ఓ నిముషంలోనే ఆ వార్తను నాలుగుసార్లు చదివేసి పేపర్ పక్కనే ఉన్న సుబ్బారావుకిచ్చాడు. సుబ్బారావు మరోసారి కళ్ళునులుము కొని పేపర్ ని క్రిందనించి పైకి ఓసారి చూస్తూ ఓ న్యూస్ దగ్గర ఆగిపోయాడు. అప్పటికప్పుడే అతని మోములో విషాద ఛాయలు కనిపించాయి.
"కన్న కూతురు పెళ్ళి చేయలేక ఆత్మహత్యలు" అన్న వార్తను పైకే చదివి, ఓ సారి నిస్పృహగా తల విదిలించి, మిగతా న్యూస్ పూర్తిగా చూసి పేపర్ పక్కనే ఉన్న నాగ్ కి అందించాడు.
నాగ్ పేపర్ తీసుకొని ఓసారి పేపరంతా తిరగవేసాడు అతడి చూపులు నిర్దుష్టంగా ఓ చోట ఎక్కడా ఆగిపోలేదు.
రెండునిమిషాలకి పేపర్ మడుస్తూ అన్నాడు. "మింట్ కాంపౌండ్ వెనుక ముగ్గురు అమ్మాయిల అదృశ్యం- సమ్మె తీవ్రం-మరో నాలుగు బస్సులు దగ్ధం....." అని పైకే రెండు వార్తల హెడ్డింగ్స్ చదివేసి ఆవేశంగా ఓ శ్వాస తీసుకున్నాడు. అంతలో తలుపు బాదుతున్న చప్పుడు వినిపించి నాగ్ చెంగు న మంచం మీంచి దూకి గడియ తీశాడు. ఎదురుగా క్రాంతి, చిర్నవ్వుతో ముగ్గుర్ని కలియజూస్తూ రూమ్ లోకి వచ్చి నాగ్ మంచం మీదున్న పేపర్ ని చేతిలోకి తీసుకొని, దాన్నే చూస్తూ ఓచోట ఆగిపోయాడు- "అరక్ కాంట్రాక్ట్ వడయార్ కే సొంతం" అన్న వార్త పైకే చదివి చటుక్కున పేపర్ని అడ్డంగా చింపేశాడు.
క్రాంతి ఆవేశానికి రాజు, సుబ్బారావు ఒకింత ఆశ్చర్యపోతే, నాగ్ మెల్లగా నవ్వుకున్నాడు.
అక్కడ కొద్దిసేపు నిశ్శబ్దంలో నలుగురూ ఆలోచిస్తూండిపోయారు.
ముందుగా తేరుకున్న క్రాంతి అన్నాడు ఆవేశంగా. చూశారా దొంగ లంజాకొడుకులు- లంచాలు తిని ఎక్సైజ్ అధికారులు, మినిస్టర్ అరక్ కాంట్రాక్టు మరలా పడయార్ కే ఇచ్చారు. ఆ అరక్ కాంట్రాక్టు వెనుక దొంగ సారా వరదలా ప్రవహింపజేస్తాడు. సామాన్యుల రక్తాన్ని కోట్ల రూపాయల రూపంలో దిగమింగేస్తాడు. వాడ్ని నరికిపారేయాలి....." క్రాంతి పళ్ళు పట పట కొరుకుతూనే ఉన్నాడు మాట్లాడటం పూర్తయినా.
నాగ్ ఓసారి క్రాంతి వేపు చూసి ప్రశాంతంగా అన్నాడు. "ఆవేశమే జాతికి పట్టుకున్న అన్ని జబ్బులకీ మందుకాదు. నరకటమే దోపిడీకి పరిష్కారమైతే, దోపిడికి నీకన్నా ఎక్కువ చేతులే ఉంటాయి. ఆ చేతుల్లో డబ్బు బలం, అధికారపు అండ, చట్టాన్ని అనుశాసించగల ధైర్యం, కోర్టుల్ని మభ్యపెట్టగల తెగువ వుంటాయి.
అన్నిటికీ మించి వాళ్ళను నువు అనాల్సింది దొంగ లంజాకొడుకులు అని కాదు__దొంగలు. స్త్రీ ఒక శ్వాసను భూమ్మీదకు తెచ్చే ప్రయత్నంలో ఆ శ్వాస దుర్గంధ భూయిష్టం కాకూడదనే కోరుకుంటుంది. వాడు అంటించుకున్న దుర్గంధాన్ని వాడికి జన్మనిచ్చిన తల్లిని నిందించటానికి వాడుకోవద్దు జన్మనిచ్చిన తల్లిని, బతకనిచ్చే మాతృభూమిని తిట్టడం ఎంత మంచి కోరుకునే వాడికైనా తగని పని-" నాగ్ మాటలు స్పష్టంగా వున్నాయి.
"వాడు అమ్మే కల్తీ సారావలన వందలమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు- వాడ్ని నరకటంలో తప్పేముంది_?" కాస్త గట్టిగానే అడిగాడు రాజు నాగ్ వేపు చూస్తూ.
"ఏదో ఒకవేపు వాదనకు దిగే బాపతు నువ్వు సబ్జెక్ట్ లోతుతెలిసి వాదించేవాడివి కాదు రాజు నువ్వు. పదినిముషాల క్రితమే నువ్వు పేపర్ తీసి చదివిన తొలి వార్తా ఏమిటి-? రాయల్ భూటాన్ లాటరీ తగిలిన అదృష్టవంతుడి గురించి, అవునా?"
"దేశాన్ని, వ్యవస్తను, విద్యావిధానాన్ని సర్వనాశనం చేస్తూన్న వార్తలే ఈ చింపిన పేపరులో ఎక్కువ ఉన్నాయ్. అవేమీ నీ దృష్టిని ఆకర్షించలేదు. ఈజీ మనీ-లక్ష్మీకటాక్షంగురించి చదివావు. నీకు చెడును తిట్టే హక్కు ఎక్కడుంది?" నాగ్ మాటలు సూటిగా ఉన్నాయ్.
"లాటరీ తగిలిన అదృష్టవంతుడి గురించి చదివానని నువే అన్నావ్, అదృష్టవంతుడు చెడ్డవాడెలా అవుతాడు?" రాజు సీరియస్ గానే అడిగాడు.
"అదృష్టవంతుడు చెడ్డవాడు కాకపోవచ్చు__అవకాశవాది మాత్రం అవుతాడు. శ్రమించకుండానే లక్షలు రూపాయలు కావాలి. అది నీ కష్టార్జితం అవుతుందా?"
"ఆర్థకంగా వెనుకబడ్డ భూటాన్ కి నా వంతు సహాయం అందిస్తున్నాను. కాదంటారా?" ఉక్రోషంగా అన్నాడు రాజు.
"నిజంగా నీకా ఉద్దేశమే ఉందా? ఓ లాటరీ తగులుతుందనే ఆశే లేకపోతే, కావాలని సహాయం చేయగలవా? ఈ దేశంలో లాటరీ టిక్కెట్లు కొనే ఖర్చు పెడుతున్నారా? ఆత్మ వంచన వద్దు. బీ ఫ్రాంక్. మనివి నిర్ణయాలు కావు___తీర్మానాలు కావు___చెప్పు ఆ ఉద్దేశమేనా?" నాగ్ మాటలు అంతకంతకు పదునెక్కుతున్నాయ్!
రాజు మాట్లాడలేకపోయాడు.
"మన క్షేమంకోసం, మన దేశ క్షేమంకోసం ఫ్యామిలి ప్లానింగ్ అమలు చేయాలని చెప్తే లంచాలడిగే నికృష్టులం. ఏదో ఒక ఆశ చూపితే తప్ప జేబులో డబ్బులు తీయని స్వార్థపరులం. లాటరీ టిక్కెట్లు కొనేవారు ఏనాడన్నా రెడ్ క్రాస్ సొసైటీకి ఒక రూపాయి ఇచ్చుంటారంటావా? అంతెందుకు నీ జబ్బు తగ్గాక మిగలిపోయినా ఇంజక్షన్స్ , టాబ్ లెట్స్ ఏనాడన్నా పనిగట్టుకొని వెళ్ళి డ్రగ్ బ్యాంకులో వేశావా? నీకన్నా క్రాంతినయం. ప్రాక్టికాలిటీకి అందకపోయినా కనీసం చెడుపట్ల ఆవేశపడ్డాడు." విసురుగా అంటూ లేచి పేపర్ని చేతిలోకి తీసుకున్నాడు.
సుబ్బారావుకి ఈ సంభాషణ అంతగా రుచించలేదు. ఇబ్బందిగా ముఖం పెట్టాడు.
అంతలో దూరంగా ఓ పొలికేక వినిపించి ఉలిక్కిపడ్డారు నలుగురూ. అప్పటికే బయటకు దూకబోయిన క్రాంతిని చుటుక్కున్ భుజం పట్టుకొని ఆపాడు నాగ్.
