'చరిత్రాత్మక నవలలు వ్రాయటము, అంత తేలికాండీ! దానికి బోలెడు పరిజ్ఞానం వుండాలి! రాజుల సమయాలూ, స్థలనిర్ణయాలూ, వివరంగా తెలిసివుండాలి! వాళ్ళ దుస్తుల వివరాలూ, ఆభరణాల వివరాలూ సేకరించాలి! అందుకనీ నేటి రచయితలు, క్లిష్టమైన చరిత్రాత్మక చిత్రణకు పూనుకోవటం లేదు! సాంఘికాలయుగం అయిన ఈ రోజుల్లో నేనూ ఒక సాంఘిక సమస్యనాధారంగా చేసుకుని ఏదో వ్రాస్తున్నాను. పూర్తి అయిపోవచ్చింది లెండి!' అన్నాడు మాధవ!
'సాంఘిక సమస్య అంటూ చెప్పుకొస్తున్నారు కదా! కాస్త ఆ సాంఘిక సమస్య ఎల్లా వుంటుందో దాని స్వరూపం చెప్పుతారా?' అంది నళిని.
'సమస్య అంటే ఏమిటి? తీరీతీరని కోరిక అనుకోవచ్చును! తిండిలేనివాడికి తిండి దొరకాలనేది ఒక సమస్య అయితే ఉద్యోగం లేనివాడికి ఉద్యోగం దొరకా లనేది ఒక సమస్య! ఆహార సమస్య నిరుద్యోగ సమస్య వివాహ సమస్య! ఇలా సమస్యలు అనేకవిధంగా ఒక్కో వ్యక్తికి ఒక్కోలా వుంటాయి! ఆ సమస్యల్ని ఎదుర్కొని పరిష్కరించుకోవాల్సిన వాళ్ళే వ్యక్తులు! ఇవన్నీ సాంఘిక సమస్యల క్రింద వస్తాయి! వ్యక్తిగత సమస్యలు అంటూ కొన్ని వున్నాయ్! వర్ణభేదాలూ, వర్గబేధాలూ సామూహిక సమస్యలు! రకరకాల సమస్యలతో వేగిపోతూ జీవిస్తూన్నారు వ్యక్తులు.' అన్నాడు మాధవ!
'సమస్యలు లేని వ్యక్తులు వుండరా!' హేళనగా అంది నళిని.
'వుంటే వాళ్ళు అదృష్టవంతులు నళినీ! సమస్యలు లేని వ్యక్తులు వుండవచ్చును కాని, వ్యక్తులు లేని సమస్యలు వుండవు!' అన్నాడు మాధవ.
'బాగుంది!' అన్నాడు అదంతా శ్రద్దగా విన్న కేశవ!
'కానయితే ఈ సమస్యలన్నీ కూలంకషంగా చర్చించే వ్యాసాలసంపుటే అన్న మాట నేటి నవలలు! సాంఘికాలూ అంటూ వస్తూన్న నేటి నవలల్లో, సంఘపు కట్టుబాట్లుకాని, వాటిల్లోని లోపాలని సరిదిద్దాల్సిన అవసరాలని కాని, వ్రాయటంలేదు రచయితలు! ఒక చిన్న సంసారం గురించి వ్రాసుకుపోయే ఈపెద్ద కధనాల్లో నవలలు కుండాల్సిన లక్షణాలేమి వుంటున్నాయి! ఇవి సంసార చిత్రణాలు కాని నవలలు అవుతాయా? మనకీ చెప్పుకోదగ్గ నవలలు, ఏవో నాలుగయిదు తప్ప ఇంకేమి వున్నాయి! మన జాతినీ మన నీతినీ ప్రపంచ వ్యాప్తంగా చేయ గలిగిన పాత్ర చిత్రణ ఒక్కనవలలో వుంటోందా? ఏదో వ్రాసుకపోతారు! ఏదో చదువుకుపోతారు! ఇల్లా వ్రాసుకు పోవటం కూడా ఒక విధంగా చూస్తే కాలం జరుగుబాటుకే వ్రాస్తున్నారేమో అనిపించకపోదు కదా!' అన్నాడు కేశవ!
'మీరు చెప్పినది ఆలోచిస్తే, నిజమే నన్పించుతోంది! నామటుకు నేను కూడా నా పరిసరాల్లో జరిగిన సంఘటనలని ఏర్చి కూర్చుకుని, రూపు కట్టటానికే ప్రయత్నిస్తూంటాను. నా ఆలోచనా పరిధి అంతవరకే పరిమితమై వుండిపో యింది! ఆలోచనాశక్తి పెరగాలి! వ్యక్తి మనోవికాసం హెచ్చినకొలది, భావాలు కూడా పరిపూర్ణతని సాధిస్తాయి అనుకొంటున్నాను' అన్నాడు మాధవ.
'అది కొంతవరకు సహజచిత్రణే అవుతుంది. నీవు చూసిన ఒక సన్నివేశాన్ని నీవు పొందిన ఒక అనుభూతిని నీవు కధగానో, నవలికగానో మలచ కలిగేవంటే నువ్వు వాస్తవికతా వాదానికి దగ్గరవాడవవుతావు! పూర్వ కావ్యాలలోలాగ స్త్రీ అవయవ, వర్ణనలూ పురుషుల విరహవర్ణనలూ, కోకిల కలకూజితలూ, మేఘరాజులూ, మెరుపు కన్నెలూ ఇవి మానసిక కవాటాలని ఎల్లా స్పృశించకలుగుతాయి? అని ఎప్పటికీ ప్రకృతి సౌందర్యదృష్టిని అలవర్చుకుందామనుకునే రసికులకేగాని సామాన్యుల భావపరిధులకి అందుబాటులో వుండవు! మన ఊహలకందని, సౌందర్య లోకాల్లోని ఆనందపు టంచులకోసం కొరకరాని కొయ్యలాంటి వాక్యాల దిగ్భంధనాలని సడలించుకుంటూ కాలాన్ని వ్యయపరిచే బదులు మన కళ్ళముందు జరిగే అకాల అనాచారములని మన మెదడు తేలిగ్గా స్వీకరించే పదాలతో చదువుకొని జీర్ణించుకుంటే చాలనుకుంటాడు నేటి వ్యక్తి! నిత్యం అనేక సమస్యలతో సతమతమయిపోతూ జీవితపు పరుగుపందెంలో ఓడిపోతూన్న నేటి మధ్యతరగతి వ్యక్తికి పూర్వకాలం వాళ్ళల్లా బొజ్జలనిండా బ్రేవుమంటూ త్రేనుపులు వచ్చేలా తిని తీరిగ్గా పచ్చకర్పూరపు విడియాలు సేవిస్తూ నవరస ఖండాలన తగ్గ పద్యపాదాలు విరిచివిరిచి చదువుకొని అర్దాలకి మళ్ళీ టీకా తాత్పర్యాలు చదువుకోగల తీరిక వుందా?
అందుకని నేటి నవలల్లో సాంఘిక సమస్యలు కంటే కూడా ఎక్కువగా సంసారిక సమస్యలే ప్రాధాన్యత వహిస్తున్నాయి అనుకోవచ్చును. ఇది కూడా ఒక రకమైన పురోగతే ప్రజలూ, సాహిత్యమూ, సన్నిహితము కావటము పురోగతి కాదా!' అన్నాడు కేశవ.
వీళ్ళు సమకాలీన సాహిత్య సృష్టి గురించి చర్చించుకుంటూంటే కామేశ్వరి లోపల సీతమ్మగారివద్ద కువెళ్ళి కూర్చుంది.
'నళిని ఏం చేస్తోందమ్మాయ్!' అంది సీతమ్మ.
'ఎవరో వచ్చారు మాట్లాడుతోంది!' అంది కామేశ్వరి.
'చూడు! పెద్దదాన్ని ఒకమాట అంటాను. మనసు కష్టపెట్టుకోకు! నీకు పెళ్ళయిందికదా! ఇంక నీకు కాలేజీ చదువులు అనవసరం. పెళ్ళి కాకపోతే ఎల్లానూ పెళ్ళయేదాకా ఇంట్లో కూర్చుండి ఏం చేస్తారు ఆడపిల్లలు అని కాలక్షేపం కోసం చదువుకోక తప్పదు! ప్రొద్దునన్నగా కాలేజీకి వెళ్ళి సాయంకాలం దాకా మీ రిద్దరూ ఇంటికి రాకుండా వుంటే ఈ కోటలాంటి ఇంట్లో నేను వక్కర్తినే పడివుండాలి! నళిని చిన్నపిల్ల, పైగా పెళ్ళికాని పిల్లది! అది చదువు కుంటుంటే ఫరవాలేదు. ఏదో పెళ్ళి కుదిరేదాకా చదువుకుంటుంది. దానితో నీకు వంతా! నిక్షేపంలాంటి పిల్లని! హాయిగా చీకూ చింతా లేకుండా సంసారం చేసుకోవాల్సినదానివి! చదువులూ అంటూ ఆడా మగా చేయీ చేయీ రాసుకు తిరుగుతూ కాలేజీలమ్మట తిరిగి నలుగురిచేత నాలుగుమాటలూ అనిపించుకోవాల్సిన ఖర్మ ఏం వచ్చింది? నాలుగు మాటలూ వింటే ఏమో బ్రహ్మకైనా పుట్టురిమ్మ తెగులు అన్నట్లు కేశవకి కూడా ఏమన్నా అనుమానాలు పుట్టే యంటే సంసారం అల్లకల్లోలం అయిపోతుంది. అంతా విచ్చిన్నం అయ్యేక నీకు దారీ తెన్నూ ఏమి వుంటుంది? ఏదో పెద్ద దాన్ని! మీరు కలకాలం సుఖంగా వుండాలని అన్పించి చెప్పాను. కోపం పెట్టుకోకు!' అంది సీతమ్మ.
కామేశ్వరి శుష్కహాసం చేసింది.
'కోపం ఎందుకు? మీరు ఆలోచించి చెప్పారు' అంది.
సీతమ్మ ప్రేమగా నవ్వి అంది.
నాకు తెలుసు! నీవు వివేకవంతురాలివి!' అంది. కామేశ్వరి మాట్లాడలేదు. భర్త అనుమతి ఇస్తేనే తాను చదువుకుంటున్నది. పోనీ బి.ఎ. వరకూ చదువుకుందామనుకున్నది. నళినికి కూడా తమ కాలేజీలో జేరటం ఇష్టంలేదు. అంచేతనే కాలేజీలో తనతో అంటీ ముట్టనట్లు ప్రవర్తిస్తుంది. ఇప్పుడు తనకి చదువు అంత ముఖ్యం కానేకాదు. ఎల్లానో మూడుముళ్ళూ పడ్డాయి! ఆ బాంధవ్యాన్ని పవిత్రంగా భావించుతూ బ్రతికున్న నాలుగురోజులూ నిలుపుకోగల గాలికి చదువుకుంటే తనకి వచ్చేలబ్ది ఏమిటి? ఉద్యోగార్హత వస్తుంది! ఉద్యోగార్హత కలిగిన స్త్రీలు ఆర్దికంగా తమ ఇష్టానిష్టాలని జరుపుకోగల సమర్దులై వుంటారు. ఇప్పుడు తనకి జరుగుబాటు లేకుండా వుండలేదు కదా!' అనుకొంది కామేశ్వరి.
పెళ్ళికాని రోజుల్లో కామేశ్వరికి ఎన్నెన్నో కోరికలు గుండెల్లో గూళ్ళు కట్టి కాపురం చేసేవి! తనలో అంతర్గతంగా ఎంతో ప్రతిభ ఉందనీ అది ఉజ్జ్వలమైన చూపు ధరించటానికి తన తల్లితండ్రులు తగిన దోహదం చేయటం లేదని పైగా తనని సామాన్య బాలికలా పరిగణించి మూడుముళ్ళ వలలో బందీని చేయాలనే ప్రయత్నం చేస్తున్నారనీ విసుక్కునేది! చూపులకు వచ్చిన ప్రతి పెళ్ళికొడుకు తన్ని తిరస్కరించి వెళ్ళిపోవటంతో ఆమెలో ఒకవిధమైన ద్వేషభావము రగుల్కొనేది! తను బాగా చదువుకోవాలని సంఘసేవికయై స్త్రీ జనభవిష్యత్తుకు కాంతి కిరణంగా వుండే బాటలు ఏర్పరచాలనీ తన పేరు దేశదేశాలా మారు మ్రోగుతూండి పోవాలనీ అప్పుడు తన్ని పరిణయమాడ తిరస్కరించిన పెళ్ళికొడుకు లందరూ-
'తాము తిరస్కరించిన కన్య ఎంత విజ్ఞాన ఖనియైనదో!' తెలుసుకుని విస్తుబోవాలనీ కలలు కనేది! పెళ్లికాని పిల్లలు జీర్తిని వరిస్తారు! మరిగృహస్థ జీవనులైన తర్వాత ఆ పిల్లలే సంసారపు సుఖశాంతిని అన్వేషిస్తారు.
'రేపట్నించీ కాలేజీకి పోనులెండి అత్తా!' అంది కామేశ్వరి.
'నాకు తెలుసు! నీ అణకువా మంచితనం! వసు నాకు తగ్గ కోడల్ను వెదకింది! నీ కడుపున నాలుగు కాయలు కాస్తే చూస్తాను. అంతకన్న ఈ పెద్ద వయసులో నాకేం కావాలి అమ్మాయ్!' అంది సంబరంగా సీతమ్మ.
* * *
జగదాంబా వాళ్ళ సంసారం బాగానే జరిగిపోతూంది. దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు వొచ్చాయి. వెళ్ళాయి. పండుగలకి కూతుర్ని, అల్లుణ్ణి పిలవాలనీ అనుకుంది. కానీ, నరసయ్య వొప్పుకో లేదు.
'వాళ్ళ అంతస్తు ఎక్కడ? మన అంతస్తు ఎక్కడ? అంతటి ఆయన్ని ఎల్లా పిలుస్తాం? పిలిచి మనం ఎల్లా సత్కరిస్తాం?' అన్నాడు. అంచేత ఆ ప్రసక్తి ఎత్తటం మానుకోవలసి వచ్చింది. పోనీ కామేశ్వరి నెలా గిలా తప్పినట్లు వార్తలు వస్తాయేమో అని ఎదురుచూసేది కానీ, అల్లాంటి వార్తలు కూడా సంవత్సరం గిర్రుమని తిరుగు తోన్న నరసమ్మకి అందటంలేదు! జగదాంబకి కూతురిమీద జాలి వేసింది. 'వెర్రి మొహం! ఏం తిప్పలు పడుతూందో! ఏదో భాగ్యవంతుల ఇంట్లో పడింది కదా అని వూరుకుంటున్నాం! ఏం చేస్తూందో!' అనుకునేది. సుభద్రకి కూడా అక్కగారి సంసారం ఎల్లా వుందో చూడాలని బుద్ధి పుట్టేది.
'అమ్మ! అక్కని రమ్మని ఉత్తరం వ్రాయవే! నాకు చూడాలని వుంది. లేకపోతే నన్ను పంపియ్యి! నేను అక్కదగ్గరికి వెళ్తాను' అని సాధించటం మొదలెట్టేది.
'పెళ్ళికాని పిల్లవి! అల్లా బంధువుల ఇంటికి వెళ్ళటం బాగుండదు! నేనే అక్కని పిలిపిస్తాను సంవత్సరమయి పోతోంది పెళ్ళయి వెళ్ళి! పిలిచి నాలుగు చీరలన్నా పెట్టి పంపకపోతే తప్పుకదా! మనకే మంచిది! ఆడపిల్లకి పసుపు కుంకుమా క్రింద మనకి తోచినది ఇస్తే!' అంది జగదాంబ!
కామేశ్వరి పుట్టింటి పిలుపు గురించి సీతమ్మతో చెప్పింది.
'అయ్యో! పెళ్ళయిన ఏడాదికి తనకో కూతురున్నట్లు గుర్తు వచ్చింది కాబోలు మీవాళ్ళకి! పండగలరోజులు వెళ్ళిపోయేక పిల్చారేం? ఏమీ పెట్టక్కర్లేదనా!' అంది. కామేశ్వరి ఏమీ బదులు చెప్పలేదు. ఆమె మౌనంచూసి సీతమ్మ అంది.
'మీ ఆయన్ని అడుగు తల్లీ! వాడిదే ఇష్టం అంతా. నాదేం లేదు!' అంటూ సీతమ్మ సాగదీసింది.
* * *
