Previous Page Next Page 
నేస్తం నీ పేరే నిశ్శబ్దం పేజి 11

 

    ఇందాకా భర్తన్నది న్యాయంగా అనిపిస్తే యిప్పుడు ధన్వి చెప్పింది కరెక్టే అనిపిస్తుంది.

 

    తల్లి సందిగ్ధతని అర్ధం చేసుకున్నట్టుగా అన్నాడు ధన్వి. "మనసు పాడు చేసుకోకమ్మా. తాజ్ మహల్ కొందరికి సమాధైన ప్రేమకధని గుర్తుచేస్తే మరికొందరికి చాలా ఖర్చు చేసి కట్టించిన కళాఖండమనిపిస్తుంది......చూసే కళ్ళని బట్టికాక ఆలోచించే మనసుని బట్టి నిర్వచనాలు మారుతుంటాయి.

 


    ఇందాక ఎప్పుడో భర్త చెప్పింది ఎంత సమంజసం అనిపించిందో ఆమెకు గుర్తులేదు కానీ, ధన్వి ఆలోచనలే చాలావరకూ రైటనిపించాయి యిప్పుడు పూర్తిగా.

 

    ఒకరు యవ్వనం నుంచి చేయిపట్టుకుని నడిపిస్తూ 'ఇది జీవితం' అని హితబోధ చేసిన వ్యక్తీ.

 

    మరొకరు తన చేయి పట్టుకుని నడుస్తూ తన కళ్ళముందే ఎదిగి 'ఇదో జీవితమా?" అని ప్రశ్నించే బిడ్డ.

 

    మొదటి వ్యక్తీ ముందుగా జీవితంలో అడుగుపెట్టినవాడయితే రెండో ప్రాణి జీవితంగా మారినవాడు.

 

    ఎవర్నైనా ఎలా కాదనగలదని......

 


    కట్టుకున్న వాడికే కాక కన్నబిడ్డకి వుడిగం చేస్తూ అదో అర్హతగా ఆనందించే మధ్యతరగతి సగటు స్రీ  ఆమె.

 

 

                                                      *    *    *    *

 

    "నిన్న మొన్నటి బ్రతుకు సెలయేటి పరవళ్ళు మనో రోదసిలో పేరుకున్న ఇంద్రధనుర్వర్ణ వహినులై ఆమెను కదిలించి కలవరపెడుతుంటే కాంక్షల 'ఉలి' గాట్లలో ఉలికిపడేట్టు చేసే ఆషాడ మేఘ భాష్పంలా నన్నెందుకు కదిలిస్తావ్ ప్రియా! నీ వూపిరి వెచ్చదనంతో చలి కాగిన నీ చెలి చెలిమిని కోరి నీ చేతిని అందుకుని నరకానికైనా నడుస్తాను అన్నాక నువ్వు వచ్చింది నా గుండె గోడలపై వ్యధల కవితలు రాయటానికి మాత్రమే అని నువ్వు చెప్పడం నీకు న్యాయమేనా నేను నిన్ను బంధించిన ఉచ్చునికాదు. రగులుతూ కాల్చే చిచ్చునీ కాను నేస్తం" "అసలు నేను కోరింది మన అంగాంగ సంగమం కాదే. తోడు.....అవును ప్రభూ! పాలిచ్చే తల్లికి పసిబిడ్డ అందించేది తోడు....పూవుకి తానితోడు.....అనుభవానికి అనుభూతి తోడు....."

 

    చదువుకున్న సామ్రాజ్యం ఉద్విగ్నంగా తలపైకెత్తి చూసింది . ఆఫీసు నుంచి వచ్చి అరగంట కాలేదు. రిసేప్షనిస్ట్ గా రకరకాల వ్యక్తులతో అరిచి అరిచి అలసటతో యింటికి రాగానే వీక్లీ కనిపించడంతో వెంటనే "నీరవం' సీరియల్ చదవాలనుకుంది.

 

    సగమైనా పూర్తికాలేదు. కానీ, అదోలాంటి వివశత్వానికి గురయిపోయింది.

 

    మధూళీ....ఒకసారి ఎప్పుడో స్నేహితురాలిద్వారా తాను పనిచేసే హోటల్ రెస్టారెంట్ కి వచ్చినప్పుడు పరిచయమైంది. అసలామె వయసెంతని....రెండు పదులు దాటి రెండు మూడేళ్ళువుండవచ్చు. అయినా పదహారేళ్ళ అమ్మాయిలా అనిపించింది. ఎలా.....భావుకత్వంలో యింత లోతుకి ఎలా వెళ్ళగలుగుతుంది మధూళీ.....

 

    అప్పుడు గమనించింది సామ్రాజ్యం . ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి ఆప్రయత్నంగానే.

 

    ఎందుకిలా అవుతుంది......తను కోరుకున్న జీవితానికి దూరమై చాలా కాలమైందే, ఇప్పుడెందుకు గడ్డకట్టుకుపోయిన పరిమళాల మకరందాలు ద్రవిస్తూ కలవరపెడుతున్నాయి.

 

    మధూళీ రాస్తున్న "నీరవం' లో భావుకత్వమే తననింతగా అలజడి పెడుతోందా?

 

    తను అంత బలహినురాలు కాదే! అలనాటి అనుభూతులు గుండె పై కాలాల పై దూకే లేడిపిల్లలా రాపిడికి గురిచేస్తున్నా మనుసుని మందలించి మరో వ్యాపకంలో మునిగిపోయేదే.

 

    అదికాదు....ఈ రెండు రోజులనుంచీ ధన్వి మరీమరీ గుర్తుకొస్తున్నాడు. పందెం కాసినందుకో లేక ఆ పందెంలో ధన్వి గెలవకుడదని మనస్పూర్తిగా కోరుకుంటున్నందుకో ఆమెకి తెలీదు.

 

    ఎందుకు....భర్తని వదిలేసిన ఆడదాన్నే! జుగుప్సాకరమైన అప్పటి అనుభూతుల్ని జ్ఞాపకాల పొరల నుంచి చేరిపెసుకోవాలని తపిస్తున్న గాయపడ్డ దానినే.....వయసులో పెద్దదాన్ని అయ్యుండి ధన్వితో బంధం కోరుకుంటుందేం, గిల్టిగా ఆమె నేత్రాలు అరమోడ్పులయ్యాయి.

 

    "వద్దు ధన్వి! నా నిశ్శబ్ద ప్రపంచపు ధ్వనిగా మారకు.....రసదునిగా నిన్ను మైమరిపించే ప్రజ్ఞతో నన్నింకా గెలుచుకోకు.....సగం చెరిగిన బ్రతుకు చిత్రాన్నైనా నా కోసం వియోగ నయాగారా హోరులో వూపిరి అందక ఒంటరితనంలో నలిగే నన్ను ఉద్దరించడం కోసం నీ తొలకరి పలుకుల చైతన్యాన్ని పెట్టుబడిగా పెట్టకు. నేను మలినమైన అడదాన్నని తెలిసి కూడా నీ స్వచ్చమైన ఆలోచనల కవితల్ని నా ఎదలోయల్లోకి విసిరి ఆ ప్రతి ధ్వనుల స్వరలయాల్లో తరలిరాని హిమగిరుల తరంగాల అరనవ్వులకోసం ఆశపడకు."

 

    అలా ఎంతసేపు ఆమె ఆలోచనల్లో మునిగింది ఆమెకి గుర్తులేదు. తేరుకుని సజల నేత్రాలతో సాయం సమయపు నీ రెండని రెండు క్షణాల పాటు చూసింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS