బాగానే వుంటుంది! కాని ఏం చెయ్యాలో ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా తోచి చావటంలేదే?
ఏదైనా ప్రఖ్యాత, అదే ప్రపంచ సాహిత్యంలో పేరుపొందిన పుస్తకం చదువుతూ కూర్చుంటే? అది చూసి ఆయన ప్రపంచ సాహిత్యంలో పేరుపొందిన కొన్ని పుస్తకాలమీద తన అభిప్రాయాన్ని అడిగితే? తను చచ్చిందే! మామయ్య ఇందుకే కాబోలు మంచి పుస్తకాలు ఎక్కువగా చదవమనేవాడు!
పుస్తకం చదువుతూ కూర్చోవటంలో ప్రత్యేకత ఏముందిలే!
ఇన్ని తెల్లకాగితాలను ముందేసుకొని ఏదైనా కొత్త కథ ప్రారంభిస్తే? ఐడియా అమోఘంగా వుంది. "నేను వెళ్ళేసరికి అనూరాధగారు రచనా వ్యాసంగంలో మునిగిపోయి వున్నారు. నా ఆగమనాన్ని కూడా ఆమె గమనించలేదు" అని రాస్తారు.
అబ్బే బొత్తిగా బాగుండదు. అది చదివిన పాఠకులు, ధర్ గారు వస్తున్నట్లు తెలిసికూడా తనురాస్తూ కూర్చోవటాన్ని ఒక ఫోజ్ గా అనుకుంటారు.
తోటపనిలో నిమగ్నురాలై వుంటే? గొప్పవాళ్ళందరికీ తోటపని స్వయంగా చేసికోవటం హాబీఅట! కాని తన ఇంటిముందుకానీ, వెనగ్గానీ తోటలేదే? ఛ! ఛ! ఏం కొంప? అద్దెకొంప! అందులో రెండు గదులు మాత్రమే ఇంటికి ముందుకానీ వెనగ్గానీ చారెడు స్థలంలేదు.
కాని తన ఇంటికి టెర్రస్ వుందిగా? పైకివెళ్ళి పచార్లుచేస్తూ, ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ మైమరచి వున్నట్లు చేస్తే? తనలోని సౌందర్య పిపాసనుచూచి ధర్ ముగ్ధుడైపోడే?
అనూరాధ, ఇంతసేపటికి తనకు అంత మంచి ఆలోచన తట్టి నందుకు తనను తానే అభినందించుకున్నది.
కాని.....అతను వస్తుంది మధ్యాహ్నం పన్నెండుగంటలకు. అప్పుడు డాబామీద పచార్లు చెయ్యటం ఏమిటి? పైగా వర్షాకాలం అన్నాకాదు. మండు వేసవికాలం! తనకు పిచ్చిపట్టిందనుకుంటాడు ! అయినా వచ్చే మనిషి ఏ సాయంకాలమోవస్తే నేత బాగుండేది? మధ్యాహ్నం రావటం ఏమిటి?
అనూరాధకు ధర మీద చిరాకువేసింది.
ఆఁ ఒకటిచేస్తే ? తను ఇంత చదువుకున్నా, ఇంటిపనంటే వంటచేయటమంటే యిష్టం అని తెలియపర్చే పనేదయినా చేస్తే?
అవును! అతను వచ్చేప్పటికి వంటింటి గడపలో కత్తిపీట మీద కూర్చొని కూరగాయలు తరిగితే, బాగానే ఉండవచ్చు. ఇంట్లో ప్రొద్దుట సూరమ్మత్త పంపించిన సొరకాయ ఉంది. దొడ్లో కాసిన సొరకాయ నవనవలాడుతోంది. సొరకాయ తరగటం చాల తేలిక. కళాత్మకంగా తరగవచ్చు కూడా !
"నేను వెళ్ళేప్పటికి అనూరాధగారు వంటింటి గుమ్మంలో కూర్చొని కత్తిపీటమీద లేతలేతసొరకాయలు కోస్తున్నారు. ఆ ముక్కల్ని ఎంతో ఆర్ట్ స్టిక్ గా తరుగుతున్నారు. దాన్నిపట్టి వారు చేసే ప్రతి పనీ ఎంత కళాత్మకంగా వుంటుందో వ్యక్తం అవుతుంది" అని రాస్తాడు.
ఏడ్చినట్టుంది? ఛ! లేత లేత సొరకాయలు తరగటం ఏమిటి? ఆడదై పుట్టి వంటచేయటంగూడా ఓ గొప్పపనేనా? పైగా పన్నెండు గంటలవేళ కూరగాయలు తరుగుతూ కూర్చోవటం ఏమిటి? అది చూస్తే అమ్మమ్మ ముందుగానే చెవులకు తాటాకులు కట్టేదే?
మరి? ఇన్నిటికీ ఏం చెయ్యాలి? నుదురు అరచేత్తో రుద్దుకుంటూ ఆలోచించసాగింది అరుంధతి.
అన్నట్టు ఆమధ్య ఓ ప్రఖ్యాత రచయిత్రి......ప్రఖ్యాత ఏమిటిలే.....ఓ రచయిత్రి చెప్పిందిగా?
"నాకు అన్నిటికంటే మా శ్రీవారికి ఎదురుగా కూర్చుని కబుర్లు చెప్పటం ఇష్టం! ఇంటి సమస్యలు మా శ్రీవారితో చర్చించటం నాకు సరదా! మా శ్రీవారంటే నాకు వల్లమాలిన గౌరవం! అంటూ" చెప్పింది గదూ?
కాని తనకు అలాంటి అవకాశం లేదే? తను అంతవరకూ వివాహం చేసుకోనందుకు మొదటిసారిగా బాధ కలిగింది అనూరాధకు. మళ్ళీ తన మనస్సును తనే ఓదార్చుకొన్నది.
అదేం గొప్ప విషయం కనక తను బాధపడాలి? శ్రీవారితో కబుర్లు చెప్పటంకూడా ఓ ఘనకార్యమేనా? ఇంటి సమస్యలు శ్రీవారితో కాక మరెవరితో చర్చిస్తారు ఎవరు మాత్రం? అయినా ఇంటి సమస్యలు చర్చించటంకూడా సరదా ఏమిటి? బూడిద! ఎవరి శ్రీవారంటే వారికి గౌరవం కాక, ఊళ్ళోవారి శ్రీవార్లమీద వుంటుందా? అంత వున్నా చెప్పుకోగల ధైర్యం ఎంతమంది గృహిణులకు వుంటుంది కనక.
పోనిద్దూ! పాఠకులు తెలుసుకోవాలని ఉబలాట పడేది తనను గురించికాని తన శ్రీవారిని గురించికాదుగా!
ఎం. యస్. ధర్ గారు వచ్చేటప్పటికి ఏం చేస్తూన్నట్లు నటించాలో అనూరాధకు బుర్ర బద్దలు కొట్టుకున్నా అంతుచిక్కలేదు.
అనూరాధ విసుగ్గాలేచింది. స్నానంచేసి భోజనంచేసి రోజూ కంటే సింపుల్ గా వుండాలని చేసుకున్నా మేకప్ కు రోజూకంటే ఓ అర్ధగంట ఎక్కువే పట్టింది. అనూరాధ ఇంట్లోకీ బయటకీ ఆలోచనల్ని వెతుక్కుంటూ తిరగసాగింది.
"ఏవిటే పిల్లా, అట్లా ఇంట్లోకి బయటకూ కాలుకాలిన పిల్లిలా తిరుగుతున్నావ్?" అంది అప్పుడే భోజనంచేసి, గడపమీద తలపెట్టు కుని పడుకొనివున్న అనూరాధ అమ్మమ్మ.
అమ్మమ్మ పలకరింపుతో అనూరాధకు ఓ అమోఘమైన ఐడియా వచ్చింది.
ధర్ గారు వచ్చేప్పటికి అమ్మమ్మతో కబుర్లుచెబుతూ కూర్చుంటే? ఓహో! బ్రహ్మాండం? అమ్మమ్మలతో కబుర్లు చెప్పటం ఇష్టమనీ, అమ్మమ్మల కాలంనాటి విషయాలు వినటం సరదా అనీ, ఆ మాటకొస్తే అమ్మమ్మల్లా మాట్లాట్టం, ఆలోచించటం, తనకు ఎంతో ఇష్టమనీ చెప్పవచ్చును. ఉషారుగా ఒక్కదూకులో అనూరాధ అమ్మమ్మ దగ్గిర కొచ్చింది.
"అమ్మమ్మా?"
