కాసేపయ్యాక ఆయన నా అనుకరణ విద్య గురించి భార్యకు చెప్పాడు. చెప్పి వూరుకోకుండా-ఇప్పుడు ప్రదర్శన వుంటుందని కూడా అన్నాడు.
నేను తడబడ్డాను. ఆయన ముందు ప్రదర్శన ఇచ్చే ధైర్యం లేదు నాకు. కానీ ఆయన బలవంతపెట్టాడు. సంకోచంగా ఆరంభించినా అయిదు నిమిషాల్లో వూపులోకి వచ్చేశాను. ప్రదర్శనలోని ప్రతి అంశానికీ మెప్పు లభించింది. ఆఫీసరు భార్య చాలా అందంగా వుంటుంది. ఆమె మెప్పుదల నాకింకా ప్రోత్సాహాన్నిస్తోంది.
చాలా అనుకరణలయ్యేక- "ఇప్పుడితను నన్ను అనుకరిస్తాడు...." అన్నాడు ఆఫీసరు. ఉలిక్కిపడి ఆయన వంక చూశాను. ఆయన ముఖంలో ఎక్కడా కోపం లేదు.
"నావల్ల కాదండి..." అన్నాను.
"వుద్యోగం మీద ఆశ వుంటే ఆ మాట అనకూడదు" అన్నాడాయన.
ఉలిక్కిపడ్డాను. ఆయన్ననుకరించినందుకు వుద్యోగం పోతుందని భయపడ్డాను. కానీ అనుకరించనందుకుద్యోగం పోయే పరిస్థితి ఇప్పుడేర్పడడం విచిత్రంగా వుంది. ఆఫీసరు భార్య నావంక కుతూహలంగా చూస్తోంది. తనభర్తను అనుకరించడం ఆమెకు అంగీకారమేననిపిస్తోంది. కళ్ళలో కనిపించీ కనిపించనట్లుగా అభ్యర్ధన వుంది.
తటపటాయించినా మొత్తం మీద మొదలుపెట్టాను. ప్రదర్శన జరుగుతూంటే ఆఫీసరు భార్య పడిపడినవ్వింది. అంతా అయిపోయేక-"చాలా గొప్ప టాలెంట్..." అంది.
"ఎలా వుంది?" అన్నాడు ఆఫీసరు భార్య వంక చూస్తూ.
"ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నవ్వొస్తోంది....." అంది ఆమె.
"ఏమీ లోపాలు కనబడలేదా?"
"లేదు....."
"వెరీగుడ్...." అని ఆయన నా వంక నవ్వుతూ చూసి- "నా భార్య కూడా మెచ్చుకునేవిధంగా నన్ననుకరించారు. మిమ్మల్నభినందిస్తున్నాను. మిమ్మల్నింకో ప్రశ్న అడుగుతున్నాను. నా నాడకతో నాకు తెలిసిన ఇంకో రెండు విశేషాలున్నాయి. అవి మీ అనుకరణలోకి రాలేదు. అవి కూడా వస్తే నన్ను పూర్తిగా అనుకరించగలిగినట్లే" అన్నాడు.
"ఏమిటివి?" అంది ఆఫీసరు భార్య.
"నాకై నేను చెప్పను. చలంగారే అవి కొనుక్కోవాలి. ఒక వారం రోజులు టయిమిస్తున్నాను. ఈ వారం రోజుల్లోనూ ఆ విశేషాలు కనుక్కుని అనుకరించి చూపాలి. అలా చూపగలిగినట్లయితే మీకు మంచి బహుమతి ఉంటుంది. లేనిపక్షంలో శిక్ష కూడా ఉంటుంది..."
ఆఫీసరు మాటలు విని మ్రాన్పడిపోయాను. ఎందుకంటే నేనాయన లక్షణాలన్నీ బాగా పరిశీలించాను. నా సమర్ధతపై నాకు నమ్మకముంది. ఆయనలో నేనింక కొత్తగా తెలుసుకోదగ్గ విశేషాలేమీ లేవు. ఈ వారం రోజుల్లోనూ నేనాయన దగ్గర్నుంచి కొత్త విశేషాలు తెలుసుకోగలనన్న నమ్మకం లేదు.
అప్పుడాయన నాకు విధించే శిక్ష ఏమిటి?
"ఈ రోజు నేను ఆఫీసుకెళ్ళను...." అన్నాను.
"అదేమిటండీ?" అంది శ్రీమతి.
"అవును సుధా! ఈ వారం రోజులూ ఆయన్ను శ్రద్దగా గమనించాను. ఇదివరలో నేను చూసినవి తప్పితే కొత్త విశేషాలేమీ కనబడలేదు. ఏం చేయాలో నాకు తోచడం లేదు."
శ్రీమతి నవ్వి-"మీరనవసరంగా కంగారుపడుతున్నారు. నా అనుమానమేమిటంటే-మీ అనుకరణ చూసేసరికి ఆయనకు దిమ్మతిరిగిపోయుంటుంది. ఇంకా తనలో ఏమయినా విశేషాలున్నాయేమోనని తెలుసుకోవాలనుకుని వుంటారు. యధాలాపంగా చెబితే మీరు శ్రద్ధ వహించరని బెదిరింపు మాటలని వుంటారు. మీకు తెలిసింది మీరు చెప్పండి. ఆయన మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఆయనకు మీరంటే అభిమాన మేర్పడిందని నాకు అనిపిస్తోంది..." అంది.
ఆ మాటలు నాకు ధైర్యాన్నిచ్చాయి. ఆఫీసుకు వెళ్ళాను. వెళ్ళిన పది నిమిషాల్లో ఆఫీసరు గదినుంచి పిలుపువచ్చింది వెళ్ళాను.
"ఏమైనా కనుక్కోగలిగావా?"
"లేదండి...."
"మొహమాట పడవద్దు....."
"నిజంగానే చెబుతున్నానండి..."
"అయితే నా పరీక్షలో మీరు ఫెయిలై పోయారు...."
నేను ధైర్యం తెచ్చుకుని-"లేదండీ......నిజంగా నేను ఫెయిలైన పక్షంలో మీరా విషయం రుజువు చేయాల్సుంటుంది" అన్నాను.
"రుజువంటే ఆ రెండు విశేషాలూ నేను చెప్పాలనే కదా! అలా చెప్పాల్సిన అవసరం నాకులేదు. ఇదుగో-ఈ కవరు తీసుకుని తిన్నగా ఇంటికి వెళ్ళిపొండి-" అన్నాడు ఆఫీసరు. వణుకుతున్న చేతులతో కవరు అందుకున్నాను.
"ఇక్కడ తెరవ్వద్ద్దు. తిన్నగా ఇంటికి వెళ్ళి అక్కడే తెరవండి...." అన్నాడు ఆఫీసరు. అది మాటలాలేదు. ఆజ్ఞలావుంది. ఆ ఆజ్ఞప్రభావం నా మీద ఎంతలాగుందంటే నేను ఇంటికి బయల్దేరి కవరును దారిలో కూడా తెరిచిచూడలేదు.
తిన్నగా ఇంటికి వెళ్ళి శ్రీమతి ముందు కవరు తెరిచాను.
కవర్లో రెండువేల రూపాయలకు డ్రాఫ్టువుంది. ఆఫీసులో అనుకరణవిద్యలు ప్రదర్శిస్తూ, ఇతర ఉద్యోగుల పనికూడా పాడుచేస్తున్న కారణంగా నన్నుద్యోగం నించి తీసివేస్తున్నట్లు కాగితమొకటి వుంది.
"అనుకున్నదంతా అయింది సుధా!" అన్నాను బాధగా.
"బాధపడకండి. ఆయన్ను మళ్ళీ వెళ్ళి బ్రతిమాలుకోండి. ఇస్తే ఇస్తాడు. లేకపోతే ఎక్కడో అక్కడ ఉద్యోగం దొరక్కపోదు...." అంది శ్రీమతి ధైర్యంగా.
ఆమెకున్న ధైర్యం నాకులేదు. మా ఆఫీసరు మాటకు తిరుగుండదని నాకు బాగా తెలుసును.
అయినా సాయంత్రం ఆఫీసరింటికి వెళ్ళి కలుసుకోవాలనుకున్నాను. ఆయన నన్నలా ఎందుకు ప్రోత్సహించాడో, ఉద్యోగమెందుకు తీసివేశాడో నాకు అర్ధం కావడంలేదు.
శ్రీమతి తనూ నాతో బయల్దేరి వస్తానంది. ఇద్దరం కలిసి బయల్దేరేసరికి మా ఇంటికి ఎవరో వచ్చారు. మనిషి కార్లో దిగాడు. చాలా ఖరీదైన వాడిలాగున్నాడు.
