Previous Page Next Page 
స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ పేజి 11

    "ఈ కుర్రాళ్ళని చేరదీస్తున్నది ఎవరో నాకు తెలుసు భరత్-"    
    "ఎవరు?"    
    "అరవింద్ చౌరసియా".    
    భరత్ చప్పున తలెత్తి చూశాడు.    
    "అవును భరత్. నువ్వు చేసినట్టే నేనూ ఎంక్వయిరీ చేశాను. కానీ మరో కోణం నుంచి ఇప్పుడు నాకు విషయం తేటతెల్లంగా అర్ధమైంది. గత కొన్ని సంవత్సరాలనుంచి చాపకింద నీరుల ప్రవహిస్తూన్న అండర్ వరల్డ్ రాకెట్ ఇది. నీ క్రింద వందమంది మనుష్యులున్నారనుకో. ఒక ఊరిని శాసించడానికి వాళ్ళు చాలు వాళ్ళ ప్రాణాలకి తెగించిన వాళ్ళు జైలుకి భయపడరు. వాళ్ళే నీ పెట్టుబడి. నీకోసం వాళ్ళు చందాలు వసూలు చేస్తారు. ఖాళీ స్థలాలు ఆక్రమిస్తారు. ఎవరైనా రాజకీయ నాయకుడు ఎలక్షన్స్ కోసం ఆశ్రయిస్తే, నీ తరపున ఈ మనుష్యులు రిగ్గింగ్ చేస్తారు. ఆ నాయకుడు పదవిలోకి వస్తాడు. నీకు కృతజ్ఞుడై వుంటాడు. ఆ తరువాత ఆటోమాటిక్ గా పోలీసులూ నీ కంట్రోల్ లోకి వస్తారు. నువ్వు క్రమంగా పక్క నగరాలకి విస్తరిస్తావ్. ఒక స్టేజిలో అసెంబ్లీ లో నీ మనుష్యులే వుంటారు. ముఖ్యమంత్రిని నువ్వు శాసించగలుగుతావు. రాష్ట్రం మొత్తం నీ చేతిలోకి వస్తుంది. మామూలు 'లేబర్'కి బయటకన్నా నీ క్రింద బ్రతకడమే సుఖమనిపిస్తుంది. ఒక్కో ఎలక్షన్ లో ఒక్కో ఎమ్మెల్యేని గెలిపించడంకోసం పాతిక లక్షలు వసూలు చేస్తావు. ఒక లైసెన్స్ కి పది లక్షలు అడుగుతావు. నీ సంవత్సరాదాయం చాలా సులభంగా సాలుకి ఐదారు కోట్లు వుంటుంది. నీ క్రింది మనుష్యులకి, విడిగా బయట దొరికేది కాక నీ నుంచి నెలకు అయిదారు వేలు లభిస్తుంది. నీ మనుష్యులకి దాదాలుగా పేరు, నీకు సంఘంలో పలుకుబడి, ఎక్కడికి వెళ్ళినా నిముషాల మీద పని జరగడం- ఇంతకన్నా కావల్సింది ఏముంది?"    
    భరత్ ఊపిరి పీల్చడం మర్చిపోయినట్టు రాణా వైపు చూస్తూ వుండిపోయాడు. చివరికెలాగో నోరు పెగల్చుకుని "నేను వ్రాస్తున్న ఫుట్ పాత్ బ్రతుకుల వ్యాసం వెనుక ఇంత కథ వుందా?" అన్నాడు.    
    "అరవింద్ చౌరసియా అనవసరంగా తన నీడని చూసి తనే భయపడ్డాడు. వీళ్ళు భయపడేది ప్రెస్ కే. ఇప్పుడు నేను చెప్పినదంతా మీరు ఇన్వెస్టిగేట్ చేసి వ్రాస్తున్నారేమో అని బహుశ తెర వెనుకనుంచి చిన్న వార్నింగ్ యిచ్చి వుంటాడు."    
    "ఇప్పుడు నిశ్చయంగా వ్రాస్తాను."    
    "అంతకన్నా ముందు మీరొక పని చెయ్యండి. ఉపాధ్యాయ కాలనీ వారిని కలుసుకోండి. వాళ్ళు ప్రెస్ కి చెప్పాల్సింది చాలా వుంది."    
    "తప్పకుండా."    
    ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు.    
    భరత్ ని చూడగానే ఇంట్లో కలకలం రేగింది. అభిషిక్త పరుగు పరుగున వచ్చి తండ్రి చేతుల్లో వాలిపోయింది. భరత్ భార్య ఆనందంతో కంట నీరు పెట్టుకుంది.    
    రాణాకి ఎందుకో బాధేసింది.    
    పోలీసులు ఎన్నోసార్లు ఎంతోమందిని కారణం చెప్పకుండా స్టేషన్ కి తీసుకెళ్ళడం తనకు తెలుసు. ఇంటిల్లిపాదీ ఎంత తల్లడిల్లిపోతారో ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాడు.    
    ఇక అక్కడ వుండకుండా పోలీస్ స్టేషన్ కి వచ్చేశాడు.    
                                            *    *    *    
    అతను స్టేషన్ కి వచ్చేసరికి అక్కడ కాలనీవాళ్ళు ఎదురు చూస్తున్నారు.    
    "ఏమిటి విషయం?" అని అడిగాడు.    
    "గంట క్రితం ఎమ్మెల్యే నాయుడుగారు వచ్చారు సార్. విషయమంతా తెలుసుకుని, మమ్మల్ని స్టేషన్ కెళ్ళి వుండమని ఆయన వెళ్ళారు."    
    "ఎక్కడికి?"    
    "తెలీదు."

    "ఏ విషయమంతా తెలుసుకుని?"    
    వాళ్ళేదో చెప్పబోతూంటే మెట్ల దగ్గర అలికిడి వినిపించింది. నాయుడు మస్తాన్ ని దాదాపు మెడపట్టుకుని లాక్కొస్తూ కనిపించాడు.    
    మస్తాన్ ని రాణా ముందుకు తోస్తూ "వీడేదో గొడవచేశాడట కదా, ఈ రౌడీ ముండాకొడుకుల్ని ఎందుకు వదిలిపెడ్తారు" అన్నాడు. రాణా ఏదో చెప్పబోతూ వుంటే, "ముందు ఈడిని బొక్కలో తొయ్యండి. తరువాత మాట్లాడుకుందాం" అంటూ తనే స్వయంగా మస్తాన్ ని సెల్ లో వేసి వచ్చి కూర్చున్నాడు.    
    "ఈ వెధవలు పొలిటికల్ ఇన్ ఫ్లుయెన్స్ ని బాగా వుపయోగించుకుంటారండీ. పెద్ద పెద్ద వాళ్ళపేరు చెప్పుకోవడం వీళ్ళకి బాగా అలవాటయిపోయింది. వీడిని వదలి పెట్టమని మీ డియస్పీగారికి నా పేరుమీద ఎవరు చెప్పారో తెలీదు. ఈ కాలనీ వాళ్ళొచ్చి వీడి గ్యాంగు చేసిన పనులన్నీ చెపుతూంటే ఆశ్చర్యపోయాను. నేను ప్రజల మనిషిని. నా పేరు ఇంకొకరు వాడుకోవడం సహించలేక వెంటనే వీడ్ని పట్టుకుని తీసుకొచ్చాను. ఎటువంటి పరిస్థితుల్లోనూ, ఎవరు పలుకుబడి ఉపయోగించినా, చివరికి ముఖ్యమంత్రి ఇన్ ఫ్లుయెన్స్ చేసినా వీడిని వదలకండి. మీ వెనుక నేనుంటాను."    
    రాణా ఇంకా విస్మయం నుంచి తేరుకోలేదు.    
    ఉపాధ్యాయ కాలనీ వాళ్ళ మొహంలో ఆనందం కనపడుతూ వుంది. నాయుడిమీద వాళ్ళకి గౌరవం పర్వతమంత పెరిగిపోయినట్టు వాళ్ళని చూస్తుంటేనే తెలుస్తోంది.    
    "థాంక్స్" అన్నాడు రాణా క్లుప్తంగా.    
    కాలనీ వాళ్ళు లేచి ముక్తకంఠంతో "వెళ్ళొస్తాం సార్" అన్నారు నాయుడితో వాళ్ళ స్వరంలో "మిమ్మల్ని అనవసరంగా అపార్ధం చేసుకున్నాం" అన్న భావం ధ్వనిస్తోంది.    
    ఈ టైమ్ లో వైర్ లెస్ మెసేజి వచ్చింది. ఒక కానిస్టేబులు హడావుడిగా చెప్పాడు. "సార్-రౌడీలు ఉపాధ్యాయ కాలనీని ఛిన్నాభిన్నం చేశారు. అక్కన్నుంచే మాట్లాడుతున్నాను నేను."    
    రాణా కంగారుగా లేచాడు. విషయం తెలిసి నాయుడు- "అట్లానా, పదండి. వీళ్ళు నా కార్లోనే వస్తారు" అంటూ బయల్దేరాడు. నాయుడి సరికొత్త మారుతీ కార్లో కొందరు, పోలీసు జీవులో కొందరు ఎక్కి కాలనీకి బయల్దేరారు.    
    అప్పటికే జరగవలసినదంతా జరిగిపోయింది. గూండాలు కాలనీని నానా భ్రష్టు పట్టించారు. కొందరిళ్ళల్లో సామాన్లు బైటకు విసిరేశారు. అడ్డొచ్చిన వాళ్ళని కొట్టారు. "మా దాదాని పోలీసులకి పట్టిస్తారా?" అంటూ భీభత్సం సృష్టించారు. ఆర్ధికంగా నష్టపోవడం స్పష్టంగా తెలుస్తోంది.    
    నాయుడు అన్నాడు- "వీళ్ళు నిశ్చయంగా ఆ మస్తాన్ గాడి మనుష్యులే అయివుంటారయ్యా ఎవడినీ వదిలిపెట్టకు. అందరి మక్కెలూ విరగదన్ను" అని, కాలనీ వాళ్ళవైపు చూసి, "మీరేం భయపడకండి" అంటూ మరికొంచెం సేపు ధైర్యం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంకో గంటలో పార్టీ తాలూకు మహిళా విభాగం వాళ్ళు వచ్చి కాలనీ ఆడవాళ్ళకి ధైర్యం చెపుతారని అన్నాడు.    
    రాణాకి నాయుడి ఎత్తు అర్ధమైంది.

    దీని వెనుక వున్నది అతడే అంటే కాలనీ వాళ్ళు ఇప్పుడు నమ్మే స్థితిలో లేరు. అంత డ్రామా ఆడాడు. ఇప్పుడీ గొడవంతా మస్తాన్ ని అరెస్ట్ చేసినందుకు వాడి అనుచరులే చేసినట్టు రంగు పూశాడు. వాళ్ళని పట్టుకోవలసిన బాధ్యత తనమీద పెట్టి అతడు తప్పుకున్నాడు.    
    రాణాకి కసిగా వుంది. ఎవరిమీదో తెలియని కసి!    "మీ కాలనీలో గూండాయిజం చేసిన వాళ్ళని పట్టుకుంటాను" అన్నాడు. "ఎవర్నీ వదిలిపెట్టను."    
    "వద్దు సార్" అన్నాడు కాలనీ వాళ్ళలో ఒకరు. "మమ్మల్ని ఇలా బ్రతకనివ్వండి. మీ మీ గొడవల మధ్య మమ్మల్ని ఇరికించకండి."    
    రాణా ఏదో అనబోయి ఆగిపోయాడు. అందరి మొహాల్లో అదే భావం కనపడుతూంది "....వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి మా ఆడవాళ్ళ మీద చెయ్యి వేయలేదు. కావాలంటే చందాలు ఇచ్చుకుంటూనైనా బ్రతుకుతాం. మమ్మల్ని బాధపెట్టకండి" అన్న భావం.    
    వాళ్ళు వెళ్ళిపోయారు.
        కాలనీలోంచి ఎవరిదో ఏడుపు వినిపిస్తోంది.    
    రాణా ఒక్కడే నిస్సహాయతకు ప్రతీకగా మిగిలాడు.    
    'నాయుడూ' అనుకున్నాడు.    
    అతడు పోలీస్ స్టేషన్ కొచ్చేసరికి లాయరు రెడీగా వున్నాడు. "ఏ నేరంమీద మస్తాన్ ని అరెస్ట్ చేశారో తెలుసుకోవచ్చా సార్?" అని నమ్రతగానే అడిగాడు.

    "ఒక పోలీసు అధికారిమీద చెయ్యి చేసుకున్నందుకు."    
    "క్షమించండి సార్ ఇలా అడుగుతున్నందుకు మీరప్పుడు డ్రెస్ లో వున్నారా?"    
    "లేను".    
    "సివిల్ డ్రెస్ లో మీరే ముందు అతడిని కొట్టడంతో అతడు మిమ్మల్ని మామూలు మనిషిగా అపార్ధం చేసుకుని తిరగబడ్డాడు."    
    '-రేపు కోర్టులో నేనిలాగే వాదించబోతున్నాను. నువ్వు అనవసరంగా కష్టాల్లో ఇరుక్కోబోతున్నావ్ ఇన్ స్పెక్టర్' అన్న మందలింపు వుంది లాయర్ కంఠంలో.    
    "మనం మస్తాన్ ని వదిలిపెట్టి కాంప్రమైజ్ కి వెళ్తేనే బావుంటుందేమో సర్" అన్నాడు యస్సై కర్రా.    
    రాణా తలూపాడు. అంతకన్నా చేసేది లేదు. 24 గంటల్లో మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలి. కేసు నిలబడదు. అనవసర పంతాలకు పోయి మస్తాన్ మీద కేసు పెట్టడం వేస్టు.    
    మస్తాన్ ని తీసుకుని లాయరు వెళ్ళిపోయాడు.    
    రాత్రి ఎనిమిదయింది.    
    రేపొద్దున్నే ఈ విషయం కాలనీ వాళ్ళకి తెలుస్తుంది.    
    ఇప్పటికే వాళ్ళు కుతకుతా వుడికి పోతున్నారు. ఇప్పుడు తను మస్తాన్ ని వదిలేశాడంటే ఇక అసలు క్షమించరు. తన పరిస్థితి అర్ధం చేసుకోరు. అటు గూండాలు కాలనీలో గొడవ చేయడానికి తనే కారణమయ్యాడు. మస్తాన్ ని థానే వదిలేశాడు. వాళ్ళ దృష్టిలో నాయుడు దయామయుడయ్యాడు. చాలా అందమైన వల పన్ని అందులో తనని ఇరికించాడు నాయుడు.    
    'నా రాజకీయం ముందు నువ్వు అర్భకుడివిరా' అని నిరూపించాడు.
        నిజంగా తను అర్భకుడేనా?    
    రాత్రి భోజనం చేస్తూ అదే ఆలోచించాడు.    
    పదకొండింటికి డ్రెస్ వేసుకుని బయల్దేరాడు. పోలీస్ స్టేషన్ కి కాదు, నాయుడు ఇంటికి.    
    మోటార్ సైకిల్ దూరంగా ఆపి, గోడదూకి వెనుకనుంచి పోర్టికోలోకి వచ్చాడు. కొత్త మారుతీకారు.... ఇంకా రిజిస్ట్రేషనూ, ఇన్సూరెన్సూ కూడా లేవు.    
    పెట్రోలు టాంక్ లోంచి గుడ్డ తడిపి అంటించి అక్కడనుంచి బయటపడ్డాడు. అతడు మోటార్ సైకిల్ స్టార్ట్ చేస్తూ వుండగా మంటలు ఉవ్వెత్తున లేస్తూ కనపడ్డాయి.    
    విపరీతమైన వేగంతో డ్రైవ్ చేస్తూ రెండు నిమిషాల్లో పోలీస్ స్టేషన్ కి వచ్చాడు. సరీగ్గా పది సెకన్ల తరువాత ఫోన్ వచ్చింది.    
    "నా మారుతీకారు ఎవరో కాల్చేశారు" అట్నుంచి దాదాపు అరుస్తున్నట్టు అన్నాడు నాయుడు.    
    "ఏది సార్? ఆ కొత్త కారేనా?"    
    "ఆ అదే" విసుగ్గా, కోపంగా అన్నాడు.    
    "నేనిప్పుడే వస్తున్నాను."    
    అతడు వెళ్లేసరికి అక్కడ జనం గుమిగూడి వున్నారు. కాలనీ వాళ్ళు కూడా వున్నారు. కారు దాదాపు బూడిదగా మారిపోయింది. లక్షా యాభైవేలు విలువచేసే బూడిద!    
    "ఇదెవరు చేసి వుంటారని మీరు భావిస్తున్నారు?" అన్న ప్రశ్నకి రాణా-    
    "ఇది నిశ్చయంగా మస్తాన్ గాడి పనే. సాయంత్రం లాయరొచ్చి వాడ్ని విడిపించుకుపోయాడు. మీరేమో వాడి మెడ పట్టుకుని కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ కి లాక్కువచ్చారాయె. ఆ కసి మనసులో పెట్టుకుని కారు కాల్చేసి వుంటాడు" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS