.jpg)
వినాయక చవితి ఉత్సవాలు జరపాలని మా రామ్ భరోసా అపార్ట్ మెంట్స్ వాళ్ళు డిసైడ్ చేశారు.
శంకరమూర్తి కల్చరల్ సెక్రటరీ కాబట్టి ఎలాంటి ప్రోగ్రామ్స్ ఎరేంజ్ చేయాల్సిందీ అపార్ట్ మెంట్స్ లో వాళ్ళందర్నీ సంప్రదించి కొన్ని కార్యక్రమాలు లిస్ట్ చేశాడు.
మొదటిరోజు అపార్ట్ మెంట్ లేడీస్ కి పాటల పోటీ! 'పాట' అంటే విరక్తి కలిగే పద్దతిలో లేడీస్ అందరూ తమ ప్రతిభను మూడు గంటలపాటు వెళ్ళగక్కారు.
రెండోరోజు మిమిక్రీ పోటీలు! అవికూడా ఎక్కువగా మా అపార్ట్ మెంట్స్ వాళ్ళే చేశారు. ఆఖర్లో - అంటే పదోరోజు రాత్రి జరిపిన కార్యక్రమం చూసి అపార్ట్ మెంట్ లేడీస్, జెంట్స్ అఫెండ్ అయిపోయి, అలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు కల్చరల్ సెక్రటరీ శంకరమూర్తి మీద దాడిచేశారు.
ఇంతకూ ఆ కార్యక్రమం ఏమిటంటే చిన్నపిల్లల రికార్డ్ డాన్స్ లు!
మరీ చిన్న వయసు ఆడపిల్లలు- మన తెలుగు సినిమా హీరోయిన్స్ వేసుకునే సెక్సీడ్రెస్ లు వేసుకుని పరమబూతు పాటలు పాడటమే కాకుండా వల్గర్ విన్యాసాలు కూడా చేయడం! 'అబ్బనీ తీయని దెబ్బ-' అంటూ నడుము ముందుకు జెర్క్ ఇస్తోంటే అపార్ట్ మెంట్స్ లోని యూత్ అంతా బూతు కామెంట్స్, విజిల్స్ తో మోతెక్కించేశారు.
ఆ ప్రోగ్రాం అవగానే మా వాళ్ళందరూ- మిగతా ఆఫీస్ బేరర్స్ తో సహా శంకరమూర్తి టేస్ట్ చాలా నీచంగా ఉందని కామెంట్ చేయటం మొదలు పెట్టేసరికి శంకరమూర్తి వొళ్ళుమండిపోయి ఎదురుతిరిగాడు. ఇలా పదిమందిలో పబ్లిగ్గా గొడవ పడటం బాగుండలేదని మా సొసైటీ ప్రెసిడెంట్ హమీద్ మియా ఒక రాజీఫార్ములా వదిలాడు.
"నేను రేపాదివారం జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేస్తయ్! అన్నీ ఆ మీటింగ్ కొచ్చి డిస్కస్ చేసి అప్పుడు శంకరమూర్తి మీద యాక్షన్ డిసైడ్ చేస్తయ్-" అన్నాడు.
ఆ మేరకు ఆదివారం మీటింగ్ మొదలయిపోయింది.
ముందు మా సొసైటీ వైస్ ప్రెసిడెంట్ అంజనీ బొపాషా మాట్లాడింది. అంజనీబోపాషా తెలుగావిడకాదు. నేటివ్ ప్లేస్ అస్సాం బెంగాల్ బోర్డర్ గానీ, వాళ్ళాయన ఉద్యోగరీత్యా హిమాచల్ ప్రదేశ్ కొండజాతుల మధ్య చాలాకాలం గడిపి, ప్రస్తుతం హైదరాబాద్ కి బదిలీ మీద వచ్చాడు.
ఆమె అపార్ట్ మెంట్స్ కి సంబంధించిన విషయాల్లో యాక్టివ్ గా ఉండడంతో ఒక వైన్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చారు.
"ఆడపులులూ, మగపుల్లలూ! చాలా నిజంగా ఆ పిల్లుల రికార్డ్ డాన్స్ లు బాగుండేదిలేదు" అంది.
అందరూ ఆమె తెలుగుకి తలలు పట్టుకున్నారు.
"సింకరమూతి చాలా నిజంగా ఆ కార్యం కార్యించాడు."
"అమ్మా! నాపేరు సింకరమూతి కాదు కాదు తల్లీ! శంకరమూర్తి-"
"నా తెగులు నించంరాదు- ఎడ్జస్ట్ కాసుకోవాలి-"
"కాసుకోవాలి కాదు- చేసుకోవాలి-" ఎవరో అరచాడు.
ఆ తరువాత లేడీస్ వింగ్ ప్రెసిడెంట్ మంగతాయారు ఆవేశంగా మాట్లాడింది.
"నమస్కారం! మొన్న గణపతి ఉత్సవాల్లో ఆఖర్రోజున జరిగిన ఆ సిగ్గు చేటు కార్యక్రమం గురించి మాట్లాడ్డానికి మనం ఇక్కడ సమావేశమయ్యాం ఆ చిన్నపిల్లల రికార్డ్ డాన్స్ లు ఎంత నికృష్టంగా, అసహ్యంగా ఉన్నాయంటే నేనూ మా ఆయనా సిగ్గుతో తలవంచుకున్నాం!"
"అవును! ఆ లిరిక్స్- ఆ పాటలు- మన సొసైటీకే నిండా ఇన్సల్టప్పా" మంగతాయారుని సపోర్ట్ చేశాడు స్వామినాథన్!
భారతమ్మ మైక్ అందుకుంది. "మన భారత సంస్క్రుతేంటి? మన తెలుగు సంస్కృతి ఎంత గొప్పది? అలాంటిది ఆ చిన్నపిల్లల్తో "ముందు పెట్టుకో- ముద్దు పెట్టుకో" అనే పాటలు పాడిస్తారా ఎవరయినా?"
ఇలా అందరూ వరుసగా ఎటాక్ చేస్తూంటే శంకరమూర్తికి, విజయ్ యాదవ్ కి వళ్ళుమండిపోయింది.
"అవన్నీ సినిమాల్లో పాట లేనండీ! తెల్లారిలేస్తే అన్ని టి.వి. చానెల్స్ లో చూపిస్తూనే ఉన్నారు. ఆ సినిమాలకి లేడీస్ ఎగబడి వెళ్లి వందరోజులాడించారు- ఇప్పుడు సడెన్ గా "అవన్నీ నికృష్టమైనవి అంటారేంటి?" అంటూ కౌంటరేశాడు.
అంతవరకూ నిశ్శబ్దంగా ఉన్న విజయ్ యాదవ్ కూడా శంకరమూర్తిని చూసుకుని రెచ్చిపోయాడు.
"అసలు పిల్లలందరికీ ఆ బూతుపాటలకు రికార్డ్ డాన్స్ లు గిట్ట చేయటం నేర్పించినోళ్లెవళు? దమ్ముంటే ఆ పేరెంట్స్ నడగండ్రి! మాకెందుకడుగుతాన్రు?"
"అతను చెప్పేది నిజమేమరి! అసలిదంతా ఈ ఫాల్తూ టీ.వీ. చానెల్స్ ప్రభావమండీ! సినిమాల్లోని బూతంతా ఏరి ప్రత్యేక కార్యక్రమాల కింద రోజూ చూబిస్తోంటే పిల్లలు పాడవకుండా ఎలా ఉంటారు?" అంటూ అవధాని ఆవేశంగా శంకరమూర్తిని సపోర్ట్ చేశాడు.
"అసలిలాంటి కార్యక్రమాలు టీవీ ఛానెల్స్ చూపిస్తోంటే గవర్నమెంట్ ఏం చేస్తోందీ?" ఇంకెవరో అరచారు.
వెంటనే ప్రెసిడెంట్ హమీద్ మియా మైక్ లాక్కున్నాడు.
"గవర్నమెంటంటే ఎవళురా భయ్? మనమే కదా! పిల్లగాళ్ళను పక్కన కూసోబెట్టుకొని టీవీలో వచ్చే అడ్డమయిన చెత్తా చూపిస్తోంటే ఆ పిల్లగాళ్ళేం చేస్తయ్ పాపం?"
అందరూ బిగ్గరగా అరచుకుంటూ మాట్లాడటం మొదలుపెట్టేసరికి లేడీస్ వింగ్ ప్రెసిడెంట్ షైనీ స్టేజ్ మీద కొచ్చి 'సైలెన్స్' అంటూ అరిచింది.
షైనీ అంటే అపార్ట్ మెంట్స్ లో చాలామందికి అట్రాక్షన్!
అందుక్కారణం షైనీ మోడ్రన్ గా డ్రస్ చేసుకుంటుంది. సెక్సీగా, అందంగా ఉంటుంది. అందుకే అందరూ ఏదొక వంక మీద ఆమెతో కల్పించుకుని మాట్లాడుతుంటారు.
ఆమె ఏం అడిగినా ఓకే!
ఏం చెప్పినా ఓకే! యూత్ లో చాలామంది ఆమెకు లైన్ వేస్తూంటారు గానీ ఆమె వాళ్ళను ఎంతదూరంలో ఉంచాలో అంతదూరంలో ఉంచగలరు. అదెలాగంటే- ఆమె కరాటే బ్లాక్ బెల్ట్! ఒకసారి అర్దరాత్రి ఆమె కాల్ సెంటర్ నుంచి స్కూటీ మీద ఇంటికొస్తోంటే తాగుబోతులిద్దరు అడ్డుతగిలారు. స్కూటీకి స్టాండ్ వేసి ఇద్దరికీ చెరో కిక్ ఇచ్చి తనే అంబులెన్స్ కి ఫోన్ చేసింది.
