"నేనేం చేస్తున్నానో నాకే తెలీనంతగా నన్ను నేను మర్చిపోయానమ్మా! అందుకే అలా ప్రవర్తించాను. సారీ అమ్మా...... ఇప్పుడు విషయం అంతా నీ ముందు పెట్టాను. నువ్వేం చేయదల్చుకుంటే అదే చెయ్యి. నీ ఆజ్ఞకి కట్టుబడి ఉంటాను!" అంది.
విద్య నిట్టూర్చి "సాయంత్రం నువ్వు వెళ్ళాక తరళవచ్చి వెళ్ళింది. నీ కోసం గిఫ్ట్ తెచ్చింది. నీ రూంలో పెట్టాను!" అంది.
వర్షచర్నాకోలా దెబ్బతిన్నదాన్లా తల్లివైపు చూసింది. అంతా తెలిసి కూడా తల్లి ఎంత కూల్ గా..... దయగా వ్యవహరించిందీ! అదే తల్లి ఏదైనా అబద్దం చెప్పినట్లు తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతోంది?
"అమ్మా.......నామీద కోపం రాలేదా?" విస్మయంగా అడిగింది వర్ష.
"లేదు! వచ్చినా ఇప్పుడు నువ్వు ఇలా వచ్చి నిజం చెప్పడంవలన గర్వంగా ఉంది. లేకపోతే రాత్రంతా నా పెంపకం సరిగ్గా లేదేమోనని బాధపడుతూ గడిపేదాన్ని!" అంది.
"అమ్మా........ఇంకెప్పుడూ నీకు ఇంత బాధ కలగనీయనమ్మా!" వర్ష తల్లిని చుట్టుకుపోయి ఏడ్చింది.
"ఐనో......ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ బేబీ!" మృదువుగా కూతురివెన్ను నిమురుతూగర్వంగా అంది విద్య.
వర్షతల్లి గుండెల్లో పక్షి పిల్లలా ఒదిగిపోయి నిశ్చింతగా నిద్రపోయింది. నిద్రపోతున్న కూతురి మొహంచూస్తుంటే అప్పుడు రాలిపడ్డాయి విద్య కళ్ళనుండి రెండు కన్నీటి బొట్లు!
'ఈ చిన్నారివర్ష తనని విడిచిదూరంగా వెళ్ళిపోతుందా?' అన్న ఆలోచనతో అలా కూతురి మొహాన్నే కన్నార్పకుండా చూస్తూఉండిపోయింది!
ఉదయం విద్య పేపర్ చూస్తోంది. వర్ష తల్లి ఎదురుగా బుద్దిమంతురాల్లా చేతులు కట్టుకుని కూర్చుని ఉంది. వరమ్మ కాఫీ తెచ్చి టేబుల్ మీద పెట్టింది.
ఇంతలో ఫోన్ మోగింది. వర్ష తీస్తుందని విద్యా, విద్య తీస్తుందని వర్షా కాసేపు ఎదురుచూశాడు.
విద్య వర్షతో "ఆ అబ్బాయే అయితే వెంటనే మనింటికి రమ్మను" అంది.
వర్ష ఫోన్ తీసింది.
"హలో స్వీటీ!" అన్నాడు సంజయ్.
"సంజయ్......నువ్వు వెంటనే బయల్దేరి మాఇంటికి రా......తర్వాత మాట్లాడుకుందాం బై!" అని ఫోన్ పెట్టేసింది వర్ష.
విద్య తృప్తిగా చూసింది, వర్ష మాట్లాడకుండా అలాగే కూర్చుని టీ.వీ.లో బిబిసి ఛానల్ చూస్తోంది.
"వెళ్ళి డ్రస్ చేంజ్ చేసుకో!" అంది విద్య.
వర్ష అప్పుడే నిద్రలేచినట్లు తల రేగిపోయి నలిగిపోయి నైటీలో ఉంది.
"ఫర్వాలేదమ్మా!" అంది లేచే ప్రయత్నం చెయ్యకుండా.
"సరే......నేను స్నానం చేసి వస్తాను" అని విద్య లోపలికి వెళ్ళింది.
సంజయ్ మోటార్ సైకిల్ చప్పుడు వినిపించింది. వర్ష గుండెలు గుబగుబలాడాయి!
అమ్మ ఏం మాట్లాడ్తుందో ఆమెకి ఊహించడం కష్టంగా ఉంది. ఒకవేళ సంజయ్ తో 'నువ్వు జన్మలో మా అమ్మాయి వంక కన్నెత్తి చూడటానికీ, పన్నెత్తి పలకరించడానికి వీల్లేదు!' అన్నా తను ఏమీ చెయ్యలేదు. అన్ని పవర్స్ తల్లికి ఉన్నాయి. వాటికి తనుబద్దురాలై ఉండాలి!
సంజయ్ లోపలికి వచ్చాడు. వర్ష కూర్చున్న చోటునుండే "గుడ్ మార్నింగ్!" అంది.
అతను ఆనందంగా "ఏమిటో? దేవిగారికి ప్రొద్దుటే ఇంతదయా?" అంటూ వచ్చి సోఫాలో పక్కన కూర్చున్నాడు.
"అమ్మలోపల ఉంది!" హెచ్చరిస్తున్నట్లుగా చెప్పింది వర్ష.
ఆమె ఊహించనంతవేగంగా అతను ముందుకి ఒంగి ఆమె పెదవులమీద ముద్దు పెట్టాడు.
"సంజయ్!" అని వర్ష వారిస్తుండగానే విద్య అడుగుల చప్పుడు వినపడింది.
సంజయ్ సర్దుకుని దూరంగా జరిగి "హాయ్......గుడ్ మార్నింగ్......నమస్తే ఆంటీ! అక్క డ్రెస్ సెట్ అయిందోలేదో అడిగిరమ్మంది. వర్షగారేం చెప్పడంలేదు.....మీ అమ్మాయి చాలా తక్కువగా మాట్లాడ్తుందనకుంటా ఆంటీ!"అంటూ విద్యతో ఏదేదో మాట్లాడ్తూ, వర్షవైపు చూసి 'ఎలామేనేజ్ చేస్తున్నానో చూడు!' అన్నట్లు కన్ను గీటాడు.
వర్ష అతని వాగుడికి నుదురుకొట్టుకుంది. విద్యచేతులు కట్టుకుని అతన్ని పరీక్షగా చూస్తూ వింటూ నిలబడింది. సంజయ్ కుండీలోని క్రోటన్స్ ని చూసి, "మీ టేస్ట్ సింప్లీ సూపర్బ్ ఆంటీ! ఇంటిని చూసి ఆ ఇంట్లో ఉండేవాళ్ళమనస్తత్వాలు అంచనావేయచ్చు! తెల్లరోజెస్.....తెల్లపూలక్రీపర్స్......కిటకీలకీ, డోర్స్ కి తెల్ల కర్టెన్స్.......ఓహో! మీరు స్వచ్చతనీ ముక్కు సూటితనాన్ని ఇష్టపడ్తారు......ఏమ్ ఐ కరెక్ట్! ఆకుపచ్చ కార్పెట్.... ఇన్ డోర్ ప్లాంట్స్ మీకు ప్రకృతి పట్ల ఉన్న మక్కువని పట్టిస్తున్నాయి. సెన్సిటివ్ పీపుల్ మోసాన్నీ, అబద్దాలన్నీ భరించలేరు. ఇంక మీ ఇంటికి వేసిన పెయింట్స్ ని బట్టి చూస్తే.....మీరు పాలిటిక్స్ లోకి వెళ్తే ఒక నియంతలా వ్యవహరిస్తారని తెలుస్తోంది!!"
చివరిమాటకి వర్ష బెదురుగా తల్లివైపు చూసింది.
"ఎగ్జాట్లీ!" విద్య కూర్చుంటూ అంది.
"నేను ఎప్పుడూ కరెక్ట్ గానే చెప్తాను. సైకాలజీ నాకు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్!" గర్వంగా.
వర్ష కలగజేసుకుంటూ "సంజయ్....అమ్మకి అంతా....." అని చెప్పబోయి.
అతను నవ్వి ఆమెని చెప్పనీయకుండా "మీరు ఆ డ్రెస్ డిటైల్స్ చెప్తే అక్క మిగతా డ్రెసెస్ ప్లాన్ చేస్తుందిట. సో..... నా టైం వేస్ట్ చెయ్యకుండా మీరు ఆపని కానివ్వండి....." అన్నాడు.
"చూడండి సైకాలజీ ప్రొఫెసర్ గారు! మీకు తెలీని, మీరు ఊహించనీ విషయం ఒకటి ఉంది.... చెప్పమంటారా?" అడిగింది విద్య.
చెప్పండి అన్నట్లు స్టైలుగా చూశాడు సంజయ్.
"నా వెనకాల నిలబడ్డ అమ్మాయి నాకూతురు. నాకంటే ఈ ప్రపంచంలో దానికి ఎవరూ ఎక్కువ కాదు! రెండు రోజులు కబుర్లుచెప్పీ, ఒక రోజు ఐస్ క్రీమ్ కొనీ నన్ను మరిపించడం నీకే కాదు..... ఆ బ్రహ్మకి కూడా అసాధ్యం! ఇందాకటి నుండీ నువ్వేదో నన్ను మాయ చేసేస్తున్నానని ఫీల్ అయిపోతున్నట్లున్నావు.... ఇటు చూడు!" విద్య తన చెవి దగ్గర వేలుపెట్టి చూపిస్తూ "నువ్వు మా అమ్మాయికోసం తెచ్చినపూలు నా చెవిలో పెట్టాలని చూడకు!" అంది.
సంజయ్ తన చేతిలోని తెల్లగులాబీటక్కున టేబుల్ మీద పెట్టేశాడు. అతని కళ్ళలో ఇప్పుడు బెదురు కనిపించింది. హోం వర్కు చెయ్యనిపిల్లాడు టీచర్ తో 'కొట్టండి' అని సిద్దపడి నిలబడినట్లు నిలబడ్డాడు. వర్ష అతని వైపు 'మన్నించు' అన్నట్లు చూసింది.
సంజయ్ ఆమెకి కళ్ళతోనే 'ఐ కెన్ అండర్ స్టాండ్' అన్న మెసేజ్ అందించాడు.
"కూర్చో సంజయ్....." విద్య ఎదురు సోఫా చూపించింది.
