వెళ్ళిపోతున్న వినయ్ వైపు అదే చిరునవ్వుతో చూశాడు విష్ణు.
తను నోరు విప్పకుండానే తను ఎందుకు వచ్చాడో ముందే చెప్పగలిగిన విష్ణు నిజంగానే మహిమగల వ్యక్తీ అయివుంటాడా? లేక తన వస్తువు ఏదో పోయిందనేది ఆయనకు తెలుసు కాబట్టి ఇన్ స్పెక్టర్ వచ్చాడూ అంటే ఆ విషయమే అయి వుంటుందని వూహించి అలా మాట్లాదినట్టా?
ఎటూ తెల్చుకోలేకపోతున్నాడు వినయ్ కుమార్.
విష్ణు మందిరం దాటి జీపును సమీపించాడు.
అప్పటికే తన మనసులో రూపుదిద్దిక్కున్న పధకాన్ని మరొకసారి మననం చేసుకుంటూ జీపును స్టార్టు చేశాడు ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్.
* * * *
కలెక్టరు క్యాంప్ ఆఫీసు......
"నమస్తే మేడమ్"
ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్ విష్ చేస్తూ కలెక్టర్ ఛాంబర్ లోకి అడుగు పెట్టాడు.
చిరునవ్వు నవ్వి అతనికి సీట్ ఆఫర్ చేసిందామె.
"మేడమ్ ....." అంటూ ఆగిపోయాడతను.
"నో ప్రాబ్లం ఇన్ స్పెక్టరు......మీరేదో చెప్పడానికి సంశయిస్తున్నట్టున్నారు......ఫరవాలేదు చెప్పండి" ధీరజ అతనివైపు పరిశీలనగా చూస్తూ అన్నది.
"మీరు విష్ణు మూవ్ మెంట్స్ వాచ్ చేయమని చెప్పారు. అతను దైవాంశ సంభూతుడు కాదన్నా అనుమానాన్ని వెలిబుచ్చింది మీరే! కాని మీరు తరచుగా ఆ ఆశ్రమానికి వెళుతున్న కారణం నాకు బోధపడడం లేదు....'
అతని మాటలు విన్న ధీరజ గతుక్కుమన్నది.
ఒకే ఒక్క నిమిషం.......
క్షణాల మీద తేరుకుని మోముపై చిరునగవులను చిందించింది.
'అదా.....పర్సనల్ ఇంటరెస్ట్.....అందరూ అతని బోధనలకు ఎందుకు ఆకర్షితులవుతున్నారో స్వయంగా తెలుసుకుందామని"
"వెల్ మేడమ్.........ఒక జిల్లా కలెక్టర్ గారే విష్ణు మహిమలను ఆకర్షితురాలై నిత్యమూ అతని మందిరానికి వెళుతూన్నారంటే ఇక సామాన్యుల సంగతి ఎలా వుంటుందో? ఈ పరిస్థితులలో నేను విష్ణు గురించి దర్యాప్తు చేసి మాత్రం ప్రయోజనం ఏం ఉంటుంది?" సూటిగా అడిగాడు ఇన్ స్పెక్టర్ వినయ్.
అంతే ఒకే ఒక్క క్షణం.......ఆమె కనులలో ఎర్ర జీర ఏర్పడింది.
"ఇన్ స్పెక్టర్ ......మీ డ్యూటీ మీరు చేయండి. నేను భక్తురాలిగా మారానో, లేదో నాకు తెలుసు. నా ఉద్యోగ ధర్మానికి నా పర్సనల్ లైఫ్ ఎప్పుడూ అడ్డు రాదు. ఒక కలెక్టర్ గా నా బాధ్యతను నేను విస్మరించను. చిత్తశుద్దితో మీ డ్యూటీ మీరు చేయండి.'
"ఎస్ మేడమ్ ....నేడు సమాజాన్ని పట్టి పీడిస్తున్న పెద్ద సమస్య మతం. ఇక్కడ మతం పేరుతొ అమాయకులను, వంచించడం జరుగుతుంది. మంత్రాలకు చింతకాయలు రాలతాయి అనే నమ్మకం వున్న జాతి పుట్టిన గడ్డ ఇది. దైవత్వం లేదని కాదు......వుంటే ఉండొచ్చు. అది సామాన్యులను సయితం కొన్ని సందర్భాల్లో మహిమాన్వితుడిగా చెయ్యొచ్చు. అలాంటి సంఘటన ఏదో విష్ణును గొప్ప వ్యక్తిగా చేస్తే చేసి వుండవచ్చు......"
"కానీ విష్ణును ద్వైవస్వరూపంగా భావించి లక్షల కొలదీ విరాళాలు కానుకలు గుప్పిస్తున్నారు. వాటిని తిరిగి ప్రజలకే ఖర్చు పెడుతున్నానంటున్నాడు విష్ణు. అక్కడే నా అనుమానాలన్నీ కేంద్రీకృతమవుతున్నాయి. దైవభక్తి తేరా వెనుక అక్రమాలు జరగడానికి అవకాశం లేకపోలేదు.'
ఒక క్షణం పాటు ఊపిరి పీల్చుకోవడానికన్నట్టు ఆగాడు ఇన్ స్పెక్టర్.
'అంటే విష్ణు అలాంటి అక్రమాలను ప్రోత్సహిస్తున్నాడని మీ అనుమానమా?" ధీరజ సూటిగా ప్రశ్నించింది.
"నో..నో.......నా ఉద్దేశ్యం అది కాదు. ఆయనకు తెలియకుండా అతని అనుచరులలో ఎవరయినా అలా ప్రవర్తించడానికి అవకాశం వున్నది. బంగారం, డబ్బు కుప్ప తెప్పలుగా వచ్చి పడుతుంటే ఎవరి మనసు అయినా చలించకమానదు. బుద్ది పెడమార్గం పట్టకా మానదు. విష్ణుకు ధనాపేక్ష లేదనుకోవడం మీకు వారిపై వున్న నమ్మకం, గౌరవం అయితే కావచ్చు కాని అతని చుట్టూ వున్న వాళ్ళలో స్వార్ధపరులు వుండి ఉంటారని నా అనుమానం......"
"మీ ఆలోచనలు, అనుమానాలు సహజమే ఇన్ స్పెక్టర్.....కానీ ఈ రోజు విష్ణు అంటే జనంలో భక్తీ ప్రవత్తులు పాతాళం వరకూ పాతుకుపోయాయి. ఒక విధంగా అతను చేపట్టిన కార్యక్రమాలే అతనికి అంత పేరును తెచ్చి పెట్టాయి. కానుకలన్నీ ప్రజల కోసం వాళ్ళ సౌకర్యర్ధమే వెచ్చిస్తున్నట్టు విష్ణు పేరిట ఈ నగరంలోనే కాదు, మన రాష్ట్రం నలుమూలల వున్న ఎన్నో సంస్థలు ఋజువు చేస్తున్నాయి.....
"విష్ణు బీద విద్యార్ధుల కోసం ఉచిత విద్య, ఉచిత భోజన శాలలు, ఆరోగ్యం అందరికీ అందించాలనే తపనతో ఉచిత వైద్యశాలలు ప్రతి జిల్లాలోనూ నెలకొల్పడం మానవత్వం వున్న ప్రతి ఒక్కరూ మెచ్చుకునే విషయాలే! అలాంటి వ్యక్తిని అందరిలా సామాన్య మానవుడే అని ప్రచారం చేస్తే వాళ్ళను ప్రజలు పిచ్చివాడిగా జమ కడతారే తప్ప వాస్తవాన్ని అంగీకరిచరు" సిన్సియర్ గా చెప్పింది కలెక్టర్ ధీరజ.
