ఆ వేదికలమీద ఫ్లెక్స్ (రాతితో తయారుచేసిన బ్లేడు ముక్కల్లాంటివి) పడవేసి ఉన్నాయి. అతని దగ్గర చాల ఏనుగు దంతాలున్నాయి. అవన్నీ అతడు అడవిలో చనిపోయిన ఏనుగు నించి సేకరించి దాచుకున్నాడు కాబోలు.
కెప్టెన్ మాలతి మనసులో నవ్వుకుంది.
సంపాదించుకోవడం, దాచుకోవటం అనేవి మనిషిలో చాల పురాతనమైన ఎలిమెంట్స్ అన్నమాట అనుకుంది. మరొకవంక ఎండిపోయిన చామరీమృగాల చర్మాలు గుట్టలుపడి ఉన్నాయి. అంటే అతడి స్వార్ధం బహుముఖాలు అన్నమాట.
పరిధి అల్పాతి అల్పమే ఐనా అదే స్వార్ధం మనిషిని పట్టి పీడించేది ఎన్నో నాటకాలు ఆడించేది. అతని దగ్గర ఉన్న చర్మాలనూ, ఏనుగు దంతాలనూ నాగరిక ప్రపంచంలో అమ్ముకుంటే లక్షల రూపాయల విలువను చేస్తాయి.
కాని అతడి విధానం వ్యామోహంకాదు. అసలు డబ్బు అనేది సంపద అవుతుందనికూడా ఎరుగనివాడు. అతని దృష్టిలో సంపదలు అంటే వస్తుసంచయమన్నమాట.
అతడు అమితమైన మైత్రీభావాన్ని ప్రదర్శిస్తూ రెండు దంతాలను తీసి ఆమెకు అందించాడు. కాని మాలతి వాటిని అందుకోలేదు. రెండు చామరీ మృగాల చర్మాలను తనకు ఇస్తే బావుండును చలినుంచి కాపాడుకోవచ్చు అనుకుంది.
కాని ఆమె అవుసరాన్ని అతడు గుర్తించలేకపోయినాడు. కాని తాము ఇచ్చిన దంతాలను ఆమె తీసుకోకపోవటం అతడి సంతోష ఆధిక్యతకు అడ్డుకట్టలా అయింది. తనకు ఇంత అనందాన్ని అందించిన మిత్రురాలు ఏమిస్తే తీసుకుంటుంది అని ఆలోచించడంకూడా సంపూర్ణంగా అతనికి చేతకాదు.
ఇంకా లోపలకుపోయాక అక్కడ తన నిద్రకోసం కొన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. కొన్ని జంతు చర్మాలను ఎత్తుగా పేర్చి ప్రక్క తయారుచేసుకున్నాడు చిత్రమేమిటంటే తలగడపై వున్న దిండులా మరింత ఎత్తుగా వాటిని పేర్చాడు.
దానిమీద మెత్తగా వుండేందుకు ఆకులు పరుచుకున్నాడు. అంత భయంకరమైన గుహలో అతని ఆనందమయ ప్రపంచం అది. జంతువులు తనను గుర్తించి నిద్రించే సమయాన దాడిచేయకుండా అతడు వాటిని నిర్మించుకున్నాడు.
దాని దగ్గరకుపోయిన తరువాత అతని ఆనందం మీరిపోయింది. కెప్టెన్ మాలతిని రెండు చేతులతోపట్టి అవలీలగా ఎత్తిదానిమీదికి విసిరాడు. ఆమెకు ఎముకలు విరిగి నాయేమో అనిపించింది. అంత విసురుగానే అతడు శయ్యమీదకి ఆమె ప్రక్కకు లంఘించాడు ఆమెను చేతులతో బంధించాడు.
5
తమతో పాటుగా వచ్చిన బృందం పిరికివారయినారు. సిన్హా తప్పిపోవటం, అతనికోసం సాహసోపేతంగా విచిత్ర ప్రాణిని ఎదిరించిన కెప్టెన్ మాలతి ఆ ప్రాణికి చిక్కిపోవటం తలుచుకుంటూ అడుగులు వేస్తున్నాడు ఫిజో! ఇంత జరగటానికి-ఎవరెస్ట్ ఎక్కే ప్రయత్నం అర్ధంతరంగా ఆగిపోవటం అతనికి చాలా బాధ కలిగింది.
యిటీవల ఎవరెస్ట్ ను అధిరోహించిన స్త్రీబచేంద్రిపాల్. మాలతి అంతటి మహోన్నతమైన విజయాన్ని సాధించగలదు. కాని సిన్హా తన పిరికితనంతో పధకాన్ని భంగం చేశాడు. అంతే కాదు కెప్టెన్ మాలతి భయంకరమైన పరిస్థితుల,లో చిక్కిపోతే అంతా పారిపోయినారు.
ఇవన్నీ తలచుకుంటూ ఉంటే ఫిజోకి ఒళ్ళుమండి పోయింది. గతాన్ని తలచి బాధపడుతూ కూర్చోవాటం వృధా అనిపించింది. తనను తాను నిగ్రహించుకుని కోపాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నించాడు. ముందు కర్తవ్యం ఆలోచించాలి.
ఎదురుగాఉన్న లోయభయంకరంగా కన్పిస్తోంది. మాలతిని ఆ దారిన ఎలా ఎత్తుకుపోబడిందో అర్ధంకాని విషయమయింది. తాను మాత్రం ఆ దారిన దిగిపోవటం అసాధ్యం:
అందునించి చుట్టు తిరిగిపోయేందుకు కృత నిశ్చయుడయినాడు ఫిజో! అడవులలో తిరగటం అతనికి అలవాటు లవటం నించి క్రొత్తదారిని అన్వేషిస్తూ పోయేందుకు అతడు రవంత అయినా భయపడలేదు. వెనుకాడలేదు.
వీపున వ్రేలాడుతున్న కిట్టు మరింత బరువు అన్పిస్తోంది. టీము అంతా కలిసిపొవటమైతే అవసరమైన వస్తుసంచయాన్ని అందరూ పంచుకుంటారు. ఇప్పుడు అందరి వంతూ తనదే అయింది.
అతనిది అడవులు కొండలలో తిరిగి రాటుతేలిన శరీరం అందునించి అంత బరువును వెంట తీసుకుపోయేందుకు అతడు రవంత అయినా వెనుకాడలేదు ఆహారపదార్దాలు ఐపోతాయన్న భయం కూడాలేదు. అతడు అడవి జంతువులను వేటాడి ఎంతకాలమైనా ఆహారాన్ని సంపాదించుకోగలడు. నిప్పు దొరికితే కేవలం మాంసాహారం ఒక్కటే తింటూ ఎంత కాలమైనా జీవించగలడు.
అందునించి జంకు గొంకులు లేకుండా ఆ మంచు ఎడారిలాంటి ప్రదేశంలో మునుముందుకు పయనం సాగించాడు. కొన్ని చోట్ల మంచు తక్కువగా ఉంది. అలాంటి చోటుల్లో వృక్షాలున్నాయి. తినేందుకు పనికిరాని అనేక రకాల పళ్ళున్నాయి. పడిలేచిన కుంకుమపూవు మొక్కలు విరగపూచి నేలమీదనే సూర్యోదయమవుతున్నట్లు అరుణ కాంతుల్ని చిమ్ముతున్నాయి. అంతటి రమణీయ మయిన ప్రకృతి సంపద అతనికి స్ఫూర్తినిస్తోంది. తనలక్ష్యం వైపుగా సాగిపోయేందుకు ఉత్తేజాన్ని కల్గిస్తోంది.
ఆ పగలంతా నడచి చీకటిపడే వేళకు అతడు ఎత్తయిన కొండచరియమీదికి చేరుకున్నాడు. అక్కడ పెద్ద పెద్ద రాతిచుట్టులున్నాయి. వాటికి అక్కడకూడా తొలుచుకుపోయిన గుహలున్నాయి. గుహ ముఖాలు వింత వృక్షాలతో మూసివేయబడినట్లుగా ఉన్నాయి. తానింక ముందుకు సాగటం ఆ రాత్రి అసాధ్యమనిపించింది. అందునించి ఒక గుహ ముందు ఆగి చాకుతో కొమ్మలు చెలగి లోనికి వెళ్ళేందుకు మార్గం సుగమం చేశాడు. లోపల గుహలో చిమ్మచీకటిగా ఉంది. అయినా అది ఆ రాత్రి తనను చలినించి కాపాడగలిగిన పవిత్ర ఆలయంగా భావించాడు ఫిజో!
