Previous Page Next Page 
ప్రేమించండి ప్లీజ్ పేజి 11


    ఇలా ఆంజనేయులు తనలో తాను సూత్రీకరణలు, నిర్వచనాలు చెప్పుకుంటూ వుండగా ఓ చిన్నపిల్ల అక్కడకు వచ్చింది.
    ఆంజనేయులు కూడా ఆ పిల్లవైపు చూసాడు.
    ఆపాప నేరుగా జగదీష్ దగ్గరకు వెళ్ళి తన చేతిలోని ప్యాకెట్ ఇస్తూ "సీతక్క నీకిమ్మంది. లోపల లెటర్ కూడా వుందంట" అని అక్కడి నుంచి తుర్రుమంది.
    ఆప్యాకెట్ ఏమిటోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
    జగదీష్ దానిని విప్పి "స్వీట్స్ లా వున్నాయి. స్త్రీలు వంటింటి మహారాణులు కనుక పిండి వంటలు పంపడం ద్వారా తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. ఏ ఆడపిల్లయినా నీకు స్పెషల్ గా పిండివంటలు పంపిందంటే ఆ పిల్లకు నువ్వంటే చాలా ఇష్టమని గుడ్డిగా నమ్మచ్చు." అన్నాడు.
     మిగిలిన అబ్బాయిలంతా కరెక్టేనని తమను ఇష్టపడే అమ్మాయిలు ఎప్పుడెప్పుడు ఏం పంపారో ఏకరువు పెడుతున్నారు.
    తనకూ చెప్పుకోవడానికి ఏమైనా వుందా అని ఆలోచించాడు ఆంజనేయులు. వూహూఁ ఏదీ తగల్లేదు.
    ఏ ఆడపిల్లా తనకింతవరకు తినుబండారాలు పంపలేదు. ముఫ్ఫై ఏళ్ళు దాటిపోతున్నా ఇలాంటి అనుభవం లేకపోవడం బాధాకారం. ఈ బాధను పంచుకోవడానికి కూడా ఎవరూ లేరు. ఎంత దౌర్భాగ్యం!
    ఇక అక్కడ వుండలేకపోయాడు ఆంజనేయులు. లేచి వచ్చేశాడు.
    ఇంటికెళ్ళ బుద్దికాలేదు. నేరుగా నరసింహులు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ చాలా రష్ గా వుంది.
    ఓ మూల నిలబడ్డ ఇతన్ని చూస్తూనే నరసింహులు "ఏమయ్యా! ఆంజనేయులు! మొన్న దీపావళికి ఇచ్చిన కూర డబ్బులు ఇవ్వనేలేదు. ఇచ్చెయ్యకూడదూ" అని అడిగాడు.
    తప్పు చేసిన వాడిలా తల దించుకున్నాడు.
    "ఏంటి మూగెద్దులా నిలబడి పోయావు? నేనడిగింది డబ్బులు. ఇచ్చేదేమైనా వుందా? లేదా?"
    నరసింహులు మరోమారు రెట్టించి అడగటంతో జవాబు చెప్పక తప్పలేదు ఆంజనేయులకు.
    "ఇస్తాను నరసింహులూ ఈ నెల జీతం రాగానే ఇచ్చేస్తాను" అక్షరాలు కూలబలుక్కున్నట్టు చెప్పాడు.
    నరసింహులు ఓచూపు చూశాడు. ఆ చూపుల్లోని అసహ్యం మామూలే ఆ చూపుల అర్ధాన్ని మనసు భట్టీయం పెట్టేసింది.
    అక్కడినుంచి వచ్చేద్దామనుకుంటే తండ్రి దీనంగా మాంసం కూర అడగడం గుర్తుకొచ్చింది.
    జేబులన్నీ తడుముకున్నాడు. నాలుగు రూపాయి బిళ్ళలు తగిలాయి. వాటినితీసి నరసింహులు చేతికిచ్చాడు.
    "ఇదేమిటయ్యా, నాలుగు రూపాయలిచ్చావ్?" ఆయన అడిగాడు విసుగ్గా ముఖం పెట్టి.
    "పాత బాకీ కాదు. ఇప్పటికే"
    "చోద్యం గాకపోతే నాలుగు రూపాయలకు కూర వస్తుందయ్యా. ఏభై గ్రాములు కూడా రాదు." తేల్చి చెప్పాడు.
    "కూరగాదు.....ఎముకలు" ఆంజనేయులు మెల్లగా చెప్పాడు.
    "ఎముకలా!" నరసింహులు నోరు తెరిచాడు.
    "అవును మాకు గాదు. టౌన్ లో మా ఫ్రండ్ కుక్కకి -దానికి వేయడానికి .... ఎన్నొస్తే అన్ని ఎముకలు ఇవ్వు."
    "అలా చెప్పు, అదే గదా... ఉత్త ఎముకల్ని తీసుకెళ్ళి మనుషులేం తింటారు" అని పనికిరావని పక్కన పారేసిన పక్కటెముకలు ఏరాడు నరసింహులు దాదాపు పది ఎముకలను ఓ కాగితంలో వేసి పొట్లం కట్టిచ్చాడు.
    అవి వట్టి ఎముకలే అయినా, కుక్కకని అబద్దం చెప్పినా తండ్రి కోరికను తీరుస్తున్నందుకు పొంగిపోయాడు ఆంజనేయులు. ఆదివారం పూట తమ ఇంట్లోనూ మటన్ కూరని తమ చెల్లెల్లూ, తమ తమ్ముళ్ళూ ఫ్రండ్స్ కు చెప్పుకోవచ్చు కదా అని సంబరపడిపోయాడు.
    ఇంటికి వెళ్ళగానే శారదను పిలిచి పొట్లం అందించాడు చాలా గర్వంగా. ఆమె దాన్ని విప్పింది.
    "పొట్టేలు కూరా? తింటే తిన్నారుగానీ ఎముకల్ని దూరంగా పారేయండి. ఇక్కడెక్కడైనా వేస్తే అసహ్యంగా వుంటుంది" అది.
    ఆ మాటలకు ఆంజనేయులు భయపడ్డాడు. ఇంతగా శుభ్రత మీద పిచ్చి ఎందుకీ అమ్మాయికి? ఏమైంది ఈమెకు? ఈ సిగ్గు, ఈ శుభ్రత ఈమె తెచ్చిపెట్టుకున్న లక్షణాలే ఎందుకలా ప్రవర్తిస్తుంది? ఈ గుణాలను ఎగ్జిబిట్ చేయడంవల్ల ఈమె కోరుకునే ప్రయోజనం ఏమిటి? తనలో తనే ఈ ప్రశ్న వేసుకుంటూ వెళ్ళి మంచం మీద నడుంవాల్చాడు.
    కళ్ళు మూసుకున్నాడు- ఎదురుగా ఏవో గజిబిజి చిత్రాలు అలుముకున్నాయి.
    అంతవరకు దొడ్లో షేవింగ్ చేసుకుంటున్న రామ్మూర్తి ఆంజనేయులు దగ్గరకు వచ్చాడు.
    "అన్నయ్యా! తిరుపతికి వెళ్ళాలి. ఈరోజు మా పార్టీ! మీటింగ్ వుంది. నేను వెళ్లకుంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ బాధపడిపోతారు"
    ఈ మాటలకు కళ్ళు తెరిచాడు ఆంజనేయులు. రామ్మూర్తి అతని పెద్ద తమ్ముడు. ఇరవై ఆరేళ్ళుంటాయి. ఇంటర్మీడియట్ మధ్యలో ఆపేశాడు. అప్పటినుంచి వ్యవసాయం చూసుకుంటున్నాడు. రాజకీయాల పిచ్చి కొత్తగా పెట్టిన ప్రాంతీయ పార్టీ కార్యకర్త.
    "పెద్దవాళ్ళంటే" ఆంజనేయులు అడిగాడు.
    "మన ఎమ్మెల్యే, మండలాధ్యక్షుడు, మాజీ మంత్రి సుధాకర్ నాయుడు- వీళ్ళంతా"
    "నా దగ్గర డబ్బు లేదు నీకివ్వడానికి"
    "అలా అంటే ఎలా అన్నయ్యా? నిన్న సుధాకర్ నాయుడు ఫోన్ చేసి నువ్వు రాకుంటే మీటింగ్ నే నిలిపివేస్తానన్నాడు. ఇక నేను కనపడకపోతే మండలాధ్యక్షుడు భానుప్రకాష్ అయితే పిచ్చిపట్టినట్టయిపోతాడు. మన ఎమ్మెల్యే అయితే పదే పదే చెప్పాడు మీటింగ్ కు రమ్మని."
    "నిజమే...... కానీ...."
    "కానీ లేదు, అణా లేదు. పది రూపాయలు ఎలాగైనా ఇవ్వాలి. వెళ్ళకపోతే మన ప్రిస్టేజి అంతా మంటగలసిపోతుంది."
    "ఎవరి ప్రిస్టేజి?"
    "నాదే పార్టీలో నన్నందరూ అభిమానిస్తారు. ఎంతో గౌరవంతో చూస్తారు. అసలు పార్టీలో మనమంటే హడల్. పార్టీ, మండలాధ్యక్షుడుగా నన్నే వుండమన్నారు. కానీ నేనే ఒద్దన్నాను. మాపార్టీ అధ్యక్షుడు కూడా నన్ను అడుగుతూ వుంటాడు సుధాకర్ నాయుడు చెప్పాడు. ఈ రోజు మన పక్కింటి వెంకటసుబ్బయ్య పని ఒకటి చేసుకురావాలి."
    "ఏం పని?"
    "బస్టాండ్ దగ్గర కూడా వాళ్ళకు చెందిన అంగడి వుంది. దానిని వెంకటసుబ్బయ్యకు తీసివ్వాలి. అక్కడ ఆయన కూరగాయల అంగడి పెట్టుకుంటాడట. సరే తీసిస్తామని చెప్పాను. అది చాలా సింపుల్ పని. సుధాకర్ నాయుడుకు చెబితే అయిపోతుంది."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS