ముందు ఆగటం -- శేఖర్ దిగి తన వైపు రావటం జరిగిపోయింది క్షణం లో.
"భార్గవి! ఇవిగో మందులు! రాత్రికి నుదుటి మీద పల్చటి బట్ట తడిపి వెయ్యటం మాత్రం మర్చిపోవద్దు! అని భార్గవి చేతిలో మందుల కవరు పెట్టి వెళ్ళిపోయాడు.
అంటీ అంటనట్టు కలిగిన ఆ స్పర్శాను భూతికి భార్గవి శరీరం జలదరించింది. ఇక ఎక్కువసేపు నిలబడకుండా లోపలి కొచ్చేసింది.
మరునాడు తేలిగ్గా ఉండటం వలన ఇందిర హాస్పిటల్ కు బయలుదేరింది.
శేఖర్ దోవలో ఎదురుపడ్డాడు.
"మీఇంటి కే బయలుదేరాను. ఇంతలో మీరు ఎదురు పడ్డారు" అన్నాడు కారాపుతూ శేఖర్.
"మీ పేషెంట్ ను చూస్తారా?"
"పదండి! చూసి హాస్పిటల్ కి వెళ్తాను. అయినా నా పేషెంట్ ఏమిటి -- మీ పెషేంటే" నవ్వుతూ అంది ఇందిర.
రెండు కార్లూ ఒకదాని వెనక ఒకటి పరుగు తీసినాయ్.
ఇద్దరూ ఒకరి వెనుక ఒకరు లోపలికి దారి తీశారు. నీరసంగా కళ్ళు మూసుకుని మగతగా పడుకుని ఉన్నాడతను. శేఖర్ పరీక్ష చెయ్యడం పూర్తీ చేసి ఇందిర వైపు తిరిగాడు. ఇందిర ముఖం తెల్లగా పాలిపోయి ఉంది. రెప్పవాల్చకుండా అతన్నే చూస్తూ కూర్చున్నది.
(1).jpg)
"ఇందిరా" గట్టిగా అన్నాడు శేఖర్.
కాని ఇందిరా లో చలనం లేదు.
"ఇందిరా......." ఇంకొంచెం గట్టిగా అరిచాడు శేఖర్.
భార్గవి కేమీ పాలుపోలేదు. కొంచెం సేపయిన తరువాత తెప్పరిల్లింది ఇందిర.
"ఎట్లా ఉంది శేఖర్" అంది నీరసంగా.
"ఏమిటి మీరలా అయిపోయారు? మీరు కూడా చూడండి" స్టేతస్కోపు అందిస్తూ అన్నాడు శేఖర్.
"నో! నో అక్కరలేదు -- ఫరవాలేదు కదా"
ఆమె గొంతులో ఆందోళన ధ్వనించింది.
"ఫరవాలేదు ! కాని...."
భార్గవి వంక చూస్తూ అర్దోక్తి లోనే ఆపేశాడు శేఖర్.
"చెప్పండి" అంది ఆదుర్దాగా.
"నాలుగైదు రోజుల వరకు డాక్టరు దగ్గరగా ఉండటం అవసరం."
'అయితే హాస్పిటల్ లో చేర్పించావా!" దాదాపు ఏడుస్తూ అంది భార్గవి.
"మా ఇంటికి తీసు కెళ్తే సరి? నాలుగు రోజుల తర్వాత పంపించేస్తాను" అన్నాడు శేఖర్ ఆలోచిస్తూ.
ఈ ఆలోచన భార్గవి కూడా నచ్చింది. రోగి పక్కన వంటరిగా ఉండాలంటే ఆమెకు బెరుగ్గానే ఉంది. అందుకని వెంటనే ఒప్పుకుంది . ఇందిర కసలు తనేం మాట్లాడుతుందో -- ఏం చేస్తున్నదో తెలియటం లేదు.
"నేను వెళ్తున్నాను" అనేసి గబగబా కారులో వచ్చి పడింది. కారు హాస్పిటల్ కు బదులుగా ఇంటి వైపు తిరిగింది.
* * * *
"అదేమిటి వచ్చేశావెం? హాస్పిటల్ కి వెళ్ళలేదా?" అంది నీరజ ఇంటికి వచ్చిన ఇందిరను చూస్తూ.
"లేదు -- భార్గవి అన్నయ్య ను చూస్తున్నాను నీరజా -- అతనికి...అతను...అతను...." ఆమె ముఖమంతా చెమటలు పట్టినయి . ముఖం ఎర్రగా కందిపోయి ఉంది.
"ఏం - ఎట్లా ఉందతనికి?' ఆదుర్దాగా అడిగింది నీరజ.
"ఏం లేదు -- బాగానే ఉంది -- కాని-- అతను అతను....."
"అబ్బబ్బ! ఏం కంగారే నీకు -- అతనికేం ఫర్వాలేదంటుంటివి -- ఇంకా ఎందుకా గాభరా! ఇందూ ! నీకు రోజు రోజుకి బుద్ది తరిగిపోతున్నది. నువ్వు డాక్టరు వనే విషయం ప్రతిక్షణం నేను జ్ఞాపకం చెయ్యాలా? మామూలు ఆడపిల్ల లాగ అలా కంగారు పడిపోతావెం? నీ ధోరణి చూస్తుంటే నువ్వేం డాక్టరు వా అనిపిస్తున్నది"
"ప్రతిదానికి డాక్టరు, డాక్టరు" డాక్టర్ అయితే హృదయముండదా? మనసుండదా! డాక్టర్ మనిషి కాదా! ఆ మనిషికి మమతలు ఉండకూడదా?" కోపంతో ముఖం మరింత ఎర్రగా కందిపోయింది.
నీరజ తేలిగ్గా నవ్వేస్తూ "డాక్టరు కి మనసూ మమతా రెండూ ఉంటాయి కాని రోగిని చూసి రోగి కంటేఎక్కువగా నీళ్ళు కారిపోతే ఈ డాక్టరు ని చూడటానికి ఇంకో డాక్టరు కోసం పరుగెత్తవలసి వస్తుంది." అంది , "నీరూ! పరిహాసానికి ఒక వేళా పాళా ఉంటుంది తెలుసా?" కోపంగా అక్కడనుండి లేచి వెళ్ళిపోయింది ఇందిర.
* * * *
"అదేమిటి? ఇందిర అలా వెళ్ళిపోయింది"- అని ఆశ్చర్యపోతూనే శేఖర్ ఇంజక్షన్ చెయ్యడం ముగించాడు. భార్గవి ఎదురుగ్గా నిలబడ్డా గుర్తించనట్టే ప్రవర్తించాడు." ఇంజక్షన్ ను చెయ్యటం, అతని చేతుల మీద నీళ్ళు పొయ్యటం యాంత్రికంగా జరిగిపొయినాయి. భార్గవి నీళ్ళు పోస్తూనే ఆలోచనలో పడ్డది.
"అన్నయ్యను పూర్తిగా శేఖర్ దగ్గర వదిలి పెట్టడం భావ్యమా! అయినా ఇంకా అన్నయ్య కు బాగా స్పృహ నిలవటం లేదెందువల్లనో?పెద్దమ్మ ఇంకా ఎప్పుడొస్తుంది...." ఈవిధంగా ఆమె మనసు ఆలోచనా ప్రపంచంలో ఉంది. శేఖర్ చేతులు కడుక్కుని నిలబడ్డాడు. టవల్ ఇవ్వాలన్న ధ్యాసే లేదు భార్గవికి.
"టవల్ ఇస్తారా?" కొంగుతో తుడుచుకోమంటారా?"
