"అన్నయ్యా!' అంటూ ఆపింది చివరి మాటలు చెప్పనీయకుండా కౌసల్య.
"ఏమ్మా! తప్పేముంది? పట్టుకునేది బావగారి కాళ్ళేగా! పైగా నాకు బావగారే కాదు, కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన వాడిని కూడా" అన్నాడు నవ్వు తెచ్చి పెట్టు కుంటూ సుధాకర్. పానకాలు మాత్రం మాట్లాడకుండా కొండముచ్చులా చూస్తూ నుంచున్నాడు గోళ్ళు గిల్లుకుంటూ.
* * * *
కళ్ళు మూసుకుని కాపురం చేసినా, అయిష్టంగా కాపురం చేసినా పకృతి మాత్రం తన ధర్మాన్ని తను నెరవేర్చుకుంది. కౌసల్యకి నెల తప్పింది. ఏది తిన్నా వాంతులూ, నీరసం ఆమెని పిచ్చిదాన్ని చేస్తున్నాయి. అందులోనూ తను తల్లి కాబోతుందని తెలిసి మరి మధనపడిపోయింది. భగవాన్! ఈ దేశంలో ఎందరో, పిల్లలు కావాలని చేట్టుకీ, పుట్టకీ రాయికీ మొక్కుతున్నారు. ఆవేదనతో అలమటించిపోతున్నారు. వారిపైనా కనీసం దయ కూడా చూపించడం లేదు నువ్వు! కానీ ఎందరో అభాగినులు, దరిద్రులు మాకేందుకయ్యా బిడ్డలు, పోషించుకోగలమా పెట్టగలమా" అని ఏడ్చేవాళ్ళకి , వాళ్ళ గోడు వినిపించు'కోకుండా బిడ్డల్ని ఇస్తూనే పోతావ్! ఏమిటయ్యా నీ విచిత్ర లీలలూ? అడిగిన వాళ్ళకి అడిగినది ఇయ్యక అడగని వాళ్ళకి అన్నీ ఇస్తావ్! మనిషిని పుట్టించి వాళ్ళని ఏడిపించడమేనా నీకు అట! ఎందుకలా చేస్తున్నావ్?" అంటూ పసిపాపలా దేవుడి విగ్రహాల ముందు పూజ గదిలో కూర్చుని గుండె తేలిక పడేవరకూ , ఏడ్చింది. కళ్ళ ముందు కాలేజీ తన స్నేహితులు కదలాడేరు. ఎంత స్వేచ్చా జీవితం అది! ఏ రకమైన బరువులూ, బాధ్యతలూ , బాధలూ ఉండేవి కావు . చదువుకున్నప్పుడు చదువు'కోవటం , అల్లరి చేసేటప్పుడు అల్లరి చేయడం తలుచుకున్నప్పుడు అందరూ కాలేజీ ఎగ్గొట్టి సినిమాలకీ, హోటళ్ళకి వెళ్ళిపోవడం, ఎంత మధురమైన రోజులావి? కమ్మని కలలో తేలిపోతూ ఉండేవారు. కౌసల్య కళ్ళ వెంబడి నీళ్ళు జలజలా రాలాయి. కన్న కలలన్నీ పేకమేడల్లా కూలి పోయాయి. తనను ప్రేమించే అందమైన భర్తా వారి అనురాగానికి తీపి గుర్తులుగా చిన్నారులిద్దరూ, మమతల పొదరిల్లు గా ఊహించుకుంది జీవితాన్ని. కానీ విధి తనని శపించింది. చదువు ఆగిపోయింది. తనకే మాత్రమూ నచ్చని భర్త దొరికాడు. స్నేహితులందరూ దూరమయ్యారు. చివరికి తనకి కన్నీరే తోడుగా మిగిలింది.
ఒకసారి తన స్నేహ బృందమంతా వచ్చారు. రాధిక,భార్గవి మైధిలి అంతా "కాలేజీ ఎందుకు మానేశావ్?" అంటూ ఏవో కారణాలు కల్పించుకుని చెప్పి, కేవలం తనని చూడ్డానికని వచ్చిన వాళ్ళందరిని భోజనానికి ఉండమంది కౌసల్య. అందరూ కలిసి సంతోషంగా తలో చెయ్యి వేసి వంట చేశారు. అన్నం పప్పూ కూరా రాధికా భార్గవి చేస్తే , మైధిలి తనూ ఆలూ బాత్ , పాయసం చేశారు. అప్పడాలు వేయించుకున్నారు. అందరూ కలిసి భోజనానికి కూర్చునే సమయంలో పానకాలోచ్చాడు "మీరంతా ఇక్కడున్నారా? క్లాసులో మీరెవ్వరూ కనబడకపోయే సరికి ఇక్కడి కొచ్చారేమోననుకున్నా. నా ఊహ నిజమే అయింది" అన్నాడు. టేబుల్ మీద పెట్టిన ఆ వంటకాల వేపు పరికించి చూస్తూ.
"రండి! సమయానికి కొచ్చారు, అనుకోకుండా మేమంతా కలిసి కౌసల్యని చూడాలని అనుకున్నాం. కబుర్లు చెప్పుకుంటూ భోం చెయ్యాలనిపించింది. సరదాగా ఇవన్నీ చేసుకున్నాం. మీరు కూడా సరిగ్గా సమయాని కొచ్చారు" అంది రాధిక.
"ఊ.....హూ......! అన్నీ అనుకోకుండానే అయిపోయాయన్నమాట. మీరేనా ఇంకెవరైనా వస్తారా?" వ్యంగ్యంగా అన్నాడు.
"మేమే! ఇంకెవరోస్తారు?" అంది భార్గవి.
"మీ మీ .....హీరోలు!" వెకిలిగా నవ్వాడు.
"మాకెవరూ , హీరోలు లేరు" అంది రాధిక, కొంచెం సీరియస్ గా.
"అయితే ఇన్నెందుకు చేశారు?" అన్నాడు టేబిల్ మీదున్న పదార్ధాలని చూపిస్తూ.
అప్పటికీ ఎవ్వరూ సీరియస్ గా తీసుకోలేదు అతని మాటలని. కౌసల్య మాత్రం ఇంకా ఏం మాట్లాడతాడోనని భయంగా చూస్తోంది.
అది గమనించిన రాధిక "ఇంత మందిమున్నం కదా? ఆ మాత్రం లేకపోతే ఎలా? పైగా ఐటమ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయంతే కానీ ఏవీ ఎక్కువగా చెయ్యలేదు" అంది.
ప్లేట్లల్లో అందరికీ వడ్డిస్తూ ఎంతో సంతోషంగా ఉన్న కౌసల్య మూడంతా మారిపోయింది. ఈ పానకాలు ప్రత్యేకత ఏమిటో గానీ నలుగురూ కూర్చుని కాస్త సంతోషంగా ఉన్నారూ అన్న సమయం అతనికేలా తెలుస్తుందో ఏమో, టపీమని అక్కడ వాలిపోతాడు. ఆ వాతావరణాన్ని క్షణంలో సీరియస్ గా మార్చేసి పుణ్యం కట్టుకుంటాడు. ఒకసారి అన్నయ్యా వాళ్ళు వచ్చినప్పుడు కూడా అంతే! కౌసల్య గుండెలో రైళ్ళు పరుగెడుతున్నాయి. "ఏం వాగుతాడో ఏంటో? స్నేహితుల ముందున్న ఆ కాస్త పరువు కూడా పోతుంది. వాళ్ళు తన మొహం చూసి అతనికి మర్యాదిస్తున్నారు కానీ లేకపోతే అతనికేసి కూడా చూసేవారు కాదు. భగవంతుడా! ఈ కాస్త సేపూ ఈయన నోరు తెరవకుండా, ఏ అవాక్కులూ చవాక్కులూ పెల్చకుండా చూడు" అంటూ అందరి దేవుళ్ళకీ దండం పెట్టుకుంది. రాధిక వడ్డించి అందరినీ కుర్చోమనే లోపలే, అందరూ చేతులు కడుక్కుని వచ్చే లోపలే, పానకాలు గబగబా తినెయ్యడం అందరికీ అదోలా వెగటుగా అనిపించింది. అందులోనూ ఆబగా అతను తినే తీరు చూస్తే అందరికీ అసలు అతని సమక్షంలో కూర్చుని భోం చెయ్య బుద్ది పుట్టలేదు. కానీ కౌసల్య బాధ పడుతుందని ఎవ్వరూ నోరెత్తలేదు.
"నా మట్టుకు నేను తినేస్తున్నాను. మీరేమైనా చేసుకోండి. ఇంకా ఎవరైనా మీ బాయ్ ఫ్రెండ్స్ వొచ్చేదుంటే ఆగండి" అంటూ నోటి నిండా అన్నం కుక్కుకుని మాట్లాడుతూ వుంటే పోరమారి నోట్లో నుంచి మెతుకులు టేబుల్ మీద పడ్డాయి. ముక్కు లోకి అన్నం పోయిందేమో 'సర్రున' ముక్కు చీదేడు పానకాలు. అది చూశాక అందరికీ కడుపులో దేవినట్టయింది. ముద్ద నోట్లో పెట్టుకోకుండా అలాగే కూర్చున్నారు అంతా. కౌసల్యకి తల తీసేసినట్టయింది. కళ్ళలో నీళ్ళు నిండాయి. అది చూసి అతి బలవంతం మీద ఎలాగో తిన్నట్టు చేసి, చేతులు కడుక్కున్నారు అందరూ .....కౌసల్య మనసు నొప్పించకుండా వుండడానికి.
