Previous Page Next Page 
రారామాఇంటిదాకా పేజి 11


    
    టిక్కెట్లు ఇవ్వడానికి ఇంకా టైమ్ వుండడంతో మేమిద్దరం బుకింగ్ దగ్గరగా నిలుచున్నాం.
    
    అంతలో ఓ జంట వచ్చి మా పక్కన నిలబడున్నారు.
    
    ఆమెకి ముఫ్ఫై ఏళ్ల పైమాటే. అతనికి ముఫ్ఫై ఏడేళ్ళుంటాయి రమారమిగా.
    
    వాళ్ళు మాట్లాడుకుంటూ వుండగానే అతనికి మూర్చరోగం వచ్చింది.
    
    చెట్టంత మనిషి మొదలు నరికిన చెట్టులా దభీమని కిందపడిపోయాడు. కాళ్ళూ చేతులూ కొట్టుకుంటున్నాడు.
    
    ఆమె బొడ్లోని తాళాల గుత్తి తీసి అతని చేతిలో పెట్టింది. ఇద్దరు ముగ్గురు చుట్టూ చెరి ఏవో ఉచిత సలహాలు ఇస్తున్నారు.
    
    అంతలో టిక్కెట్లు ఇస్తున్నట్లు బెల్ మోగింది. ఆమె హడావుడి పడిపోయి భర్తను అలానే వదిలి టిక్కెట్ల కోసం కౌంటర్ దగ్గరకు పరుగెత్తింది.
    
    స్త్రీలు కొద్దిమందే వుండడంతో ఆమెకు తొందరగానే టిక్కెట్లు దొరికాయి.
    
    తిరిగి భర్త దగ్గరికి వచ్చింది. అప్పటికి అతని జబ్బు తగ్గింది. లేచి కూర్చున్నాడు.
    
    ఇద్దరూ బాల్కనీకి నడుస్తూండగా ఆనంద్ ఆమె మీద విరుచుకుపడ్డాడు-
    
    "చూశావా! ఆ మహాతల్లి ఏం చేసిందో - మూర్చతో గిలగిల కొట్టుకుంటున్న భర్తని వదిలేసి టిక్కెట్ల కోసం పరిగెత్తింది. ఛీ..... ఛీ"
    
    ఎందుకనో నేను మాత్రం అసహ్యించుకోలేకపోయాను.
    
    సినిమా వదిలాక ఊరికి వచ్చాం.
    
    కాస్తంత రిలాక్సయి, స్నానం ముగించేటప్పటికి ఎనిమిదయింది. మా మేనత్త నా దగ్గరికి వచ్చింది.
    
    "ఇంకా ఏమిటలా కూర్చున్నావ్! లేచి తయారవ్వు. తెల్లచీర కట్టుకో రాత్రి ఆ వెధవ వడ్డాణం వల్ల ఏ ముచ్చటా తీరలేదు" అంటూ తొందర చేసింది.
    
    నేను చీర మార్చుకున్నాను.
    
    తొమ్మిది గంటల ప్రాంతాన గదిలోకి తోశారు ముత్తయిదువులు.
    
    "వెల్ కమ్" అన్నాడు ఆనంద్.
    
    నవ్వుతూ ఆయన దగ్గరికి అడుగులు వేశాను. నేను కూడా ఎప్పుడూ చూసుకోని నా నగ్నత్వాన్ని మరికొద్దిసేపట్లో అతను చూస్తాడని ఊహ రావడంతోనే నాకు తెలియకుండానే సిగ్గు మేఘంలా కమ్మేసింది. తల వంచుకున్నాను.
    
    నా ఎడమ చేయి పట్టుకొని మంచం మీదికి లాగాడు.    

    పక్కన కూర్చున్నాను. చలికాలం నిప్పుల కుంపటికి దగ్గరగా కూర్చున్నట్లుంది.
    
    "ఈరోజు తెల్లచీరే ఎందుకు కట్టుకోమంటారో తెల్సా?"
    
    తెలియదన్నట్లు తలూపాను.
    
    "రాత్రి గదిలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి రంగుల చీర అయితే ఏమాత్రం నలిగిందో తెలుసుకోవడం కష్టం కనుక. మరి పాలు ఎందుకిచ్చి పంపిస్తారో తెల్సా?"
    
    మళ్ళీ తల అడ్డంగా ఊపాను.
    
    "భార్యభర్తల లిద్దరంటే సగపాలు కాబట్టి" అని చమత్కారంగా నవ్వాడు. నాభుజంమీద చేయి వేసాడు.
    
    అప్పటికి సర్దుకున్నాను.
    
    నోటికి పాలు అందించాను. కొంత తాగి కొంత నాకు ఇచ్చాడు.
    
    "రాత్రి చేయి వేస్తేనే కంపరం అన్నావుగా - మరి తీసెయ్యనా?" అంటూ చేయి తీసెయ్యనా?" అంటూ చేయి తీసేయబోయాడు.
    
    మగవాళ్ళు అంతే. తమ భార్యో, ప్రేయసో ఏదయినా అంటే పూర్తిగా అప్ సెట్ అయిపోతారు. బహుశా మేల్ సుప్రమసీ వల్ల కావచ్చు.
    
    దాన్ని క్లియర్ చేసుకుని, తిరిగి పుంజుకునేంత వరకు గిలగిల్లాడిపోతారు.
    
    చేయి తీయకుండా నా చేతులతో అదిమి పట్టుకున్నాను.
    
    "మధ్యాహ్నం థియేటర్ దగ్గర ఒకామె మూర్చరోగం వచ్చిన భర్తను అలా వదిలేసి టిక్కెట్ల కోసం వెళ్ళిందని తిట్టారు కదా"
    
    "అవును"
    
    "కాని ఆమెను నేను అసహ్యించుకోలేకపోయాను"
    
    అతను అర్ధంకానట్లు నావేపు చూసాడు.
    
    "మీరు ఒక కోణంలోంచి చూసి ఆమె ఘోరమైన తప్పు చేసిందని అనుకుంటున్నారు. కానీ మరో కోణంలోంచి ఆలోచించండి. వయస్సు బట్టి చూస్తే వాళ్ళిద్దరికీ వివాహం అయి ఏడెనిమిది సంవత్సరాలయి వుంటుంది. పెళ్ళి అయిన మూన్నెల్లకో ఆర్నేలకో ఆయనకి మూర్చ వచ్చుంటుంది. మొదటిసారి గిలగిలా కొట్టుకుంటున్న భర్తను చూసి ఆమె పడిన ఆందోళన ఇంత అంత వుండదు.
    
    కన్నీళ్ళు కారిపోతూ వుంటే దగ్గరుండి సపర్యలు చేసుంటుంది. ఆయనకీ మూర్చరోగం వుందని, అయితే ప్రమాదం ఏమీ లేదని అత్తా మామలు అప్పుడు చెప్పుంటారు. ఆ నిజాన్ని జీర్ణించుకోవటానికే ఆమెకి చాలాకాలం పట్టుంటుంది.    

    తిరిగి రెండోసారి పడిపోయినప్పుడు మొదటిసారి పడినంత ఆందోళన పడి వుండదు. పది నిముషాలకి తిరిగి ఆయన లేచి కూర్చుంటాడని తెలియడం వల్ల సహజంగానే కంగారు తగ్గి వుంటుంది. ఇలా ఏడెనిమిది సంవత్సరాలు గడవడంతో అది ఆమెకి మామూలై పోయుంటుంది. అందుకే ఆయన్ని వదిలి టిక్కెట్ల కోసం వెళ్ళుంటుంది.
    
    మనం మొదటిసారి చూస్తున్నామని ఆమెనీ అంత ఆందోళన పడమని అనడం భావ్యమా చెప్పండి"
    
    ఆనంద్ నా వేపు కొత్తగా చూస్తున్నాడు.
    
    "అలానే ఇదీ ఆలోచించండి. పాతిక సవర్ల వడ్డాణం అంటే మాటలు కాదు. అది దొరక్క పోయుంటే కనీసం పది సంవత్సరాలపాటు మా పొలాల్లో పండినదంతా రాయుడికి ఇచ్చేయ్యాల్సి వచ్చేది. అదంతా మీవల్లే జరిగిందని అనిపించి కసురుకున్నాను. అంతే తప్ప మరేం కాదు."
    
    "నేనూ అర్ధం చేసుకున్నాననుకో"
    
    "మిమ్మల్ని కసురుకున్నాక ఎందుకలా చేసానా అని బాధపడ్డాను. మీవేలు తగిలితే పులకించిపోయిన నేను మిమ్మల్ని అలా కసురుకున్నానంటే అదంతా పరిస్థితుల్లో వచ్చిన మార్పేనన్న విషయం బోధపడింది. నైతిక విలువలుగానీ, సభ్యతా సంస్కారాలు గానీ - ఏవీ వాటికంతటవే ఎగ్జిస్ట్ కావు. అన్నీ ఒకదాని కొకటి ఇంటర్ లింక్డ్. కానీ చాలామంది వేటికి వాటినే విడదీసి చూసి ఎదుటి వ్యక్తుల మీద తీర్పులు చెప్పేస్తుంటారు. మనుషులందరూ మంచివాళ్ళే - పరిస్థితులు చెడ్డవి. ఈ జీవన సత్యం నాకెప్పుడు బోధపడిందో తెల్సా? మిమ్మల్ని తిట్టిన తర్వాత. ఈ సత్యం బోధ పడ్డాక మనుషుల్ని ద్వేషించలేం - ప్రేమిస్తాం"
    
    ఆనంద్ నన్ను విస్మయంతో రెప్పవేయకుండానే చూస్తుండిపోయాడు.
    
    "ఏమిటలా చూస్తారు? ఇది సెకండ్ నైట్ అయినా మనకు ఫస్టు నైట్ లైట్ ఆర్పేయండి" అన్నాను.
    
                                                                 *    *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS