రెండు రోజులు గడిచిపోయాయి.
సుజన తండ్రినీ, ఆమె ముగ్గురు అక్కయ్యలనూ బోల్తా కొట్టించి, తన ఫస్ట్ నైట్ ముచ్చట ఎలా తీర్చుకోవాలా అన్న విషయం తప్ప మరొకటి ఆలోచించలేకపోయాడు వంశీ.
చివరికి ఓ బ్రహ్మాండమైన ఐడియా తట్టిందతనికి. తన ఐడియా ఎక్కడయినా బెడిసికొడుతుందేమోనన్న అనుమానంతో దాన్ని అటూ ఇటూ తిప్పి ఆలోచించాడు. కానీ ఎక్కడా ఏ లొసుగులూ కనిపించలేదు. దాంతో ఇక ఆగలేకపోయాడు. ఆ రాత్రే తన పథకానని ఆచరణలో పెట్టాలనుకున్నాడు.
సైన్యం తను చేయబోయే అఫెన్స్ కు కోడ్ నేమ్ పెట్టుకున్నట్లు అతనూ తన పథకానికి 'పూలపల్లకి' అని నామకరణం చేశాడు.
ఆ ప్లాన్ ప్రకారం ఆరోజు రాత్రి తొమ్మిది గంటలకు తన తల్లి బర్త్ డే అని చెప్పి సత్యనారాయణరావు ఇంట్లో మత్తుమందు కలిపిన స్వీట్స్ ఇస్తాడు. అవి తినగానే అందరూ నిద్రలోకి జారుకుంటారు. నిద్రంటే అలాంటి యిలాంటి నిద్ర కాదు - కుంభకర్ణుడి నిద్ర.
అప్పుడు తన ఫస్ట్ నైట్ లాగించేయాలన్నది అతని ప్లాన్. ఈ ప్లాన్ కోసం అన్నీ ముందు జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆ యింట్లో ఎవరికయినా షుగర్ కంప్లయింట్ వుందో లేదో కూడా కనుక్కొన్నాడు. అదృష్టం కొద్దీ ఎవరికీ చక్కెర వ్యాధి లేదు.
రాత్రికే తమ ఫస్ట్ నైట్ అనీ, తను ఇచ్చిన స్వీట్ తినవద్దని, తను రావడానికి వీలుగా దొడ్డి తలుపులు తీసి వుంచమనీ సుజనకు చెప్పాల్సిందే మిగిలి వుంది. ఈ ఇన్ ఫర్మేషన్ సుజనకి ఎలా పాస్ ఆన్ చేయాలో తెలియక తలపట్టుకున్నాడు.
ఉత్తరం రాసి పోస్టు చేసే టైమ్ లేదు. ఎవరయినా నమ్మకస్థుల చేత పంపించాలని సుజనకు ఓ చిన్న ఉత్తరం రాశాడు.
దాన్ని జేబులో పెట్టుకుని యింట్లోంచి బయటపడ్డాడు. అప్పుడు ఉదయం పదిగంటలయింది. నీరెండ లోకానికి వెచ్చటి రగ్గు కప్పుతున్నట్లుంది.
జనం అటూ యిటూ తిరుగుతూ హడావుడి పడిపోతున్నారు.
వంశీ ఊరి మొదట్లో వున్న నాడార్ అంగడికి వచ్చాడు. అక్కడ ఓ సిగరెట్ కొనుక్కుని వెలిగించి, బయటికొచ్చి నిలబడ్డాడు.
ఉత్తరాన్ని ఎవరయినా పిల్లలచేత పంపించాలని అనుకున్నాడు. కానీ అదంతా శ్రేయస్కరంగా అనిపించలేదు. డాబా మీదున్న సుజనను కలుసుకుని ఉత్తరం అందివ్వడం పిల్లలకు సాధ్యం కాదు.
మరిక ఏం చేయాలో అని ఆలోచిస్తుంటే అంగడికి వస్తున్న సుబ్బులు కనిపించింది.
ఆమెకి పాతికేళ్ళుంటాయి. ప్యాకెట్ లోని హల్వాలా ఉంటుంది. పెళ్ళయింది గానీ భర్తను వదిలేసింది. పెళ్ళి అయిన మొదట్లో ఓరోజు సాయంకాలం మల్లెపూల దండను జడలో జారవిడుచుకున్నట్లు పెట్టుకుంది. దీన్ని చూసి మొగుడు ఉగ్రుడయిపోయాడు.
"ఏమిటా పూలు పెట్టుకోవడం? ఇలాంటి వెధవ్వేషాలు సంసార స్త్రీలు చేయరు" అని కేకలేశాడు.
దీంతో ఆమెకి చిర్రెత్తుకొచ్చింది. "ఏమిట్రా కూశావ్! నేను సంసార స్త్రీని కానా? పూలు జారవిడుచుకోవడం అంత చేయరాని తప్పా? నువ్వు మాత్రం చొక్కా పై బటన్ పెట్టుకోకుండా వుంటావే. అది తప్పు కాదా? అలా చొక్కా బటన్ పెట్టుకోకుండా తిరగొద్దని నేనెప్పుడైనా అన్నానా?
అయినా తెలియకడుగుతాను - మొగుడయినంత మాత్రాన పూలు ఎలా పెట్టుకోవాలో అన్నది కూడా నువ్వే నిర్ణయించాలా? ఇలాంటివి నా దగ్గర కుదరదు. పుట్టింట్లో అయినా, మెట్టినింటిలో అయినా నాకాయకష్టం మీదే నేను బతికేది. మరి అలాంటప్పుడు నీ దగ్గర మాటలు పడుతూ నేనెందుకు యిక్కడుండాలి? ఇదిగో ఇప్పుడే వెళ్ళిపోతున్నాను" అని వచ్చేసింది.
పెళ్ళికి ముందునించీ పనిచేస్తున్న సత్యనారాయణరావు ఇంట్లోనే తిరిగి పనికి కుదిరింది. భర్తను వదిలేసినందుకు యెప్పుడూ ఆమె పశ్చాత్తాపం చెందలేదు. ఇలా మొగుడ్ని వదిలెయ్యడం ఎవరయినా ఏమైనా అన్నా సహించేది కాదు.
"మీవాళ్ళల్లో భర్తను వదిలేసినవాళ్ళు చాలా ఎక్కువే. అదే మా యిళ్ళలో అయితే ఆడవాళ్ళు యిలా చేయరు" అని రైతులు తమ స్త్రీలంతా పతివ్రతలన్న అర్ధం స్పురించేటట్లు మాట్లాడితే బెదిరిపోయేది కాదు.
"అవును - మీ స్త్రీలు మాలా మొగుడ్ని వదిలి వచ్చెయ్యరు. కారణం పతివ్రతలని కాదు - మరో దిక్కులేక. మాలా కాయకష్టం చేసి బతకలేరు గనుక. మొగుడు మనసు కష్టపడేటట్లు మాట్లాడినా నోరు విప్పరు. రోజూ తంతున్నా కాళ్ళు కదపరు" అని సూటిగా చెప్పేది.
ఆమె మాటల్లోని నిజం నషాళానికి అంటడం వల్ల పారబోయేదే తప్ప మాటలు వచ్చేవికావు రైతులకి.
అలాంటి సుబ్బులు చేత ఉత్తరం పంపడానికి ధైర్యం చాలక పోయింది వంశీకి. అందుకే అలా ఆమె వస్తున్నవేపు చూస్తూ నిలుచున్నాడు.
ఆమె అతని దగ్గరకొచ్చింది. "ఏమండీ పెళ్ళికొడుకుగారూ! ఇక్కడ నిలబడి మా సుజనమ్మ కోసం తపస్సు చేస్తున్నారా ఏమిటి" అని అడిగింది.
"తపస్సా అని చిన్నగా అడుగుతావేమిటి? దానికి రెండు మూడు విశేషణాలు కలిపితేగానీ నా అవస్థకి సరిపోదు" అన్నాడు వంశీ.
"మీకు చెడ్డ ఇబ్బందొచ్చి పడింది. పెళ్ళి జరిగీ ఆ ముచ్చట తీరలేదు పాపం. మా బాబుకి ఆ శాస్త్రాల జబ్బు ఎప్పుడు వదులుతుందో గానీ అందర్నీ ఇబ్బందుల్లో పెట్టేస్తున్నాడు. ఊరికి బయలుదేరాలన్నా పంచాంగాలన్నీ తిరగేస్తాడు. ఇంటికొచ్చిన చుట్టాల్ని కూడా వదలడు. వాళ్ళు బయలుదేరడం - టైమ్ బాగోలేదనో, పడమట చుక్క పొడిచిందనో - ఈయన నిలిపివేయడం జరుగుతూనే వుంటుంది.
ఇలా నాలుగయిదు రోజులు గడిస్తేగానీ ఆ చుట్టాలకు తిరిగి ఊరికెళ్ళే యోగం కుదరదు"
"ప్రయాణం అయితే వాయిదా వేసుకోవచ్చు. కానీ యిది ఫస్టునైటే"
"మా బాబుది మరీ చాదస్తంలెండి. భార్యా భర్తలు కలుసుకోవడానికి ముహూర్తాలూ, గర్భాదాన మంత్రాలూ ఎందుకు? ఇవన్నీ లేకుండా జంతువులు పిల్లల్ని కనడం లేదా ఏమిటి?"
"జంతువులకి యివన్నీ ఉండవు. ఈ కార్యక్రమమంతా వాటికి సీజనల్ బిజినెస్ కానీ మనుషులకు అలా కాదుగా అందుకే యివన్నీ పెట్టారని అంటుంటాడు మీ సత్యనారాయణబాబు"
"అంతేనంటారా? కానీ నాకు మాత్రం ఇవన్నీ శుద్ద దండుగనిపిస్తుంది. మా గంగాభవాని చెప్పినట్లు శోభనానికి ఇన్ని తంటాలు పడాలా!"
"గంగా భవానా! ఆమెవరు?" అతను ఎంతో ఆశ్చర్యపోతూ అడిగాడు.
"గంగా భవానీ!" అంటూ తెరలు తెరలుగా నవ్వి, కొంతసేపటికి తనను తాను కంట్రోల్ చేసుకుని "మా వాడపిల్లే - అదంతా ఓ తమాషా - చెబుతాను వినండి" అని ప్రారంభించింది.
"గంగా భవానీ అని మావాడలో ఓ పిల్ల వుండేది. గంధపు చెక్కలా మెరిసిపోయేది. ఎప్పుడూ పనీపాటా చేసుకునే వాళ్ళం గనుక మాకు ప్రపంచ జ్ఞానం ఎలా వుంటుంది? నిద్ర లేచింది మొదలు ఒకటే పని. పొద్దు గుంకేవరకు పనిచేసేవాళ్ళం గనుక రాత్రి కాగానే ముసుగు తన్ని పడుకుండిపోతాం.
