Previous Page Next Page 
జొన్నలగడ్డ రామలక్ష్మీ కధలు -1 పేజి 10

 

    "తప్పు....తప్పు..." అనుకున్నాడు సత్యమూర్తి.
    తను తప్పు చేస్తే ఆ తప్పును బ్రతకనివ్వడు. తప్పు చేసిన వాడిగా తను బ్రతకలేడు. ఎందుకంటె జీవితంలో తనకూ కొన్ని ఆశయాలున్నాయి. ఆ ఆశయాలే సమాజంలో తనని మంచివాడిగా నిలబెట్టాయి.
    వివాహితుడయినా ఓ పురుషుడు భార్య కాకుండా పర స్త్రీ తో సంబంధం పెట్టుకోవడం తప్పు. ఆ తప్పుకు తనింకో నిర్వచనం ఇస్తున్నాడు. తను తప్పు చేస్తే ఆ స్త్రీ జీవించి వుండదు. అప్పుడు తను పాపి కాడు.
    విప్లవకారుడు విజయం సాధిస్తే -- దేశ ద్రోహి అన్న ముద్ర తొలగి దేశ భక్తుడవుతాడు. తనూ అదే సూత్రం వర్తింపజేస్తాడు.
    సత్యమూర్తి తన యెదుట నున్న బీరువా తెరిచాడు. అందులోంచి ఓ వస్తువు తీశాడు.
    కత్తి తళతళ మెరిసింది.
    "ఆమె చిన్నె గుండెలో ఎన్నో ఇముడ్చుకుంది. ఇప్పుడు నిన్ను...." అనుకున్నాడు సత్యమూర్తి. అయితే , "పాపం నిర్మల ...." అని కూడా అతడను కోకుండా వుండలేక పోయాడు.
    
                                        3
    తలుపు చప్పుడు విని పరుగు పెట్టలేదు లక్ష్మీకాంతం. టైము చూసుకుని -- "ఇంకా గంట టైముంది. అతడు ముందుగా రాడు..." అనుకున్నదామె.
    నిరుత్సాహంగా వచ్చి తలుపు తీసి --"మీరా ?" అన్నదామె.
    శేఖర్ -- ఆ సమయంలో వస్తాడని ఆమె ఏమాత్రము అనుకోలేదు.
    "మీరీ వేళ ఆఫీసు నుంచి వచ్చేసరికి పన్నెండవుతుందని అన్నారు...."
    "ఏం ముందుగా వస్తే డిజప్పాయింట్ అయ్యావా!" అన్నాడు శేఖర్.
    "మీరు వస్తే నేను డిజప్పాయింట్ కావడమా!అన్నది లక్ష్మీ కాంతం. ఆమె యెంతో అమాయకంగా నూ బాధగానూ అన్నదా మాటలు.
    శేఖర్ ఆమెను దగ్గరగా తీసుకుని -- "నీ మనసు చాలా సున్నితం . తెలుసుండీ నేనలాంటి తప్పు చేస్తుంటాను . నిజానికి నేను నిన్ను డిజప్పాయింట్ చేయడానికీ వచ్చాను." అన్నాడు.
    "ఏమిటండీ " అన్నది ఆమె కంగారుగా.
    "కాంతం -- ఈ రాత్రంతా నేను ఇంటికి రాను"అన్నాడతను.
    ఆమె కన్నుల్లో మరింత బాధను ప్రకటించింది.
    "ఎందుకూ అని అడగవెం?" అన్నాడతను.
    "అడగడమెందుకు?మీకు ఎన్నో ముఖ్య వ్యవహరాలుంటాయి. తగినంత కారణం లేనిదే మీరు నన్ను విడిచి వుండరని నాకు తెలుసు" అన్నదామె.
    అతడామెను నుదుటి మీద చుంబించి -- "నిన్ను భార్యగా పొందడం నా అదృష్టం. ఈ అదృష్టాన్ని నేను పూర్తిగా ఉపయోగించుకుంటున్నట్లు లేదు"అన్నాడు.
    లక్ష్మీకాంతం నిట్టూర్చింది.
    అతడు బెడ్ రూం వైపు నడిచాడు. లక్ష్మీ కాంతం కంగారుగా -- "అటు యెందుకు?" అన్నది.
    "నా సిగార్ లైటర్ మరిచిపోయాను ."
    "మీరు వచ్చింది దాని కోసమే అనుకుంటాను" అన్నదామె.
    అతడికా లైటర్ ఆరో ప్రాణం. అదెప్పుడూ జేబులో వుండి తీరాలి. అయితే అతడు కాస్త పరధ్యానం మనిషి. చాలాసార్లు అది మరిచి వెడుతుండడమూ, ఆఫీసులో ఇబ్బందిగా ఫీలవడమూ జరుగుతుండేది.
    "నేనెందుకు వచ్చానో నీకు తెలుసు. నేనాలశ్యంగా వచ్చే మాటైతే అది నేనే నీకు స్యయంగా చెప్పాలి..."అన్నాడు శేఖర్.
    'లైటర్ నేను తెచ్చి యిస్తాను. మీరు ఇక్కడే వుండండి"అన్నదామె.
    బెడ్ రూం లో ఏర్పాట్లు అతను చూస్తె ....ఇంకేమైనా వుందా?"
    శేఖర్ అక్కడే ఆగిపోయాడు. లక్ష్మీ కాంతం లోపలకు వెళ్ళింది. ఆమె దురదృష్ట మో ఏమో -- అమెకది దొరకలేదు.
    ఇంకో క్షణం లో -- "ఏమిటి ఆలస్యం?" అంటూ అతడు బెడ్ రూం లో అడుగుపెట్టి దెబ్బ తినేశాడు.
    ఏమిటి -- ఇది తన బెడ్రూమేనా?
    గదిలో అడుగు పెట్టగానే ఊహాతీతమైన వాతావరణం.
    అక్కడ అన్నింటికీ మించి అతడినాకర్షించింది . మల్లె పూల మంచం. ఆ మంచానికి కాస్త దూరంగా లక్ష్మీ కాంతం.
    ఆమె బెదురూ చూపులు చూస్తున్నది.
    ఎవరి కోసం ....ఈ ఏర్పాట్లన్నీ ఎవరి కోసం....
    తన భార్య పడక గదిని ఇంత మనోహరంగా అలంకరించగలదా? గదిలో ఇటువంటి వాతావరణాన్ని సృష్టించగలదా?
    ఈ విషయం అతడికి కలలో కూడా స్పురించినట్లు లేదు.
    "లక్ష్మీ ...." అన్నాడతడు.
    లక్ష్మీ కాంతం మాట్లాడలేదు. తానెప్పుడూ ఇంట్లో యిలాంటి ఏర్పాట్లు చేయలేదు. ఇలా చేయడం ఇదే మొదటిసారి....దీనికి అతడే మనుకుంటాడు. తనేం సమాధానం చెప్పాలి?
    "ఏమిటిదంతా ?" అన్నాడు శేఖర్.
    పట్టుబడిన దొంగలా ముఖం పెట్టిందామే. తేలు కుట్టిన దొంగలా మౌనం వహించిందామె.
    శేఖర్ ఆమెను సమీపించి ఆమె తల మీద చేయి పెట్టాడు. "నేను నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నాను కదూ" అన్నాడు బాధగా.
    లక్ష్మీ కాంతం మాట్లాడలేదు.
    "ఈరోజు ఉదయం పల్లెటూరికి వెళ్ళారు. ఇంట్లో నువ్వోకతేవే వున్నావు. ఈరోజే నేను రాత్రి కింటికి రాకూడదనుకున్నాను" అన్నాడతడు బాధగా -- "చాలా రోజులుగా నేను నిన్న నిర్లక్ష్యం చేస్తున్నాను . అయితే నన్నాకర్షించాలని నీవు మధన పడురున్నట్లు ఈరోజే గ్రహించాను."
    "ఎలా?" అన్నదామె.
    "ఈ ఏర్పాట్లు చూస్తె తెలియడం లేదూ !"
    మొదటిసారిగా ఆమెకు భర్త మీద జాలి కలిగింది. వెర్రి వాడు - ఈ ఏర్పాట్లన్నీ తనకే అనుకుంటున్నాడు.
    "ఈఎర్పట్లు మీకోసమే నని ఎందుకనుకుంటున్నారూ?" అన్నాదామే అప్రయత్నంగా.
    అతడు పకపకా నవ్వేసి -- "నా లక్ష్మీ ఈ ఏర్పాట్లు నా కోసం కాక వేరేవరి కోసమైనా చేస్తుందని సాక్షాత్తూ ఆ భగవంతుడే వచ్చి చెప్పినా నమ్మను" అన్నాడు.
    ఆమె దెబ్బతిన్నది. భర్తకు తనమీద యెంత నమ్మకం, నిజంగా ఈ ఏర్పాట్లు తనకోసం కాదని అతడికి తెలిస్తే ఏమైపోతాడు?
    అంతలోనే ఆమె మనసు రాయిగా మారింది. ఇటు వంటి తీయని మాటలు తనను మళ్ళీ బానిసను చేస్తాయి. తన కోరికకు యెదురు తిరిగాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ తన నిర్ణయం మారకూడదు. అంతా పధకం ప్రకారం జరిగిపోవాలి.
    "మీరు లైటర్ కోసం వచ్చారు" అన్నదామె.
    'అది తలగడ క్రింద ఉంచిన గుర్తు'అంటూ అతడు తలగడ ను కదుపబోయాడు. ఆమె కంగారుగా అతడిని వారించింది.
    "ఏం?" అన్నాడతను.
    "ఒక అరగంట క్రితమే -- నేను మంచం దులిపి వేశాను ....అక్కడేమీ లేదు" అన్నదామె. ఆమె భయం వేరే వున్నది. అతడు కత్తిని చూస్తాడేమోనని ఆమె భయం.
    అప్పుడామే కు లైటర్ ఎక్కడున్నదీ గుర్తుకు వచ్చింది. పక్క వేసినపుడు - తలగడ క్రింద నుంచి తీసి డ్రెస్సింగ్ టేబిల్ అరలో పెట్టిందామె.
    అతడికి లైటర్ అందింది.
    శేఖర్ వెళ్ళిపోతూ -- "రేపు తప్పకుండా మంచాన్ని లాగే మళ్ళీ అలంకరించాలి. మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నానన్న భావం నాలో కలగకూడదు" అన్నాడు.

                                   4
    సత్యమూర్తి మరోసారి టైము చూసుకుని -- "ఇంకా అరగంట వున్నది" అనుకున్నాడు.
    తన భార్య నిర్మల ఎవరో స్నేహితురాలీని కలుసుకోవాలని చెప్పి అరగంట క్రితమే బయటికి వెళ్ళిపోయింది. అయితే ఆమె కలుసుకోబోయే ఆ స్నేహితురాలేవరో అతడికి తెలుసు-- శేఖర్.
    "సత్యమూర్తి నిట్టూర్చాడు.
    నిర్మల అతడిని యెప్పుడూ అనుమానించదు. అతడన్నా అతడి సంస్కారమన్నా ఆమెకు అంతులేని గౌరమున్నది. అయితే ఆమెలో ఒక్కటే లోపం!
    ఏ మగవాడైనా ఆమె తప్ప వేరే లోకం లేదని చెప్పి నమ్మించగలిగితే -- ఆమె అతడికి దాసురాలై పోతుంది. ఆడదానిలో అటువంటి బలహీనత వుంటే - దాన్ని ఉపయోగించుకునేందుకు చాలామంది ప్రయత్నిస్తారు. ఎంతమంది అలా ప్రయత్నించారో, విజయం సాదించారో అతడికి తెలియదు.
    అసలతడామె గురించి ఎప్పుడు పట్టించుకున్నాడు గనుక.
    లక్ష్మీకాంతం తనకు కాకుండా పోయిందన్న బాధ అతడి మనసు నావహించుకున్నది. అతడు నిర్మలతో నిర్లిప్తంగా కాపురం చేశాడు.
    పెళ్ళయిన రెండేళ్ళ కు వాళ్ళకు ఓ బాబు కలిగాడు. అప్పటికీ సత్యమూర్తి నిర్లిప్తత మారలేదు.    
    ఒరోజున నిర్మల అతడితో అన్నది - "నాలో ఏం లోపమున్నది? మీరు నా గురించి ఎందుకు పట్టించుకోరు ?'
    "నా స్వభావమే అంత - ఇంతకంటే ఎక్కువగా నే నేవరినీ పట్టించు కోలేను" అన్నది సత్యమూర్తి జవాబు.
    "ఇందువల్ల ఓ ప్రమాదముంది. నా మనసు ఆదరణను కోరుతోంది. ఆదరణ మీనుంచి లభించాలన్నది నాకోరిక. అలా జరుగక పొతే ఆదరణ ఎట్నించి లభిస్తే అటువైపు నేనాకర్శించబడతారు. అది నా బలహీనత. నా బలహీనత ను మీరే అదుపు చేయండి. అదుపు చేయకపోతే -- ప్రోత్సహించిన వారౌతారు.'
    సత్యమూర్తి ఆమె మాటలు పట్టించుకోలేదు.
    ఆమె అదుపు తప్పింది. సత్యమూర్తి అదీ పట్టించుకోలేదు.
    అయితే నిర్మల బరి తెగించిన దానిలా తిరగలేదు. ఆమె ఏం చేసేదో తెలియదు కానీ సత్యమూర్తి కి మాత్రం ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా కనబడలేదు.  అతను తన్ను అనుమానించడం లేదనీ -- మందలించడం లేదనీ ఆమె బాధ పడుతున్నది.
    ఇప్పుడతడు మొదటిసారిగా ఆమెను అనుమానించాడు.
    ఆమె హోటల్ గదిలో నిన్న శేఖర్ ను కలుసుకొనడం చూశాడు. అతడితో సంతోషంగా గడపడమూ చూశాడు.
    అప్పుడు అతడిలో ఏ భావాలూ కలుగలేదు.
    వెంటనే అతడు లక్ష్మీ కాంతాన్ని కలుసుకున్నాడు. ఇద్దరి కాపురాలూ ఒకలాగే వుంటున్నట్లు గమనించాడు. చివరికి ఒప్పందానికి వచ్చారు.
    నిజానికి ఇదే తనకు తొలిరేయి . యాంత్రికమైన శరీరాల కలయిక తొలిరేయి అనిపించుకొదు. మనసారా కోరుకుంటున్న ప్రియురాలితో ఏకాంతం ....అబ్బ....ఎన్నాళ్ళ కు లభించింది....
    ఆపైన....
    సత్యమూర్తి పాంటు జేబు తడుముకున్నాడు.

                                         5
    "జీవితంలో ఎన్నడూ ఇటువంటి అసహనం ఎరుగను" అనుకున్నది లక్ష్మీ కాంతం విసుగ్గా. సత్యమూర్తి వస్తానని చెప్పిన టైము దాటి అరగంటైంది, అతడింకా రాలేదెందువల్లనో?
    ఈరోజు సత్యమూర్తి , తను -- ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించు కుంటారు. ఒకరికొకరు ఆత్మీయులుగా మారిపోతారు.
    ఆపైన ఇద్దరూ కలిసి ట్రావెలర్స్ బంగాళా కు వెడతారు.
    అక్కడ సత్యమూర్తి అన్ని ఏర్పాట్లు చేశాడు.
    శేఖర్, నిర్మల రహస్యంగా ఎవరికి తెలీకుండా ఈరోజు రాత్రి అక్కడ గడుపుతారు. తాను భర్తను, అతడు భార్యను హత్య చేస్తారు. జీవితంలో ఇన్నేళ్ళ ఆనందం నుంచి తామిద్దరనూ దూరం చేసినందుకు వాళ్ళ మీద ఏర్పడిన కసి అలా తీర్చుకుంటారు. శవాలు కూడా రాత్రికి రాత్రి మాయం చేయబడతాయి.
    "ఈ పధకంలో ప్రమాదముంది. పాపం ....సత్యమూర్తి -- అయినా నాకోసం ఇందుకోప్పుకున్నాడు...." అనుకున్నది లక్ష్మీ కాంతం.
    ఆ తర్వాత....
    కొన్నాళ్ళకు తామిద్దరమూ వివాహం చేసుకుంటారు.
    మరోసారి టైము చూసుకున్నది లక్ష్మీకాంతం. ఆమె కనులు వాచీ ముళ్ళ పోజిషన్నుని అవగాహన చేసుకునే లోగానే తలుపు చప్పుడయింది.
    ఆమె పరుగున వెళ్ళి తలుపు తీసింది.
    "లక్ష్మీ ...." అంటూ అతడు ఒక్క అంగలో ఆమెను బలంగా కౌగలించుకున్నాడు. ఆమె ఉక్కిరిబిక్కిరయింది. అయితే అంత ఉక్కిరిబిక్కిరిలోనూ ఆమెకు ఓ విషయం అర్ధమయింది.
    ఆ పిలుపు అతడిది కాదు. అస్పర్శ అతడిది కాదు . మరి....
    ఇతడు తన భర్త శేఖర్ !
    కానీ ఈ పిలుపులోనూ, ఈ స్పర్శ లోనూ తేడా వున్నది.
    "నీవు నాకోసం ఇంతగా తపిస్తుంటే మూర్ఖుడినై తప్పు దారులు తోక్కలేను. లక్ష్మీ! ఈ క్షణం నుంచీ నేను నీ వాడిని. గతాన్ని మర్చిపోదాం. నేనీ రాత్రి ఓ గొప్పపని చేసి వచ్చాను. నన్ను కోరి వచ్చిన స్త్రీకి నీ ఔన్నత్యాన్ని వివరించి నిన్ను వదులుకోలేనని చెప్పి పంపాను. నాకోసం నీవు తయారుచేసిన ఆ మల్లెపూల మంచాన్ని ఈరోజు మన మిరుపురం సార్ధకం చేద్దాం" అన్నాడు శేఖర్.
    లక్ష్మీ కాంతం ఆశ్చర్యంగా వింటున్నది. తనకోసం ఈ మంచం అలంకరించానని భ్రమ పడ్డం వల్ల అతడిలో యింత మార్పు, వచ్చిందా? అంటే తను అతడి పట్ల శ్రద్ధ వహించక పోవడం వల్లనే అతడు పక్క దారులు పట్టాడా? ఇప్పుడతడి కౌగిలి లో ఎంత కాంక్ష వున్నది? ఆ కాంక్ష అతడి శరీరపు వేడి నుంచి పుట్టినది కాదు, ఆ కాంక్షలో తనమీద అభిమానం, ఆత్మీయత వున్నవి.
    అసలైన భార్య భర్తల అనుబంధమిది!
    లక్ష్మీ కాంతానికి తన పొరపాటు అర్ధమయింది. ఉన్నట్లుండి ఆమె మనసు నుండి సత్యమూర్తి వైదొలగాడు. బహుశా నిర్మల కలుసుకోగా సత్యమూర్తి లోనూ అటువంటి మార్పే వస్తుందేమో!
    ఆరోజు రాత్రి లక్ష్మీ కాంతం తయారు చేసిన మల్లెపూల మంచం సార్ధకతను సంతరించుకున్నది.

                                        ***   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS