Previous Page Next Page 
రాంభరోసా అపార్ట్ మెంట్స్ పేజి 13

   
                 
    
    "ఇప్పుడు మా లేడీస్ అంతా కోరుతోందేంటంటే డాన్స్ ల పేరుతో బూతు విన్యాసాలు చేయించిన కల్చరల్ సెక్రటరీ రాజీనామా చేయాల్సిందే" అంది షైనీ.
    "అయ్ సపోర్ట్ షైనీ" అంటూ వేదిక మీద కొచ్చాడు బాచులర్ కృష్ణమూర్తి.
    కృష్ణమూర్తి షైనీకి లైట్ కొట్టడం మొదలుపెట్టి సంవత్సరం అయిపోయింది గానీ ఇంతవరకూ ఆ వ్యవహారం ఒక ఇంచ్ కూడా ముందుకి జరుగలేదని వాచ్ మెన్ సింగినాధం ఎప్పటికప్పుడు అందరికీ న్యూస్ రిలీజ్ చేస్తూంటాడు.
    కృష్ణమూర్తి, షైనీల గురించే కాదు. మా అపార్ట్ మెంట్స్ లో సీక్రెట్ గా జరిగే సక్రమ, అక్రమ సంబంధాల గురించీ, రెండో నెంబరు దందాల గురించీ, రియల్ ఎస్టేట్ గురించీ సర్వస్వం - అరగంటకోసారి న్యూస్ రిలీజ్ చేస్తూంటాడు సింగినాథం.
    కృష్ణమూర్తి అలా ఓపెన్ గా ప్రతి విషయానికీ 'అయ్ సపోర్ట్ షైనీ' అంటూ తన వెనుకే తిరగటం షైనీకి నచ్చటం లేదు.
    "నాకిప్పుడు నీ సపోర్ట్ అవసరమా?" అనడిగిందతని వేపు తిరిగి. అక్కడున్న చాలామంది భార్యాభార్యలు కూడా షైనీని సపోర్ట్ చేశారు. దాంతో హమీద్ మియా కంగారుపడి మైక్ అందుకున్నాడు.
    "దేఖో భాయింయో- అండ్ బెహనో! భారత కల్చర్, తెల్గూ కల్చర్ అంటే నాకూ ఇజ్జత్ ఉన్నయ్! గట్లనే హమారా ఉర్దూ కల్చర్ భీ మంచి గుంటయ్! ఫిర్ భీ- ఈ ఛోటీసీ బాత్ కేలియే-శంకర్ మూర్తినీ రిజైన్ చెయ్ అనటం- మంచిగ లేవ్! ఆప్ బీ- ఇంకోసారి- ఆలోచన చెయ్-" అన్నాడు.
    "ఇగో - నువ్ శంకర్ మూర్తిని సపోర్ట్ చేస్తున్నావ్ గనుక మొత్తం మీ కమిటీ రిజైన్ చేయాలి" అంటూ ఇంకొందరు అరిచేసరికి హమీద్ మియా కంగారుపడ్డాడు.
    శంకర్ మూర్తిని సపోర్ట్ చేస్తే తన పదవి ఊడి పోద్దేమోనని భయపడ్డాడు.
    "ఠీక్ హై! ఠీక్ హై! మీరు అంత స్ట్రాంగ్ గా ఫీల్ గిట్టయితే గిప్పుడు నేను శంకర్ మూర్తిని ఎక్స్ ప్లనేషన్ ఇమ్మనికోరుతుంది" అన్నాడు. దాంతో శంకర్ మూర్తికి వళ్ళు మండిపోయింది. హమీద్ మియా చేతిలో నుంచి మైక్ లాక్కుని "ఆ పిల్లలు చేసిందీ, చేయాల్సిందీ నిర్ణయించింది ఆ పిల్లల తల్లులే! కనుక ఆ ఎక్స్ ప్లనేషనేదో వాళ్ళ తల్లుల్నే అడగాలి-" అన్నాడు.
    దాంతో అందరూ సైలంటయిపోయారు.
    "అబద్దం లేడీస్ ఎప్పటికీ అలాంటి డాన్స్ లు సెలక్ట్ చేయరు" అంది షైనీ.
    "చేశారు- కావాల్నంటే వాళ్ళనిప్పుడే స్టేజ్ మీదకు లాగండి!" అన్నాడు శంకరమూర్తి ఇంకా రెచ్చిపోతూ.
    హమీద్ మియాకి ధైర్యం వచ్చింది.
    "అరే మొహిందర్ సింగ్! ఆ పిల్లల తల్లులు ఇక్కడెవరయినా ఉంటే స్టేజ్ మీదకు పంపు-" అంటూ వైస్ ప్రెసిడెంట్ మొహిందర్ సింగ్ కి చెప్పాడు.
    సీతావరదరాజన్ కోపంగా లేచింది.
    "యా! మా పాప ఏపాట పాడాలో నేనే సెలక్ట్ చేస్తిని- అయితే ఏమీ?" అంటూ టామిళ్ యాక్సెంట్ తో అదరగొట్టింది.
    "షేమ్ షేమ్" అంటూ అరచారు వింధ్యా దేవి అండ్ కంపెనీ. వాళ్ళలా షేమ్ అని అరవడంతో సీతావరదరాజన్ కి తమిళ్ కోపం వచ్చేసింది.
    "ఏమి? షేమ్ షేమ్ అంటారు? నా పిల్లలు ఏమి సాంగ్ పాడాలో, ఏమి డాన్స్ చేయాలో నేనుదా నిర్ణయం జేస్తాను! కొశ్చెన్ చేయటానికి నీవెవరు? వాయుముడప్పా!" అంటూ గట్టిగా అరచేసరికి అంతా సైలెంటయిపోయారు.
    "సూస్తారేమి? సమాధానం సోల్లుంగో! తెలుంగు సినిమాల నిండా బూతుపాటలు, బూతు డాన్సులు. పదిసార్లు సూస్తారు- ఇంకా తెలుగు కల్చర్ రొంబగొప్పది అంటారు! నా పిల్లలు అదే పాటపాడితే 'ఛీ ఛీ' అంటారు. ఎన్న అన్యాయం ఇది? థూ! అన్నీ పాలిటిక్స్-" అంటూ వెళ్ళిపోయిందామె. అందరూ ఆ షాక్ నుంచి కోలుకుంటూండగానే దీపామెహతా తన పాపతో మైక్ ముందుకొచ్చింది.
    "హాం జీ! హమారీ బచ్చీ జో గీత్ కో నాచీ హై, ఓ గీత్ మైనే చునీథీ! తో క్యాహువా? హమారీ బచ్చీహై, హమారీ మర్జీ హై! బీచ్ మే తుమ్ కౌన్ హూ తేహో బోల్ నే వాలే?" అంటూ ఛాలెంజ్ చేసేసరికి అంతా డంగైపోయారు.
    సునీత వెంటనే తన అభిప్రాయం ఎనౌన్స్ చేసింది. "ఇకనుంచీ కల్చరల్ కార్యక్రమాలేం జరుపదల్చుకున్నా మా లేడీస్ వింగ్ లో మెంబర్స్ తో సంప్రదించి మా సూచనలు అమలు చేయాలి! లేడీస్ అయితేనే ఎక్కడా 'అసభ్యం' అనేది లేకుండా డిగ్నిఫైడ్ గా కార్యక్రమాలు రూపొందించగలరు-" ఆమె సూచనలు ఆమోదిస్తున్నట్లుగా మెంబర్స్ అందరూ తప్పట్లు కొట్టి మద్దతు తెలియజేశారు.
    కానీ శంకరమూర్తికి మాత్రం ఆ ప్రపోజల్ నచ్చినట్లులేదు.
    "అన్నీ లేడీస్ చూసుకునేట్లయితే ఇంక కల్చరల్ పోస్టెందుకండీ? ఇప్పుడే రిజైన్ చేస్తున్నా!" అన్నాడు ఆవేశంగా.
    విజయ్ యాదవ్ అర్జంటుగా కాగితం పెన్నూ తెచ్చి అతని ముందుంచాడు.
    "రిజైన్ చేస్తానంటివిగా! ఇదిగో కాయితం, పెన్నూ!" అన్నాడు.
    కల్చరల్ సెక్రటరీ పదవికి శంకరమూర్తితో పోటీచేసి రెండు ఓట్ల తేడాతో ఓడిపోయాడతను. అప్పటి నుంచీ ఏదొకరోజు శంకరమూర్తిని లేపేసి తనాపోస్ట్ చేజిక్కించుకోవాలని ప్లాన్లో ఉన్నాడు.
    శంకరమూర్తి అతని ప్లాన్ ని ఇట్టే పసిగట్టేశాడు.
    "రాస్తానండీ! ప్రెసిడెంట్ గారిని ఓకే అనమనండి!" అంటూ కౌంటరేశాడు. ఆ డైలాగ్ తో హమీద్ మియా గాబరాపడ్డాడు.
    షైనీ ఇంక కల్పించుకోకుండా ఉండలేక పోయింది.
    "మిస్టర్ శంకర్ మూర్తీ! ప్లీజ్ లిజెన్! మీ రెజిగ్నేషన్ వల్ల ప్రాబ్లెమ్ సాల్వ్ కాదు. మా లేడీస్ అందరూ కోరుతోందేంటంటే ఏ ప్రోగ్రామ్స్ జరిపినా వాటిల్లో ఎక్కడా అశ్లీలం, అసభ్యం అనేది ఉండకూడదు. అదే మేము కోరేది. ఎందుకంటే మన అపార్ట్ మెంట్స్ లో ఉంటోన్న ఫ్యామిలీస్ ని మీరు గమనించే ఉంటారు. ఎంత డిగ్ని ఫైడ్ గా ఉంటారు? అవునా, కాదా?"
    "అవును" అంటూ అరిచారు లేడీస్.
    "అయ్ సపోర్ట్ షైనీ" అన్నాడు కృష్ణమూర్తి అలవాటు చొప్పున. షైనీ విసుగ్గా చూసేసరికి కంగారుపడ్డాడు.
    "కనుక ఇలాంటి సున్నితమయిన విషయాలన్నీ మగాళ్ళందరూ దృష్టిలో పెట్టుకుంటే మనం కండక్ట్ చేసే ప్రోగ్రామ్స్ అన్నీ బాగానే ఉంటాయ్-" అంది షైనీ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS