Previous Page Next Page 
వసంతం పేజి 11


    "అరగంట ఐంది నాన్నా- ఈమధ్య ఎందుకు రాలేదని అడిగాను..." అని, ఆగి పోయింది వసంత.
    "ఆఁ?-"
    "అతనికి దారి తెలియలేదనుకున్నాను, కాని టైము లేక రాలేదుట"
    "నీ కింకా చిన్నతనం పోలేదు" అని ప్రేమగా అని, "వెళ్ళు- గోపాలంతో మాట్లాడాలి" అన్నారు వెంకటరామ్.
    ఆమె వెడుతూ అతనికి కనిపించేలాగ చెయ్యి ఊపి, నవ్వింది.
    "కాఫీ తాగుతావా?"
    "వొద్దండీ. వసంత లెమన్ ఇచ్చింది"
    అదీ ఇదీ మాట్లాడి, చివరికి అనేక ప్రశ్నలు వేసి గోపాలం పరిస్థితులన్నీ గమనించి తెలుసు కున్నారు వెంకట్రామ్, ఆయనతో ఏ విషయం దాచేందుకు వీలులేకపోయింది గోపాలానికి,
    అన్నీ విని ఆయన, "పద టీ తాగుదాం" అని అతన్ని లోపలికి తీసికెళ్ళేరు, వసంత డైనింగ్ రూములో టేబిల్ సర్దుతూంది. ఆమె మళ్ళా బట్టలు మార్చుకుంది. ఈ సారి హిమంకన్నా తెల్లటి చీర, స్లీవ్ లెస్ బ్లౌజూ వేసుకుంది. కొత్త బట్టలు పుట్టినరోజుకి. రెండు జడలు వేసుకుంది. ముభాన్న బొట్టు అంత తెలుగుతనం, అంత అందం చూసి ఆస్థిరుడైపోయాడు గోపాలం.
    టేబిల్ నిండా స్వీట్సు. ఏపిల్స్, కేన్ చేసిన పియర్సు. రక రకాల తినుబండారాలు.
    అతనికి ప్లేటూ, చెమ్చా, నెప్ కిన్, ఇచ్చింది వసంత. ఆమె వేళ్ళుతగిలి అతనిలో వెయ్యి వోల్టుల విద్యుత్తు ప్రవహించింది. కూర్చుని. ఒక స్వీటూ, కొంచెం పకోడీలూ తీసుకున్నాడు గోపాలం.
    "అదేమిటయ్యా! ఇవేళ వసంత పుట్టినరోజు నిన్నొక్కడినే పిలిచాను..... అన్ని స్వీట్సూ రుచి చూడాలి" అన్నారు వెంకటరామ్.
    "అన్నీ తినడం అసాధ్యమండీ..."
    "రసగుల్లా తీసుకో గోపాలం.... కలకత్తా నించి తెప్పించేను. వసంత ఫేవరెట్" అన్నారు వెంకటరామ్.
    వసంత లేచి ప్లేట్లో రెండు రసగుల్లాలూ బాగా రసంపోసి ఇచ్చింది. ఆమె ముఖంలోకి చూశాడు....కాటుక పెట్టుకుంది. తలవొంచుకుని ఒక్కోక్కటే జీడిపలుకు నాజూకుగా నాలికకి అందించుతూంది.
    తల వొంచుకుని ప్లేటు మీద కేంద్రీకరించాడు గోపాలం. పరిస్థితులు తన చెయ్యి దాటిపోతున్నాయనిపించింది.
    తినడం అయాక టీ తయారుచేస్తోంది  వసంత- నిలబడి.
    ఆమెవంక సంతృప్తిగా చూస్తూ, "వసంతకి ఇరవై నిండాయి.....దీని పెళ్ళి చేసేస్తే నాకు శాంతి..... క్రమంగా వైరాగ్యం పొందవొచ్చును-" అన్నారు వెంకటరామ్ పంచదార కలుపుతూ.
    "అంత వయస్సు లేదండీ!"
    "ఎవరికి? వైరాగ్యానికి నాకా? వివాహానికి వసంతకా?"
    అతనూ, ఆయనా నవ్వేరు. వసంత బుగ్గలు అందంగా ఎరుపెక్కేయి. గోపాలానికి గులాబులు జ్ఞాపకం వొచ్చాయి.
    "సీరియస్ గా - గోపాలం- మా ఇద్దరికీ వయస్సులు వొచ్చాయయ్యా. బుద్దిమంతున్ని చూసి వసంతకి పెళ్ళిచేసేస్తే మనసుకి శాంతి....ఈ బంగారుబొమ్మకి వరుడు దొరకడం కష్టం కాదు, ఏం?"
    అవునండీ"
    కళ్ళెత్తి గోపాలం కళ్ళలోకి చూసింది. వసంత. ఎంతో సిగ్గుపడుతోన్నట్టు.
    ఆయన ఇంకేమీ అనలేదు టీ తాగడం అయేదాకా బ్రతికాను అనిపించింది గోపాలానికి.
    టీ  తాగి వరండాలోకి వొచ్చారు అతనూ ఆయనా "దానికి ఇంకా పసితనం పూర్తిగా పోలేదు.... కలకత్తాలో అజ్ఞానం కొద్దీ కాలేజీ వొదిలి రావలసివొచ్చింది.... తెలుసా?" అన్నారు అతని ముఖంలోకి చూస్తూ వెంకట రామ్.
    "తెలుసును" అన్నాడు గోపాలం బాధగా.
    "వసంతని మోసగించడం సుళువు. కాని, ఒక్కటి చెప్పు, నువ్వు పెళ్ళికి ఏర్పాటు చేసుకున్నావా?"
    "లేదండీ. ఇప్పుడు."
    "ఆల్ రైట్ ఆల్ రైట్ ఇందాకా నువ్వు వసంత పక్కన నిలబడ్డప్పుడు ఒక ఫ్లాష్ వొచ్చింది. చిన్నప్పట్నించి నాకు తెలిసిన వాడిని నువ్వు- నీ కారక్టర్ పూర్తిగా తెలుసు నాకు.....నీకూ, వసంతకీ ఇష్టం ఐతే. పెళ్ళిచేసేస్తాను- ఎలా ఉందంటావు?"
    వెయ్యి మైళ్ళ అగాధంలోకి దిగజారుతూన్నట్టయింది అతనికి.
    "ఇప్పుడు నాకు పెళ్ళి..."
    "అదే- లెక్చరర్ గా ఉండడాన్న సమయం కాదంటావు. ఏం?"
    "అవునండీ?"
    "అది ఆలోచించానయ్యా. కలకత్తాలో ఎలాగా మేనేజరు కావాలి. నీకన్న మంచివాళ్ళెవరున్నారు.?
    "కానీ..."
    "వసంత మాటేనా?....అది ఔననాలి అనుకో. కాని నాకూ కళ్ళున్నాయి. కనక దాని జవాబు నాకు తెలుసు".
    "ఆలోచించుకోనివ్వండి"
    "తప్పకుండాను!- ఆలోచించు మీ అన్న గారిని అడుగు. కావలసినంత టైమ్ తీసుకో....నీకు అభ్యంతరం లేకపోతే నేను వెడతాను-మఠానికి, వసంత నీతో ఇవేళ సినీమాకి వెడతా నని చెప్పింది. వెళ్ళండి-నేను అన్నది అంత ఆలోచించు..."
    ఆయన లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుని వెళ్ళిపోయారు. వసంతవొచ్చి, సినీమాకి వెడదామా?" అంది.

                                 *    *    *

                                 13

    చీకటి ఉండగానే తెలివివొచ్చింది గోపాలానికి.     రాత్రంతా గాఢంగా నిద్రపట్టింది....నిన్నను వసంత తనని నిజంగానే పరవశున్ని చేసింది. ఆమె సాన్నిహిత్యం మద్యంలాగ పనిచేసింది అతని మీద. ఆ విచిత్రమైన మత్తులో ఏం జరిగిందో అతనికి సరీగా జ్ఞాపకంలేదు- ఆమె చేతిని తన చేతిలోకి తీసుకోవడం తప్ప. తరవాత ఉండీ ఉండీ ఏదో సంభాషణ సాగింది. తరువాత పదిహేను రోజులు దాకా కలుసుకోవద్దనీ, ఈ సమయంలో ఆలోచించుకుంటాననీ తాననడం కొంచెం జ్ఞాపకం ఉంది.
    లేచి మంచం మీద కూర్చున్నాడు గోపాలం. ఆలోచనల్ని కూడగట్టుకుంటూ......వసంత నిన్నటి స్నిగ్ధ రూపంలోనే, మధురంగా, లలితంగా, మాటి మాటికీ జ్ఞాపకం వచ్చేస్తుంది.
    వెంకటరామ్ గారంటే ద్వేషం పుట్టుకొచ్చింది తన పరిస్థితిని చూసి, తనని ఉపయోగించుకుంటున్నాడాయన. తనని శశిరేఖ నించి....
    పేపర్ వాడు పేపరు పడేశాడు.
    తీసి చూసేడు ఎమ్. ఎ. పరీక్షా ఫలితాలు వచ్చాయి. త్వరత్వరగా చూడసాగాడు. శశిరేఖ ఫస్ట్ క్లాసులో పాసయింది.
    లోపల కాంపిటీటివ్ పరీక్షల ఫలితాలు ఇచ్చేరు. సెంట్రల్ సర్వీసెస్ లో రామానంద్ పేరు కనిపించింది. అతను ఐ.ఎ.ఎస్, లో సెలెక్టు కాలేదు.
    అనేక విషయాలు ఒక్కసారి జరిగిపోతున్నాయి- అదృష్టవంతుడు రామానందం. క్లాస్ వన్ ఆఫీసరైపోతాడు. అతన్ని కంగ్రాట్యులేట్ చెయ్యాలి.
    వొదిన లేచినట్టుంది. లోపల గిన్నెలచప్పుడు అవుతోంది. రాత్రి ఆమెతో ఏమీ చెప్పలేక పోయాడు- సినిమాకి వెళ్ళాననీ, వసంతకూడా వొచ్చిందనీ తప్ప.
    మరో పది నిముషాలు ఆగి లోపలికి వెళ్ళి వొదినతో వార్తలు చెప్పేడు. "ఉదయమే మంచి వార్తలు చెప్పావు. ముఖం కడుక్కునిరా కాఫీ ఇస్తాను" అంది. ఆమె ముఖంలో ఏ భావమూ కనిపించలేదు.
    అన్నయ్య ఆలస్యంగా లేచాడు. వార్తలన్నీ విని. "గుడ్- గుడ్ శశిరేఖ-" అని ఏదో అనబోయి లలిత సంజ్ఞచూసి ఆగిపోయాడు.
    కాలేజీకి వెళ్ళేడు, ఇలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ మీద ఒక లెక్చరిచ్చి మధ్యాహ్నం తలనొప్పిగా ఉందని ఇంటికి వొచ్చేశాడు. ఉదయమే శశిరేఖకి కంగ్రాట్యులేషన్సు చెప్తూ వైరు ఇచ్చేడు.    
    మధ్యాహ్నం అతను రావడం చూసి ఆశ్చర్యపడి లలిత. "వొంట్లో బాగాలేదా గోపాలం?...." అంది ఆతృతగా.
    "లేదు వొదినా- మనస్సులో బాగులేదు. అన్ని విషయాలూ నీకు చెప్పనీ...." అన్నాడు అన్నాడు అలసిపోయి, కుర్చీలో కూర్చుని.
    అన్నీ చెప్పేడు- కన్ఫెషన్ లాగ, వసంత తనలో కలిగించిన ఉద్రేకాన్నీ దాచుకోలేదు. తన బాధలు చెప్పుకోడానికి ఆమె కన్న ఎవరు న్నారు?
    అన్నీ విని చాలాసేపు నిశ్శబ్దంగా ఊరుకుంది లలిత. చివరికి. "నీ జీవితం నీదే గోపాలం- పరాయి వాళ్ళెవరూ సలహా ఇవ్వలేరు."
    "నువ్వు పరాయి దానివి కాదు"
    "ఈ విషయంలో ఔను. కాని, ఒక్కమాట ఆలోచించు శశిరేఖకి ఉత్తరం రాయి. జరిగిన దంతా కాకపోయినా, ఆమెకు చెప్పవలసినది చెప్పు- వెంటనే పెళ్ళిచేసుకుంటే బహుశా నీ సమస్యలు వాటికవే పరిష్కారం అవుతాయి... నీకు వసంత వొద్దని చెప్పే శక్తి ఉందా?"
    అతను తల అడ్డంగా ఊపేడు.
    "నువ్వే ఆలోచించు- శశిరేఖ నిన్ను సుఖపెట్టినట్టు వసంత సుఖపెట్టలేదు. ఆమెని గురించి నీకు తెలిసిన దాని తర్వాత నువ్వూ ఆమె మామూలుగా ఉండలేరు.... వెళ్ళి శశిరేఖని చూచి మాట్లాడకూడదూ".
    "ఆమె నా ఉత్తరానికి జవాబు రాయనే లేదు..."

               
    "అవును.... కాని, వెళ్ళడానికి ప్రయత్నించు మీలో ఈ పంతాలేమిటి?"
    "పంతం కాదు వొదినా.....ఆత్మగౌరవం...."
    "ఆత్మాలేదు- గౌరవం లేదు. ఆ బంగారు బొమ్మ నా మనస్సుకి తెచ్చిన రంగు.... మీ అన్నయ్యతో మాట్లాడకూడదూ?"
    "నువ్వు మాట్లాడు వొదినా..."
    సాయంత్రం అతను రామానంద్ ఇంటికి వెళ్ళి అతనికి కంగ్రాట్యులేషన్స్ చెప్పేడు. చాలామంది అక్కడ ఉన్నారు-అతని ఫ్రెండ్స్.
    అందర్నీ వొదిలి బయటికి వొచ్చి, "శశిరేఖ నుంచి ఇప్పుడే టెలిగ్రాం వొచ్చింది. నన్నూ కంగ్రాట్యులేట్ చేస్తూ" అని చెప్పేడు.
    "గుడ్....ఎప్పుడు వెడతారు?"
    "ఇంకా మెడికల్ ఎలాట్ మెంట్ అవాలి. ఆడిట్ అకౌంట్స్ లో వొస్తుందని అనుకుంటున్నాను.... మీకూ కంగ్రాట్స్ చెప్పాలి."
    ఆశ్చర్యపడ్డాడు గోపాలం. "దేనికి!" అన్నాడు.
    "నిన్నరాత్రి నేనూ వొచ్చాను శ్రీనివాస్ కి... ఎంత బ్యూటిఫుల్ గా ఉంది!" అన్నాడు రామానంద్.
    "ఆమె నా ఫ్రెండ్. అంతే!" అన్నాడు వేడిగా గోపాలం.
    "సారీ.... ఇక్కడి రూమర్స్ మరోలాగ ఉన్నాయి"
    "రూమర్స్ ని నమ్మ కూడదు లెండి.....సారీ....కనీసం ఆశించనివ్వండి... ఎల్లుండి మద్రాసు వెడుతున్నాను. రాగానే కలుసుకుంటాను."
    నీరసంగా బయటికి వొచ్చి ఇంటిదారి పట్టేడు గోపాలం. నిర్ణయాలు అన్నీ అప్పటికే జరిగి పోయినట్టు అనిపించింది అతనికి.    
    చీకటి పడేసరికి ఇంటికి వొచ్చాడు గోపాలం. వొదిన కాఫీఇచ్చి, "మీ అన్నయ్యతో చెప్పేను గోపాలం.....నీ ఇష్టమే ఆయన ఇష్టం" అన్నారు.. అంది,
    కాఫీతాగి, ఒక నిర్ణయానికి వొచ్చాడు. కాగితాలు తీసుకుని శశిరేఖకి ఉత్తరం రాసేడు.
    శశిరేఖకి!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS