పాపం-అనుకుంది. తన భోజనం ముగించు కుని విశ్రాంతిగా పడుకుంది? బాగా అలసిన ప్రాణం. మెత్తటి పరుపు మీద పవ్వళించగానే నిద్రపట్టిందామెకు.
ఆ ఎద్దు పొడిచిన పిలతాలూకు వాళ్ళంతా ఏడుస్తున్నారు. పిల్ల ప్రాణంతోనే వుంది. ప్రేగులన్నీ బైటికొచ్చాయి కొమ్ము పిల్ల క్రింద భాగాన్ని పూర్తిగా చీల్చేసింది.
సర్జన్ మాదప్పకు సహాయంగా డాక్టర్ అన్న పూర్ణ ఆ పిల్లకు నడుం దగ్గర నుంచున్నది. రక్తం ఎక్కించటానికి అంతా సిద్ధంగా వుంది. అనస్తటిస్ట్ "రెడీ" అన్నాడు. కొత్తగా వచ్చిన డాక్టర్లు ఆత్రంతో చూస్తున్నారు.
క్షణంసేపు అందరూ మౌనం దాల్చారు. ఎవరికివారు భగవంతునికి -ఆ "శక్తి" కోసం ప్రార్ధిస్తున్నారు కాబోలు.
ప్రేగులను తొలగించి చూచారు. ఒక్కసారి సర్జన్ మాదప్ప కళ్ళు డాక్టర్ అన్న పూర్ణ కళ్ళలో కలిశాయి. ఆమె కళ్ళు గాభరాగా చలించాయి. అంతే ఎవ్వరూ కూడా ఎంతపెద్ద గాయమో నోటితో అనకుండానే చటుక్కున ఊపిరిపీల్చారు. సర్జన్ తల ఆడించి -చూస్తున్నారు - రక్తపు మడుగులో ఏది ఏదో తెలియని ఆ గందరగోళం లోకి.
"గర్బంసంచి రెండు చోట్ల గాయపడింది." అన్నాడాయన.
డాక్టర్ అన్నపూర్ణ గాజు గుడ్డతో రక్తాన్ని శుభ్రంగా తుడిచింది. కానీ ఆ దెబ్బ అంత చిన్నది కాదు. అండవాహిక (గొట్టం) ఒకచోట చితికిపోయింది.
చాలా పాడైంది. ఇప్పటికే ఇన్ ఫెక్షన్ అయి వుంటుంది..."
వాళ్ళకందరికీ తెలుసు. గర్భసంచిని తీసిపార వేస్తే ఏ గొడవాలేదు - అని - ఆడపిల్ల భవిష్యత్తు అంధకార మైపోతుంది. స్త్రీకి ఆదిపుట్టుక తోనే ఇచ్చిన విధి. చిన్న అమ్మాయి - పెళ్ళి కావలసిన పిల్ల. సమస్య నంత సునాయాసంగా పరిష్కరించడానికి ఎవ్వరికి మనసొప్పదు. ఎలాగైన కుట్లువేసి పూర్తి చేయాలి. తర్వాత భగవంతునిపై భారం వేయాలి.
సర్జన్ మాదప్ప కుట్లువేయటానికి మొదలు పెట్టాడు. అన్నపూర్ణ సహాయం చేస్తోంది. చితికి పోయిన గొట్టాన్ని తీసి బాగున్న భాగానికి చిన్న ప్రేపు ముక్కును అంటించి కుట్టారు. ఈ కుట్టడం చాలాసేపు పట్టింది.
ఆ తర్వాత ప్రతిచీలికను మూసి కుట్టి ప్రేవు లన్నీ లోపల సర్ది కుట్లు వేసేసరికి సాయంత్రం నాలుగున్నర అయింది.
ఆ పిల్లను బల్ల పరుపుగా ఉండే మంచం మీద పరుండ బెట్టారు. డాక్టర్ ఖాన్ రక్తనాళం తీసి. చుక్క చుక్కగా గ్లూగోజు శరీరంలోకి పోయేలా పెద్దసూదిని ఆ రక్తనాళంలోకి దూర్చి అది కదలకుండా కట్టేశాడు. ఆమె చెయ్యి కదల కుండా, మత్తులో కాళ్ళు కదపకుండా మంచానికి స్ట్రాప్స్ తో కట్టేశారు. వెల్లికిలా పడుకుని ఉందాపిల్ల. ఇంకా మత్తువదల్లేదు, డ్యూటీ నర్సు వేయి కళ్ళతో ఆ పిల్లను కనిపెట్టుకుని చూస్తోంది.
కుమార్ ఇల్లు చేరేసరికి ఐదు గంటలైంది. మంజు లేదు. నౌకరు భోజనం తెచ్చి పెట్టాడు. భోంచేసి కాసేపు విశ్రాంతిగా కళ్ళుమూసుకున్నాడు. ఆ అమాయికమైన ముఖం కళ్ళలో మెదిలింది. ఆ పిల్ల ఈ బాధకు తట్టుకోగలదా? ఏ ఇతర బాధలు, ఇన్ ఫెక్షన్ లేకుండా బాగయితే ఒక అద్భుతమే అనుకోవచ్చు. ముఖ్యంగా గర్భసంచిని ఎంత సుకుమారంగా కుట్టారు? ఎంతశ్రద్దా సక్తులతో కుట్లువేశారు? ఇంత ఇదిగా ఎద్దు పొడవటం తానింతవరకు చూడలేదు-
ఆరుగంటలకు తన వార్డులోని రోగులను పరామర్శించటానికి వెళ్ళాడు. మంజుకోసం కళ్ళు వెతికాయి. ఒక నర్సు ఎదురొచ్చింది.
"డాక్టర్ - కాన్పు కేసు-బిడ్డ కడుపులోనే పోయింది. రావటంలేదు. ఆయుధాలు వేశారు డాక్టర్ మంజుల. లాగలేక పోతున్నారు. డాక్టర్ ఖాన్ ఆపరేషన్ జరిగిన పిల్ల దగ్గరున్నారు. మీరు వస్తారా -లేక డాక్టర్ అన్నపూర్ణ..."
అంతలోకి వారు కాన్పు గది సమీపానికే వచ్చారు-
"ఒద్దు-ఆమె చాల అలసి ఉన్నారు....నేను వస్తాను గానీ....డాక్టర్ అన్నపూర్ణగారితో చెప్పితే మంచిది! అలా తెల్పటం తమ విధి.
హెడ్ నర్సు క్లోరోపార్మ్ యిస్తోంది. కుమార్ మంజుకేసి చూచి ఏ విధమైన బావము ప్రదర్శించ లేదు. చేతులు కడుక్కుని గ్లౌస్ (చేతితొడుగులు) వేసుకొన్నాడు. నర్సు తెల్లటి ప్లాస్టిక్ ఏప్రెన్ అందించి - టేపులు కట్టింది.
"బిడ్డ చనిపోయిందని వాళ్ళవాళ్ళకు తెలుసా?"మంజును అడిగాడు. ఈ మనుష్యులు "బిడ్డను" చంపేశారు" అంటారు కడకు. మంజు మెల్లగా అంది. "తెలుసు, అసలు-వచ్చినప్పుడు నొప్పులంతగా లేవు. ఇంజక్షన్ లు ఇచ్చిన మీదట అ ఆమాత్రంగా వచ్చాయి. ప్రొద్దుట నించి బిడ్డ కదలిక తెలీలేదట ఈమెకు. నాటు మంత్రసాని ఏదో పొరపాటు చేసిందంటారు.... కానీ....చూడండి..." అంటూ మంజు ప్రక్కకు తొలగింది.
కుమార్ కు చూడగానే తెలిసిపోయింది. బిడ్డ తల విపరీతంగా పెద్దదిగా ఉంది. సహజంగా రాదు అన్నమాట. బాగా నీర్ పట్టింది. కుమార్ క్షణం భార్యకేసి చూశాడు. ఇద్దరికీ తెలుసు వారేం చేయవలసినది-మంజు చటుక్కున కళ్ళు వాల్చేసుకున్నది.
కుమార్ కు అర్ధమైంది. తను చేయలేక పోతుంది-బీరువై పోయింది. బిడ్డ తలకు రంధ్రం చేసి నీరు కార్చేసి బైటికి తియ్యాలి.
మరొక నర్సు డాక్టర్ కు ఆయుధాల్ని అందిస్తోంది. అందరు సిద్ధంగా ఉన్నారు. మంజు చూడదలంచుకోలేదు. పైకి జరిగి పేషెంటు నాడి పరీక్షించే నెపంమీద అక్కడే నుంచుంది.
ఎంతసేపైందో! ఒక్కసారైన మంజు వెనక్కి తిరిగి చూడలేదు. అలాగే నుంచుని వుంది.
కుమార్ అంటున్నాడు "సిస్టర్ - బిడ్డను గుడ్డల్లో పూర్తిగా చుట్టి ముఖం తప్ప మరేమి అగుపించకుండా బైటికి తీసుకెళ్ళి చూపించు. ఆడపిల్ల అని చెప్పు."
ఆయా బిడ్డను బందోబస్తు చేసినట్లు చుట్టింది. మంజు శిలాప్రతిమలా నుంచుని వుంది.
బాగా రాత్రి అయింది. కుమార్ గ్లౌస్, గౌన్, తీసేసి మంజు నడుముచుట్టు చేయివేసి - మంజు పద అన్నాడు.
ఆమె మారుమాట్లాడకుండా భర్త కు నమస్కరించింది.
మధ్యదారిలో భర్తచెయ్యి గట్టిగా పట్టుకుని అంది. "నాలో మన పాప మెదులు తూంటే...చేయలేక పోయాను...ఎందుకో!" కుమార్ ఏమీ అనలేదు. ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు ఆ స్పర్శ చాలు ఆమెకు సింహబలం ప్రసాదించేందుకు. ఆమెకు ఎక్కడలేని ధైర్యం వచ్చింది. తను చేతకాని డాక్టర్ కాదు - తనను అర్ధం చేసుకొనే వారున్నారని తెలుసు - ఆమె ఎంత డాక్టరైనా, ఎన్ని కాన్పులు చేసినా, ఎన్ని బాధలు కష్టాలు చూచినా తను స్త్రీ-అంతే- ఉన్న ట్లుండి ఆమెకు ఎక్కడలేని హుషారు పుట్టుకొచ్చింది. వారిద్దరికీ చటుక్కున జ్ఞాపకం వచ్చింది. ఆరోజంతా వారిద్దరు ఒక్క నిముషము సావధానంగా, సంతోషంగా మాట్లాడుకోలేదని, ఒకరి సాన్నిధ్యంలో మరొకరు గడవలేదని. ఇలాంటి రోజులు అప్పుడప్పుడు తటస్థ పడటం కద్దు?
ఇంటి తలుపు తెరచి లోపల అడుగుపెడ్తోనే కుమార్ బాహువులు మంజును చుట్టుకున్నాయి.
ఆమె చెవిలో రహస్యంగా అన్నాడు "ఈ రాత్రికి ఏ కేసు రాకూడదు."
* * *


ఆదివారం - సాయం సమయం - ఆ రోజు సాయంత్రం అందరికీ ఖాళీగా ఉంది. క్రొత్తగా వచ్చిన డాక్టర్ ప్రమోద్ కు డ్యూటీ.
హాస్పిటల్ కు పశ్చిమదిక్కున వున్న సుందరో ధ్యానవనం అది. అత్యంత మనోహరంగా విరులు విరియ బూచాయి. నీరెండలో, నృత్య కేళీలో లీనమైన బంగారు బొమ్మల్లా - సుగంధ సమ్మిళితమైన వాతావరణంలో చల్లని పిల్ల వాయువుల మురళీ నాదంలో నాట్యం చేస్తున్నాయా వికసించిన పూలు.
గార్డెన్ చెయిర్స్ లో అందరూ ఆసీనులై కబుర్లు చెప్పుకుంటున్నారు. కళ్యాణి భాస్కర్, మూర్తికూడా ఉన్నారు.
మంజులకు చెల్లిని చూడగానే తన వారంతాజ్ఞాపకానికొస్తారు. తల్లిదండ్రులు, తోబుట్టువు లెలా వున్నదీ అడిగి తెలిసికొనేది. అమ్మ గుర్తుకు రావటంలో ఏదో తెలియనిబాధ ఆమె నావరించేది. గేటు తీస్తున్న చప్పుడైతే అందరు ఆ వేపుగా చూచారు - ఖాన్ తలొంచుకుని చేతిలో పెద్ద ప్లాస్క్ పట్టుకుని వచ్చాడు. దగ్గరకొచ్చి ఖాన్ కుర్చీలో కూలబడిన తర్వాత కూడా ఎవరినీ పలుకరించలేదు.
భాస్కర్ ముందు మాట్లాడాడు, "మా అక్క గారిమీదికి మనసు మళ్ళినట్లున్నదే?"
"నీ నోట్లో కస్ ఐస్ క్రీమ్ పొయ్య? మీ అక్క మీదికి మనసుపోతే బాగానే వుండునోయ్ బావ మర్దీ - మరి మరో పురుష పుంగవుని మీదికి పోతోంది."
ఖాన్ ఒక్కసారి మంజుకేసి చూచి "నీకోసం ఐస్ క్రీమ్ తెచ్చానమ్మా -నీవు తిన్నాక మిగిల్తే మాకు పెడితే తింటాము. "మంజు ఫ్లాస్క్ అందుకుంది. పేపర్ కప్పులు - చెక్క స్పూనులు జేబులోంచి తీసి బల్లమీద పెట్టాడు.'
"ఎవరా పురుషుడు? ఏమా కథ'
"ఐస్ క్రీమ్ తిన్నాక"
"అది మంజు తిన్నాక కదా!" కుమార్ చాల సీరియస్ గా అన్నాడు. "మంజు తిన్నాక నాకుతప్పక మిగుల్తుంది....మీకు మిగలదేమో ఖాళీ కప్పుల్ని చూచి చప్పరించుకోండి" ఖాన్ హాస్యంగా మాట్లాడుతున్నా అతడిలో ఏదో విషయం కుములుతోందని అందరికీ తెలిసిపోయింది.
మంజు అన్నికప్పులు నింపింది. తలకొకటి తీసుకున్నారు.
ఖాళీచేసేవరకూ ఎవ్వరు ఏమీ మాట్లాడలేదు.
"బలే సస్పెన్స్" మూర్తి జేబురుమాలుతో మూతి తుడుచుకున్నాడు.
"మా అన్నయ్య ఒక అమ్మాయిని పెళ్ళి చేసికోబోతున్నాడు"
"ఇంకా నయం అబ్బాయిని చేసికు......" భాస్కర్ అంటూండగానే.
"ఆగు-ఆ....ఆగు అమ్మాయి ఒక రెడ్డిగా రమ్మాయి.....సరేనా? ఇప్పుడను....." ఖాన్ ధీమాగా చూశాడు.
క్షణం అందరు మౌనం దాల్చారు. చాల ఆశ్చర్యంగానూ ఉంది కుమార్ అన్నాడు "ఇక నేం..." ఏదో అనబోయి గబుక్కున ఖాన్ కేసి వింతగా చూచాడు. "మీ అన్నయ్యకు పెళ్ళయి నట్లు పిల్లలున్నట్లు తెలుసు ఇంకెవరైనా..."
"అహ....ఇంకెవరూ లేరు....ఆ అన్నయ్యే"
"ఏ అన్నయ్య-ఏమా కథ మూర్తి ముందుకు వంగాడు.
