Previous Page Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 11

 

    "అక్కా! ఇంతకంటే మంచిసమయం మరొకటి రాదు, నా మనసులో మాట అందరి ముందు చెపుతున్నాను, ఏదో ఆడపిల్ల తండ్రిని...." అన్నాడు ఉపోద్ఘాతంగా.

    "చెప్పరా తమ్ముడూ. నీకు నా దగ్గర మొగమాటమెందుకు...?అందరూ మనవాళ్ళేగా చెప్పు" అంది ఆనందంగా.

    "ఏంలేదే. గిరజను సురేంద్రకు ఇచ్చి చేయాలనేది నా ఉద్దేశం. నీ అభిప్రాయం ఏంటో చెపితే సంతోషిస్తాను. దీన్లో బలవంతం ఏంలేదు. పిల్లలు కూడా ఒకర్నొకరు యిష్టపడాలనుకో, ఆ తర్వాతే మన ముచ్చట" అన్నాడు.

    భ్రమరాంబ కాసేపు మౌనంగా వుండిపోయింది.

    వాతావరణం అంతా క్షణంలో గంభీరంగా మారిపోయింది. భ్రమరాంబ ఏం చెపుతోందోనని అందరూ ఉద్విగ్నతతో చూస్తున్నారు.

    భ్రమరాంబ మెల్లగా లేచి "అమ్మా గిరిజా ఇటురా తల్లీ..." అంటూ దగ్గరకు తీసుకుని ఆమె నుదిటిపై ముద్దు పెట్టుకుని, "నువ్వు అంతగా అడగాలట్రా తమ్ముడూ? గిరిజ నా కోడలు అంది.

    "చాలక్కా చాలు. ఇక నాకు ఏ దిగులు లేదు. అరేయ్ తమ్ముడూ! మిగిలిన ఏర్పాట్లన్నీ నువ్వే చూడాలి" అన్నాడు సర్వోత్తమరావుతో.

    "అలాగే అన్నయ్యా. నువ్వు నిశ్చింతగా వుండు. పెళ్ళి ఏర్పాట్లన్నీ మేము చూసుకుంటాముగా" అన్నాడు సర్వోత్తమరావు.

    "అసలు వ్యక్తుల్ని అడిగారా? వాళ్ళకిష్టమో లేదో....అది కనుక్కోకుండా గిరిజ నా కోడలు అని....తమ్ముడు పెళ్ళి ఏర్పాట్లు చూడరా అని పెదనాన్న అనటం ఇదేం బాలేదు నాన్నగారూ, నాకైతే ఇష్టంలేదనుకోండి ఇప్పుడే పెళ్ళి చేసుకోవటం" అని అప్పుడే అక్కడి కొచ్చిన జయంతి అన్న మాటలకు అందరూ ఉలిక్కిపడ్డారు.

    "నువ్వుంది అందుకేకదే....నీకున్న ధైర్యం ఈ యింట్లో ఎవరి కుంది? నువ్వే అడుగు వాళ్ళిద్దర్నీ" అంది కస్తూరి.

    "ఏంటే గిరిజ నీకు సురేంద్ర బావని చేసుకోవటం ఇష్టమేనా? మొహమాటం లేకుండా చెప్పు. తర్వాత బాధపడి ప్రయోజనం లేదు" అంది జయంతి.

    కూతురి మాటలకు సర్వోత్తమరావు, రామశేషులు ముసి ముసిగా నవ్వుకున్నారు.

    గిరిజ మాత్రం సిగ్గుతో తల భూమిలోకి దించుకుంది.

    "అలా తల దించుకుంటే కుదరదు అమ్మాయిగారూ, ఆ విషయం చెప్పాలి అన్నాడు వెంకటేశం.

    "ఏంటక్కా....! ఇష్టమా కాదా? చెప్పు త్వరగా" అని రెట్టించింది జయంతి.

    "దాని ముఖం చూస్తే తెలియటంలేదుటే, నీ మాటలకేం గానీ అబ్బాయిని చేసుకోవటం ఇష్టమే" అంది భ్రమరాంబ.

    "నిన్నెవరడిగారే ఆ మాట. గిరిజక్క చెప్పాలి. చెప్పేవరకూ వదలను, కనీసం అవునో కాదో తలూపి చెప్పు" అంది జయంతి గిరిజ గడ్డం పట్టుకుని పైకి లేపుతూ.

    గిరిజ నవ్వుతూ ఇష్టమే అన్నట్లు తలూపింది.

    "హయ్! గిరిజక్క పెళ్ళికూతురాయెనె......" అంటూ చప్పట్లు కొట్టింది జయంతి.

    "అన్నట్లు అసలు హీరో ఏడి? అయనకిష్టమో లేదో" అంది జయంతి.

    "నువ్వు నోర్ముయ్యవే, మా అబ్బాయిని చేసుకునే అదృష్టం నీకు ఎటు లేదు, సురేంద్రని ఇష్టపడని ఆడపిల్ల ఎవరు? అంది భ్రమరాంబ.

    "నేనే" అంది జయంతి సీరియస్ గా.

    జయంతి మాటలకు దాక్షాయణి, శివపార్వతి పెద్దగా నవ్వి వెంటనే సంభాళించుకున్నారు బావగార్లు ఉన్నారని.

    "వనజ నువ్వెళ్ళి సురేంద్ర బావని పిలుచుకురా" అంది జయంతి.

    అప్పటి వరకూ ఈ సంభాషణంతా వింటున్న సురేంద్ర ఉలిక్కిపడ్డాడు. ఈ రౌడి పిల్లా నన్ను కూడా ఇరకాటంలో పెట్టిందే. ఇప్పుడు అందరిముందు ఎలా చెప్పటము అని ఆలోచిస్తుండగానే వనజ వచ్చి "బావా బావా జయంతక్కా పిలుస్తోంది." అని చెప్పింది.

    "దాని మొహం గిరిజను చేసుకోవటం నాకిష్టమే. అని చెప్పు" అన్నాడు పెద్దగా అందరికి వినిపించేటట్లు.

    "నేను చెప్పలా , నా కొడుకు నా మాట కాదనడు: అంది భ్రమరాంబ
    "అదేం కుదరదు అబ్బాయిగారు....ఆ మాట అందరిముందు చెప్పాలి. రేపు మా అక్కను చేసుకోవటం ఇష్టం లేదంటే....అందుకే అందరిముందుకొచ్చి ఆ ముక్కే చెప్పు. ఇహ మేము పెద్దమనుషులం మీ పెళ్ళి పనుల్లో తలమునకలవుతాం" అంది జయంతి.

    "దాని మాటలకేం గానీ తమ్ముడు లగ్నం ఎప్పుడు పెట్టుకుందాం" అంది భ్రమరాంబ.

    "అదేం కుదరదే అత్త. బావా, రా బయటికి వచ్చి మా అందరి ముందు చెప్పు" అరిచింది జయంతి.

    కొన్ని క్షణాల అనంతరం సురేంద్ర గదిలోంచి బయటకొచ్చి చెవి పట్టుకుని చెప్పాడు.

    "నా కిష్టమే .....ఇష్టమే....ఇష్టమే...."అని.

    "ఎవరు నేనా?" అంది జయంతి నవ్వుతూ.

    "చీ....నిన్నెవరు చేసుకుంటారే చింపిరిజుత్తు.....గిరిజను చేసుకోవటం ఇష్టమే" అన్నాడు.

    "అలారా దారికి, నాన్నగారూ, ఇహ మీరు ముహూర్తాలు పెట్టుకోవచ్చు. అమ్మాయికి అబ్బాయికి నచ్చింది. అబ్బాయి అమ్మాయికి నచ్చాడు. ఇహపోతే కట్న కానుకుల విషయం తేల్చుకోండి" అంది జయంతి.

    "ఒసేయ్ నిన్నూ...." అంటూ భ్రమరాంబ జయంతి వెంట పరుగెత్తింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS