Previous Page Next Page 
ది సెల్ పేజి 13


    
                                  ఆకలి అరచిన వేళ    
    
    ఆరోజు దీపావళి అమావాస్య అయింది.
    చుట్టూ ప్రమిదలు వెలుగులను విరజిమ్ముతున్నాయి. వరండాలో వాలుకుర్చీలో భూపతి, కాస్తదూరంగా భూపతి భార్య పార్వతమ్మ పట్టుబట్టలతో ఉన్నారు. మరోమూల చేతులు కట్టుకుని పాలేరు యాదయ్య నుంచొని ఉన్నాడు.
    కాంపౌండు గేటు దగ్గర నించుని బాణాసంచాను కాలుస్తున్న కొడుకు సుధాకర్ ని చూసి దంపతులిద్దరు ఆనందిస్తున్నారు. యాదయ్య ధ్యాస సుధాకర్ బాబు కాలుస్తున్న టపాకాయల మీద లేదు. కాలుతున్న తన కడుపుమీద వుంది.
    ప్రొద్దున్నే ఎప్పుడో చద్ది తిన్నాడు యాదయ్య. ఇంత వరకు పచ్చి మంచినీళ్ళుకూడా ముట్టలేదు. పండుగ నాడు పరమాన్నం కోరుకోవడం లేదు. పిడికెడు పచ్చడి మెతుకులు కడుపులో పడితేచాలు. యాదయ్య సోలిపోతున్నాడు నీరసంతో. కళ్ళుమూతలు పడుతున్నాయి.
    భూపతి ముద్దుల కొడుకు సుధాకర్ ఉత్సాహంగా టపాకాయలు కాలుస్తూనే ఉన్నాడు. బాణాసంచా సరుకు ఏమాత్రం తరగలేదు. చిన్నబాబు ఇవన్ని ఎప్పటికి కాలుస్తాడో, వాళ్ళు అన్నాలు తిని తనకింత ఎప్పుడు పడేస్తారోనని గొణుక్కుంటున్నాడు యాదయ్య.
    "అమ్మా ఆకలేస్తున్నదమ్మ! పండుగ పూట ఇన్ని మెతుకులు పెట్టండమ్మా" అడుక్కునేది అరుస్తూ ఇంటిముందు నించున్నది.
    "అవతలకిపోవే!" కాల్చడం ఆపి కసిరాడు సుధాకర్.
    "బాబు! పండుగ బాబూ! గేటు ముందు కూలబడింది అడుక్కునే ఆమె.
    "పార్వతీ! దాని మొహాన ఏదైనా పడెయ్యవే, దాని పీడ విరగడవుతుంది" అన్నాడు విసుక్కుంటూ భూపతి.
    గొణుక్కుంటూనే పార్వతమ్మ అన్నం తీసుకువచ్చి వేసేసరికి బిచ్చగత్తె వెళ్ళిపోయింది.
    అంత దానబుద్ది కలవాళ్ళు తనని పట్టించుకోరేం, అడగందే అమ్మయినా పెట్టదు అన్న సామెత గుర్తుకొచ్చి ఉండబట్టలేక అడిగేశాడు యాదయ్య. "నీరసంగా వుందమ్మ" అన్నం పెట్టమని అడగలేక అలా డొంక తిరుగుడుగా అడిగాడు.
    "ఉంటే ఆమూల పడుకో మేం తిన్న తరువాత లేపు తాములే" అని కసురుకుంది పార్వతమ్మ. యాదయ్యకు కడుపులో దేవినట్లయింది.
    నోరు తెరచి అడిగినా, ఆకలిని అర్ధం చేసుకోలేని యజమానులు. తన పరిస్థితికి తనకే కళ్ళెమ్మట నీళ్ళు తిరిగాయి యాదయ్యకి. మైకం కమ్మినట్లయి కుప్పలాకూలిపోయాడు యాదయ్య.
    కళ్ళు తిరిగి పడిపోయిన యాదయ్యను చూసి ఏం చేయాలో పాలుపోలేదు యింటియజమానులకు. ఆ హడావుడికి చుట్టుప్రక్కల వాళ్ళు రావడం మొదలు పెట్టారు.
    యాదయ్య చనిపోతే అన్న ఆలోచనకే గుండెల్లో రైళ్ళు పరుగెత్తినట్లయింది భూపతికి.
    "వెట్టి చాకిరి చట్టాలు-మరో ఆకలిచావు-హరిజనునిపై అత్యాచారం" రకరకాలుగా ఆలోచనలు చుట్టు ముడుతున్నాయి.
    భూపతి మెదడు చురుగ్గా పనిచేసింది. యాదయ్య తలను ఒళ్ళో పెట్టుకొని కూర్చున్నాడు. మరుక్షణం పార్వతమ్మ యాదయ్య ముఖం మీద నీళ్ళు చిలకరిస్తూంటే సుధాకర్ విసనకర్ర విసరడం మొదలు పెట్టాడు.
    "ఏదో పైత్యం చేసి కళ్ళుతిరిగి వుంటాయి ఫరవాలేదు. డాక్టర్ గారికి కబురుచేశాను, కాసేపటికి తేరుకుంటాడు. ఈ మాత్రందానికే మీరంతా ఎందుకు?" అంటున్నాడు భూపతి వెళ్ళమనలేక ఇరుగుపొరుగుని.
    "అలాగే" అనుకుంటు వెనుతిరిగారు జనం.
    భూపతి అన్నమాటలు అప్పుడే స్పృహలోకి వచ్చిన యాదయ్యకు విన్పించాయి.
    "భూస్వామ్యవ్యవస్థ నశించాలి" 'వెట్టిచాకిరి నశించాలి' ఎక్కడో విన్న ఉపన్యాసం గుర్తుకు వచ్చింది. చేతికి అందినది పట్టుకుని చితక బాధా లనిపించింది. కాని ఓపికలేదు. మెదడు మాత్రం చురుగ్గా పనిచేసింది.
    "వెట్టిచాకిరి చేయించుకొని చంపేస్తున్నారు దేవుడో! అన్నం పెట్టకుండా చంపేస్తున్నార్రోయ్ బాబో! ఆకలికి కళ్ళు తిరిగి పడిపోతే పైత్యం చేసిందని చెపుతున్నాడు దేవుడోయ్" గొంతు చించుకుని అరిచాడు యాదయ్య.
    ఎంతో ఆశ్చర్యం. కాని అది అనుభవం. చెవులు మోసం చేయలేదా. ఏమీ లేదనుకుని వెనుదిరిగిన జనం మళ్ళీ వచ్చారు. యాదయ్య శోకాలకు చుట్టుప్రక్కల వాళ్ళలో ప్రతిస్పందన కనపడింది. భూపతి, పార్వతమ్మ, సుధాకర్ సిగ్గుతో తలవంచుకొన్నారు.
    యాదయ్య కళ్ళలో ఆనందం మెరిసింది. ఆకలి నోరెత్తి అరచింది. ప్రతి మనిషిలో ఆలోచన మొదలయ్యింది. అదే విప్లవానికి పునాదిరాయి. విప్లవానికి నాంది.
    
                                         * * *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS