బావిచుట్టూ జనం ఇసుకవేస్తే రాలకుండా వున్నారు. మోరలు పైకెత్తి కళ్ళార్పకుండా చూస్తున్నారు. ఆరునెలల గర్భిణి స్త్రీ ఏన్నర్ధం పిల్లాడిని చంకనేసుకొని గుండెలుచిక్కబట్టి పైకిచూస్తోంది. నాగేశ్ ఒక జేబులోనుంచి సీసాతీశాడు. "పెట్రోల్ పెట్రోల్" అంటూ జనంలో కేకలు సీసాను బిరడాతీసి ఒంటిమీద ఒలకబోసుకున్నాడు. సీసాను కింద బావిలోకి విసిరాడు. రెండోజేబులోనుంచి అగ్గిపెట్టెతీసి అందరికీ చూపిస్తున్నాడు. అగ్గిపెట్టె కనిపించకపోయినా ఆ చేతులో వుందేమిటో అందరికీ అర్ధం అయింది.
అవధానులకు చిరుచెమటలుపట్టి చంకలోని పంచాంగం, రొంటినున్న ఐదురూపాయలనోటూ చెమ్మగిల్లాయి. ఆ సమయంలో ఓ చిటికెడు పొడుంపట్టుబడితే బాగుంటుందనిపించింది. కాని ఈ లోపలే ఆ దృశ్యం జరిగిపోతే?
"మృత్యువుతో నేరుగా పోరాటం! వెల్ ఆఫ్ డెత్!" తారాస్థాయిలోవున్న యాదగిరి కంఠం అకస్మాత్తుగా ఆగిపోయింది. వెంటనే పెద్దగా గంట మోగింది.
ఒకటీ !
రెండూ! మూ.....!
పేదవాడి ఆకలిలా అగ్నిదేవుడు భగ్గుమన్నాడు. నాలుకలు చాచిన అగ్నిజ్వాలలతోపాటు, అంతకంటే తీవ్రగతితో ఓ ఆర్తనాదం వినిపించింది. ఆ మండుతున్న ఆకారం క్షణకాలంలో గిర్రున సుడులు తిరుగుతూవచ్చి కిందవున్న "వెల్ ఆఫ్ డెత్" బావిలోకాక ఒడ్డునే పైకి చూస్తో నిలబడ్డవాళ్ళ నెత్తినే పడింది.
జనం కకావికలై పరుగెత్తసాగారు. కొందరికి బట్టలంటుకున్నాయి. పిల్లా జెల్లా, ఆడ మగా విచక్షణలేకుండా విరగదొక్కుకుంటున్నారు. ఒకటే తొక్కిసలాట. క్రింద పడ్డవాళ్ళ పీకలమీదగా నడిచి ప్రాణాలు రక్షించుకోవటమే ఆ భీభత్సంలో పరమధర్మంగా పాటించబడింది.
గోపాలం గుండెలు బ్రద్దలయినై. మస్తిష్కంలో అగ్నిగోళాలు వీచాయి. అంతలో అంధకారపు చుట్టలు సుడులు తిరిగాయి. నిరాకార రూపాలు అల్లీబిల్లీ తిరిగాయి. అవధానులు వచ్చి రెక్కపట్టుకొని లేపేదాకా గోపాలం ఈ ప్రపంచంలో లేడు. స్పృహవచ్చిన గోపాలం లేచి మట్టి దులుపుకొని అవధానుల భుజం ఆసరాగా బయటకు నడిచాడు.
కొద్దినిముషాలక్రితం, ఆనందంతో, ఉద్రేకంతో ఉరవళ్ళు తొక్కుతూ, కేరింతలు కొట్తూన్న ప్రదర్శన వాతావరణం బీభత్సంగా మారి, ఆర్తనాదాలతో శోకతప్తమయిపోయింది. అంతా నిర్వికారంగా చూస్తూ అవధానులూ, గోపాలమూ ఆ ప్రదర్శనశాలనుంచి బయట పడ్డారు.
సిమెంటురోడ్డుమీద నడుస్తోన్న గోపాలం, ఇసుకలో కూరుకు పోతున్నట్లు అడుగులో అడుగు వేస్తున్నాడు. పక్కనే అవధానుల పాదాలు భూమిని ధాటిగా తాకుతున్నాయి. ఇద్దరిమధ్యా మౌనం హిమాలయ పర్వతంలా నిలబడివుంది. గోపాలం మనస్సు అతిశీతలంలో ఉదకం ఘనీభవించే స్థితిలో వుంది. అవధానుల మనస్సు వేడి తగిలి మంచుగడ్డ కరిగే స్థితిలో వుంది.
నడుస్తూ నడుస్తూ గోపాలం ఏదో వింటూ అప్రయత్నంగా హఠాత్తుగా ఆగిపోయాడు. అవధానులు యాంత్రికంగా గోపాలన్నే చూస్తూ నిల్చుండిపోయాడు.
దేవాలయంలోంచి గంటలు వినబడుతున్నాయి. అది ఆంజనేయ స్వామివారి గుడి. శనివారం కావటంవల్ల గుళ్ళో హడావిడిగా వుంది. గర్భగుడిలోంచి ఆంజనేయస్వామివారి దండకం స్పష్టంగా వినిపిస్తోంది. గోపాలానికి ఏమీ కనిపించటంలేదు. అంతా చీకటి. లోపల చీకటి. బయట చీకటి. చేతులు జోడించి తలవంచి మంత్రముగ్ధుడిలా గోపాలం దేవాలయ ప్రాంగణంలోకి ప్రవేశించాడు.
అలా గుడిలోకిపోతున్న గోపాలాన్ని విస్తుపోయి చూశాడు అవధానులు. అడుగు ముందుకు వెయ్యబోయి విద్యుత్ ఆగిపోయిన యంత్రంలా కదలకుండా అలానే నిలబడిపోయాడు.
అవధానులకు మళ్ళీ కాళ్ళకింద ఏదో చల్లగా తగిలి "కీచ్" మన్నట్లనిపించింది. అది పసిబిడ్డ పాలగొంతుకో లేక చూలాలి నిండుగర్భమో! అవధానులు తల విదిలించుకున్నాడు. చంకలోని పంచాంగం చేతిలోకి తీసుకొని చూశాడు. కళ్ళు జ్యోతుల్లామండుతున్నాయి. చేతిలో వున్న పంచాంగాన్ని ఆంజనేయస్వామివారి గుడి గోడపక్కగా పొర్లాడుతున్న కుక్కమీదకు విసిరాడు.
రొంటినవున్న ఐదురూపాయలనోటు తీసి గుడిముందు కూర్చున్న కళ్ళులేని కబోది చేతుల్లోకి విసిరాడు. రెండు చిటికెల నశ్యం పట్టించాడు. ఏదో జ్ఞానబోధ అయినవాడిలా రెండుసార్లు తలపంకించి, పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ, ముందుకు, ఆంజనేయస్వామివారి గుడిదాటి గబ గబా వెళ్ళిపోయాడు.
