కాఫీ టిఫిన్లయ్యాక, "అలా వెళ్ళొస్తాం" అని చెప్పి, అడయార్ బీచికి కారు మీద చేరుకున్నాము. జనం లేని చోటు చూసుకుని కూర్చున్నాక, భాస్కరం తన కొడుకు సంగతి తో ప్రారంభించి, వాడికి పెళ్ళి చెయ్యాలని, ఏ పిల్లని చూపించినా వద్దంటున్నాడని చెప్పి, "ఒకవేళ ఎవరినైనా ప్రేమించాడేమో" అన్నాడు.
'ఆలోచనదేనికి? అడిగేస్తే పోలా" అన్నాను.
"పోతుంది. కానీ ఎలా అడగడం?"
"ఎలా ఏవుంది? 'అబ్బాయ్ , నీకు పెళ్ళీడు వచ్చింది. ఎన్ని సంబంధాలు చూసినా వద్దంటున్నావు. అసలు నీ మనస్సులో ఉన్నదేమిటి? ఒహవేళేవర్నయినా ప్రేమించావా? ప్రేమిస్తే చెప్పు కుల గుణగణాలు సరిపోతే నాకేమీ అభ్యంతరం లేదు" అని నిండుగా అడిగై" అన్నాను.
భాస్కరం అవునంటూ తలూపాడు.
తరువాత, "ఈ మద్యనో విశేషం జరిగింది.' అంటూ ప్రారంభించి, "రమణ దగ్గర నుంచి ఒక వుత్తరం వచ్చింది అన్నాడు.
"ఏమని" అన్నానాత్రంగా.
"ఏముంది? మామూలే అనుకో. ఈ రకంగా డబ్బు సహాయం చేయడానికి కారణం ఏమిటో తనకు తెలిస్తే ఆత్మతృప్తిగా వుంటుందని , తరువాత నన్ను ప్రత్యేకంగా మా యింట్లో కలుసుకోవాలని మా ఆవిణ్ణి వాళ్ళను చూడాలనుందనీ రాశాడు."
"ఏమని రాశావు" అన్నాను.
"ఏమని రాయడం ఏవుంది? ఆ సాయంత్రమే మెడికల్ కాలేజీకి వెళ్లాను. అతన్ని కలుసుకున్నాను. నన్ను చూసి , బ్రహ్మానందపడ్డాడు. నా మేలు తను జన్మజన్మాలకి మర్చిపోనన్నాడు. తనకి అంత వుదారంగా సహాయం చేసిన నన్ను నా కుటుంబాన్ని అందర్నీ చూడాలనుందన్నాడు. నే చేసే దానం గుప్తంగా వుండడం బాగులేదని అన్నాడు. నా నోట్లో వెలక్కాయ పడ్డట్టయ్యింది. ఇంటికి వచ్చి నానా ఆర్బాటం చేస్తే, సుమతి హడలి పోతుంది. ఏవిటీ దంతా అంటుంది. ఏమని చెప్పాలో తోచక, కాస్సేపాలోచించి ఓ పధకం వేశాను."
ఏమని చేశావు" అన్నాను ఆత్రం పట్టలేక.
భాస్కరం ఊపిరి గట్టిగా పీల్చి, వదిలేసి మళ్ళీ ప్రారంభించాడు.
"అది నలుగురికి తెలియకూడదనీ, అసలు దానం చేసేది నేను కాదనీ, అడబ్బుకి కాపలాదారుణ్ణి మాత్రమే ననీ కనుక నా గొప్పదనం ఏమీ లేదని చెప్పాను"
"ఆ తరువాత?'
"అతను చాలా నిరుత్సాహపడ్డాడు. తనకి యింత వుదారంగా దానం చేస్తున్న వ్యక్తిని తను చూచి తీరాలని , ఆనైనమైనా చెప్పామనీ ప్రాధేయపడ్డాడు. నేను కాస్సేపాలోచించి, "అలాగ ఆవేశపడక నీ కధ చెప్తాను విను అంటూ ప్రారంభించాను...."
"చెప్పెసేవా" అన్నాను నే నాందోళనతో.
భాస్కరం నవ్వాడు. నా అమాయకతకు నవ్వాడు.
"భలేవాడివి. ఎలా చెప్తాను! విను. ఓ కధ కల్పించి చెప్పాను" అంటూ తిరిగి ప్రారంభించాడు.
"ఓ వూళ్ళో ఓ జమిందారుండేవాడు. అయన ఒక హైస్కూలు కు వెళ్ళారు. ఆ స్కూల్లో నువ్వున్నావు. అయన కొడుకు చిన్నప్పుడు చనిపోయాడు. ఆ కొడుకు పోలికలో నువ్వున్నావు. అంతే. ఆనాటి నుంచీ నీ బాధ్యతలన్నీ ఆయనే తీసుకున్నారు. చదువు తిండి, బట్టా అన్నీ ఆయనే భరిస్తున్నారు అయితే ఆ డబ్బుకి నేను కాపలాదారుణ్ణి మాత్రమే అని చెప్పాను. అతను ఆ జమిందారు ఎడ్రసు యివ్వమని పట్టుబట్టాడు. నేను మరో క్షణం అలోచించి, అయన కొంత డబ్బు నీ పేర బ్యాంకులో వేసి అది నీ ఖర్చుకు నెలనెలా, యిమ్మని చెప్పారు. ఫారిన్ వెళ్ళిపోయారు. అక్కడ నుంచి కొన్నాళ్ళు నాకు ఉత్తారాలు వచ్చాయి. ఆతరువాత రావటం లేదు. బహుశా మరో దేశానికి మారి వుంటారనుకుంటాను. పైగా నీ చదువయ్యేవరకూ పేరు గుప్తంగా వుండాలనీ, తరువాత తనే నీకు పరిచయం అవుతానని చెప్పారు. కనుక అయన పేరు నేను చెప్పలేను అన్నాను. దాంతో రమణ నీరసపడి పోయాడు" అన్నాడు భాస్కరం.
6

నేను నిట్టుర్చాను.
ఒక్క అబద్దాన్ని కప్పి పుచ్చడానికి ఎన్ని అబద్దాలాడాలో! ఏవిటో నా జీవితం! తెగిన గాలిపటం లా ఎక్కడ ఎప్పుడు ఏ పొదలో ఆపదలో చిక్కుకుంటుందో"
"ఏవిటాలోచిస్తున్నావు" అన్నాడు భాస్కరం.
"ఆలోచించడానికే వుంది. బూడిద. ఒక్క అబద్దాన్ని కాయడానికి ఎన్ని వేల అబద్దాలాడాలో అని అనుకుంటున్నాను." అన్నాను. నాతొ పాటు అతనూ నిట్టూర్చాడు.
"మరో విశేషం జరిగింది" అన్నాడు.
"ఏవిటీ' అన్నానాత్రంతో.
మా సూర్యానికి , రమణ కి మంచి స్నేహంట. ఎలాగ కలిసిందో. ఓనాడు నేను బజారు నుంచి వచ్చేసరికి మా యింట్లో రమణ, సూర్యం కలిసి కబుర్లు చెప్పుకుంటున్నారు. నన్ను చూసి, అతను అతన్ని చూసి నేనూ ఆశ్చర్యపోయాము. ఈ సంగతంతా అతను సూర్యానికి చెప్పాడనుకుంటాను. సూర్యం సుమతితో చెప్పుంటాడు. సుమతి నన్ను అడిగింది. నాకు డిక్కపడిన త్లయ్యింది. "ఏం? మీరేదో అంత పెద్ద ఘనకార్యం వెలగ బెటున్నారని నేను తెలుసుకోకూడదా! అంత పెద్ద జమిందారేవడు బాబూ. మా వాసు కాదు కదా. అతనికి ఒక్కడేగా కొడుకు పైగా వైజాగ్ లో చదువు కుంటున్నాడు కాదూ" అనడిగింది. ఆలస్యం చేస్తే సుమతి నిజాన్ని పసికట్టి వేస్తుందేమోనని భయం వేసి ఆదాత వేరే వ్యక్తీ. పొమ్మని బుకాయించేసరికి ప్రాణం పోయిందనుకో" అన్నాడు.
"నిన్ను చాలా శ్రమ పెడుతున్నాను భాస్కరం, నన్ను క్షమించాలి" అన్నాను. భాస్కరం నాకేసి ఆశ్చర్యంగా చూసి, "ఏమిటా వెర్రి! ఇందులో శ్రమా లేదు. ఫలితమూ లేదు. నా పనులు నేను చూసుకోవటం లేదు. లేనిపోని చాదస్తాలు పెట్టుకుని, బుర్ర పాడుచేసుకోక... లేలే... పోదాం" అన్నాడు నా భుజం తట్టి. నేను యాంత్రికంగా లేచాను. ఇద్దరం ఇసకలో నడుస్తూ మౌనంగా కారు చేరుకున్నాము. కారు స్టార్టు చేశాను. నా మనస్సులో వున్న కోర్కె బయట పెట్టాలని పించింది. రమణను చూసి ఐదేళ్ళ కు పైగా అయ్యింది. అతన్ని చూడాలని చాలాసార్లు అనిపించినా, ధైర్యం చాలక , కోర్కె క్షీణించి పోయింది. అలాంటి దీసారి కోర్కె విజ్రుంభించి, అధిక మయ్యింది. "భాస్కరం , రమణను చూడాలని వుంది. అయితే నేను అతని కంటపడలేను. నాకా ధైర్యం లేదు. అతన్ని ఎక్కడ కైనా తీసుకు వస్తే దూరాన్నుంచి చూస్తాను" అన్నాను.
"తప్పకుండా" అన్నాడు భాస్కరం.
కారు దిగి యింట్లోకి వెళ్ళేసరికి సుమతి మమ్మల్ని చూసి, "ఇంతవరకూ ఆ రమణన్న తను మీ కోసం కాచుక్కూచున్నాడు. ఇప్పుడే వెళ్ళారు" అంది. నా గుండె దడదడ లాడింది. సుమతి నాకేసి చూసి, "నువ్వా రమణన్నతన్ని చూడాలోయ్. అచ్చు నీ పోలికే అనుకో. పాతికేళ్ళ ముందు నీ ఫోటో చూస్తె యీ నాడతను తీయించుకున్నాడేమో అనిపిస్తుందిస్మీ' అంది. నేనామె ముఖం చూడ్డానికి భయపడ్డాను. "ఆహా అలాగా యీ సారి వచ్చినప్పుడు చూడాలి" అన్నాను తప్పనిసరిగా.
* * * *
రాత్రి భోజనాలయ్యాక మేడమీద పక్కల మీదకు చేరాము. భాస్కరం నా మంచం మీద కూర్చుని, "పోనీ సూర్యాన్ని నువ్వే అడిగి చూడకూడదూ, నువ్వంటే వాడికి గౌరవమూ భయమూ , భక్తీ అన్నీ ఉన్నాయి. ఎవంటావ్?' అన్నాడు.
నేనేమంటాను . నాకామాత్రం ధైర్యం వుంటే నా జీవితం యిలా తగులడునా.
"ఏం? పోన్లే..... నేనే ప్రయత్నిస్తాను.' అన్నాడు భాస్కరం నీరసంగా. భాస్కరం బాధపడటం నాకు యిష్టం లేదు. అడిగి తీరాలని నిశ్చయించుకుని, "ఎప్పుడడగమంటావు? ఇప్పుడే అడిగేస్తే మంచిదంటావా" అన్నాను. భాస్కరం ముఖం కళకళలాడింది. "నీ యిష్టం . ఎప్పుడయినా సరే" అన్నాడు. ఇలాంటి విషయాలు రాత్రి పూటే అడగాలనిపించింది నాకెందుకో.
"ఇప్పుడడిగితే నేనలాగ ప్రొఫెసరు గారింటికి వెళ్ళినట్టు వెళ్తాను. కాస్సేపు కూర్చుని వస్తాను. ఈలోగా నువ్వు అడిగై." అన్నాడు. "సరే" అన్నాను నేను. భాస్కరం లేచి వెళ్ళబోతూ , ఆగి, వెనక్కు వచ్చి "జాగ్రత్త సుమీ, వాడసలే పోగరబోతూ" అని వెళ్ళిపోయాడు. నేనో అయిదు నిమిషాలు, ఎలా, ఏమని అడగాలో నిర్ణయించుకుని మేడ దిగి క్రిందకు వెళ్ళాను. వంటింటి పని పూర్తీ చేసుకునివస్తున్నదల్లా సుమతి నన్ను చూసి, "ఏం కావాలి" అంది.
"సూర్యం-- సూర్యం కావాలి. నేను మేడ మీదుంటాను. కొంచెం పైకి పంపు" అనేసి పైకి వెళ్ళిపోయాను. పడకుర్చీలో కూర్చుని ధైర్యం కోసం ఓ సిగరెట్టు వెలిగించాను. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఈలోగా సూర్యం వచ్చాడు. "పిలిచారట . అమ్మ చెప్పింది" అన్నాడు. నేను సూర్యం కేసి చూసి, "అవును" అంటూ కుర్చీలోంచి లేచాను.
సూర్యం చేతులు కట్టుకుని నిలబడ్డాడు.
"మీ నాన్నగారికి వయస్సెంతుంటుంది." అన్నాను.
సూర్యం ఆశ్చర్య పోయాడు.
"చెప్పు" అన్నాను.
చెప్పాడు. "మీ అమ్మకో " అన్నాను. అదీ చెప్పాడు. చేతిలో సిగరెట్టు పారేసి, మరో సిగరెట్టు వెలిగించి, "కూర్చో" అంటూ నేను కుర్చీలో కూర్చుని, అతను కూర్చున్నాక ప్రారంభించాను.
"మీ చెల్లెలు విజయ పెళ్ళయి వెళ్ళిపోయింది. యీ వయస్సు లో మీ అమ్మకు చేతి ఆసరా ఎవరూ లేరు. ఆ సంగతి అలా వదిలై - చేతి ఆసరా కోసమయితే పని మనిషి, వంట మనిషిని పెట్టుకోవచ్చు-- మానసికంగా వాళ్ళు ఎంత బాధ పడుతున్నారో నీకు తెలుసా-- నీ పెళ్ళి వాళ్ళకో సమస్యగా తయారయ్యింది. ఇంట్లో కళకళ్ళాడుతూ నీ భార్య తిరుగుతుంటే చూడాలన్న కోర్కె కోర్కేగానే ఉండిపోయింది." గాంభీర్యం కోసం మరోసారి గాలి పీల్చాను గట్టిగా.
