Previous Page Next Page 
మనసు పొరల్లో పేజి 13

 

    "నీ కేం తక్కువుందని ఇతన్ని పెళ్ళి చేసుకున్నావే?కాలేజీలో అందరూ నవ్వడమే. "కాకి ముక్కుకి దొండపండు' అని ఒకరూ, కోతికి కొబ్బరికాయలా' అనివొకరూ , తలోకరూ తలోకరకంగా వ్యాఖ్యానిస్తున్నారు. రూపమా? గుణమా? ధనమా? ఏముందని తొందరపడ్డావే?' అడిగింది మైధిలి.
    "నిన్ను చూస్తూ వుంటే రాక్షసుడి చేతికి చిక్కిన రాజకుమారిలా ఉన్నావ్! కోరి నీ జీవితాన్ని రొంపిలోకి దించుకున్నావ్! మేమందరం ఉన్నామనే జ్ఞానమయినా లేకుండా నీ మీద చెయ్యి చేసుకున్న అతడు మనిషేనా? సారీ కౌసల్య ఇలా మాట్లాడుతున్నందుకు ఏమి అనుకోకు. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో? అసలు కలుస్తామో లేదో కూడా ఈ పరిస్థితుల్లో నీ ముందు అతణ్ణి దోషించే హక్కు మాకు లేదు కానీ నిన్ను చూస్తుంటే జాలేస్తుంది" అంది రాధిక బాధగా.
    "విడాకులు పుచ్చుకో! జీవితాన్ని కొత్తగా ప్రారంభించు" సలహా ఇచ్చింది భార్గవి.
    కౌసల్యకి ఏం మాట్లాడాలో, వాళ్ళకి ఎలా క్షమాపణ చెప్పుకోవాలో తెలీని బాధ ఒక పక్కా, ఇంకెప్పుడూ వీళ్ళింక తనని చూడడానికి రారేమో ఇవే ఆఖరి చుపులేమిననే బాధ మరోపక్కా , వీళ్ళంతా వెళ్ళిపోయాక మళ్ళీ అతడితో తను ఒక్కర్తి ఉండాలనే భయం ఇంకోపక్కా- కౌసల్య పిచ్చిదైపోతోంది. భయంకరమైన ఊహలతో మాటరాక!
    "రాదీ! ఐ ........యామ్ ....సారీ మైధిలి, భార్గవి!..." అంది దోసెట్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ , స్నేహితులందరి కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి.
    "నువ్వేం చేస్తావే? ఇంతకీ ఇప్పుడు మేము బాధపడుతున్నది మాకు జరిగిన అవమానాన్ని గురించి కాదు, నీ భవిష్యత్తు గురించి, ఇటువంటి వ్యక్తితో నువ్వెలా సంసారం చేస్తావో ఏమో?" ఓదార్పుగా తల నిమురుతూ భయంగా చూస్తూ అంది రాధిక.
    "పోనీ , నువ్వు మీ అన్నయ్య వాళ్ళింటి కెళ్ళిపో. జరిగినదంతా అన్నయ్యతో చెప్పు. అతను కాస్త నచ్చచెబితే ప్రవర్తన మారొచ్చు" అంది భార్గవి.
    "కౌసల్యా! ఈ పరిస్థితుల్లో నువ్వు ఒంటరిగా ఇంట్లో కూర్చుంటే మతి పోతుంది. మాములుగా కాలేజీ కొచ్చేయ్య కూడదూ?" అంది మైధిలి.
    "నన్ను కాలేజీ మానేయ్యమన్నాడు" అంది వెక్కి వెక్కి ఏడుస్తూ కౌసల్య.
    'అలాగా? కాలేజిలో అందరితోటీ ఏం చెప్పాడో తెలుసా ? పెళ్ళయ్యాక చదువుకోనంటోందని, నేనెంత బతిమిలాడిన కాలేజికి రమ్మని, రానంటే రానందనీ , "ఎంత చదువుకున్నా భార్య స్థానం భర్తా పిల్లల మధ్యే కదా! హాయిగా ఇల్లు చూసుకోవడంలోనే నాకు తృప్తి ఉంటుంది' అన్నావని చెప్పాడు. మేము మొదట నమ్మలేదు , కానీ తరువాత కాబోలుననుకున్నాం."
    "అలా చెప్పాడా? ....లయ్యర్....." అంది పళ్ళు కొరుకుతూ కౌసల్య.
    "ఆశ్చర్యంగా ఉంది. అబద్దాలు కూడా ఇంత బాగా చెబుతాడా? హు! ఎటువంటి వ్యక్తీ చేతిలో పడ్డావే. యూ....ఆర్ .......సో... ఇంటిలిజెంట్ బ్యూటిఫుల్! ఇదేం ఖర్మే> అన్నీ ఉండీ, డబ్బుండీ, అమ్మా నాన్నా లేకపోయినా, ప్రేమించే అన్నయ్య ఒదినలు ఉండీ ఇలా బోల్తా పడ్డావ్! ఇది కేవలం నీ తెలివితక్కువతనమేననిపిస్తోంది. జాలీ దయాదాక్షిణ్యం అంటూ గోతిలో పడ్డావ్" అంది రాధిక.
    "రాదీ? అతడు చెప్పే ప్రతీ వాక్యంలో సగం వాక్యం అబద్దమే! అబద్దాల పుట్ట అతను. అన్నయ్యతో కూడా అలాగే చెప్పాడు. అయితే అన్నయ్యకి నా సంగతి తెలుసు గనుక నమ్మలేదు. కానీ ఎంతో బాధపడ్డాడు. నన్నొక ప్రొఫెసర్ గా చూడాలని కోరుకున్నాడు అన్నయ్య. నాకొక అందమైన భర్త దొరికి నేను ఆనందంగా ఉంటే చూడాలని ముచ్చట పడ్డాడు.
    కానీ నేనేం చేశాను? అతని ఆశలన్నీ అడియాశలు చేసి చదువుకు స్వస్తి చెప్పి, ఒక అనామకుడికి అనాకారికీ భార్య నయ్యాను. అంతేకాదు దుష్టుడికీ, సంస్కార హీనుడికి ఇల్లాలినయ్యాను." అంటూ తలబాదుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. రాధికా, భార్గవి, మైధిలి కూడా ఏడ్చేశారు. భాదని అణుచుకోలేక. "మీ అన్నయ్య మరీ అంత తొందరపడకుండా ఉండవలసింది. నువ్వు పొరపాటు పడ్డా అతను కరెక్ట్ చెయ్యవలసింది" అంది వీణ.
    నా ఖర్మలో ఇలా రాసుంటే ఎవరికీ ఏమీ తోచదు" అంది నిర్లిప్తంగా కౌసల్య. నిశ్శబ్దం ముగ్గురి మధ్యా భయంకరంగా నిలిచింది. అందరి మనసులూ బాధతో బరువెక్కాయి. కాస్సేపటికి తేరుకుని, "కౌసల్య! నిన్ను జాగ్రత్తగా ఉండమనీ, తెలివిగా మసులుకోమనీ చెప్పడం తప్ప  ఇంకేమీ చేయలేని నిస్సహాయులం. వెళ్ళొస్తామే!" అంది రాధిక దుఃఖాన్ని ఆపుకోవడానికి మునిపళ్ళతో కింద పెదవిని నొక్కి పడుతూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS