ఆమె డ్రెస్సులూ, అందచందాలే కాదు, మోడ్రన్ గా థింక్ చేసే ఆమె డేరింగ్ అండ్ డేషింగ్ లేడీ అనిపిస్తుంది శ్రీచరణ్ కు.-
ఎంతో చనువుగా వుంటుంది.
"బాసూ...ఈవెనింగ్ ఏదైనా రెస్టారెంట్ కు వెళ్దామా? క్యాండిల్ లైట్ డిన్నర్.... బావుంటుంది కదా..... ఓసారి తీసుకెళ్ళకూడదూ..." అడిగింది గారాలు పోతూ...
'బిల్లు నువ్వు పే చేస్తాన్నంటే నేనెందుకు తీసుకెళ్ళనూ..." అన్నాడు శ్రీచరణ్.
'ఆ మాత్రం దానికీ నువ్వెందుకు బాసూ....నేనే వెళ్ళనూ..." అంది దీర్ఘం తీస్తూ. ఎంత ఫ్రెండ్లీగా వున్నా ఇష్టం అయినా శశికోసం డబ్బు ఖర్చుపెట్టాలంటే మాత్రం ప్రాణం ఒప్పదు చరణ్ కు, అది తెలిసీ, అందుకు అతన్ని తరచూ సినిమాకని, హోటల్ కని అడిగి విసిగించి కాదనిపించుకుంటుంది శశి.
ఫైవ్ స్టార్ హోటల్స్ లో పార్టీలు, క్యాండిల్ లైట్ డిన్నర్లు, డిస్కోథెక్ లు ఆమెకు ఇష్టమైన విషయాలు. అయితే అంత ఆర్ధిక స్థోమత లేని శశి, ఆడంబరాలకు నిచ్చెనలు వేస్తూంటుంది. కావాలని పట్టుబట్టి ఈ కంపెనీలో ఉద్యోగం చేయడానికి కారణం కూడా తన ఆడంబరాల కోరికలే కారణం. ఎవరో ఒకరు తమని స్టేట్స్ కు తీసుకెళ్తారని ఆశ...అందుకే స్టేట్స్ కు వెళ్ళడానికి ఎవరొచ్చినా, వాళ్ళతో పరిచయాలు పెంచుకునే ప్రయత్నం చేస్తుంది.
"ఏయ్ శశి యివ్వాళ నువ్వు అందంగా వున్నావు, జీన్స్ లో నీ అందం నాలుగు రెట్లు పెరిగింది" అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు శ్రీచరణ్.
"నిజమా..." వత్తిపలికి మరీ అడిగింది.
'నిజ్జం...'
"మరి చుడీదర్లో!
'ఎనిమిది రెట్లు అందంగా వుంటావు"
'వావ్ మరీ మిడ్డీస్ లో..."
'పదహారు రెట్లు..."
ఆమె బుగ్గలు గర్వంతో ఎరుపెక్కాయి.
"మరి అని యింకా ఏదో అడగబోయి ఆగిపోయింది శశి.
"అవేమీ లేకుండా..." అని అడిగితే 'లక్ష రెట్లు అందంగా వుంటావు.' అనాలనుకున్నాడు శ్రీచరణ్.
అప్పటికే శశి ఆ క్యాబిన్ లో ఉన్న న్యూయార్క్ పెయింటింగ్ ను చూస్తూ ఉండిపోయింది.
"ఏయ్...శశి ఏంటి చూస్తున్నావు?"
'న్యూయార్క్..."
'ఇండియాలో వుండి న్యూయార్క్ చూడ్డం ఏంటి?"
"ఆ పెయింటింగ్ ని చూస్తున్నా....నేను ఎప్పుడెళ్ళానో...?" అంది.
"వెళ్తావు.....వెళ్తావు.... ఆ కంపెనీ ఎం.డి.ని లైన్ లో పెట్టు...అదెంత పని..." అన్నాడు ఆటపట్టిస్తూ శ్రీచరణ్.
"మన యండి... అంత ఈజీగా లైన్లో పడతాడంటావా?" ఆసక్తిగా అడిగింది శశి.
శ్రీచరణ్ కు జుట్టు పీక్కోవాలనిపించినా, ఆ పని శశి ఎదురుగా చేస్తే బావోదనిపించి ఊర్కుండిపోయాడు.
ఒక్కోసారి తాను 'శశిలాంటి అమ్మాయిని పెళ్ళి చేసుకుని ఉన్నా బావుండేదనుకుంటాడు...కానీ యిలాంటప్పుడే" దెబ్బ తినేస్తాడు.
"ఏ ఒక్కరూ అన్ని విషయాల్లో నచ్చరేమో! కొందరు అందంలో అయితే కొందరు ఆస్తిలో అయితే, కొందరు అణుకువలో అయితే....మరి కొందరు మరో విషయంలో బావుంటారు. అన్ని విషయాల్లోనూ తనకి నచ్చేవిధంగా ఉండే అమ్మాయి ఎప్పుడు దొరుకుతుందో ఏమో! అనుకున్నాడు అసహనంగా.
శశి తనతోపాటు తన స్కూటర్ మీద వెనకాల కూచుంటుంది. టాంక్ బండ్ కు రమ్మన్నా వస్తుంది. అటో కాలు, ఇటో కాలు వేసి తన నడుం చుట్టి మరీ స్కూటర్ మీద కూచుంటుంది. ఇలాంటి ఆల్ట్రా మోడరన్ అమ్మాయే తనక్కావాలి. కానీ.... అప్పుడు గుర్తొచ్చింది తన జీవితమిలా మారడానికి కారణమైన బామ్మ!
"ఒసే ముసలి డొక్కు, సెంటిమెంటు బామ్మా..." మనస్సులో కసిగా బామ్మని గుర్తుచేసుకున్నాడు శ్రీచరణ్. బామ్మ ఎప్పుడైతే శ్రీచరణ్ కు గుర్తొచ్చిందో, అప్పుడే కోపమూ వచ్చింది. తన బ్రతుకిలా అయిపోవడానికి బామ్మే కారణం. సెంటిమెంట్ తో తన కోరికలను పాతేసిన బామ్మని తమిళ మిలిటెంట్లు కిడ్నాప్ చేసే బావుండునన్న ఆలోచన కూడా వచ్చింది.
అయినా ముసలి బామ్మ స్ట్రాంగ్ మిలిటెంట్స్ అయినా, కాశ్మీర్ ఉగ్రవాదులైనా, ఆమె నోటిముందు బలాదూరే. అరవయ్యేళ్ళొచ్చినా, చెక్కుచెదర కుండా, నిక్షేపంగా గుండ్రాయిలా వున్న బామ్మ కళ్ళముందు కనిపించింది. ఆవిడ తనకు ద్రోహం చేసిన సంఘటనలు బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో ఫ్లాష్ బాక్ లా గుండ్రాలు తిరిగి కనిపించాయి.
'ఒరే చరణుడూ....నా బంగారుకొండడూ...ఎక్కడున్నావు మురిపెంగా అడిగింది బామ్మ.
"యిక్కడే...చెట్టు చాటున వున్నాను" బాల శ్రీచరణ్ బదులిచ్చాడు.
"అక్కడేం చేస్తున్నావురా నా బంగారు కొండా..."
"నువ్వు పెరుగన్నం తినిపిస్తానంటే చచ్చినా బయటకు రాను. నాకు వాంతి వచ్చేలా వుంది"
"గడ్డ పెరుగు, పూర్తిగా మీగడ వేసి నీ కోసం తోడుపెట్టానురా కన్నారా నాయనా...!" 'నాకు పెరుగన్నం అంటే అసహ్యమే... వద్దే"
'నోర్మూసుకుని బయటకు వచ్చితిని చావు." అంటూ బలవంతంగా మీగడ పెరుగన్నం తినిపించేది. వాంతి వచ్చేలా వున్నా బలవంతాన మింగేవాడు. అలా తన చేత అయిష్టమైన పనులు ఎన్నో చేయించేది.
బామ్మకోసం మనసు చంపుకుని అన్నీ భరించేవాడు తను.
తల విదిల్చి ఆ చిన్నప్పటి ఫ్లాష్ బాక్ నుంచి కాస్త ముందుకొచ్చాడు.
అవి తను ఇంటర్మీడియట్ పూర్తిచేసి మెడిసిన్ చదవాలనుకున్న రోజులు.
"బామ్మా నేను మెడిసిన్ చదువుతానే..."
"ఏంటి డాక్టరీ చదువుతావా? కసాయివాడిలా కప్పలు కోస్తావా?" అంది బామ్మ. సైన్స్ గ్రూపు తీసుకుంటే కప్పలు కోయాలని ఎవరో చెప్పగా వుంది.
'అదికాదే బామ్మా..."
"ఏది కాదు శుభ్రంగా కలెక్టరీ చదువు....మీ తాత బతికుండగా కలెక్టర్ కావాలనుకున్నాడు. ప్చ్.....నా కొంగు పట్టుకుని తిరిగి తిరిగి చదివింది బుర్రకు ఎక్కడ గుమాస్తా అయ్యాడు. నువ్వలా కాకురా....కలెక్టరీ చదవరా...." బామ్మా కాసెట్ వేసింది.
'అదికాదే బామ్మా..." నాకు డాక్టర్ కావాలని కోరిక. అదీకాక, కలెక్టర్ అయ్యే తెలివితేటలు నాకు లేవు. ఎలాగైనా ఎంబిబిఎస్ చదవాలనే పట్టుదలతో అన్నాడు.
"నువ్వు కలెక్టర్ వి కాకపోయినా ఫర్వాలేదుగానీ, కసాయివాడివి కావద్దు. నువ్వు కప్పలు, గుండెలు కోస్తే చూడలేను..."
"అయ్యో..దాన్ని కసాయి పని అనకే..."
"అంటే నువ్వు డాక్టరీ చదువుతానంటావు."
"అవునే..."
"ఇదే నీ చివరాఖరి నిర్ణయమా."
"అవునే..." ఆ మాట నూనూగు మీసాల శ్రీచరణ్ అవడమే ఆలస్యం.
"అంతేనా....ఈ బామ్మా నీకిప్పుడు పనికి రానిది అయిందా? యింతప్పుడు.... నువ్వు వేలెడు వున్నప్పుడు నిన్ను నాకు వదిలి, నీ అయ్య, అమ్మ పైకెళ్ళిపోయారు. అప్పట్నుంచి.... నా గుండెల్లో పెట్టుకుని పెంచాను. యిప్పుడీ బామ్మ గుండెలమీద తన్ని డాక్టరీ చదువుతావా....ఈ బామ్మ శవం మీదినుంచి వెళ్ళి ఆ కప్పలు కొయ్యరా...." మళ్ళీ సెంటిమెంట్ తో కొట్టింది. అక్కడితో మెడిసిన్ చేయాలన్నతన కోరికను పాతిపెట్టి ఆర్ట్స్ లో చేరి బియ్యే చదివాడు.
మళ్ళీ చిన్న ఉలికిపాటు.
చిన్నప్పటినుంచీ అంతే....'సెంటిమెంట్ తో తనని చితకబాదుతుంది. తనకు కర్రా, బిళ్ళ ఆట ఆడాలని ఉంటే, ససేమిరా కుదర్దు, తొక్కుడు బిళ్ళాట ఆడమనేది. తనకి ఇంటర్ లో ఫ్యాంటు వేసుకోవాలనే కోరిక వుంటే, ఇంటరయ్యే వరకూ నిక్కర్లేవేసుకోమనేది. ఎప్పుడూ తన పంతమే నెరవేరాలనేది.
తనకు బామ్మతో వున్న ఎటాచ్ మెంట్ సెంటిమెంట్ కు సంబంధించింది కాబట్టి ఆ బాధ భరించలేక యిలా అయిపోయాడు.
