Previous Page Next Page 
మిసెస్ కైలాసం పేజి 12


                               ఇంటర్వ్యూ
    
    నులివెచ్చని సూర్యకిరణాలు అనూరాధ ముఖాన్ని గోముగా తాకాయి.
    ఉలిక్కిపడి లేచి కూర్చొంది. అప్రయత్నంగానే ఆమె కళ్ళు టేబుల్ మీదవున్న టైంపీస్ మీద నిలిచాయి. ఎనిమిదింబావు అయింది. గోడ మీద వున్న క్యాలెండర్ వైపుకు మళ్ళాయి ఆమె చూపులు.
    అవును! ఇవ్వాళ ఆదివారమే! సందేహంలేదు. ఇవ్వాళకూడా తను పొద్దెక్కేవరకూ నిద్రపోగలిగింది.
    అవును! ఈ రోజే ఇంటర్వ్యూ? అతను సరిగ్గా పన్నెండుగంటలకు వస్తానన్నాడు. ఇవ్వాళయినా పెందలకడలేచి ఇంటర్వ్యూకు తయారుకావాలనుకుంది తను. కాని త్వరగా మెలుకువ వస్తేనా? అనూరాధకు తనమీద తనకే విసుగు కలిగింది.
    "రాత్రంతా సరిగా నిద్రలేదేమో కళ్ళు ఇసుకపడినట్లు మెరమెర లాడుతున్నాయి.
    అనూరాధకు రెండురోజులుగా ఏ పనిమీదా మనస్సు లగ్నం కావటంలేదు. ఇంటర్వ్యూలో అడగబోయే ప్రశ్నలను ఊహించుకుంటూ జవాబులు తనకు తానే చెప్పుకుంటూ రాత్రంతా సరిగా నిద్రపోలేదు. అయినా అనూరాధకు సంతృప్తి కలుగలేదు.
    లేచి పళ్ళు తోముకుని, ప్లాస్కులోని కాఫీ గ్లాసులో పోసుకొని వచ్చి తాగుతూ కూర్చుంది. తలనిండా ప్రశ్నలూ-సమాధానాలు.
    ఇంతకుముందు ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళింది. అవన్నీ ఒక ఎత్తు. ఈ ఇంటర్వ్యూ ఒక్కటే ఒకఎత్తు. ఆ మాటకొస్తే ఇలాంటి ఇంటర్వ్యూలు ఎంతమందికి జీవితంలో తటస్థపడతాయి? అంతటి అదృష్టం కలిగే కొద్దిమందిలో తనుకూడా ఒకర్తె, అనే ఆలోచన, అనూరాధను ఆనందంలో ముంచి ఉక్కిరిబిక్కిరి చేసింది.
    "ఏఁ విటే పిల్లా! కాఫీగ్లాసు చేత్తోపట్టుకొని తపస్సు చేస్తున్నావ్!"
    అనూరాధ చివ్వున తలెత్తిచూచింది. ఎదురుగా కర్రపోటుమీద వంగివంగిన నడుమును కొంచెం పైకెత్తటానికి ప్రయత్నిస్తూ, అనూరాధ అమ్మమ్మ నిల్చొని వుంది.
    "అమ్మమ్మోయ్!" అనూరాధ కంఠంలో సంతోషం కంచుగంటగంటలా మ్రోగింది.
    "ఏవిఁటే పిల్లా, అంత కేరింతలు కొడుతున్నావ్ ? ఏదైనా కథ రాశావా? ఇప్పుడు నీ కథ వినే ఓపిక లేదే పిల్లా!" అంది అనూరాధ అమ్మమ్మ బోసిబోసిగా నవ్వుతూ.
    అనూరాధకు వళ్ళు మండిపోయింది.
    అమ్మమ్మ మహా గడుసుమనిషి! ఆమెను కథ ఏదైనా చెప్పమని అడగటం పాపం, ఆగకుండా గంటలకొద్దీ చెప్పుకుపోతుంది! తను రాసిన కథ ఏదైనా వినమంటే ములగచెట్టు చిటారుకొమ్మకెక్కి కూర్చుంటుంది ! ఎంతో బ్రతిమాలించుకొని కాని వినదు. తీరా విన్నాక ఎలా వుందో చెప్పటానికి కాసేపు ఏడిపిస్తుంది!
    "నువ్వు గడ్డం పుచ్చుకొని బతిమాలిన ఇవ్వాళ నీకు కథ వినిపించను. అసలు నీతో మాట్లాట్టానికే నాకు తీరికలేదు. నన్ను పలకరించకుండా వుండు. అంతేచాలు!" అంది అనూరాధ ఉక్రోషంగా.
    "ఏవిఁటే నా తల్లీ! అంతకోపం వచ్చింది! ముందు కాఫీ తాగుతాగు! కథ వింటాలే" అంటూ కర్ర పక్కనే పెట్టుకొని నేలమీద ఎదురుగా కూర్చుంది బోసినోటిని ముడుచుకొని ముసలవ్వ.
    "కోపం కాదమ్మమ్మా! నిజమే చెబుతున్నాను. నేను ఒక ఇంటర్వ్యూకు తయారుకావాలి" అంది అనూరాధ.
    "ఇంటర్వ్యూ ఏమిటి? ఈ ఉద్యోగం మానేస్తున్నావా?" అంది అనూరాధ తల్లి పార్వతమ్మ.
    అనూరాధ పెదవులపై చిరునవ్వు లాస్యం చేసింది.
    "అది కాదమ్మా! నన్ను ఇంటర్వ్యూ చెయ్యడానికి ఒకాయన మనింటికి వొస్తున్నారు. మధ్యాహ్నం కాఫీ, ఫలహారాలు చెయ్యాలి నువ్వు!" అంది అనూరాధ.
    అనూరాధ తల్లి అర్ధంకానట్లు చూసింది. అమ్మమ్మ తలపైకెత్తి బోసినోటిని తెరచేసింది.
    "అదేం ఉద్యోగమే అమ్మాయ్ నాకు తెలియకడుగుతాను? ఇంటి కొచ్చి ఇంటర్వ్యూచేసి ఇచ్చే ఉద్యోగాలుకూడా వుంటాయా? ఉద్యోగం కూడా ఇంట్లో వుండే చేసుకోవచ్చా?" అంది పార్వతమ్మ ఆశ్చర్యంగా.
    అనూరాధ పకపకా నవ్వింది.
    "ఇవ్వాళ ఇంటర్వ్యూ ఉద్యోగం యివ్వటానికి కాదమ్మా! నా గురించి పేపర్లో రాయటానికి ఇంటర్వ్యూ చేస్తారు."
    "పేపర్లోనా? ఎందుకూ?" తలమునకలయే ఆశ్చర్యంలో పడిపోయింది పార్వతమ్మ.
    అనూరాధ అమ్మమ్మ కళ్ళు తేలేసింది.
    అనూరాధకు ముఖంమీద చన్నీళ్ళు చిలకరించినట్లయింది. అమ్మమీద, అమ్మమ్మమీదా చిర్రెత్తుకొచ్చింది. తనగురించి పేపర్లో యెందుకు రాస్తారోకూడా వూహించలేరేం? రచయిత్రుల పరిచయం పడటం ఆలస్యం తనకంటే ముందు అమ్మేముందు చదివేస్తుందిగా? అమ్మమ్మకు తను ఎన్నిసార్లు ఇలాంటి పరిచయాలు చదివి వినిపించలేదు? వీళ్ళుకూడా తననొక రచయిత్రిగా గుర్తించరు. ఇక మామయ్య సరేసరి? "ముందు కొన్ని మంచికథలు చదువు ఆ తరువాత రాద్దువుగాని" అంటాడు. కృష్ణవేణికూడ ఆ మాటే అంటుంది. అందుకే వాళ్ళతో ఎప్పుడూ తన కథల్ని గురించి చర్చించదు. ఇంటర్వ్యూ పేపర్లో పడ్డాక ఇకవాళ్ళు నోరుకూడా యెత్తరు !
    మావయ్య థియరీ తనకు బొత్తిగా అర్ధంకాదు. తను కథలు రాయాలంటే, ఎవరో రాసిన కథ లెందుకు చదవాలో? తను రాసిన కథలు అచ్చు కావటంలేదూ? ఎంతమంది పాఠకులు ప్రశంసిస్తూ ఉత్తరాలు రాయటంలేదు? ముఖ్యంగా తనురాసిన "తెగిపోయిన తీగలు," "విరిగిపోయిన వీణ"కు పాఠకుల నుంచి పుంఖానుపుంఖంగా ఉత్తరాలు వచ్చాయి.
    అనూరాధ తల్లి అలాగే నిల్చొనివుంది కూతురి ముఖంలోకి చూస్తూ.
    "నేను కథలు రాస్తానుగదూ? అందుకే నన్ను ఇంటర్వ్యూచేసి నా గురించి పేపర్లో రాస్తారు." అంది అనూరాధ నీరసంగా.
    "నిజంగా? నా తల్లే! చూస్తుండగానే ఎంత గొప్పదానివైపోయావమ్మా!" అంది పార్వతమ్మ మురిపెంగా కూతుర్ని చూసుకొంటూ.
    "ఇంకేం? జవాబులు బాగా చెప్పు" అంది అమ్మమ్మ.
    అరుంధతి చేతిలోని గ్లాసు అందుకొని పార్వతమ్మ అక్కడనుంచి వెళ్ళిపోయింది. ముసలమ్మ కర్రపోటు వేసుకుంటూ వరండా లోకి వెళ్ళిపోయింది. అనూరాధ వాలుకుర్చీలో వెనక్కువాలి ఆలోచనల్లోకి జారిపోయింది.
    సరిగ్గా 'ధర్' గారు పన్నెండుగంటలకు వస్తానన్నారు. బహుశా ఫోటోగ్రాఫర్ ను కూడా తీసుకొస్తారు. ఫోటోతో సహా తనగురించి పేపర్లో వస్తుంది. అప్పుడుగాని తన గొప్పతనం తనచుట్టూ వున్నవాళ్ళకు తెలియదు!
    "ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్" అంటారు. ధర్ గారు వచ్చేటప్పటికి ఏదైనా ఇంప్రెస్ చేసేపనిలో తను లీనం అయివుండాలి!
    "నేను వెళ్ళేప్పటికి అనూరాధగారు ఫలానా పనిలో నిమగ్నులై వున్నారు. దీనినిబట్టి వారికిగల ఫలానా అభిరుచి అర్ధం అవుతుంది" అంటూ రాస్తారు ధర్ గారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS