ఇంటికి వచ్చుచుండ గనిపించిరి దేవర దేవళమ్ములో
మంటపమందు పుష్పములు మాలలు గ్రుచ్చుచు వారు - పోయి కూ
ర్చుంటిని నేను కూడ నొకచో నొక స్తంభమువెన్క - ఇంతలో
గంటలు మ్రోగి - అర్చనలకై గుడిలోనికి పోయి రందఱున్.
పూజలై మిత్రు లిండ్లకు పోయినారు
రిక్తహస్తాల నిన్ను దర్శింపలేక
మంటపము ప్రక్క ధూళిలో నిండియున్న
గ్రుడ్డిపువ్వులనే యేరుకొంటి నేను.
పరిమళము లేక - ఎవరికి పనికిరాక -
పాఱవేయ బాటల ప్రక్కపడి - కరాళ
కాల పురుషుని కాఱు చక్రాల క్రింద
బ్రతుకలేని దరిద్ర పుష్పమ్ము లివ్వి.
ఈ యనాథ సుమాలనే - ఈ విశీర్ణ
జీర్ణకుసుమాలనే - ఈ కృశించు మ్లాన
హీన దీన ప్రసూనాలనే -త్వదంఘ్రి
సేవకై దోయిలించి తెచ్చితిని నేను.
పూల దోసిలి కన్నీట పొరలిపోయె
విరుల మాలిన్య మంతయు వెడలిపోయె
ఆగియుంటి ప్రభూ! స్వామియాజ్ఞకొఱకు
ఆదరింతువొ లేదొ నా "బీదపూజ."
సార్ధకత
అర్చకు లొనర్చు పూజల నందుకొనుచు
గుళ్ళలోపల హాయిగా కూరుచున్న
దైవముల తలకెక్కి తైతక్కలాడి
కులుకరింపగ మా మది కోర్కె లేదు.
గందపొడి గాలిపై చల్లి విందులిడి మ
రంద బిందువులు మిళింద బృందములకు
సిగ్గు విడనాడి ఉచ్చిష్ణ జీవితమ్ము
గడుపుటకు మా మదిని కౌతుకమ్ము లేదు.
హాయి మేయుచు శయ్యా గృహాంతరముల
పూలపాన్పులపై బడి పొరలుచున్న
మనుజ మహిషాల అడుగున మణగిపోయి
కమలిపోవగ మాకు నుత్కంఠ లేదు.
తొడిమ లెడలించి చించి తంతువులతోడ
గొంతులు బిగించి దండలు గ్రుచ్చి మమ్ము
ముడుచుకోను మోహనాంగుల ముడులమీద
ఫేషనులు దిద్ద మా కభిలాష లేదు.
ప్రణయినీ మృదులాంగుళీ రచిత పుష్ప
దామమై ప్రేమమయు కంఠసీమ నలరి
వలపు కౌగిళ్ళ సందుల నలిగి నలిగి
పరవశత నంద మాకు సంబరము లేదు.
ఒక ప్రశాంతప్రభాతాన, ఒక్క మంద
మలయా మారుతవీచిలో పులకరించి
మెల్లగా తల్లి చల్లని కాళ్ళపైన
రాలి కనుమూసికొనుటే సార్ధకత మాకు !!
స్వేచ్చా పుష్పాలు
శాంతిపూర్ణ సత్యాగ్రహ సమరమందు
జీవితమ్ముల నర్పణ సేయునట్టి
ధన్యమూర్తులు నడచెడి దారులందు
కాపురము సేయగా కోర్కె గలదు మాకు.
దేశదాస్య విముక్తికై దీక్షబూని
బందిఖానాల బ్రతుకులు బలియొనర్చు
త్యాగమూర్తుల పాదపరాగ మొడల
పులుముకొన నెంతయో కాంక్షగలదు మాకు.
కట్టుకొన గుడ్డ, త్రాగంగ గంజి లేక
గుడిసెలందు పేరాకట కుములుచున్న
కష్టజీవుల నిట్టూర్పు కాకలందు
కమలిపోవగ కోరిక గలదు మాకు.
విజయ ఘంటాధ్వనులు వినువీథి నిండ
ప్రజలు సాగింప జాతీయ పథము వెంట
కధలు స్వాతంత్ర్యరథము చక్రాల క్రింద
నలిగిపోవ సముత్కంఠ గలదు మాకు.
దాస్యబంధ విముక్త స్వతంత్ర భరత
మాతృకంఠాన ఒక పుష్పమాల యగుచు
తల్లి యానందబాష్పాల తడిసితడిసి
పులకరింపగ అభిలాష గలదు మాకు.
మాతృశ్రీ
అభ్రంకషంబౌ హిమాలయం బే తల్లి
మౌళి జుట్టిన మల్లెపూల చెండు
గోదావరీ కృష్ణ లే దేవి కటిసీమ
వ్రేలాడు ఆణిముత్యాల సరులు
ఆంధ్రసముద్ర మే యమ్మ పాదాలపై
జీరాడు పట్టుకుచ్చెల చెఱంగు
నలుబదికోట్ల వీరులు భారతీయు లే
కల్యాణి చల్లని కడుపుపంట
ఆమె బ్రహ్మర్షిజాత కల్యాణగీత
ధర్మసముపేత వేదమంత్రప్రపూత
విశ్వవిఖ్యాత సుశ్రీల వెలయుగాత
పరమకరుణాసమేత మా భరతమాత !!
నమస్తే
ఎలుకగుఱ్ఱము మీద నీరేడు భువనాల
పరువెత్తి వచ్చిన పందెకాడు
ముల్లోకములనేలు ముక్కంటియింటిలో
పెత్తన మ్మొనరించు పెద్దకొడుకు
"నల్లమామా" యంచు నారాయణుని పరి
యాచకా లాడు మేనల్లు కుఱ్ఱ
వడకుగుబ్బలి రాచవారిబిడ్డ భవాని
నూఱేండ్లు నోచిన నోముపంట
అమరులం దగ్రతాంబూల మందు మేటి
అఱుమోముల జగజెట్టి అన్నగారు
విఘ్నదేవుడు వాహ్యాళి వెడలివచ్చె
ఆంధ్రవిద్యార్ధి! లెమ్ము జోహారు లిడగ !!
తిలకమ్ముగా దిద్ది తీర్చిన పూప జా
బిలి రేక లేత వెన్నెలలు గాయ
చిఱుబొజ్జ జీరాడు చికిలి కుచ్చెల చెంగు
మురిపెంపు పాదాల ముద్దుగొనగ
జలతారు పూలకుచ్చుల వల్లెవాటుతో
త్రాచు జందెములు దోబూచులాడ
కొలుచు ముప్పదిమూడు కోట్ల దేవతలపై
చల్లని చూపులు వెల్లివిరియ
గౌరి కొమరుడు కొలువు సింగారమయ్యె
జాగుచేసినచో లేచి సాగునేమొ!
తమ్ముడా! రమ్ము స్వామి పాదములు కడుగ;
చెల్లెలా! తెమ్ము పువ్వుల పళ్ళెరమ్ము.
కొలుచు వారలకు ముంగొంగు బంగారమ్ము
పిలుచువారల కెల్ల ప్రియసఖుండు
సేవించు వారికి చేతి చింతామణి
భావించువారికి పట్టుకొమ్మ
"దాసోహ" మనువారి దగ్గర చుట్టమ్ము
దోసిలొగ్గినవారి తోడునీడ
ఆశ్రయించినవారి కానందమందార
మర్దించువారల కమృతలహరి
జాలిపేగులవాడు -లోకాల కాది
దేవుడే మన పార్వతీదేవి కొడుకు!
చిట్టెలుక నెక్కి నేడు విచ్చేసినాడు;
అక్కరో! అర్ఘ్యపాత్ర మిట్లందుకొనవె !
లడ్డూ జిలేబి హల్వాలె యక్కరలేదు
బియ్యపుండ్రాళ్ళకే చెయ్యిచాచు
వలిపంపు పట్టు దువ్వలువలే పనిలేదు
పసుపు గోచీకే సంబ్రాలుపడును
ముడుపు మూతల పెట్టుబడి పట్టుదల లేదు
పొట్టి గుంజిళ్ళకే పొంగిపోవు
కల్కి తురాయీలకై తగాదా లేదు
గరిక పూజకె తలకాయ నొగ్గు
పంచకల్యాణికై యల్కపాన్పు లేదు
ఎలుక తత్తడికే బుజా లెగురవైచు
పంచభక్ష్యాలకై మొండిపట్టు లేదు
పచ్చి వడపప్పె తిను "వట్టి పిచ్చితండ్రి!"
కుడుము లర్పించు పిల్లభక్తులకు నెల్ల
ఇడుములం దించి కలుము లందించు చేయి;
పార్వతీదేవి ముద్దులబ్బాయి చేయి;
తెలుగుబిడ్డల భాగ్యాలు దిద్దుగాక !
