Previous Page Next Page 
శతదినోత్సవం పేజి 10

 

    రావుబహుద్దూర్ రామమోహనరావుగారి మనవరాలయిన నేను ఈ మాత్రం దానికే పులకీంచడం ఎంత నీచమైన విషయం!


    ఇలాంటి ఆలోచనలు రావడం అసంబద్దంగా అనిపించి వెంటనే కాగితాన్ని చించేయాలనుకుంది కాని, చేతులు రాలేదు.


    రేపు ఆ వ్యక్తీ ఎవరో పట్టుబడితే సాక్ష్యంగా ఇది అవసరముండదు?

 

    చించకుండా ఉంచుకున్నది అందుకు కాకపోయినా, అలా అనుకోవడంతో ఆమె అహం కాస్త చల్లబడింది.


    అయినా అదృశ్యంగా ఉండి తననింత కలవరపరుస్తున్న ఆ వ్యక్తీ ఎవరు?


    
                                                            * *    * *    * *    * *


    "ఎందుకు అన్నది నీకు అనవసరం. ఈరోజు కూడా ఓ అదిరిపోయే కవిత రాయాలి. బస్......అంతే......"


    "హటాత్తుగా నీకి వ్యామోహం పట్టుకుందేమిట్రా? పైగా నువ్వు అడగ్గానే రాసిచ్చేయటానికి నేనేమన్నా మహాకవినా?" కుదరదన్నట్టు మొండిగా అన్నాడు రాఘవ. అసుర సంధ్యా సమయాన అరుణరాగ రంజితమైన మోముతో కదిలే అమ్మాయిలా ప్రవహిస్తున్న శారదా నదిని చూస్తూ "నా వల్ల కాదంతే" అంటూ ఖండితంగా తేల్చి చెప్పాడు.


    "అలా అంటే పళ్ళు రాలకోడతాను నేను అడిగినంత కాలం నువ్వు కవితలు రాస్తూనే ఉండాలి. అది సైకో-దేరఫీ లా ఆ అమ్మయి మీద పని చేస్తుండాలి , అంతే!"


    రాఘవకన్నా మొండిగా అన్నాడు. రాఘవకు స్నేహితుడైన ఉదయ్. కిన్నెర అన్న.


    "ఎవరా అమ్మాయి?" అడిగాడు రాఘవ.


    ఉదయ్ జవాబు చెప్పలేదు.


    "ఏదన్నా లవ్ అఫైరా?"


    "ఆఫ్ కోర్స్.....ఇట్స్ లవ్......" చెల్లి ఎవర్నయినా కట్టుకుని సుఖపడాలనిపించే 'లవ్' గురించి వివరంగా చెప్పలేదు ఉదయ.


    "అలాంటప్పుడు అందమైన ప్రేమలేఖ రాయమనాలి కాని, కవితలెందుకురా శఠగోపం?"


    యూనివర్శిటీలో యిద్దరూ పీ.జీ. చేసినప్పటి నుంచీ ప్రాణ స్నేహితులే, కాకపోతే, ఉదయ్ లెక్చరర్ అయితే, రాఘవ బ్యాంక్ ఆఫీసరయ్యాడు. ఒకే ఊరు వాళ్ళు కావడం మాత్రమే గాక, రాఘవ ఈ మధ్య అనకాపల్లికే బదిలీ అయి రావడంతో , పైగా రాఘవకు యూనివర్సిటీ రోజుల్నుంచి కవితలు రాసే అలవాటు ఉండటంతో ఉదయ్ ఈ ట్రిక్ ఉపయోగిస్తున్నాడు రహస్యంగా.


    "అది కాదు ఉదయ్! కవితల్లో నీ సోద ఏమర్ధమవుతుందని?"


    "అవతల వ్యక్తికీ కవితలంటే ప్రాణం"


    "అవును నువ్వు సమస్యల్లో చిక్కుకుంటావ్!"


    "సమస్యంటే?"


    ఉత్సాహంగా యూనివర్సిటీలో జరిగిన ఓ సంఘటన గుర్తుచేశాడు రాఘవ. "రాజారాం అని ఫిజిక్స్ పీ.జి. చేసేవాడు గుర్తుందా? వాడు వాడి క్లాస్ మేట్ రమణి మీద ఇలాగే మక్కువ పడి ఆ అమ్మాయికి దేవులపల్లిగారి కవితలంటే ప్రాణం కాబట్టి, ప్రేమలేఖల పరంపర ప్రారంభించాడు. వాడికి రాయటం ఇబ్బందైనా వెంట పడేవాడు. ముందు నేను ఒప్పుకోలేదు కాని, నాకు రోజుకు రెండు బీర్లు లంచంగా కొట్టించి ఇలాంటి పోయిట్రీ రాసి ప్రేమలేఖతో పాటు ఆ కవితల్ని పంపేవాడు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పరాకాష్టకు చేరుకుంటున్న సమయంలో రమణికి తెలిసిపోయింది, ఆ కవితలు రాస్తున్నది నేనని, అంతే! వాణ్ణి వదిలి నా వెంట పడింది. ఆ తర్వాత షాక్ లో వాడేక్కువ బీర్లు తాగుతూ 'నాకు అన్యాయం చేయకు రొరే మిత్ర ద్రోహి' అంటూ రోజు రూంకు వచ్చి బావురమనేవాడు. ఒకవేళ అలాంటి ప్రమదం నీకూ ముంచుకొచ్చి ఆ అమ్మాయి నా వెంట పడిందనుకో......"


    జోవియల్ గా నవ్వుతూ అంటున్న రాఘవ మాటలు వింటూ పగలబడి నవ్వలేదు ఉదయ్. రాఘవను తదేకంగా చూశాడు.


    నవలల్లో హీరో పాత్రలా ఆరడుగుల పొడవు, పొడవుతో పాటు స్పోర్ట్స్ మేన్ లా కండలు తిరిగిన శరీరం. అంతకు మించి సులభంగా ఆకట్టుకోగలిగే మాటకారితనం ఉన్న రాఘవను నిజంగా కిన్నెర యిష్టపడితే.....? ఆస్తి తప్ప తమ ఇంటి ఆల్లుడికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి రాఘవకు.


    "మాట్లాడరా ఉదయకుమారా! ఆ అమ్మాయికన్న ముందు నువ్వే నా వెంట పడుతున్నట్టు ఆ చూపులేమిటి? దెబ్బకు నీ మనసు మారిపోయింది కదూ! ఇక ఛస్తే నన్ను కవిత రాయమని అడగవు. అవునా?" ఉత్సాహంగా వికట్టాహాసం చేయబోయిన రాఘవ నోరు నొక్కాడు ఉదయ్"


    "రాయరా!"


    "అంటే.....?" కళ్ళు చిట్లించి చూశాడు రాఘవ. "అనక నేను మిత్ర ద్రోహినని తిట్టించుకునే అవకాశం తిసుకోమంటావ్! చూడు......నువ్వు చాలా నష్టపోతావ్. ఇప్పటికైనా నా మాట విను."


    "నువ్వనుకున్నదే జరిగితే అది నాకు లాభమే అవుతుందిరా. కావాలంటే డజను బీర్లు కొట్టిస్తాను. అడిగినప్పుడల్లా కవితలు రాస్తూ పో...."


    "మరీ డజను అంటే భజన పాటలు తప్ప కవితలు రావురా ఉదయ్! క్షణం ఆగి ఓరకంట ఉదయ్ ను చూస్తూ అడిగాడు --" చెప్పు ఎవరా అమ్మాయి?"


    "ఎవరైతే నీ కెందుకు?"


    "అలాంటప్పుడు ఏ చెత్త కవితనైనా నువ్వు రాసుకోవచ్చుగా?"


    "కుదరదు......కవిత అదిరిపోవాలి."


    రాఘవ ఉక్రోషాన్ని అభినయిస్తూ అన్నాడు- "ఓసారి మార్క్ యిన్ అనే రచయిత తన మిత్రుడి ఇంటికి వెళ్ళాడట. పిచ్చాపాటి మాట్లాడుకున్నాక, స్నేహితుడి లైబ్రరీలో ఉన్న ఓ మంచి పుస్తకమేదో చూసి 'ఇంటికి పట్టుకెళ్ళి చదివిచ్చెస్తాను' అంటే, వెంటనే ఆ స్నేహితుడు - 'ఇక్కడే కూర్చుని చదువుగాని, ఇంటికిచ్చె అలవాటు నాకు లేదు' అని తెగేసి చెప్పాడు. మార్క్ ట్వాయిన్ నిరాశగా ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత కొంతకాలానికి అదే స్నేహితుడు మార్క్ ట్వయిన్ ఇంటికి వచ్చి ' మా ఆవరణలో గడ్డి కత్తిరించే మిషిన్ పాడయింది ,  నీ దగ్గరున్న మిషిన్ ఓసారివ్వూ' అంటే, కావాలంటే ఇక్కడే కూర్చుని కత్తిరించు కాని, ఇంటికిచ్చె అలవాటు నాకూ లేదన్నాడట."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS