"యింట్లో దొంగలుపడి, ఉన్నదంతా దోచుకుపోయారు. మీ నాటకాలపిచ్చి మీది. ఒక్కరాత్రి కూడా ఇంటిదగ్గరుండరు గదా? ఇప్పుడనుభవించండి" అంటూ శోకాలు మొదలుపెట్టింది.
అంతలో, యస్. ఐ. గారు వస్తున్నారు దారివ్వండి తప్పుకోవమ్మ అంటూ హెడ్ కానిస్టేబుల్ దారిచేస్తూ ముందుకి నడిచాడు.
ఎందుకంతమంది ఇక్కడ మూగారు? వస్తూనే యస్.ఐ. ప్రశ్నించాడు. దొంగలు పడి ఇల్లంతా దోచుకున్నారు. చుట్టుప్రక్కల జనం పరామర్శించడానికి వచ్చారు అని కాంతమ్మ అంది. ఎప్పుడు జరిగింది అని అడిగాడు యస్.ఐ.
"సుమారు రెండవది.......రాత్రి..." కాంతమ్మ జవాబు యిచ్చింది.
మరైతే ఇప్పుడుదాకా రిపోర్టు ఇవ్వకుండా మీ చేస్తున్నారు, యస్.ఐ. కోపంగా ప్రశ్నించాడు.
"ఇస్తేమాత్రం పోయినది దొరుకుతాయండి. ...." కాంతమ్మ మొగుడు తన అనుమానాన్ని వెలిబుచ్చాడు. రిపోర్టు, గిపోర్టు ఎందుకులెండి.
"ఇదుగోచూడండి పత్రికావిలేఖరి గారు, నేరాలుజరగకుండా చూడటం మావిధి. ఒకవేళ జరిగితే నేరస్తులను పట్టుకోవడం మావిధి. ఎటొచ్చి ఇటువంటి విషయాల్లో ప్రజల సహకారం పూర్తిగాలేదు.కొంతమంది ఇష్టంవచ్చినట్లుగా వార్తలు వ్రాస్తున్నారు. అసలు ఇది దొంగలు పడ్డ ఇల్లులా వుందా? వందలమంది జనం దొంగలు తిరిగిన చోటంతా తిరిగేశారు. ఇలాంటప్పుడు మాకు ఆధారములు ఏమీ దొరుకును యిన్ వెస్టిగేషన్ ఎలా చేస్తాము? వేలిముద్రలు, కాలిముద్రలు ఏమీ దొరకకుండా చేశారు. కనీసం పోలీసుకుక్కలకు వాసన కూడా దొరకకుండా చేశారు. ప్రజల అజ్ఞానం వలన" ఆవేశంగా అన్నాడు. యస్.ఐ.
"యిన్ వెస్టిగేషనా? .... అవన్ని కథల్లోను, సినిమాల్లోనూ, చూశాం ఇక నిజజీవితంలోను నా? సరే.....బలే డైలాగులు చెప్పారు" అన్నాడు విలేఖరి.
"ఇంతకూ మీరు వార్త రాస్తే శీర్షిక పేరు ఏం పెడుతున్నారు?" యస్.ఐ. అడిగాడు.
'పోలీసుల గస్తీ జరిగిన చోరీ' ఆనందంగా వివరించాడు.
"ఇదిగో చూడండి విలేఖరిగారు! పోలీసులు రాత్రి గస్తీ తిరుగుతున్నప్పుడు చోరీ జరిగింది అని మీరు వ్రాసినా, చివరికి చోరీ చేసి పారిపోతున్న దొంగల్ని పట్టుకున్న పోలీసు ప్రతిభ అని వ్రాయక తప్పదు" మీసం మెలేస్తూ యస్.ఐ. అన్నాడు.
విలేఖరి తికమక పడ్డాడు విషయం అర్ధంకాక" అంటే...?' అని గొణుగుతూ." అంటే ఏముంది? రాత్రి రౌండ్సులో ఈ కేసులో దొంగల్ని పట్టుకున్నాము. చోరీసొమ్ము యావత్తు దొరికింది. రిపోర్టు తీసుకుని రాద్దామని ఇక్కడకు వచ్చాను. యిప్పుడు మా ప్రతిభ గురించి వ్రాస్తారా? విలేఖరి గారూ?" యస్.ఐ. అంటూ ప్రక్కకు తిరిగేసరికి పళ్ళుకిలిస్తూ పెన్నూ నోట్ బుక్ బయటకు తీసాడు "వివరాలు చెప్పండంటూ" విలేఖరి.
* * *
