Previous Page Next Page 
మనసు పొరల్లో పేజి 12

 

    ఊ ........ఇప్పుడు చెప్పండి , ఇదేన్నో సారి మీరిలా కాలేజి ఎగ్గొట్టి మా ఇంటికి రావడం, ఇలా వండుకోవడం తినడం?" అడిగాడు జేబుల్లో నుంచి వక్కపొడి పాకెట్టు తీసి నోటినిండా పోసుకుని నములుతూ.
    రాధికకి , భార్గావికి వొళ్ళు మండిపోయింది.
    "దుర్భరం " అనుకున్నారు.
    ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు.
    "ఎన్నిసార్లు చెప్పాలి. ఇదే ఫస్ట్ టైం మీ ఇంటికి రావడం అని చెప్తుంటే నమ్మకం లేదా? మళ్ళీ మళ్ళీ అదే మాట అడుగుతున్నారు?" కోపంగా అంది రాధిక.
    "ప్రాబబ్ లీ ......ఇదే .......లాస్ట్ టైం కూడా కావచ్చు. ఏదో కౌసల్యని చూడాలని వోచ్చాం కానీ .......భార్గవి మాట పూర్తీ కాకముందే కోపం తారాస్థాయికి చేరుకున్న కౌసల్య, "నన్ను చూడ్డానికి ఇంటికొచ్చిన నా ఫ్రెండ్స్ ని అవమానించడానికి మీకు సిగ్గనిపించడం లేదా?" ఇంచుముంచు అరిచినట్టుగా అడిగింది. "భోరు" మని త్రేనుస్తూ పళ్ళికిలించి నవ్వుతూ "ఎందు కనిపిస్తుంది? ఇంట్లో కాలేజీ వెళుతున్నామని చెప్పి, కాలేజి ఎగ్గొట్టి ఇలా వాళ్ళింటికి వీళ్ళింటికివెళ్ళి పిండి వంటల్తో భోం చేస్తూ జల్సా చేసే వీళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది?" అన్నాడు పానకాలు, కమీజు జేబులో నుంచి మరో వక్కపొడి పొట్లం తీసి వక్కపొడి వేసుకుని , పటా పటా చప్పుడు చేసుకుంటూ నములుతూ.
    "మర్యాదగా మాట్లాడండి. కౌసల్య మొహం చూసీ మీకు మర్యాదిస్తూ వొచ్చాం! మేమేమీ కాలేజీ ఎగ్గొట్టి బలాదూర్ తిరిగేవాళ్ళం కాదు. మీ ఇంటి కొచ్చి పిండి వంటలు తినవలసిన అవసరం మాకేమీ లేదు. మా ఇంట్లో పనివాళ్ళకు కూడా రోజూ భోజనం పెడతాం మేము తినే పిండివంటలతో పాటే, తెలుసా? జాగ్రత్తగా మాట్లాడండి" అంటూ పుస్తకాలు చేతిలో పట్టుకుని చెప్పులేసుకుంది. ఇంక అక్కడ ఉండడం ఇష్టం లేదన్నట్టు భార్గవి. వెంటనే మిగిలిన వాళ్ళు కూడా గబాగబా పుస్తకాలు తీసుకుని బయలుదేరారు.
    "మీరలా వెళ్ళిపోకండి ప్లీజ్! నాకు చాలా బాధగా ఉంటుంది. ఇవాళ మీరంతా ఒస్తే మిమ్మల్నందరిని చూసి నా ప్రాణం లేచొచ్చింది. జీవచ్చవంలా పడున్న నాలో చైతన్యం కలిగింది. మీరిలా వెళ్ళిపోతే నా గుండె పగిలిపోతుంది. అతడి మాటలు పట్టించుకోకండి." బతిమాలింది కౌసల్య తలుపు కడ్డంగా నుంచుని వాళ్ళను వెళ్ళనీయకుండా.
    "సిగ్గులేదూ! వాళ్ళ కాళ్ళ మీద పడుతున్నావా? ఏమిటిదంతా? స్నేహమే! నాకు డౌట్ గా ఉంది- కొంపదీసి మీ స్నేహం హోమ్ సెక్స్..."
    అతని మాట పూర్తీ కాకుండానే "షటప్! యూ ఇడియట్" అంటూపుస్తకాన్ని అతని మీదకి విసిరేసింది కసిగా రాధిక. "దూ.....యూ బ్రూట్" అంది భార్గవి, అసహ్యన్నంతా మాటల్లో చూపి నొక్కి నొక్కి పలుకుతూ, స్తంభించిపోయింది.  నోట మాట రాక కౌసల్య. క్షణమాగి "నీకన్నా పశువు నయం. సంస్కార హీనుడా! నిన్ను బాగు చేద్దామని, నీ మీద జాలిపడి నీతో మాట కలిపినందుకు. ఈ ఊబిలో కూరుకుపోయిన జన్మంతా నీతో వుండేలా శిక్ష పొందెను. పన్నీరు బురద నీటిలో కలిస్తే బురదకు పన్నీరు వాసనంటు కుంటుందా? నెవర్! పన్నీరూ బురదై పోతుంది. అటువంటి బురద బతుకు నీది! మంచి అ;ఆలోచనలు ఎలా వస్తాయి . చివరి మాటలు పూర్తీ చేసేలోగా, అతని అయిదు వేళ్ళూ ఆమె చెంపకతుక్కుపోయాయి. కళ్ళు చీకట్లు కమ్మి పడిపోబోయింది. అందరూ కొయ్య బారిపోయి చూస్తూ నుంచున్నారు. స్థాణువుల్లా. "నామీద ఏకవచనం ప్రయోగిస్తావా?" అతని కళ్ళు చింత నిప్పుల్లా వున్నాయి. కౌసల్యలో అహం పూర్తిగా దెబ్బ తింది. తిరిగి అతణ్ణి కొట్టాలన్నంత కోపంతో చేయ్యేత్తింది పళ్ళు పటపట కొరుకుతూ, చెంపల మీదుగా కారుతున్న కన్నీరు తుడుచుకుని "ఛీ! నిన్ను కొట్టాలన్నా నిన్ను తాకాలిగా అది న కసహ్యం. అంటూ చెయ్యి దింపేసింది. ఏమీ జరగనట్టుగానే చెప్పు లేసుకుని బయటి కెళ్ళిపోయాడు పానకాలు. అందరూ నిశ్చేష్టులై అతను వెళ్ళిన వైపు చూస్తూ నుంచున్నారు.
    స్నేహితులను పట్టుకుని పసిపిల్లలా భోరున ఏడ్చింది కౌసల్య. స్నేహితులందరి కళ్ళు నీటి కుండలయ్యాయి.
    "సారీ కౌసల్య! మేము రావడం వల్లే ఇదంతా జరిగింది. చాలా రోజులయింది కదా, ఒకసారి నిన్ను చూసిపోదాం అనుకుని వోచ్చాం. నిజానికి లాస్ట్ వీక్ నుంచి ప్లాన్ చేస్తున్నాం రావాలని, కానీ కుదరలేదు. ఇవాళ రెండు ఫ్రీ పీరేడ్స్ ఉండడం వల్ల, సరదాగా నీతో గడుపుదామని వచ్చాం. పానకాలుకు రూపమే లేదనుకున్నాం, కానీ గుణం కూడా లేదని ప్రత్యేక్షంగా తెలుసుకున్నాం. మై.....గాడ్....! హీ....ఈజ్....వాట్..ఏ హ్యూమన్ బీయింగ్!" అంది భార్గవి.
    "నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో చూడాలనీ, నీ కొత్త కాపురం చూసి మురిసిపోవాలని, ఈ రోజంతా నీతో సరదాగా గడపాలని అనుకుంటే ఇలా జరిగింది. అయినా అతడేమిటి అలా మాట్లాడతాడు? హీ.ఈజ్..వెరీ ...క్రూయాల్! ఎంత అసభ్యంగా మట్లాడాడు?"అంది రాధిక.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS