Previous Page Next Page 
మల్లమ్మదేవి ఉసురు పేజి 11


    రాజమాత నావంక అయోమయంగా చూచారు.
    నేను స్నానం చేయనని ఆమె అనుకుని మళ్ళీ వేడినీళ్ళ సంగతి ఎత్తలేదు. నేను చక చకా వెళ్ళి బావిదగ్గర నీళ్ళు తోడుకుని స్నానం చేశాను.
    అనుభూతులకూ, అరికాలి దుమ్ముకూ సంబంధం యెలా కుదురుతుంది?
    నేను వెళ్ళి స్నానంచేసి వచ్చే సమయానికి మిస్ మార్లిన్ అక్కడున్న వారందరినీ చిందులు వేయిస్తోంది పనివాళ్ళకి యిదొక వేడుక అయింది కానీ ఖర్చులేకుండా కలిసి వచ్చిన కాలక్షేపం అయింది. ఆమె యింత చేస్తే వీళ్ళు మరింత చేస్తున్నారు. ఒకళ్ళని మించినవాళ్ళు మరొకళ్ళు.
    చైనా వెంటటరాయుడు గురించి అడుగుతోంది మిస్ మార్లిన్ "చిన వెంకటరాయుడు యెవరు?" అని ఒకళ్ళూ, "నీ కొడుకా?" అని ఒకళ్ళూ, "నీకు పెళ్ళికూడా అయిందా?" అని మరొకళ్ళూ అడుగుతున్నారు. వాళ్ళందరినీ "తలలు తీయిస్తా!" అంటోంది మిస్ మార్లిన్.
    "నీ బిడ్డ వెంగళరాయుడు బాబాయి దగ్గర వున్నారు. హాయిగా నిద్రపోతున్నారు. వారికి నిద్రాభంగం చెయ్యమంటారా మహాదేవీ!" అని అడిగాను. అందుకామె ఒప్పుకోలేదు.
    ఆ కన్యాహృదయంలో మల్లమ్మదేవి తల్లితనం తాలూకు స్పర్శ పొంగి పొర్లింది. "అయితే వారిని లేపవద్దు" అంది.
    అందరినీ వెళ్ళిపొమ్మన్నాను. రంగారావుగారు బాగా కోపంమీద వున్నారు. గాయత్రీదేవి అయోమయంలో వున్నారు. పనివాళ్ళు వేడుక చూస్తున్నంత సంతోషంతో వున్నారు. అందరూ నా మాట విని వెళ్ళారు.
    "నాయనా! యీ పిచ్చిది మళ్ళీ నిన్ను ఒంటరిగా వుండటం చూచి యేమి చేస్తుందో!" అని తన అనుమానాన్ని వ్యక్తం చేశారు గాయత్రీదేవి.
    నా మీద నాకున్న నమ్మకాన్ని మరొకసారి మననం చేసుకున్నాను.
    "ఫరవాలేదు. వెళ్ళిరమ్మ"ని ఆమెను సాగనంపాను.
    "తెల్లవారితే అంతా పెళ్ళిపనులు. విశ్రాంతికి క్షణం తీరిక వుండదు. దయచేసి మీరు నిద్రపొండి" అని మిస్ మార్లిస్ ని బ్రతిమలాడటం ప్ర్రారంభించాను. అందుకు ఆమె మల్లమదేవిలా ఒప్పుకుంది.
    తాను మల్లమదేవినే అన్న తృప్తితో కాస్సేపటికి ఆదమరచి నిద్రపోయింది. నాకు ఒక సంగతి బాగా తెలిసి వచ్చింది. ఆమె మాటలకు అంగీకరించాలీ తప్ప ఆమెకు యెదురు చెప్పకూడదు. ఆమె మల్లమదేవి కాదని ఆమె యెదురుగా అనకూడదు. వుపాయంతో పరిస్థితిని, ఆమె కోర్కెల్ని సమన్వయించాలిఅని తోచింది.
    అంతకు ముందుకన్నా ఆమెమీద నాకు జాలి అధికం అయింది కొద్ది నిముషాల క్రితం నాపట్ల ఆమె ప్రవర్తన నాకు యిప్పుడు భయం కల్గించలేదు. మడతమంచం వాకిలికి ఆనించి అడ్డుగా వుంచి దానిమీద పడి నిద్రపోయాను. మిస్ మార్లిన్ గది వెలుపలకు పోవాలంటే నా మంచం మీదుగా పోవాలి.
    అటువంటిది యేమీ జరుగకుండానే తెల్లారింది. మిస్ మార్లిన్ యెలాగో ఒప్పించి టిఫిన్ చేయించాను కాఫీ త్రాగించాను. నేను వింత కృత్యంతో చేయవలసిన పనులు యేవీ చేసుకోలేదు. ఆమె సేవలో వున్నాను. ఆమెకు నామీద మంచి అభిప్రాయం కలిగేందుకు వీలు కల్పించుకున్నాను. యీపూట ఆమె రవ్వంత ప్రశాంతంగానే వుంది. వెంట తీసుకుని ఆరోజు పోష్టు యింకా అర్జెంటు కాగితాలు చూసుకునేందుకు నా గదికి తీసుకువచ్చాను. నా కుర్చీలో మిస్ మార్లిన్ ని కూర్చోమని యెదురుగా నేను కూర్చున్నాను. మధ్యమధ్య యేవో మాట చెప్తూ ఆమెకు తిక్క పెరిగిపోకుండా చూచుకుంటూ పోష్టు చూస్తున్నాడు.
    ఆరోజు వుత్తరంలో యితర దేశాలనించి వచ్చిన ఎయిర్ మెయిన్ వుత్తరం ఒకటి వుంది. బరువుగా వుంది.
    విప్పి చూశాను. అది పిఠాపురం రాణి సీతాదేవి ఫ్రాన్స్నించి రాసిన వుత్తరం. అందులో మిస్ మార్లిన్ తాలూకు వివరాలు అన్నీవున్నాయి. ఆమె తల్లిదండ్రులు ఆమె గురించి బెంగపడటం వుంది. ఆమె ఫోటో వుంది. ఆమె యిండియా బయలుదేరి రావటంవరకూ వుంది.
    నాకు సంగతులు అన్నీ తేటతెల్లం అయినాయి.
    ఆమెను అక్కడే కూర్చోమని చెప్పి నేను పైకి వెళ్ళాను. రంగారావుగారికి ఆ వుత్తరం చూపి సంగతి అంతా వివరించాను ఆమెమీద కోపం తెచ్చుకోవటం అర్ధరహితమనే విషయం ఆయనకు అప్పటికి బోధపడింది. రాజమాతకూ అన్ని సంగతులూ చెప్పాం.
    "అయితే పునర్జన్మలు వున్నాయన్నమాట. యీ మిస్ మార్లిన్ మల్లమ్మదేవి మరొక జన్మ అన్నమాట. యెంత చిత్రం" అన్నారు గాయత్రీదేవి.
    "అవునండీ! యీమెనించి మనకు తెలియవలసిన సంగతులు చాలా వున్నాయి. ముఖ్యంగా మనం ఆమె కోర్కెలను తిరస్కరించటం కాని ఆమె ఆజ్ఞలకు యెదురుచెప్పటం కాని చెయ్యకూడదు. అప్పుడే మనకు కావలసిన సంగతులు అన్నీ వెలుగులోకి వస్తాయి" అన్నాను.
    "అయితే యీమెను డాక్టరు వెంట పంపటం లేదా?" అని అడిగాడు రంగారావుగారు. రాజమాత నావంక చూచారు.
    "అవునండీ! అవుసరమయితే డాక్టరుగారినే యిక్కడ వుండమంటాను. రేపేకదా బోనాల పండుగ. కనీసం ఆ రాత్రికి అయినా యీమె యిక్కడ వుండాలి" అన్నాను.
    రంగారావుగారు అంగీకరించారు.
    నేను ఎంతో సంతోషంతో క్రిందికి దిగి వచ్చాను.
    మిస్ మార్లిన్ యేడుస్తోంది. "నాకేమయింది? నాకేమయింది?" అంటోంది.
    నాకు అర్ధమయింది. రాత్రినించి ఆమెకున్న యేకాగ్రత- తాను మల్లమ్మదేవిని అన్న యేకాగ్రత తగ్గిపోయింది సబ్ కాన్షస్ లోంచి కాన్షస్ లోకి కొన్ని విషయాలు జంప్ చేస్తున్నాయి. ఆమెకిప్పుడు కలలాంటి అయోమయస్థితి కలిగి వుంటుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS