Previous Page Next Page 
ది సెల్ పేజి 12


                                     హత్య
    
    'మద్రాసు నుండి హౌరా పోవు మెయిల్ నాలుగవ నెంబరు ఫ్లాట్ ఫారం మీదికి కొన్ని నిమిషముల లో వచ్చుచున్నది' రైల్వే ఎనౌన్స్ మెంట్.
    ప్రయాణికులు హడావిడి పడుతున్నారు.
    "బాబుగారు...బండొచ్చింది లెగండి"
    పోర్టర్ హడావిడిగా వెయిటింగ్ రూమ్ లోకి వచ్చిచెప్పాడు.
    ఉలిక్కిపడ్డాడు సూటుబాబు. ఒక్కసారిగా అతనికి నిద్రమత్తు వదిలింది.
    పోర్టర్ వి.ఐ.పి సూట్ కేసు నెత్తిన పెట్టుకుని మరో దాన్ని చేత్తో పట్టుకుని నడుస్తూంటే అతడి వెనక వెళ్ళాడు సూటుబాబు.
    "చూడండి బాబు! ఇక్కడ మీ పేరుందేమో" అని ఫస్ట్ క్లాసు కంపార్టు మెంటు దగ్గరాగాడు పోర్టరు.
    "లక్ష్మీపతి" అని వున్న తన పేరు చదువుకుని "ఈ కంపార్టుమెంటులోనే పెట్టు" అన్నాడు.
    పోర్టరు సూటుకేసులు లోపలపెట్టి లక్ష్మీపతి ఇచ్చిన నోటు అందుకొని వెళ్ళిపోయాడు. ఫ్లాట్ ఫారం అంతా చూశాడు లక్ష్మీపతి.
    మామూలు బోగిల్లో ఎక్కటానికి కుస్తీలు పడుతున్నారు ప్రయాణీకులు.
    వాళ్ళ యాతన చూసి నవ్వుకున్నాడు లక్ష్మీపతి. ఫస్టీ క్లాసులో రిజర్వేషన్ చేయించుకున్నందుకు యిప్పుడతని మనసు కుదుట పడింది. డబ్బుపోతే పోయింది. ప్రయాణం హాయిగా సాగుతుందిలే అనుకున్నాడు.
    కదులుతున్న ట్రయిన్ లోకి సునాయాసంగా ఎక్కేడు లక్ష్మీపతి. నిద్రపోబోయాడు కాని నిద్రపట్టలేదు. అతని మెదడులో అన్నీ ఆలోచనలే.
    ట్రయిన్ రాజమండ్రి చేరేసరికి ఉదయం తొమ్మిదిన్నర కావచ్చు. అక్కడ దిగగానే ఓ పెద్ద హోటల్లో రూమ్ తీసుకోవాలి. ప్రయాణం బడలిక తీర్చుకోవాలి. సాయంత్రం లోగా జాయినింగ్ రిపోర్టు యివ్వాలి. ఎప్పుడిస్తేనేం? ఆఫీసరు తెలిసినవాడేగా?
    ఇంట్లో రాజభోగాలు అనుభవించే తనకి రాజమండ్రిలో ఉండటం కష్టమే. తొందరలో పైవాళ్ళని పట్టుకుని విజయవాడ వేయించుకోవాలి.
    వచ్చే జీతం ఏడురోజులు సరిపోదు. అయినా తనకేం తక్కువ? ఉద్యోగం చేయాల్సిన అవసరం తనకేమిటి? పొట్ట కోసం కాదుగా తనకి ఉద్యోగం. హాబీ కోసం-సంఘంలో హోదాకోసం. ఆఫీసరనిపించుకుంటే కట్నం బాగా గుంజవచ్చు. అందుకేగా తను ఉద్యోగంలో చేరుతున్నది.
    అయినా పిల్లనిచ్చేవాళ్ళు తన ఉద్యోగం చూసే కాక తన ఆస్తి చూసి కూడా కట్నం ఎక్కువ ఇస్తారు. తనకేం తక్కువ? ఎ.సి. సినిమాహాలు, ఎ.సీ. హోటలు, ఏభై ఎకరాలు మాగాణి కల రావుగారి ఏకైక పుత్రుడ్ని. లక్ష్మీపతి ఆలోచనలు కళ్ళెంలేని గుర్రాల్లా పరుగెడుతున్నాయి.
    ట్రయిన్ అవుటర్లో ఆగింది. అతని ఆలోచనలు టక్కున ఆగాయి.
    ఏమి జరిగిందోనని కొందరు, రిలీఫ్ కోసం మరి కొందరు ట్రయిన్ దిగారు.
    ఎంతసేపటికి ట్రయిన్ కదలక పోవటంతో ఏమిటో తెలుసుకుందామనుకున్నాడు లక్ష్మీపతి. వెంటనే ట్రయిన్ దిగాడు.
    ఎవరో పాపం ట్రయిన్ క్రింద పడ్డాడు
    తిని తిరగటం చేతకాకపోతే సరి...
    ఏ భగ్న ప్రేమికుడో?
    పిచ్చోడేమో?
    నిరుద్యోగేమో?
    చావాల్సిన కర్మ ఎందుకో.....పిరికి సన్నాసి.
    ఏక్సిడెంటేమో పాపం...
    హత్యేమో......?
    ప్రయాణికులు తలో రకంగా అనుకుంటున్న మాటలు లక్ష్మీపతి చెవిన పడ్డాయి.
    "అతని చావుకి ఎంత బలమైన కారణముందో? రెండు పట్టాలమీద దిక్కులేని చావుచచ్చాడు పాపం" అనుకున్నాడు లక్ష్మీపతి.
    శవాన్ని చూడాలనుకున్న వాళ్ళు చూసి వస్తున్నారు.
    లక్ష్మీపతి చూడలేననుకున్నాడు.
    తరువాత ధైర్యం చేసి ముందుకి వెళ్ళాడు. గుంపుని తప్పించుకుని చూశాడు. పట్టాల మధ్యలో తల, మిగిలిన మొండెం పట్టాల పక్కన పడివుంది. శవం మీద బట్టలు ఎర్రముద్దలా వున్నాయి.
    ఆ భీకర దృశ్యం చూసి లక్ష్మీపతి మనస్సు విలవిల్లాడి పోయింది. అతడి వయసు యిరవై అయిదులోపే ఉండొచ్చని పించింది. మరింత పరీక్షగా చూశాడు. అతని వళ్ళు జలదరించింది. అతన్ని ఎక్కడో చూసినట్టు గుర్తు-మరికొంచెం దగ్గరికి వెళ్ళిచూశాడు.
    అతడి పక్కన పడివున్న పాత ఫైల్ మీద కృష్ణమూర్తి ఎం.యస్.సి అని వుంది.
    లక్ష్మీపతికి యిప్పుడు బాగా గుర్తు కొచ్చాడతడు. అతన్ని తను మర్చిపోలేడు. తనతో పాటే అతనూ యూనివర్శిటీలో చదివాడు. క్లాసులో ఎప్పుడూ ఫస్ట్ రాంక్ లో వచ్చేవాడు.
    ఆవాళ యింటర్వ్యూకి యిద్దరూ వెళ్ళారు. మెరిట్ లో కృష్ణమూర్తి సెలెక్ట్ అవుతాడని అందరూ అనుకున్నారు. తను అతన్ని అభినందించాడు కూడా.
    కాని యింటికి వచ్చిన మర్నాడు పోస్టులో తనకి ఆర్దర్సు వచ్చాయి. తనకి ఉద్యోగం వస్తుందని తెలుసు. ఉద్యోగం కోసం ఏంచేయాలో పై లెవెల్లో అన్ని జరిగాయి. అందుకని ఉన్న ఒక్క పోస్టు తనకి యిచ్చి వుంటారు. కృష్ణమూర్తి యూనివర్శిటీ ఫస్ట్ లో పాస్ అయ్యాడు. అయినా తనలా ఉద్యోగం కొనుక్కునే స్తోమత లేనివాడు. తను సెకండ్ క్లాసులో పాసయ్యాడు. కనుక మెరిట్ లో వస్తానని నమ్మకము లేక, తన ప్రయత్నాలు తను చేశాడు.
    శవాన్ని దీనంగా చూస్తున్న లక్ష్మీపతిచూసి "అతను మీకు తెలుసా?" అడిగాడు గార్డు.
    తెలీదని లక్ష్మీపతి అబద్దమాడాడు. తెలుసునంటే తన హోదాకి భంగమని.
    ఫైల్లో ఉత్తరాలున్నట్లున్నాయి. ఆత్మహత్యేమో గార్డు గొణుక్కుని రిపోర్టు రాసుకుంటున్నాడు.
    ఆ మాటకి ఉలిక్కిపడ్డాడు లక్ష్మీపతి. కొంపతీసి ఉత్తరాల్లో ఏమైనా రాసి తనని యిరికించ లేదుకదా? అయినా తనకేం భయం? కావలసినంత పలుకుబడి డబ్బు, ఉంది ఏదైనా రూపుమాపుకోవచ్చు. కానీ తన అంతరాత్మకేం సమాధానం చెప్పాలి.
    అది ఆత్మహత్య కాదు. అది హత్యే.
    ఎవరు చేశారు?
    నువ్వే! నువ్వే! అవును నువ్వే చేశావ్. అది ప్రపంచం చూడలేని ప్రత్యక్షమైన హత్య. సాక్షి, సంతకాలు లేని ఖూనీ.
    లక్ష్మీపతి అంతరాత్మ ఘోషించింది.
    
                                     * * *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS