దాసి. పోతరాజు ఫ్రానిసెస్ పురం గ్రామము
వయస్సు 45 సం.
మా ఫ్రానిసెస్ పురం ఒక చిన్న హరిజనవాడ. అందులోని జనాభా 80 మంది. మాకు దగ్గరలో రెండు మూడు కుటుంబాల వాళ్ళు కాపులు కూడా వున్నారు. మేమెంతో అన్యోన్యంగా వుంటాము. నన్ను మా గ్రామానికి పెద్దగా ఎన్నుకొన్నారు. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ ఆ ద్వారానే జరుగుతుంటాయి. నాకు చిల్లర దుకాణం కూడా వుంది. దాంతో నాకు సుఖంగానే జీవనోపాది జరిగిపోతోంది. నా భార్య పేరు నాగ రత్నం, అన్ని విధాలా నాకు చేయూతగా వుంటూ నా సంసారాన్ని సుఖంగా జరుపుకుపోతోంది. నాకు ఒక కుమార్తె ఆమెకు పెండ్లయింది. "టి" కొత్తపాలెం యిచ్చాను. కవలలతో మరో ముగ్గురు మగ పిల్లలు కడసారి పిల్లవానికి 8 సం||ల వయస్సు. ఇతను నాగాయ లంకలో వుంటు ఉన్నాడు. మిగిలిన మగ పిల్ల లిద్దరు, నా మనుమ డొకడు నావద్ద నున్నారు.
ఆ రోజు శనివారం. ఉదయం నుంచీ తుఫాను గాలులు ఎక్కువయినాయి. అన్నం వండారు కాని మేమెవ్వరమూ భోజనం చేయటానికి వీలుపడలేదు. ఉదయం 11 గం||లకి మా యింటి కప్పు లేచి పోయింది. మా వాళ్ళకు భయమేసి ఏడుస్తున్నారు. పిల్లలు నన్ను కావలించుకొని వదలడం లేదు యింట్లో నిలవడానికి చోటు లేకుండా పోయింది. మాకు దగ్గరలో దోవా సరస్వతి గారి యిల్లుంది. దాని లోకి మేమంతా వెళ్ళాము. అప్పటికే ఆ యింటిలో యిరువై మంది వరకూ వున్నారు. నేను నాఅన్న దాసి. చంద్రయ్య కలసి ఆ యింటి కప్పుని ఎగరకుండా తాళ్ళతోను మోకులతోను బిగించి కట్టాము.
గాలికి యిల్లంతా వూగుతోంది. తలుపు లాగటల్లేదు. లోపల పలుగు లేసి తొక్కి పట్టుకున్నాము, కవల లిద్దరూ నా వద్ద వున్నారు. మనుమడు నా భార్య వద్ద యున్నాడు. యింట్లోకి నీళ్ళు వచ్చాయి. చూస్తుండగానే మోకాటి లోతు వచ్చాయి. రుచి చూశాము ఉప్పు నీరు. వెంటనే తలుపులు వదలి బయటకు వెళ్ళాను. గాలి ఎత్తి నన్ను, నా తోడల్లుడు నాదెళ్ళ భీమయ్య యింటి వద్ద పడేసింది. నేనా యింట్లోకి వెళ్ళాను, అక్కడ యింట్లోని వారందరూ ఒకళ్ళ నొకళ్ళు కావిటించుకొని ఏడుస్తున్నారు. నేను పడమట వైపునకు వెళ్ళి యిల్లు ఎక్కాను, చుట్టు ప్రక్కల గ్రామాలేవీ కనపడటం లేదు. ఎటు చూచినా వాగలే కనిపిస్తున్నాయి. నా గుండెలు బ్రద్దలయ్యాయి. వెంటనే క్రిందకు దిగి వచ్చాను. "వాగా వచ్చేసింది మీరంతా యిల్లు ఎక్కండి అని కేక వేశాను. నా అన్నగారి కుమారుడు శ్రీ రాములు నన్ను కావిటించుకొని ఏడుస్తున్నాడు. అతన్ని యిల్లు ఎక్కించాను. యింతలో తూర్పు నుంచి పెద్ద వాగ వచ్చింది. దానితోపాటు క్రింద వరుస యిళ్ళన్నీ మా వైపు కొట్టుకొస్తున్నాయి. కొన్ని యిళ్ళపైన జనంవున్నారు. ఒక యింటి మీద నా భార్య; పిల్లలు కనిపించారు, నన్ను చూచి ఏడుస్తూ, చేతులెత్తి దండం పెట్టారు, వాళ్ళు కొట్టుకుపోతున్నారు. నేను కూడా కొట్టుకు పోతున్నాను.
ఇంతలో ఒక పెద్ద వాగ వచ్చింది. మావాళ్ళున్న యిల్లు సుడి తిరిగి మునిగిపోయింది. వాగ పోయింది. మావాళ్ళు నీళ్ళల్లో కొట్టుకుంటూ నాకు కనిపించారు. నేనేమి చేసేది నేనుకూడా నీళ్ళలో మునుగుతూ, లేస్తూ యున్నాను. మరలా వాగ వచ్చింది. అది నన్నెత్తి మళ్ళీ తొడుగుమీద పడేసింది. నేనా ముళ్ళకంపలో చిక్కుకు పోయాను మళ్ళీ మండలు పట్టుకొని నన్ను యెటూ కదలనివ్వటం లేదు. బలవంతాన చొక్కాను చించిపారేశాను. కంపతోపాటు కొట్టుకుపోతున్నాను.
నాకు ఎదురుగా ఒక తెప్పసుడి తిరుగుచూ కనపడింది. దానిని పట్టుకొని గాలి ప్రకాశం కూర్చొనివున్నాడు అతని ప్రక్కనే ఒక ఆడమనిషి పండుకొనియుంది. ఆమె ఆ తెప్పకు కట్టబడివుంది. ఆమె అతని భార్య, నన్ను చూచి అతడు దండం పెట్టాడు. నేనుకూడా కంపల్లోనుంచి చేతులెత్తి దండం పెట్టాను. మాది ఎవరిత్రోవ వారిదయంది కొంతదూరం పోయాము. మరలా ఆ తెప్ప అడ్డువచ్చింది అతని తెప్ప సుడి తిరుగుతూ పోతోంది. మరలా మేము ఎవరిత్రోవన వాళ్ళు పోయాము. మూడవసారి మరలా తెప్ప నాకు కనిపించింది. అతని తెప్ప సగం మాత్రమే కనిపిస్తోంది. దానిమీద అతని భార్య లేదు. నన్ను చూచి అతను ఏడ్చాడు. నేనూ అతన్ని చూసి కేకలేసి యేడ్చాను. మేము కొట్టుకుపోతున్నాము. తరువాత అతను ఏమయ్యాడో తెలియదు. నేనున్న కంపకూడా విడిపోవటం మొదలు పెట్టింది. నేను నీటిలో పడిపోయాను. మునిగిపోతున్నాను. ఇంతలో నావద్దకు ఒక తాటాకుల మోపు కొట్టుకొచ్చింది. దానిని నేను పట్టుకొన్నాను. దానిలో ఒక పాముకూడా వుంది. అది రెండుతలల శిఖండి. దానికి కండ్లు కనపడటంలేదు. మట్టికొట్టుకుని పూడిపోయాయి. నన్ను అది ఏమీచేయలేదు నేను బర్రంకులవరకూ కొట్టుకుపోయాను. దగ్గరలో ఆవూరి తాళ్ళు కనపడుతున్నాయి నేనా వూరు చేరుకోవచ్చు ననుకొన్నా ఆ ఆశతోనే కొట్టుకు పోతున్నా.
గాలిలో మార్పు కనిపించింది. వాగలో కూడా మార్పే కనిపించింది. దక్షిణానికి పోయే నేను, ఉత్తరముగా పోతున్నాను, నా ప్రక్కనుంచే ఇళ్ళూ, కుప్పలూ, గొడ్లూ కొట్టుకు పోతున్నాయి. నేనున్నా తాటాకుల మోపు కూడా పోయింది దగ్గరలో ఒక వరి మోపు వుంటే దానిని వాటేసుకున్నాను. చాలా దూరం కొట్టుకుపోయాను ఎదురుగా, గుబురుగా చెట్లు కనబడుతున్నాయి. నేను అక్కడికి పోతే ఆ చెట్లను పట్టుకొని బ్రతుక వచ్చునను కొన్నాను. ఇంతలో పడమట గాలి వచ్చింది. ఆ చెట్లు నాకు కనపడలేదు. నేను తూర్పువైపు కొట్టకుపోతున్నా, ఎంతో వేగంగా పోతున్నా. ఒక తుమ్మ సగం వరకు విరిగిపోయి క్రిందకు వాలిపోయి వుంది. నేను పోయి దానిలో పడపోయాను. మోపును వదలి తుమ్మను వాటేసుకున్నాను. నా చేతులు బిగుసుకు పోయాయి. తరువాత ఏమి జరిగిందో తెలియదు.
మరుసటిరోజు ఉదయం ఎనిమిదిగంటలకు నాకు మెలకువ వచ్చింది. కళ్ళు తెరచి చూశాను నేను పేర్లంకపర్రలో యున్నాను. ఒకవైపు చోడవరం, మరోవైపు తలగడదీవి కనబడుతున్నాయి. దూరాన ఎవరో మనుషులు గెడలు పోటీ వేసుకొని వెతుకుతున్నారు. వాళ్ళను నేను కేకేశాను. బహుశా నా కేక వాళ్ళకు వినబడి యుండదు, అందుకే వాళ్ళు నావద్దకు రాలేదు నాకు దగ్గరలో మరో వ్యక్తి పట్టాడు. ఆయన నా కేకలు విని నావద్దకు వచ్చాడు. అతనికి వంటిమీద బట్టలు లేవు. నాకుకూడా లేవు. అతను నన్ను గుర్తుపట్టలేదు. కాని నే నతనిని గుర్తించాను. అతను నా తోడల్లుడు నాదెళ్ళభీమయ్య నేను అతన్ని చూచి గావురుమని ఏడ్చాను. అతనుకూడా కన్నీళ్ళు పెట్టుకున్నాడు. నన్నతడు గుర్తించాడు. చెట్టునుండి క్రిందకు దించాడు. మేమిద్దరము కొంతసేపు అక్కడే కూర్చున్నాము.
నాకు ఆకలి దహించుకుపోతోంది దాహమేసి నాలుక పిడచకట్టుకపోతోంది. కాళ్ళు చేతులు కొంకర్లు పోతున్నవి. లేచి నిలబడలేకపోతున్నాను. ఒక చేయి భీమయ్య పట్టుకొన్నాడు. మరోచేత్తో గెడను పోటీ వేసుకొంటూ మొనలోతు నీళ్ళలో పోతున్నాము. ఆకలికి ఆగలేక వడ్ల కంకుల్ని నమిలి వూటను మ్రింగి పిప్పిని వూసేస్తున్నాను. అదీ యేమంత ప్రయోజనంగా లేదు. నింపాదిగా నడచి పోతున్నాము. ఒక గట్టు అడ్డం వచ్చింది. అక్కడ మాకొక కొబ్బరికాయ గెల దొరికింది పోయిన ప్రాణం లేచి వచ్చినట్లయింది. కాని వాటిని కొట్టే దెట్లా? అర్ధం కావటల్లేదు మా భీమయ్యకు పళ్ళు లేవు. నాకా చేతులున్నవి కాని, పనిచేసే పరిస్థితిలో లేవు. అందుకని భీమయ్య చేతులతో ఒక కాయ మీద ఒక దానిని వేసి కొట్టి నా నోటికి అందిస్తున్నాడు. నేను దానిని నోటితో పై పీచును లాగేస్తున్నాను. ఇట్లా నాలుగైదు కాయల్ని తిన్నాము. మాకు కొంచెం ప్రాణం చేరుకొంది. తిరిగి ప్రయాణం సాగించాము.
ఎంతో కష్టపడి ఆదివారం మధ్యాహ్నానికి తలగడ దీవి హరి జనవాడకు చేరుకున్నాము మాకా బట్టలు లేవు. ఒక యింటి వద్దకు వెళ్ళాము. అప్పటి వరకు మొలలోతు నీళ్ళలోనే వున్నాము. మా పరిస్థితి చూచి ఆ యింటి ఆసామి చెరొక గుడ్డ ముక్క యిచ్చారు వాటిని మొలలకు చుట్టుకొన్నాము. మాకు దాహమేస్తుంది. మంచి నీళ్ళు కావాలని అడిగాము. పాపం వాళ్ళు మాత్రం యేమి చేస్తారు. అసలా వూళ్ళో మంచి నీళ్ళే లేవు మమ్మల్ని చూచి కళ్ళ వెంట నీళ్ళు పెట్టుకున్నారా యింటి వాళ్ళు. మా పరిస్థితంతా ప్రక్క యింటి ఆవిడ చూసింది. మజ్జిగలో అన్నం వేసి పిసికి మా దోసిళ్ళలో పోసింది. మా ప్రాణాలు జేరు కొన్నాయి, ఆ తల్లికి మనసులోనే నమస్కరించి తిరిగి ప్రయాణం మొదలు పెట్టాము.
ఆ రాత్రికి "టి" కొత్తపాలెం వెళ్ళాము. మా షావుకారు చోడి శెట్టి రామలింగేశ్వరరావుగారి యింటికి చేరుకొన్నాము. వారు మమ్మల్ని చూచి కన్నీరు పెట్టారు, మాకు చెరో చొక్కా, దుప్పట్లను యిచ్చారు. కడుపు నిండా నీళ్ళను పోశారు.
మా ప్రాణాలు పూర్తిగా జేరుకొన్నాయి. తిరిగి ఆ వూరి హరిజన వాడకు వెళ్ళాము. మా అత్తగారైన చెరుకూరి బసవమ్మ గారి యింటికి జేరుకొన్నాము. మమ్మల్ని కావిలించుకొని వాళ్ళంతా ఏడ్చారు నా కూతురు, నాగాయ లంకలో చదువు కొనుచున్న బాబు అక్కడకు వచ్చారు.
ఒక వారంరోజులు తరవాత మేము మా గ్రామం చేరుకొన్నాము ఊరంతా స్మశానంలాగా వుంది ఒక్క యిల్లు కూడా లేకుండా కొట్టుకపోయాయి. రోళ్ళూ, నాపరాళ్ళూ తప్ప. యేమి మిగలలేదు. మా గ్రామ జనాభా 80 మందిలోను ముగ్గురు మగవాళ్ళు, ఒక ఆడమనిషి మాత్రమే బ్రతికాము. మాకెంతో అండదండలుగా వుండే ఇమడాబత్తిన సుబ్బారావుగారు. వారి సోదరులు వెంకట్రామయ్య, కోటేశ్వరరావుగార్లు, వారి సోదరులు వెంకట్రామయ్య, కోటేశ్వరరావుగార్లు చనిపోయారు. కొక్కిలిగడ్డ నారాసింహులు నాలి గ్రామంనుంచి మావద్దకు వచ్చారు. మేము తా. తా. వారి ఆదరణతో యీ గ్రామంలోనే వుంటున్నాము.
