సౌదామినివేపు తిరిగి "పద సౌదామినీ! మరీ ముఖ్యమైనవీ, తప్పకుండా తీసుకెళ్ళవలసినవీ వుంటేనే తీసుకో" అన్నాడు. ఆమె మాట్లాడలేదు, అటువంటివి ఏవీ లేవన్నట్టు తలమాత్రం చిన్నగా వూపింది. ఆమె మొహం చూస్తుంటే జరుగుతున్నదంతా ఆమెకింకా పూర్తిగా అర్ధం కాలేదేమో అనిపించింది. ఇదంతా అతనికే కలలో లాగా వుంది. బ్రహ్మానంద బాలు దగ్గరికి వచ్చి చేతులు పట్టుకుని "మన మధ్య జరిగినదంతా మర్చిపో మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను మీ ఇద్దరినీ మళ్ళీ తిరిగి చూడటం నా కిష్టం లేదు. నాకూ కొద్దిగా అహం వుంటుందిగా! దాన్ని దెబ్బతీశావు నువ్వు నన్నర్ధం చేసుకోగలవా?" అని అడిగాడు.
అతను తనను చంపటానికే ప్రయత్నించినా కాని ఆ క్షణం మాత్రం అతన్ని చూస్తే జాలేసింది. అప్పగింతల టైమ్ లో కలిగే లాటి ఫీలింగ్.
తలూపుతూ "అర్ధం చేసుకోగలను" అన్నాడు.
"ఏమిటి?"
"ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళిన తర్వాత ఆమె మళ్ళీ తిరిగి మీకు కనబడి మీ మనసు బాధపెట్టకూడదు. అంతేగా!"
"అంతే! అంతే! ఉహు ఉహు అంతేకాదు, నువ్వు కూడా."
"సరే మేమిద్దరమూ మీకు మరి కనబడకుండా వెళ్ళిపోతున్నాము సరేనా."
"గుడ్! అలా శాశ్వతంగా వెళ్ళిపోవటమే నాకూ కావలసింది" శ్లేషతో అన్నాడు.
ఆమె చెయ్యి పట్టుకుని గదిలోంచి బయటికి వచ్చాడు బాలు. ఒక్కసారి చల్లగాలి చుట్టుముట్టింది. పది నిమిషాల క్రితం టెన్షన్ తో నిండివున్న మనసు సేదతీరింది. సౌదామినిలో ఇంకా ఆ తేటతనం కనపడలేదు. ఆమె సర్దుకోవటానికి కొంతకాలం పడుతుందని వూహించాడు. ఇద్దరూ మెయిన్ గేటు దగ్గరకు వచ్చారు.
మూసివున్న తలుపులకి అడ్డంగా పెద్ద తాళంకప్పు వ్రేలాడుతోంది. సౌదామిని వాచ్ మన్ వేపు ప్రశ్నార్ధకంగా చూసింది.
"ఈ తలుపు మూసెయ్యమన్నారమ్మా!" అన్నాడు.
ఈ సమాధానానికి సౌదామిని కొద్దిగా బెదిరినట్టు కనబడింది. ఇక్కడ బెదరటం అనేది సరియైన పధం కాదేమో! కోటలో ప్రతీదీ తనకి తెలిసే ఇప్పటివరకూ జరిగేవి. ఇప్పుడు మొట్టమొదటిసారి కోటనుంచి వేరుచెయ్యబడిందన్న విషయం తేటతెల్లమైంది.
ఆమెవేపు తిరిగి "మీ బ్రహ్మానందగారికి 'వాస్తు' మీద బాగా నమ్మకం వుందా?" అని అడిగాడు బాలూ.
ఆమె ఏం అన్నట్టు చూసింది. ఆమెలో అతనికి నచ్చే విషయం అదే. చాలా విషయాలు ఆమె కళ్ళతోనే మాట్లాడుతుంది.
"నేను గెలవటం, నువ్వు వెళ్ళిపోవటం అపశకునంగా భావించి సింహద్వారాన్ని ఇప్పటికిప్పుడు మూయించి మార్పిస్తున్నాడు" అంటూ నవ్వేడు. ఆమె నవ్వలేదు.
"బైటికి వెళ్ళటానికి యింకో ద్వారం వుందా?" సౌదామినిని అడిగాడు. వాచ్ మెన్ కల్పించుకుని "అటువైపు ఇంకో గేటుంది" అన్నాడు దూరంగా వున్న బోన్ మిల్ వైపు చూపిస్తూ.
ఇద్దరూ వెనుతిరిగారు. నడుస్తూండగా "నీకు ఆనందంగా లేదూ? క్షణక్షణం గండాలతో, ప్రమాదాలతో నిండివున్న ఈ కోటనుంచి బయటపడటం పంజరం నుండి బయట పడినట్టు లేదూ?" అన్నాడు. ఆమె దీనికి కూడా మాట్లాడలేదు. ఏదో గాఢమైన ఆలోచనలో వున్నట్టు కనబడింది. తనని ఎలాగైనా మాట్లాడించాలని "అరెరె!" అన్నాడు కంగారుపడుతున్నట్టు.
ఆమె తలెత్తి "ఏమిటి?" అని అడిగింది.
తన ప్రయత్నం ఫలించినందుకు సంతోషించి "నువ్వు చెప్పగానే మౌనం వహించి సహాయం చేసిన చిలక్కి కృతజ్ఞతలు చెప్పుకోవటం మర్చిపోయాం" అన్నాడు బాలూ.
ఇంతలో దూరంనుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకు వచ్చాడు. రొప్పుతూ దగ్గరకు వచ్చి "నే విన్నదంతా నిజమేనా?" అని సౌదామినిని అడిగాడు. ప్రశ్నను బట్టి అత్యను ఆంజనేయులని వూహించాడు బాలూ.
చేయి సాచాడు. "నా పేరు బాలూ. మీరు ఆంజనేయులనుకుంటాను."
అతడూ చేయి సాచి వ్యంగ్యంగా "కంగ్రాట్యులేషన్స్ చెప్పనా? కండోలెన్సెస్ చెప్పనా?" అడిగాడు.
అతడూ వ్యంగ్యంగా అర్ధంకానట్టూ "కండోలెన్సెస్ ఎందుకు?" అన్నాడు బాలు.
"ఏం లేదులెండి. వూరికినే మీకేం చెప్పినా మా సౌదామినికి మాత్రం కంగ్రాట్యులేషన్సే."
"ఆమె తరఫున థాంక్స్ చెపుతున్నాను."
"మీక్కాబోయే భార్యతో నేనో నిముషం ఏకాంతంగా మాట్లాడవచ్చా?" అని అడిగాడు.
సౌదామిని కంగారుగా "లేదు లేదు. నేను మాట్లాడవలసిందేమీలేదు" అంది.
ఆంజనేయులు ఆమెతో "అదేమిటి సౌదామినీ! ఇంతకాలం కలిసివున్నాం. విడిపోయేముందు ఒకసారి కూడా మాట్లాడాలనిపించడం లేదా?" అన్నాడు.
ఈ పరిస్థితి నుంచి తనని రక్షించమన్నట్టూ సౌదామిని చూసింది. బాలూ' కల్పించుకుని, "ఆమె తన పాతరోజుల్ని పూర్తిగా మర్చిపోదా మనుకుంటుందేమో!" అన్నాడు. అతడు వాళ్ళిద్దరివేపూ మార్చి మార్చి చూసి "సరే? అయితే మీ సంసారం సుఖంగా వుండాలని కోరుకుంటున్నాను. అన్నట్టూ ఎప్పుడైనా మిమ్మల్ని చూడటానికి రావచ్చా?" అని అడిగాడు.
బాలూ అన్నాడు, "మేం వచ్చేస్తూండగా ఈ ఇంటి తలుపులు శాశ్వతంగా మూసుకుపోయాయని బ్రహ్మానంద అన్నారు. సౌదామిని కూడా మిమ్మల్ని మళ్ళీ ఇంకోసారి చూడాలనుకుంటుందనుకోను."
అతడి మొహం వాడిపోయింది. కానీ అంతలోనే తేరుకుని నవ్వుతూ "మా సౌదామిని అలా చెపితే అది కేవలం మిమ్మల్ని సంతృప్తి పరచటానికే" అన్నాడు అదోలా నవ్వుతూ.
కొందర్ని చూస్తే అసహ్యం కలుగుతుంది. అతడిని చూసినపుడు బాలూకి అలాంటి భావమే కలిగింది. ఏమీ జవాబు చెప్పకుండా ముందుకు నడిచాడు. సౌదామిని అనుసరించింది.
అతను కొద్దిగా ముందుకు వెళుతూ వుండగా ఆంజనేయులు సౌదామినితో గొంతు తగ్గించి రహస్యంగా "ఆర్నెల్ల తర్వాత ఒకసారి వస్తాను. ఒక్కసారే అప్పుడు మాత్రం చూడననకు... ప్లీజ్" అన్నాడు. బాలూకి అది వినబడింది. సౌదామిని వడివడిగా వచ్చి బాలూని చేరుకుంది.
ఇద్దరూ ఇటుకబట్టీ అవతల వున్న దారివైపు నడక సాగించారు. చుట్టూ రెల్లుగడ్డి మధ్యలో సన్నటిబాట. ఒక యాభై అడుగులు వేసాక సౌదామిని చటుక్కున ఆగింది. ఏమిటన్నట్టూ చూశాడు బాలు. మాట్లాడవద్దన్నట్టు సైగ చేసింది. మొదట్లో వినబడలేదు గానీ చెవులు రిక్కించి వింటే దూరంగా సన్నటి అలికిడి వినిపించింది. మామూలుగా నడుస్తూ కూడా ఈ విషయాన్ని గమనించిందీ అంటే ఆమె సునిశిత తత్వానికి అభినందించాల్సిందే. బహుశా ఈ వాతావరణంలో చిన్నప్పటినుంచీ పెరగటంవల్ల ఇలాంటివి గమనించటం అలవాటై వుంటుంది.
బాలు ఏదో అనబోయేటంతలో ఆమె చేతిని పట్టుకుని పక్కకి తోసింది. మరుక్షణం ఒక బులెట్ అతన్ని రాసుకుంటూ వెళ్ళిపోయింది. పిస్టల్ పేలిన శబ్దానికి చిన్న చిన్న పిచ్చుకలు ఒక్కసారి గాలిలోకి లేవటంతో అప్పటివరకూ నిశ్శబ్దంగా వున్న వాతావరణం కలకలంతో నిండిపోయింది.
వాళ్ళు ఇద్దరూ దట్టంగా ఉన్న రెల్లుగడ్డిని అడ్డుగా చేసుకోవటానికి ప్రయత్నించారు. సౌదామిని చెవిలో రహస్యంగా "కదలకు. నడుస్తూ ఉంటే పైన గడ్డి కదలికకి మన ఉనికి తెలుస్తుంది" అన్నాడు.
ఆమె అర్ధం అయినట్టు తలూపింది.
తల కొద్దిగా పైకి పెట్టి చూశాడు. ఎక్కడా మనిషి సంచారం లేదు. పిస్టల్ పేలిన శబ్దం వినిపించినా అక్కడ ఎవరూ కనీసం తల కూడా త్రిప్పి చూడకపోవటంతో ఈ విషయం అక్కడ ఎంత సామాన్యమైనదో అర్ధంకాగానే ఒళ్ళు జలదరించింది. దూరంగా ఇటుకల బట్టీలోంచి పొగ బయటికి వస్తోంది. బోన్ మిల్ చేస్తున్న శబ్దం గాలిలో దూరంనుంచి వినబడుతోంది.
సౌదామినికి ఆమె చెయ్యవలసిందేమిటో చెప్పాడు. ఆమె తలూపి పిస్టల్ శబ్దం వినిపించినవైపు గడ్డిని బాగా కదుల్చుకుంటూ నడవసాగింది. అతను వూహించినట్టు జరిగింది. తనవైపే వస్తున్న మనిషిని దూరంనుంచి కాల్చే ఛాన్సు తీసుకోవటం ఇష్టం లేనట్టూ అవతలివ్యక్తి పిస్టల్ పేల్చలేదు.
సౌదామిని కొంచెం దూరం వెళ్ళిందని నిశ్చయించుకున్నాక బాలూ కూడా మరో వైపు నుంచి అటువైపు వెళ్ళాడు. వీలైనంత వరకు పైన గడ్డి కదలకుండా వుండటానికి ప్రయత్నం చేశాడు. మొదట బయలుదేరిన చోటికి అతడు తిరిగి చేరుకునేసరికి అయిదు నిముషాలు పట్టింది. అక్కడినుంచి నేలంతా చదునుగా వుంది.
దూరంగా పిస్టల్ చేతిలో పట్టుకుని వున్నాడు బ్రహ్మానంద.
అతడి దృష్టి గడ్డి కదులుతున్నవైపే ఉంది. బాలూ చెప్పినట్టే యెక్కువ అలజడి చేసుకుంటూ దగ్గరకు వచ్చి, చివరి అంచుకు చేరుకోగానే ఆమె గడ్డి పక్కకు తొలగిస్తూ నిలబడింది.
ఆమె ఒక్కతే బయటికి రావటం చూసి బ్రహ్మానంద కంగారుపడ్డాడు. ఆ రెప్పపాటు అయోమయం బాలూకి సాయం చేసింది. మెరుపులా వెనుకనుండి అతడి చేతిలో పిస్టల్ ఎగరగొట్టాడు. అది వెళ్ళి దూరంగా పడింది. బాలూ దాని దగ్గరికి చేరుకోబోయే లోపులో దూరం నుండి మరో పిస్టల్ శబ్దం వినిపించింది.
బాలూ వీళ్ళ తెలివితేటల్ని చాలా తక్కువ అంచనా వేశాడు. బ్రహ్మానంద ఒక్కడే ఉన్నాడనుకున్నాడు. తన వెనక కవచంలా ఆంజనేయుల్ని పెట్టుకున్నాడని వూహించలేదు.
ఆంజనేయులు పేల్చిన బులెట్ భుజాన్ని రాసుకుంటూ వెళ్ళింది. చేతి దగ్గర చొక్కా రక్తసిక్తమైంది.
ఈలోపులో సౌదామిని గాలికన్నా వేగంగా దూసుకువెళ్ళి నేలమీద పడిన పిస్టల్ ని అందుకుని బాలూవైపుకి విసిరేసింది. అయితే అతను దాన్ని చేతిలోకి తీసుకోలేదు. బ్రహ్మానందవైపు చూస్తూ, తాపీగా "దాన్నందుకో, కావాలంటే మమ్మల్నిద్దర్నీ కాల్చేయ్" అన్నాడు.
ఊహించని ఈ పరిణామానికి బ్రహ్మానంద బిత్తరపోయాడు. వాళ్ళిద్దరూ మామూలుగా మాట్లాడుకోవటం చూసి ఆంజనేయులు కూడా ఆశ్చర్యపోయినట్టున్నాడు. పరిగెత్తుకుంటూ దగ్గరకు వచ్చాడు.
ఈ లోపులో సౌదామిని కూడా లేచింది. ఆమెను దగ్గరకు తీసుకుంటూ అన్నాడు బాలూ. "నువ్వు ఇలాటిదేదో చేస్తావని నాకు తెలుసు స్వామీ! అయినా నీ రహస్యాలన్నీ తెలిసి ఈ పులిబోనులోకి ఏ జాగ్రత్తా తీసుకోకుండా ఎలా ప్రవేశిస్తాననుకున్నావ్?" అంటూ నవ్వేడు. "... నేను వచ్చే ముందే నాకు తెలిసిన విషయాలన్నీ సీల్డ్ కవర్ లో పెట్టి, మా స్నేహితుల కిచ్చి వచ్చాను. నేను వెళ్ళడం ఏ మాత్రం ఆలస్యం అయిన ఆ కవరు పోలీసులకి అందజేయబడుతుంది."
చాలా పాత ట్రిక్ ఇది. కాని నిర్భయంగా పనిచేస్తుంది. బ్రహ్మానంద మొహం వెలవెలాపోయింది. కాని వెంటనే సర్దుకున్నాడు. బాలూతో "నువ్వు నాకు నిజంగా నచ్చావు. తెలివి తేటల్లో సరితూగగలవా లేదా అని కొరియన్ చక్కర్ పరీక్ష పెట్టాను. నెగ్గావు. ఇప్పుడు ఈ పరీక్షలో కూడా నెగ్గావు. మా సౌదామినికి నువ్వు సరిగ్గా తగినవాడివి అని ఇప్పుడు నాకు నమ్మకం కుదిరింది. వెళ్ళిరండి" అన్నాడు.
