Previous Page Next Page 
మూడుముళ్ళూ పేజి 11

 

                                     6

    నళినీ, మాధవా, తిన్నగా, బీచ్ వెంపు వెళ్ళారు! మాధవ, నళినితో తీరిగ్గా మాట్లాడాలని అనుకొన్నాడు. నళిని కూడా మాధవ అంటే, మంచి ఇష్టం చూపుతో వుంటుంది. మాధవ అందమైన వాడు! చురుకైనవాడు! కమ్మని కధలు వ్రాస్తాడు! తియ్యని గొంతుతో పాటలు పాడుతాడు! తల్లి తండ్రుల కొక్కడే కొడుకు! పెద్దింటి పిల్లల ప్రేమకూడా మెరకనీరు పల్లపు భూమికే ప్రహరిస్తుంది, అన్న సామెత రీతగా వుంటుంది కాబోల్ను!
    సముద్రతీరంలో, మనస్సుల్ని ఆహ్లాదపరిచే చల్లనిగాలి విసుర్లలో ఉవ్వెత్తుగా లేచిపడే సముద్ర కెరటాల చివర్లమెరిసే పాలనురుగులని చూస్తూ.
    'చూడు నళినీ! నిన్నొక విషయం అడగాలనుకుంటున్నాను' అన్నాడు మాధవ!
    మురిసిపోయింది నళిని!
    'నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను! నువ్వనుగ్రహిస్తే కాని బ్రతకలేను! నేను నీ స్టేటస్ కి తగ్గకపోయినా' నిన్ను ఆరాధించకుండా వుండటం నా శక్తికిమించిన పని అని తేలిపోయింది.' అన్న ప్రేమభాషణ వూహించింది నళిని. సిగ్గుతో బుగ్గల ఎరుపెక్కిపోగా, ఇసుకరేణువుల్ని కరిగించే, సముద్రుని వెంపు చూస్తూ-
    'అడుగుమాధవ్! సందేహం దేనికి!' ఉత్సాహంగా అంది నళిని.
    'అదే! మీ ఇంట్లో వుంటోందే! ఆవిడ! ఆ కామేశ్వరి విషయం!' నెమ్మదిగా నళిని వెంపు చూస్తూ అన్నాడు మాధవ. క్షణం సేపు నళినిముఖం, వివర్ణమై పోయింది. మళ్ళీ స్థిమితం చేకూర్చుకుని-
    'వూఁ! కామేశ్వరి విషయం ఏమిటి!' వ్యంగ్యంగా అంది నళిని.
    'నువ్వు నాకు అత్యంతప్రీతి పాత్రురాలివి నళినీ! నీముందు నాకు దాచుకోగల రహస్యములు వుండజాలవు! అంచేత నీకు మటుకి ఈ రహస్యం చెబ్తుతున్నాను. ఇంకెవరికీ చెప్పవుకదూ! చెబితే అపహాస్యం పాలు కావాల్సివస్తుంది!' అన్నాడు మాధవ!
    ఈ ఉపోద్ఘాతం నళినికి విసుగెత్తించింది. అయినా నిగ్రహించుకుని, అసలు విషయం రాబట్టాలని,
    'వూఁ ఇంతకీ అసలు సంగతి చెప్పు!' అంది.
    'మా అన్నయ్యని నీవు చూచావుగా!'
    'వూఁ!'
    'వాడు కామేశ్వరిని ప్రేమించాడు! ఆమె చూచినది మొదలు ఇంకే సంబంధాలు వచ్చినా నచ్చలేదని ఏవేవో సాకులు చెప్పి పెళ్ళి చేసుకోవటంలేదు! అంచేత కామేశ్వరితో ఈ విషయం చెప్పి ఎల్లా గయినా అన్నయ్యతో ఆమె మాట్లాడేట్లు చేయి! నీ కెంతయినా పుణ్యముంటుంది. నేను ఆమెతో ఎన్నోసార్లు మా అన్నయ్య సంగతి చెప్పాలని ప్రయత్నించాను. కాని ఆమె నాతో మాట్లాడటానికి ఆట్టే సుముఖురాలుగా వుండటం లేదు. ఎందువల్లో! మనం ఇరువురం ప్రేమికులం! ప్రేమించుకున్నవాళ్ళకి ఎడబాటు ఎంత దుస్సహంగా వుంటుందో మనకు అనుభవం లోనికి వచ్చిన విషయమేకదా! కామేశ్వరి మీ ఇంట్లో వుంటుంది కనుక నువ్వీ విషయంలో మాకు సాయం చేయొచ్చును' అన్నాడు మాధవ. నళినికి నవ్వు వచ్చింది! ఈ అందచందంలేని నిర్ధనురాలైన కామేశ్వరికి కూడా ఒక ప్రేమికుడూ, ఆరాధకూడూ వున్నాడన్న సంగతి వినగానే ఆమెలో ఒక హేళనాభావం ఉత్సాహంగా పొంగులు వారుతూ పరుగులెత్తసాగింది! ఆ కారణంగా కామేశ్వరికీ, తమకూ వున్న బాంధవ్యం విశదీకరించి మాధవకు చెప్పాలనే సంగతి విస్మరించింది నళిని!
    'మీ అన్న కామేశ్వరిని ఎట్లా ఎరుగును?' అడిగింది నళిని.
    'మామూలుగా కామేశ్వరిని పెళ్ళి చూపులకు చూచేందుకు వెళ్ళాడు! చూసాడు!'
    'అప్పుడు నచ్చలేదా?' లాయరులా అడిగింది నళిని.
    'నచ్చిందనీ మా నాన్నారితో చెప్పాడు! మా నాన్నారు వారికి వారికీ ఆ విషయం తెలియపర్చనారు కూడా!"
    'మరయితే పెళ్ళి ఎందుకు అవలేదు?' అంది.
    'అదంతా ఒక విచిత్రం నళినీ! మేము చూసివచ్చి, నచ్చిందాని, జాబు వ్రాసేక; ఎవడో ఒక త్రాష్టుడు, ఆమెని కట్నం లేకుండానే పెళ్ళాడుతానని అన్నాడనీ, అంచేత కట్నం లేకుండా అయితేనే మా అన్నకు మొదటిసారి ఇస్తానన్నారు కనుక చేస్తామనీ, ఆమె తండ్రి వ్రాశాడు! వాళ్ళ తలబిరుసుతనానికీ, లౌక్యానికీ మా నాన్నారికి కోపంవచ్చి వద్దవేసారు! తీరా కార్యానికి వచ్చేసరికి, వాడూ చేసుకోనన్నాడు కాబోలు! ఇక్కడ చదువుకు చేర్చారు!' అన్నాడు మాధవ! అప్పుడన్నా కామేశ్వరి వివాహిత అనీ, తమయింటి కోడలనీ చెప్పలేదు నళిని! ఆమెకు చెప్పాలన్న ఆలోచన కలగలేదు!
    'మీ అన్నకూడా కట్నాని కాశించకుండానే చేసుకుంటాననవల్సింది! అప్పుడు మీ అన్నకే ఇద్దరు ఆమెని! కట్నం కోసం మనసుకు నచ్చిన జీవనభాగస్వామిని వదులుకుంటారా నేటి చదువుకున్న యువకులు? అందులో మీ అన్న స్వయం పోషకుడు కూడా కదా!' అన్నది నళిని వచ్చే నవ్వుని పెదాలమధ్య బిగించి.    
    'ఆ అవకాశం ఏది నళినీ! మా అన్న మంచి గుట్టు కలవాడు! కామేశ్వరిని చూసి వచ్చేక, ఎన్ని సంబంధాలు చూస్తున్నాడో! కాని వక్క టీ వాడి మనస్సుని ఆకర్షించలేకపోతూందంటే కారణం ఏమిటంటావు? ఆ కారణం నాకే తెలుసు నళినీ! ఒక్క నాకే తెలుసు! వాడి మనస్సులో కామేశ్వరి తిష్ఠ వేసుకుని కూర్చుందని నాకే తెలుసు! వాడి హృదయం మలుచుకొన్న అపరంజి బొమ్మ కామేశ్వరి! ఎల్లా ఆమెని అంత తేలిగ్గా మర్చిపోయి పెళ్ళికి ఒడ బడతాడు నళినీ వాడు! వాడి హృదయం అతి గంభీరం! వాడు సముద్రుడు నళినీ! నాకు తెలుసు వాడి క్షోభ! అందుకనే, నిన్ను ప్రాధేయపడుతున్నాను! నువ్వు కామేశ్వరిని మాతో చనువుగా వుంటానికి ప్రోత్సహించాలి! వాళ్ళిద్దర్నీ వకటి చేస్తే మన జీవితాలు ధన్యమవుతాయి!' అన్నాడు మాధవ! ఆవేశంతోవున మాధవిని చూసి చిన్నగా నవ్వింది నళిని! మాధవ ఆమె చేతులు రెండూ పుచ్చుకుని, పెదాల కానించుకున్నాడు. నళిని అతనిలోనికి కరిగిపోయింది!

                                *    *    *

    హాలులో మాధవ గొంతు వినగానే మేడమెట్లు దిగుతూన్న కామేశ్వరి క్రిందికి తొంగి చూసింది. మాధవ ప్రక్కన రామనాధంకూడా కూర్చునివున్నాడు. రామనాధాన్ని చూసిన జ్ఞాపకం లేదు కామేశ్వరికి! మాధవమటుకు, తనని చూసుకుందుకు వచ్చిన వాళ్ళతో వున్నాడని, జ్ఞాపకం వుంది కామేశ్వరికి! ఆరోజు ఆమె, తన్ని చూసుకుందుకు వచ్చిన యువకుడ్ని పరీక్షగా చూడనే లేదు! మాధవ మటుకు ఎక్కువ మాట్లాడటం వల్ల ఆమెకు బాగా గుర్తు వుండిపోయింది. వెను తిరిగి పైకి పోబోతున్న కామేశ్వరిని చూసింది నళిని.

                       
    'రా కామేశ్వరీ! ఇంట్లోకి వెళ్ళి మూడు కాఫీలు పట్రా! అంది నళిని. మెట్లు దిష్టి వెను తిరిగి ఇంట్లోకి పోతూవున్న కామేశ్వరి వీపుమీది పొడుగాటి జెడని అమితాసక్తితో చూస్తూన్న రామనాధంనిచూసి నవ్వుకొంది.
    'కామేశ్వరి జుత్తు బాగుంటుంది కదూ! స్త్రీలకు నిడుపాటి కురులే అందమన్నారు మన పూర్వీకులు! సర్వేంద్రియాణాం నయనం ప్రధానం! అని కూడా అన్నారు. నేత్రాలూ, కురులూ కామేశ్వరి యొక్క అందానికి తిరుగులేని ప్రతి నిధులు! ఏమంటారు? అంది నళిని!
    రామనాధం సిగ్గుగా తల క్రిందికి దించుకున్నాడు!    
    'మీ అన్నగారికి బిడియ మెక్కువ మాధవ్! మా కామేశ్వరి సరేసరి నోరు మెదపరు! ఇంకెల్లా వీళ్ళు వకరొకరి మనోగతాలు వివరించుకునేది?' ఎద్దేవాగా అంది నళిని.
    మాధవ ఫ్రీగా నవ్వాడు.
    'వాళ్ళకి కావల్సినది ఏకాంతము నళిని!' ఎవరూ లేని యమునా తటినీ ఎక్కడో ఏకాంతమందున వారిరువురూ ఒకరి నొకరు ఎరుకపర్చుకుంటారు! మనలానలుగురిలో వుండి మాట్లాడుకోమంటే వాళ్ళు గొప్ప అవమ్నంగా భావిస్తారు' అన్నాడు మాధవ!'
    'ఏమిట్రా ఆ ధోరణి!' కోపంగా అన్నాడు రామనాధం.
    'కావ్య నాయిక మల్లె కోపం అభినయిస్తున్నారు. మీ అన్న!' అంది నళిని.
    'అదికాదు అన్నయ్యా! నువ్వే పెళ్ళి కూతురయినట్లు సిగ్గుల సింగారం ఒలక పోస్తూంటే కాస్త మేలమాడాము! దానికీ కినుక వహించుతే మరి ఎటుల నాటకము సాగనోవును?' భావ యుక్తంగా అన్నాడు. మాధవ!
    'నీ కవిత్వం కట్టిపెట్టు బాబూ!' అన్నాడు విసుగ్గా రామనాధం.
    'రవి గాంచనిచో కవిగాంచునని కొండొకచో వివరింపబడియె!' అన్నాడు అల్లరిగా మాధవ! నళిని, చప్పట్లు కొట్టుతూ 'హియర్ హియర్!' అంది.
    'ఆయనతో మాట్లాడి గెలవలేమండీ! ఆయన మనస్సుల్ని చదువుతారు!' అంది నళిని.
    'ఆఁ! బాగానే చదువుతాడు చదువు, అస్తమానూ కాగితాలు నలుపుచేస్తూ, కూర్చోవటమేకాని అసలు చదువు చదివితే కదా వీడు పరీక్షలు ప్యాసయ్యేది?' ఇంతలో కేశవ వచ్చాడు. రామనాధం మాధవాలేచి నిలబడి.
    'నమస్కారం మాస్టారూ!' అన్నారు వక్కసారిగా!
    'విజయోస్తు! ఎల్లా వున్నారు? పాఠాలు వంట పట్టుతున్నాయా! నువ్వు ఎంఎకి అప్పీయర్ అవుదామనుకుంటున్నావుట! మొదలుపెట్టావా చదవటం!' రామనాధాన్ని వుద్దేశించి అన్నాడు కేశవ!    
    'ప్రయివేటుగా ఎంతబాగా చదివినా క్లాసు తెచ్చుకోవటం కష్టమండీ. వుద్యోగం పర్మనెంట్ అయినాక స్టడీలీవ్ పుచ్చుకుని, కాలేజీలో జేరదామని అనుకుంటున్నానండి!' వినయంగా అన్నాడు రామనాధం.
    'అల్లా చేస్తే, బాగా వుంటుంది!' అన్నాడు కేశవ! కామేశ్వరి ట్రేలో మూడుకప్పులు కాఫీతెచ్చి టీపాయ్ మీద పెట్టింది! రామనాధం చేతులు కాఫీ కప్పు పట్టుకుంటూంటే వనికాయ్! ఆనాడు, తెల్లనిచీరలో, మల్లెమొగ్గలా, ముడుచుకు పోయివున్న కామేశ్వరి, ఈ రోజు ధైర్యంగా, నలుగురికీ కాఫీలిచ్చి, తలెత్తుకుని, నిలబడింది! పరిస్థితుల ప్రభావము! అనుకున్నాడు రామనాధం!
    కామేశ్వరి వాళ్ళు కాఫీలు త్రాగే దాకా నిలబడింది. కేశవకాని నళినికాని ఆమెని కూర్చోమనక పోవటం మాధవకి ఆశ్చర్యం కలిగించింది! వాళ్ళు ముగ్గురూ, కాఫీలు త్రాగగానే, కాళీకప్పులు, తీసుకుని! లోనికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళి పోతుంటే ఆమెకేసి వకసారి చూసాడు రామనాధం! ఆ చూపులోని ఆనందాన్ని చదవగలిగిన మాధవ నళినివెంపు చూసి చిన్నగా నవ్వుకున్నాడు!
    'నీవేదో నవల వ్రాస్తూన్నావని, మా నళిని చెప్పింది. ఎంతవరకూ వచ్చిందోయ్! ఇంతకీ అది చరిత్రాత్మకమా, సాంఘికమా?" అన్నాడు కేశవ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS