ఇన్ని తెలిసి కూడా విష్ణు దర్శనానికి ఆమె ఎందుకు వెళుతున్నదో అన్ని గంటలపాటు అయన సమక్షంలో అయన బోధనలు వింటూ అక్కడే ఎందుకు కూర్చుంటుందో మాత్రం అతనికి అంతుబట్టడము లేదు.
అయినా, ఆమె అంత నిక్కచ్చిగా చెబుతుంది కాబట్టి, తన కర్తవ్యాన్ని తను నిర్వహించాలనే పట్టుదలతో ఆమె వద్ద శెలవు తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్.
ధీరజ టేబుల్ సొరుగు లాగింది.
లోపల ఫైల్స్ మీద ఒక ఫోటో వున్నది.
ఆ ఫోటో మీదే కొన్ని క్షణాల పాటు ఆమె చూపులు నిలిచాయి.
అది విష్ణు ఫోటో!
* * * *
ఆ మందిరం ముందు అటో దిగింది భారతి.
ప్రశాంతమయిన వాతావరణంలో, చుట్టూ పచ్చని చెట్ల సముదాయం మధ్య అధునాతనంగా నిర్మించిన విష్ణు నిలయం చూస్తుంటే ఆమె కళ్ళకు పెద్ద దేవాలయం ఏదో అక్కడ వెలిసినట్టు అనుభూతి కలిగింది.
లోపల నుంచి వేద మంత్రోచ్చాటన మంద్ర స్వరంతో ఆమె చెవులను తాకడంతో అదొక విధమైన అనిర్వచనీయనందానికి లోనయింది ఆమె అంతరంగం.
ఎప్పుడూ ఎంతో సందడిగా కనిపించే విష్ణు మందిరంలో ఆ సమయంలో జనం పలుచగా వుండడం చూసిన భారతి భ్రుకుటి ముడిపడింది.
అనుమానాన్ని తీర్చుకోవడానికి ఒక భక్తురాలిని అడిగింది కూడా.
"ఈ ఊరికి కొత్త ముఖంలా వున్నావు. ఆ విషయం తెలియదా?"
తెలియదన్నట్టు తల వూపింది భారతి.
"ఇప్పుడు టైం ఎంతయింది?"
ఎందుకో అర్ధం కాకపోయినా వాచీ చూసి చెప్పింది.
"ప్రతి రోజూ మధ్యాహ్నం రెండు గంటల తరువాత స్వామీజీ ఎవరికీ దర్శనం ఇవ్వరు. ప్రత్యేక పూజలు నిర్వహించవలసినవి వుంటే మాత్రం ఆ కార్యక్రమములో మునిగి వుంటారు. లేదంటే విశ్రాంతి తీసుకుంటారు" అన్నదామె అన్నీ తనే చెప్పాలా అన్నట్టు.
అప్పటికి భారతికి విషయం బోధపడింది.
అటుగా వెళుతున్న శిష్యుడ్ని ఆపింది భారతి.
"విష్ణుగారిని పర్సనల్ గా కలవడానికి వచ్చాను.'
ఆమె వైపు ఒక వింత మృగాన్ని చూసినట్టు చూశాడు. ఆ శిష్యుడు.
"ఎస్......ఐ వాంట్ టు మీట్ విష్ణు.' అతనికి అర్ధమవలేదేమో అన్నట్టు మరల రెట్టించి ఇంగ్లీషు లో అంది.
"కుదరదు"
"ఆయనను గురించి అందరూ గొప్పగా చెప్పుకోవడం వినివచ్చాను. అయితే ఇక్కడ విదేశీ వనితలకు విష్ణు దర్శనం దొరకదన్నమాట. భారతీయ సంస్కృతీ పట్ల ఆకర్షితురాలైన నాలాంటి విదేశీ యువతులకు విష్ణు మందిరంలో ఇంత అవమానమా?"
"ఆగండి మేడమ్.......నేను మిమ్మల్ని ఇప్పుడ ఏమన్నానని విశ్రాంతి తీసుకునే సమయంలో అయన ఎవరినీ కలుసుకోరు. ఆ మాత్రం డానికి మీకు నా వాళ్ళ ఏదో ఘోర అపరాధం జరిగిపోయినట్టు అలా మాట్లాడతారెండుకు?" కంగారుగా అన్నాడతను.
"మిస్టర్.....నాకదంతా తెలియదు. నేను ఇప్పుడు విష్ణు గారిని చూడవలసిందే! నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇప్పటికిప్పుడు విష్ణుగారిని కలుసుకొనిదే, ఆయనతో స్వయంగా మాట్లాడనిదే నేను ఈ మందిరం నుంచి కదిలేది లేదు" మొండిగా అన్నదామె!
"ఇదెక్కడి గొడవరా బాబూ.....కుదరదంటే వినవె" అని తనలో తనే గొణుక్కున్నడతను. ఏం చేయడానికీ అతనికి పాలుపోవడం లేదు.
"ఏమిటి మాట్లాడవు?" భారతి రెట్టించింది.
"అసలు మీరు ఎందుకు విష్ణుగారిని కలుసుకోవాలనుకుంటున్నారు?"
"వారి వద్ద ఆద్యాత్మిక సందేహాలను తెలుసుకోవాలని వచ్చాను"\
"ఈరోజే తప్పనిసరిగా కలుసుకోవాలంటే మాత్రం కుదరదు. రేపు ఉదయాన్నే అయితే మీరు విష్ణుగారితో మాట్లాడవచ్చు" అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్నాడతను.
"మళ్ళీ అదేమాట చెబుతున్నావు మిస్టర్....నేను ఇవ్వాళే కలుసుకోవాలి, లేదంటే......"
"విష్ణు.........విష్ణు..........విష్ణు.........విష్ణు....."
భునభోంతరాళాలు దద్దరిల్లేటట్లు కేకలు పెట్టింది భారతి.
అతనే కాదు.......ఆ మందిరంలో విశ్రాంతి తీసుకుంటున్న శిష్యులంతా ఏదో ప్రళయం వచ్చిందా అన్నట్టు పరుగు పరుగున గదుల నుంచి బయటకు వచ్చారు.
వస్తూనే ఆ విదేశీ వనితను చూసి నిర్ఘాంతపోయారు.
ఆమె ఇంకా "విష్ణు....విష్ణు......విష్ణు.......విష్ణు..... అంటూ కేకలు పెడుతూనే వున్నది.
"మిస్ భారతి-----"
విష్ణు గంభీరమయిన కంఠం మేఘగర్జనలా ఆ ప్రదేశంలో ప్రతి ధ్వనించింది.
