Previous Page Next Page 
వసుంధర కథలు-1 పేజి 12


    "నేనొక సినీ నిర్మాతను. నేను తీయబోయే కొత్త చిత్రంలో నిత్యజీవితంలోని పాత్రను కొన్ని ఏరుకుంటున్నాను. మీరు పనిచేసే ఆఫీసులోని ఆఫీసర్ పాత్రను హాస్యానికి ఎన్నుకున్నాను. అనుకరణ విద్యలో మీరు అఖండులని తెలిసింది. మా చిత్రంలోని హాస్యనటుడికి ఆ ఆఫీసరు నడవడిని అనుకరించి చూపాలి. మీకు మంచి పారితోషికముంటుంది" అన్నాడు నిర్మాత.
    "ఆ హాస్యనటుడినే ఆఫీసర్ని గమనించమనవచ్చుగా" అన్నాను.
    "అదెలా సాధ్యం? ఆయన కంపెనీలో పెద్ద ఆఫీసరు. ఇలాంటి వాటికి ఆయన అంగీకరించడు...." అన్నాడు నిర్మాత.
    నిర్మాత కాసేపు అవీ ఇవీ మాట్లాడి-"నా సంతృప్తి కోసం మీ ఆఫీసర్ని అనుకరించి చూపగలరా? మీ శక్తిని అంచనా వేసుకోవాలిగదా-ఏదో యధాలాపంగా కాలక్షేపానికి అడుగుతున్నాననుకోకండి. ఇప్పుడు మీరిచ్చే ప్రదర్శనకు వెయ్యిరూపాయలు పారితోషికం కూడా వుంటుంది...." అంటూ పది వందరూపాయలనోట్లు అందించాడాయన.
    వెయ్యిరూపాయలు నాకు తక్కువ మొత్తంకాదు. అందుకే అంగీకరించాను. అనుకరణ విద్యలో నేను లక్షలు సంపాదించగలనేమోనని ఆ క్షణంలో నాకు అనుమానం వచ్చింది కూడా.
    నా ప్రదర్శనను చూస్తూ నిర్మాత పరవశించిపోయాడు. అంతా అయిపోయాక-"అన్నింటికీ మించిన రెండు విశేషాలాయనలో వున్నాయి. అవి మీరు ప్రదర్శించనేలేదు. ఆయన వ్యక్తిత్వమంతా ఆ రెండు విశేషాల్లోనూ వుంది. అవి కూడా ప్రదర్శిస్తే నాకు తృప్తిగా వుంటుంది" అన్నాడు నిర్మాత. ఆ మాటలు వింటూనే నేనులిక్కిపడ్డాను.
    "నాకు తెలిసినంత వరకూ ఇవే విశేషాలు...." అన్నాను.
    "ఎందుకో మీరు సందేహిస్తున్నారు. అవి కూడా ప్రదర్శించగలిగిన పక్షంలోనే మీకు నేను కాంట్రాక్టు ఇవ్వగలను. నా కంట్రాక్టు పదివేలకు!" అన్నాడు నిర్మాత.
    నా బుర్ర పనిచేయటం మానేసింది. పది వేల రూపాయలు స్వంతమయ్యే అవకాశం అతిసమీపంలో వుంది. కానీ ఆ అవకాశం నాకు దక్కేలాలేదు.
    నిర్మాతకు ఎంతగానో నచ్చజెప్పడానికి ప్రయత్నించాను. ఆయన ఆ రెండు విశేషాల గురించి నొక్కించడం మానలేదు. చివరకు ఆయన కంట్రాక్టు ఇవ్వకుండానే వెళ్ళిపోయాడు. అసంతృప్తిగా మేము ఆఫీసరు యింటికి బయల్దేరాం.
    ఆఫీసరు ఇంట్లో మళ్ళీనాకు బాగా మర్యాదలు జరిగాయి. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఆశ్చర్యంతోపాటు ఆశ కూడా పుట్టుకొచ్చింది.
    "నా పొరపాటును మన్నించి నన్ను మళ్ళీ ఉద్యోగం లోకి తీసుకోవాలి...." అంటూ వినయంగా అభ్యర్ధించాను.
    "అది తప్ప ఇంకేమైనా అడగండి...." అన్నాడు ఆఫీసరు.
    "అదితప్ప నాకు వేరే కోరిక లేదండి...." అన్నాను.
    "ఈ కంపెనీ ఎలాగూ మూతపడుతోంది. దీంట్లో ఉద్యోగం గురించి మీరు తంటాలుపడడం అనవసరం."
    "పోనీ ఏదైనా దారి చూపించండి..." అన్నాను దీనంగా.
    "అనుకరించడంలో సామర్ధ్యమున్నవారికి ఉద్యోగాలు దొరకడం కష్టం కాదు. ఈ అడ్రసుకు అప్లై చేయండి. తప్పక లాభిస్తుంది...." అన్నాడు ఆఫీసరు.
    ఆ అడ్రసు తీసుకుని వచ్చాను బయటికి. "మీ ఇమిటేషన్ మీద ఈయన కన్ను పడిందండీ-మీకేదో మంచి ఉపకారమే జరుగుతుంది" అంది శ్రీమతి.
    
                                        5

    ఇంటర్వ్యూ బాగానే జరిగింది. ఇంటర్వ్యూ జరిగిన వారిలో మా ఆఫీసరుండడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. తప్పక నాకా వుద్యోగం లభించగలదని అనిపించింది. అందరికీ ఇంటర్వ్యూ అయిపోయాక ఆఫీసరు నన్ను పెర్సనల్ గా పిలిపించి-"ఈ ఉద్యోగం లోని సాధక బాధకాలు తెలుసా?" అడిగాడు.
    "తెలియదు. కానీ అన్నింటికీ సిద్దపడి వచ్చాను" అన్నాను.    
    "నెలకు పదిహేను వందల రూపాయల జీతం. అయితే దానికి ముందు ఆరు నెలలు శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో నెలకు ఎనిమిది వందలు మాత్రమే ఇస్తారు" అన్నాడు ఆఫీసరు.
    "బాగానే ఉంది" అన్నాను.
    "ఎటొచ్చీ డ్యూటీయే కష్టం. మేము కోరిన మనిషి స్థానంలో ప్రవేశించి అతన్ని అనుకరించగలగాలి...." అన్నాడు ఆఫీసర్.
    "అంటే?" అన్నాను కంగారుగా.
    "ఇందులో ప్రమాదమేమీ ఉండదు. మంచి అనుకరణ శక్తి ఉండాలి. అంతే!"
    "మరి వేషం?"
    "ఆ శ్రద్ధ మేం తీసుకుంటాం...."
    "అసిలిదంతా ఎందుకు?"
    "ఎందుకంటే మన కంపెనీ వ్యవహారం తెలుసుగదా. గొప్పగొప్పవాళ్ళ రహస్యాలు దాచిపెడుతుంది. అందుకని చాలా తరచుగా ఓ కంపెనీ ఎత్తేసి ఇంకో కొత్త పేరుతో మళ్ళీ ఇంకో కంపెనీ ప్రారంభిస్తూంటాం. కంపెనీ ఆఫీసర్లకు చాలాపెద్ద బాధ్యతలుంటాయి. ఆ బాధ్యతలు నెరవేర్చడానికి అన్ని సమయాల్లోనూ వాళ్ళు హెడ్డాఫీసులో ఉండలేరు. వాళ్ళు లేనప్పుడు వాళ్ళస్థానంలో అలాగే కనబడే మరో వ్యక్తిని ప్రవేశపెడతాము. ప్రవర్తనలో ఆ వ్యక్తిని గురించి ఎవరికీ ఏ విధమైన అనుమానమూ రాకూడదు...." అన్నాడు ఆఫీసరు.
    "మీగురించి అందుకే నేను ప్రత్యేకమైన ఆసక్తి చూపించాను. మీ శక్తి సామర్ధ్యాలమీద నాకు కొంతవరకూ నమ్మకం కుదిరింది. ఎటొచ్చీమీకు కొద్ది నెలల శిక్షణ అవసరం-"
    "మీరీ ఉద్యోగం ఇప్పించగలిగితే నేను అదృష్టవంతుడినే. కానీ మీరు నా శక్తిని శంకిస్తున్నారనుకున్నాను. నేను సరాసరి ఉద్యోగంలో ప్రవేశించగలను. నాకు శిక్షణ అవసరంలేదు...." అన్నాను.
    "ఆ విషయం తేల్చుకునేందుకే గదా-నేను నాలోని రెండు ముఖ్య విశేషాలను కనిపెట్టడానికి వారం రోజులు గడువిచ్చాను....మీరు ఫెయిలైపోయారు....." అన్నాడు ఆఫీసరు. ఆయన వస్తున్న నవ్వును ఆపుకుంటున్నాడు.
    "నేను ఫెయిల్ కాలేదు. మీరే కావాలని నన్ను ఫెయిల్ చేశారు. మీలో ఇంకే ఇతర విశేషాలూ లేవు. వుంటే చెప్పండి చూద్దాం...." అన్నాను.
    "సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నాను వినండి...." అంటూ ఆయన తన స్వరాన్ని తగ్గించాడు.
    "మొదటి విశేషం-నేను మీ ఆఫీసర్ని కాను. ఆయన స్థానంలో ఆయన వేషంలో వచ్చాను. రెండో విశేషం నేను మీ ఆఫీసర్ని అనుకరిస్తున్నాను. ఈ రెండూ మీరు తెలుసుకోలేకపోయారు. నిజంగా మీరు తెలుసుకో గలిగారో లేదో తెలుసుకునేందుకే వారంరోజులు గడువూ, ఉద్యోగం నుంచి తీసేస్తానన్న బెదిరింపూ, సినీనిర్మాతను పంపించి ఆశ పెట్టడం వగైరాలు చేశాను.
    కానీ మీరు నిజంగానే ఈ విశేషాలు తెలుసుకోలేక పోయారు. అంతే అనుకరణలో నేను నీకంటే గొప్పవాణ్ణన్నమాట. ఎదుటివాడి ప్రవర్తనను సునిశితంగా గమనించగల మీరు నేను మీ ఆఫీసర్ని కాననీ ఆయన్నన్నుకరిస్తూన్న వ్యక్తిననీ గ్రహించలేకపోయారు. నా పవర్తనలో ఏ లోపాన్నీ పట్టలేకపోయారు. అప్పుడే నాకు ధైర్యం కలిగి-మీ ఆఫీసర్ చేయలేకపోయిన కొన్ని పనులు చేశాను. ఇప్పుడా కంపెనీ మూతపడుతోంది. నేను చేసిన పనులవల్ల..... కొత్త కంపెనీ ప్రారంభిస్తున్నాం...."
    ఆయన చెప్పిందంతా ఆశ్చర్యంగా విన్న నాకు అయన మాటలు నిజమేనని నమ్మడానికి కొద్దిరోజులు పట్టింది. అదీ అసలు ఆఫీసర్బి చూసేక!
    ఏది ఏమయినా నాకు శిక్షణ అవసరమని గ్రహించి ఆ ఇమిటేషన్ ఆఫీసరు ముందు వినమ్రుడినై నిలిచాను.
    
        
                                          * * *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS