Previous Page Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 12

 

    జయంతి పెద్దగా నవ్వుకుంటూ తుర్రున బయటకు పరుగెత్తింది. అందరూ ఆ దృశ్యాన్ని చూసి హాయిగా నవ్వుకున్నారు.
                                            7
    కస్తూరి, గిరిజ, సురేంద్రల పెళ్ళి విషయంలో నీ ఉద్దేశం ఏంటి?" అడిగాడు సర్వోత్తమరావు.

    కస్తూరి అయన కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళు వత్తుతూ అంది.

    "నా ఉద్దేశమేముందండి.....చూడముచ్చటి జంట. ఈడు జోడు బాగుంటుంది" అంది ముక్తసరిగా. ఆమెకు తెలుసు అసలు విషయం భర్త అలా ఎందుకు అడిగాడని. కానీ పైకి మాత్రం తేలిగ్గా కొట్టిపారేస్తూ తన అభిప్రాయం చెప్పింది.

    "అది కాదే! మా అక్కకు మన జయంతిని చేసుకోవాలని వుంది. నువ్వు ఆ విషయం చెప్పకుండా గిరిజ ప్రస్తావన తెచ్చావు. అలా ఎందుకు అన్నావు?" అన్నాడు కొంచెం సీరియస్ గానే.

    "మన జయంతికి చదువులేని ఆ సురేంద్ర ఎందుకండి. అది చక్కగా చదువుకుంటుంది. పట్నం పోయి పై చదువులు కూడా చదువుతానంటుంది. దాని మనసు తెలుసుకునే ఈరోజు అలా తేల్చి చెప్పాను" అంది నెమ్మదిగా.

    "ఏమో కస్తూరి నువ్వు తొందరపడ్డావేమో అనిపిస్తుంది. అయిన సంబంధం. సురేంద్ర బుద్దిమంతుడు, పిల్లా, పిల్లాడు మన కళ్ళెదుటే వుండేవారు" అన్నాడు.

    "అది మన ఆలోచన, జయంతి అలా అనుకోవటం లేదుకదండి" అంది కస్తూరి అయన ముఖంలోకి చూస్తూ.

    "చిన్నపిల్ల! దేనికేం తెలుసు చెప్పు....మనం ఉందెందుకు? రేపు నా పరిస్థితి అటు ఇటూ అయితే....."! ఇంటికి పెద్దది. సురేంద్రలాంటి బుద్దిమంతుడికిచ్చి చేస్తే కుటుంబ భారమంతా ఇద్దరూ మోసేవారు కాదా.....పిల్లలింకా పసివాళ్ళు" అన్నాడు గంభీరంగా.

    "ఏంటిరోజు కొత్తగా మాట్లాడుతున్నారు? మీకేమవుతుందండి? మీరు మరి ఎక్కువ ఆలోచిస్తున్నారు." అంది కంగారుగా.

    "అలా అనుకోకు కస్తూరి. కీడెంచి మేలెంచమన్నారు. రేపు మన అమ్మాయికి అన్ని విధాల తగిన సంబంధం చూడాలంటే ఎంత కష్టం" అయినా.....ఎందుకులే అయిపోయినదానిగూర్చి ఇప్పుడు చర్చించు కోవటం" అన్నాడు.

    "అలా అన్నారు బావుంది. మీరేం కంగారుపడకండి, మన అమ్మాయి కుందనపు బొమ్మ. అందునా తెలివిగలది. ఎలాగైనా సరే అన్ని విధాల తగిన సంబంధమే చూద్దాం. ఇక మీరు ఈ విషయం గూర్చి ఆలోచించటం మానేసి పెళ్ళి పనులు చూడండి' అంది కస్తూరి నవ్వుతూ.

    "మా అక్క తర్వాత నీతో ఏమైనా మాట్లాడిందా?" అన్నాడు.

    "ఏం మాట్లాడలేదే! ఆమె చాలా సంతోషంగా వుంది. గిరిజను చేసుకోవటం ఆమెకు ఇష్టమే" అంది కస్తూరి.

    "సర్లే. రేపు పంతులుగారిని కనుక్కుంటాను, ముహూర్తాలు ఎప్పుడున్నాయో చూసి సాధ్యమైనంత త్వరగా కుదిరేటట్లు చూస్తాను" అన్నాడు సర్వోత్తమరావు కళ్ళుమూసుకుంటూ.

    "అలా చేయండి. రేపు మంచిరోజు, రేపే పంతులుగార్ని కలిసి మాట్లాడండి" అంది కస్తూరి తృప్తిగా.

                                         *    *    *    *

    ఏంటే జయంతి! మీ బావను నువ్వు చేసుకోవటంలేదా? గిరిజక్కకు ఇచ్చి చేస్తున్నారట" అడిగింది జయంతి స్నేహితురాలు సుమ చెరువుగట్టు మీద కూర్చుని మట్టితో బిందెను తోముతూ.

    "నేనెందుకు చేసుకుంటానె! అలా అని నికేప్పుడైనా చెప్పానా?" అంది జయంతి తన బిందెను చెరువులో ముంచుతూ.

    "అని నువ్వు చెప్పలేదనుకో! మేమే అలాని అనుకున్నాం" అంది కృష్ణవేణి.

    "అది మీ పొరపాటు" అంది జయంతి.

    "ఏది. గిరిజక్క నీళ్ళకు రాలేదే ఈరోజు?" అడిగింది సుమ.

    "ఈరోజే కాదు. ఇక పెళ్ళేయ్యేవరకు రాదు. పెళ్ళికూతురు కదా" అంది జయంతి నవ్వుతూ.

    "ఎంతైనా గిరిజక్క అదృష్టవంతురాలే ! మంచి అందంగా సురేంద్ర. లక్కి ఛాన్స్ కొట్టేసింది. నీకు ఛాన్స్ దొరికే అవకాశం వుండి కూడా నువ్వు దక్కించుకోలేదు....."అంది కృష్ణవేణి జయంతిని ఉడికిస్తూ.

    "గిరిజక్క అమాయకురాలు, సురేంద్ర బావని చేసుకుంటే అన్ని విధాలా సుఖపడుతుంది. నేను అలా కాదు, మొండిఘటాన్ని, నేను ఎవరినైనా వేగాగల్ను- అందుకే అమ్మకు అలా చెప్పాను. నేను ఇప్పుడే పెళ్ళి చేసుకోను. చదువుకోవాలని" అంది జయంతి.

    "అయ్యో....!అయితే అక్కకోసం త్యాగం చేశావన్నమాట" అంది సుమ.

    "నీ బొంద! త్యాగం లేదు పాడూ లేదు. సురేంద్రబావకి కూడా గిరిజక్క అంటేనే ఇష్టం. నేను ఆ విషయం కనిపెట్టి తప్పుకున్నాను. లేకపోతే పెద్దవాళ్ళు వాళ్ళ ఇష్టాఇష్టాలు కనుక్కోకుండా నిర్ణయాలు తీసుకునేవారు. సురేంద్ర బావాకూడా నోరు లేనివాడే. నన్ను చేసుకోమని మా నాన్న గారు అడిగితే, తన ఇష్టాన్ని పక్కనపెట్టి తలూపుతాడు" అంది జయంతి నవ్వుతూ.

    "ఇంతకీ నీకు సురేంద్ర అంటే ఇష్టమేనా?" అడిగింది కృష్ణవేణి.

    "చెప్పానుకదే! నేనిప్పుడే పెళ్ళి చేసుకోదలచుకోలేదు, చదువుకోవాలని" అంది జయంతి బిందెను నడుంమీద పెట్టుకుంటూ.

    "అమ్మో! నువ్వు అర్ధంకావు తల్లీ. కాలికేస్తే మెడకేస్తావు-మెడకేస్తే కాలికేస్తావు....." అంది సుమ నవ్వుతూ జయంతిని అనుకరిస్తూ.

    "మరి లగ్నం పెట్టుకున్నారా?" సుమ అంది ఉత్సాహంగా.

    "ఈరోజు నాన్నగారు వెళ్ళారుట- పంతులుగారి దగ్గరకి" చెప్పింది జయంతి.

    "ఈనెల్లో చేస్తారా!" మళ్ళి అడిగింది సుమ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS