Previous Page Next Page 
రాంభరోసా అపార్ట్ మెంట్స్ పేజి 11


    "మూడు నెలలంటే మాటలా? మిగతా పిల్లలకంటే చదువులో మూడు నెలలు వెనుక బడ్డాడంటే జీవితాంతం అడుక్కుతినాల్సిందే- తెలుసా?"
    "తెలీదని చెప్పాం వినయంగా!"
    ప్రిన్సిపాల్ ఏం చేయాలో తోచక రెండు చేతుల్తో తల పట్టుకుని ఆలోచించసాగింది.
    కేవలం బోసుబాబు పాపాయి కారణంగా 78 మంది ఫ్రెష్ గా పుట్టబోతున్న విద్యార్ధులను వదులుకోడానికి ఆమెకు మనసొప్పటం లేదు.
    "సరే- ఓ పని చేయండి!" అంది కాపేపాగి.
    "చెప్పండి మేడమ్! ఏ పని అయినా చేస్తయ్" అన్నాడు హమీద్ మియా.
    "మీకు జోలపాట తెలుసా?"
    విజయ్ యాదవ్ గర్వంగా చిరునవ్వు నవ్వాడు.
    "ఎందుకు తెలీదు మేడమ్? మా మదర్ మా చిన్నప్పుడు పాడుతూండేది."
    ఆమెకు కోపం థర్మమీటర్ లో పాదరసం పెరిగినట్టు పెరిగిపోయింది.
    "మిస్టర్- నీకేమయినా బుద్దుందా? నేనడిగిందేమిటి? నువ్ చెప్పేదేంటి?"
    మేమందరం కంగారుపడ్డాం.
    జోలపాట అంటే అదిగాక ఇంకేముందో ఎవరికీ అర్ధం కావటం లేదు.
    మేమందరం మొఖాలు చూసుకోవటం గమనించి ఆమె మా వంక చాలా డిజ్ గస్టింగ్ గా చూసింది.
    "జోల పాటంటే అమీర్ పేట్ లో ఉన్న ఒక ఇంటెన్సివ్ కోచింగ్ సెంటర్ పేరు. మీ పపయిలాగా ఏజ్ బార్ అయి స్కూల్లో చేరకుండా ఉండిపోయిన పిల్లలకు తన ఈడు పిల్లల్తోపాటు కోపప్ అయ్యేంతగా వాళ్ళు ఇంటెన్సివ్ కోచింగ్ ఇస్తారన్న మాట. ఉదాహరణకు మీ పాప ఇప్పుడు మాస్కూల్లో చేర్తే ఏడ్చేప్పుడు ఏబీసీడీ అని ఏడ్వటం మొదలు పెడతాడు. కానీ మిగతా పిల్లలు డబ్ల్యూ, ఎక్స్, వై. జెడ్ అని ఏడుస్తుంటారు- ఈ తేడా లేకుండా ఉంటానికి జోలపాట ఇంటెన్సివ్ కోచింగ్ సెంటర్లో త్వరత్వరగా మిగతా అక్షరాలన్నీ ఏడ్వటం నేర్పించేసి డబ్ల్యూ దగ్గర కొచ్చాక పంపించేస్తారు."
    అప్పుడు కానీ మా కర్ధం కాలేదు.
    "ఆహా! మన ఆంద్రప్రదేశ్ లో అంత గొప్ప స్కూలుందని మాకింతవరకూ తెలీదు మేడమ్" అన్నాడు శంకరమూర్తి మెచ్చుకుంటూ.
    "కానీ ఆ స్కూల్లో మరి అడ్మిషన్ ఇస్తారా మేడమ్?"
    "ఎందుకివ్వరు? ఎంట్రెన్స్ టెస్ట్ ఒకటి పెడతారు. అది పాసయితే చాలు- ఇచ్చేస్తారు"
    "ఎంట్రన్స్ టెస్టా?"
    "అవును?"
    "ఇంత చిన్న పాపాయికి ఎంట్రెన్స్ టేస్టేమిటి మేడమ్?"
    ఆమె నుదురు కొట్టుకుంది.
    "అబ్బా- ఇంత ఇగ్నొరెంట్ జనాభాని ఇంతవరకూ చూళ్ళేదు. ఇదిగో! ఎంట్రెన్స్ టెస్ట్ మీ పాపాయిక్కాదు మీకు. మీరు పాసయితే అప్పుడు ఇరవైవేలు ఫీజు కట్టాలి.
    వెనుక నుంచి దభేల్ మని పెద్ద సౌండ్ వినిపించింది.
    అందరం వెనక్కు తిరిగేసరికి బోసుబాబు కిందపడిపోయి కనిపించాడు. అందరం లేపి కూర్చోబెట్టాం.
    "ఏమయింది?" అడిగాడు రెడ్డి.
    "ఇరవైవేలనే సరికి కళ్ళు తిరిగినయ్"
    అందరూ బోస్ ని చివాట్లేశారు.
    "ఓ పక్క మీ కుర్రాడి లైఫ్ నాశనమయిపోతుంటే ఇరవై వేలకు కంగారు పడతావేంటయ్యా"
    ప్రిన్సిపాల్ అప్లికేషన్ మీద 'అడ్మిట్' అని రాసింది.
    కానీ దానికింద కండిషన్ కూడా పెట్టింది.
    "ఈ స్కూల్లో చదువుతూనే- జోలపాటలో రోజూ సాయంత్రం రెండు గంటలు ఇంటెన్సీవ్ కోచింగ్ తీసుకుంటేనే అడ్మిషన్ వాలిడ్" అంటూ రాసింది.
    అందరి మొఖాల్లోకి ఆనందం వచ్చేసింది.
    "థాంక్యూ మేడమ్- మీ రుణం తీర్చుకోలేం!" అన్నాడు మొహిందర్ సింగ్. అందరూ వెళ్ళబోతుంటే వెనుక నుంచి ప్రిన్సిపాల్ మళ్ళీ అరచింది.
    "మొహిందర్ సింగ్"
    "యస్ మేడమ్"
    "మీ అపార్ట్ మెంట్స్ కి సంబంధించిన 78 మంది పుట్టబోయే పిల్లల తాలూకూ కాంట్రాక్ట్ ఫైల్ మీద సైన్ చేసి వెళ్ళండి-"
    అందరూ మొఖాలు చూసుకున్నారు.
    మా ప్రెసిడెంట్ హమీద్ మియా ఏడవలేక ఒక వెధవనవ్వు నవ్వాడు.
    "ఓకే మేడమ్- అలాగే సైన్ చేస్తయ్" అన్నాడు వెనక్కు తిరుగుతూ.
    ఆ కాంట్రాక్టు సంతకం చేశాక అందరం మా అపార్ట్ మెంట్స్ కి చేరుకున్నాం నిశ్శబ్దంగా.
    అక్కడ అందరం మా హమీద్ మియాని నిలదీశాం.
    "అవునయ్యా! 78 మంది లేడీస్ మన అపార్ట్ మెంట్స్ లో ప్రెగ్నెంట్ అయి ఉన్నారనీ, ఇంకొద్ది రోజుల్లో పిల్లల్ని కనబోతున్నారనీ ఆమెతో అన్నావ్ కదా! ఎవరా 78 మంది?"
    "నాకేం తెలుసు? ఏదో ఆశ పెడదామని అంటే అదే పట్టుకూర్చుంది! తీరా ఇప్పుడా అగ్రిమెంట్ పై సంతకం చేశాం! ఒకవేళ రేపు అదంతా అబద్దమని తేల్తే కేస్ పెట్టి జైల్లో వేయిస్తయ్యేమో?" భయంగా అన్నాడతను.
    "బేఫి కర్ గుండన్నా! ఇంతమంది లేడీస్ లో కనీసం 78 మందికైనా ప్రెగ్నెన్సీ లేకుండా ఉంటుందా? లేకపోతే ఇప్పుడవకుండా ఉంటుందా? డోంట్ వర్రీ- భరత్ మహాన్ హై" అన్నాడు మొహిందర్ సింగ్ ఉత్సాహంగా.
    ఆ మాటతో మా అందరికీ కూడా ఉత్సాహం ముంచుకొచ్చింది. "భారత్ మహాన్ హై" అంటూ అరిచాం.

                        


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS