ఈ రోజు నా టెలిగ్రాం అందిందని అనుకుంటాను.
నా ఉత్తరానికి నువ్వు కనీసం రెండు పంక్తులు జవాబు రాస్తే చాలా సంతోషించి ఉండే వాడిని. నీ విజయానికి మళ్ళీ అభివందనలు చెప్తున్నాను.
ఈ సాయంత్రం రామానంద్ కనిపించాడు. అతను మద్రాసు వెడుతూ నిన్ను కలుసుకుంటాడని అనుకుంటాను. నా చేతుల్లో లేని కొన్ని పరిస్థితులవల్లే ఇక్కడ రేగిన ఒక వదంతి-వసంత అనే అమ్మాయితో నా స్నేహం గురించి అతను నీతో చెప్పవచ్చును.
మనం వాగ్ధానం లాంఛన ప్రాయంగా చేసుకో పోయినా, ఏదో ఒక రోజున వివాహం చేసుకుంటామని అనుకుంటూవొచ్చాను. నువ్వూ అలాగే అనుకుంటూ వొచ్చావని అనుకుంటాను.
వసంతతో వొచ్చిన కొన్ని విచిత్ర పరిస్థితుల వల్ల తగిన ఉద్యోగం లేకపోయినా ఏ విధంగానూ ప్రస్తుత పరిస్థితి అనుకూలంగా లేకపోయినా, మన వివాహం ఆలస్యం లేకుండా జరిగిపోవాలని కోరుతున్నాను. పరిస్థితులన్నీ విచిత్రంగా ఉండ డాన్న నీ కిలాగ రాస్తున్నాను. నువ్వు కనీసం ఉత్తరం రాసి ఉంటే అక్కడికి వొచ్చిఉండే వాడిని.
ఈ సమయంలోనే ఒకమాట చెప్పనీ.... రామానంద్ మేనర్స్ ఎంత మంచివైనా, అతను నిన్ను మరీ ఇన్ఫ్లూయెన్స్ చేస్తున్నాడని బాధపడుతున్నాను. నీ వార్తలు అతనిద్వారా వినవలసి రావడం సంతోషకరంగా లేదు. ఉండకూడనంత దూరం వొచ్చేసింది మనమధ్య.
ఆతృతగా నీ ఉత్తరంకోసం ఎదురు చూస్తాను.... మరీ ఆలస్యం చెయ్యకు. ఇక్కడ పరిస్థితులు ఈ నిర్ణయం కూడా నా చేతుల్లోంచి జారిపోయే ప్రమాదంఉంది.
ఈ మధ్య నేను మూర్ఖంగా ప్రవర్తించి ఉంటే క్షమించు. వెంటనే ఉత్తరం రాయి.
భవదీయుడు
గోపాలం.
అతని బలవంతాన ఉత్తరం చూసి ఏమీ అనలేదు లలిత. నువ్వు ఆత్మవంచన చేసుకుంటున్నావని అనేంత సాహసం లేకపోయింది ఆమెలో. అతను వెళ్ళి ఉత్తరం Express చేసి. r.m.s లో పోస్ట్ చేసి వొచ్చాడు పెద్ద బరువు దింపినట్లైంది అతనికి.
రాత్రి భోజనం చేస్తూంటే, లలిత "ఉత్తరం పోస్టు చేశావా?" అంది.
"చేశాను- ఆ ఉత్తరం నీకు నచ్చలేదు కాదూ?"
"అప్పుడు నిజంగానే నచ్చలేదు. కాని ఆలోచిస్తే నువ్వు చేసినదే సరైనదనిపిస్తుంది."
"ఎంచేతట?"
"ఈమాట నీతో చెప్దామని అనుకోలేదు కాని మనస్సు పీకుతోంది. శశిరేఖ ప్రవర్తనకి కారణం ఏమిటో ఆలోచించావా?"
"ఆలోచించానని నీకు తెలుసు వొదినా....రామానంద్ మా జీవితాల్లోకి రాకపోతే ఈకలతలన్నీ వొచ్చేవి కావు."
"అదే నీ పొరపాటు...నిజంగా చెప్పు అతను లేకపోయినా, వసంతని నువ్వు చూశాక నీమనసంతా శశిరేఖ మీదని ఉంచగలిగేవాడివా?"
జవాబు చెప్పకుండా అతను భోజనం త్వరగా ముగించి చెయ్యి కడుక్కున్నాడు. లలిత అతని వెనకాలేవొచ్చి- "నీకు బాధకలిగిస్తే క్షమించు. కాని, సముద్రం వొడ్డున కూర్చున్న మనుషులకీ. వీళ్ళలో ములుగుతున్నవాళ్ళకీ. నీటిమీద అభిప్రాయాలు వేరుగా ఉంటాయి." అంది.
అతను మాట్లాడలేదు.
"శశిరేఖ మనస్సు నొచ్చుకున్నందుకు కారణం నీమీద ఆమెకి ఉన్న మమతే.......ఆమె నిశ్శబ్దం కాని, రామానంద్ కి చూసిన ఆదరం కాని, ఈ మాటని అబద్ధం చెయ్యవు. రెండేళ్ళుగా అందరి యువకుల మధ్య కలగని చాంచల్యం ఆమెలో ఇవేళ కలిగిందని నువ్వెలాగ అనుకున్నావు గోపాలం?"
"అన్నీ నీకు తెలుసును"
అవును- ఆమె మనసు మారిపోయిందని అనుకుని ఆ రంగు అద్దాలతో పరిస్థితుల్ని చూడు. అన్నీ ఆ మాటకే ఋజువు చేస్తాయి. కాదనుకుని, నీమీద ప్రేమతోనే ఇది ఒక అధ్యాయం అని ఆలోచించు. నీ మనస్సులోని బాధ నాకు తెలుసును. వసంతని కాదనడం కష్టం......ఒకటి కన్న ఎక్కువ రకాల లక్ష్మి ఆమె.
"నేను నిశ్చయించుకోలేదని నీకు తెలుసును"
"అవునయ్యా-లాంఛనంగా నిశ్చయంలేదు కాని. ఒక్కమాట చెప్పు. శశిరేఖ వచ్చి నీకు క్షమాపణ చెప్తే నువ్వు వసంతని మరిచిపోగలవ్.
"ఆమె క్షమాపణ చెప్పదు-నీకు తెలుసును."
రేపు ఉదయం నేను వెళ్ళి రెండులెంపలూ వాయించి తీసుకొచ్చి చెప్పిస్తాను. అలాగ చేసేదా.
"వొద్దు వొదినా- ఈ వ్యవహారంలో ఇద్దరూ మనసారా ముందుకు రావాలి. బలవంతంగా చేయించే పనికాదు. నీకూ తెలుసును"
చాలాసేపు మాటలాడలేదు. ఆమె మనసు కొంత తేలిక పడింది. కనీసం తాను ఆత్మవంచన చేసుకోలేదని కాని ఆ వెనువెంటనే అదికూడా మరోరకం ఆత్మవంచనే అనిపించింది ఆమెకి.
గోపాలం పుస్తకం చదవసాగాడు.
* * *
14


వారం రోజులు ఎలాగో గడిచిపోయాయి. గోపాలం యాంత్రికంగా గడిపేడు ఆ వారము....లలిత మనస్సులో ఏముందో అతనికి పూర్తిగా బోధపడలేదు. ఆమె అన్నమాటలన్నీ నిజమని తన అంతరాంతరాలలో అతనికి తెలుసును. కాని, విచిత్రంగా ఆమె అతి ఉద్రేకంలో అన్నమాటలని తనని తానే ఊరడించుకున్నాడు గోపాలం.
ఈ ఒడుదుడుకులు అతని ఆలోచనలనిండా అలుముకుని అతనికి శాంతిలేకుండా చేసేయి. ఎలాగో కాలేజీకి వెడుతున్నాడు. పాఠాలు చెప్పి ఇంటికి వొస్తున్నాడు. ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం, వొచ్చిందనే భయంతో, రాలేదనే ఆశతో అతను శశిరేఖ ఉత్తరం కోసం చూశాడు. కాని ఆమె దగ్గరి నించి ఏ ఉత్తరమూ రాలేదు.
నిరాశ ఒకమారూ, రిలీఫ్ ఒక మారూ అతన్ని ఆవహిస్తున్నాయి. అతన్ని వసంత బలంగా, శాశ్వతంగా ఆవరించుకుంది. ఆ సంగతి క్రమ క్రమంగా అతనికి తెలిసివొస్తూంది. ఆమె జ్ఞాపకాల గులాబుల వెనువెంటనే ఆమె గతి తప్పిన జ్ఞాపకాలముళ్ళు అతన్ని గుచ్చుకుంటూనే ఉన్నాయి. కాని రోజురోజుకీ, ఆ ముళ్ళు అతన్ని పెట్టేబాధ తక్కువౌతూ వచ్చింది. ముందర అతను పొందినంత షాక్ ఆమె విషయం అతనికి కలిగించడం లేదు. ఆమె రూపం జ్ఞప్తికి వొచ్చి నప్పుడల్లా, ఆమె కళ్ళూ, ఆనాటి కాటుకా జ్ఞాపకం వొచ్చినప్పుడల్లా ఏదో సున్నితమైన ఆనందం అతనికి కలుగుతోంది. ఝం ఝా మారుతంలాగ తనని మొదట పెనవేసిన ఆమె ఆ సౌందర్యం ఆమె దగ్గరలేనప్పుడూ, ఈ జ్ఞాపకాలలోనూ, మలయమారుతమై ఈ ఆలోచనల వేడినించి ఉపశమనం ఇస్తోంది.
మదించిన యువతి రూపంనించి వసంత మోసగించబడ్డ అమాయకురాలిలాగ అతని తలపుల్లోకి రాసాగింది. ఆ మహా పట్టణంలో, అదుపులేని స్వేచ్చలో, ఆమె అజ్ఞానంలో, ఎవరో యువకుడు ఆమెని మోసం చేస్తే, దానికి ఆమె బాధ్యురాలుకాదని అనిపించింది అతనికి, ఈ ఆలోచన వొచ్చాక క్రమక్రమంగా బలపడసాగింది. చివరికి అదె స్థిరమై, పూర్వపు రేఖాచిత్రాలని చెరిపి, ఆ చిత్రమే అతని మనః ఫలకంమీద ఉండిపోయింది.
నేను వసంతని ప్రేమిస్తున్నాను- అని తనకి తానే చెప్పుకున్నాడు పదేపదే.
లలిత అనుకుంటోంది, వసంత సౌందర్యం విద్యుల్లతలాగ తనని అంధున్ని చేసిందని, లలితకి తెలీదు. మొట్టమొదట ఆ రోజు వసంత తన మనస్సుని ఒక్కసారి తన సౌందర్యంతో ఆక్రమించి, తాత్కాలికంగా తనని అంధున్ని చేసిన మాట నిజమే- కాని, క్రమక్రమంగా తాను కోల్పోయిన విచక్షణని కూడదీసుకుని. ఉద్రేకరహితంగా, నిష్పాక్షి కంగా ఆమెని చూడసాగేడు. ఆ దృష్టితో ఆమెని విమర్శించగలిగేడు. ఆమెలో లోపాలను గుర్తించుకో గలిగేడు - ఈ నిజానిజాలన్నీ గమనించిన తరువాతనే. ఆమె హృదయంలో తన స్థానం గమనించాకనే, ఆమెని తాను ప్రేమించగలిగాడు. ఆమెకు రక్షకుడు కావాలి..... ప్రస్తుతం ఆమె వొడ్డులేని నది లాగ ఉంది. ఆ వయస్సులో, సౌందర్యోత్కర్షలో సిరి సంపదల్లో ఆమె పొరపాటు చెయ్యడం మానవ సహజం..... ఆమె విషయంలో తనకి బాధ్యత ఉంది.
లలిత అనుకుంటుంది. ధనాశతోనే తాను వసంతని వివాహం చేసుకుంటాడని .... కాని. వసంత బీదవారి పిల్లఐనా తాను ప్రేమించి తన జీవితం ఆమెకి అంకితం చెయ్యగలడు...ఆమె ఉద్దేశంలో తాను ఎంత తేలిక మనిషి ఐనా, ఈ విషయంలో తాను అచంచలంగా ఈ మాట చెప్పగలడు.... ధనం కోసం ఆమెని తాను పెళ్ళి చేసుకోవడంలేదు.
కాకపోతే, రూపంచూసి, అంటుంది లలిత'
కావచ్చును తప్పేమిటి? ఆమెలాటి రూపం ఆరాధనకోసం అనునయంకోసం కాకమరేమిటి? అంత చక్కటి మనిషి తన హృదయాన్ని లాక్కుంటే సిగ్గుపడాల్సిన విషయం ఏమిటి?
కాని, బాహ్య సౌందర్యం ఒక్కటే కాదు వసంతలో- నిజం ఒప్పుకునే శక్తి ఆమెలో ఉంది. నిజం చెప్పి ధైర్యం ఆమెలో ఉంది. కాకపోతే కలకత్తాలో జరిగినదంతా తనతో చెప్పాల్సిన అవసరం ఏమిటి ఆమెకి? ఆమె ఒక్కమాటతో తనని ఉద్రేకపెట్టలేదు...తనని శాంతంగా ఆలోచించుకోనిచ్చింది. ఆమెలో ప్రేమ ఉంది. తండ్రిని ఎంతభక్తిగా చూస్తుంది? ఎంత పాశ్చ్యాత్త పద్ధతులు నేర్చుకున్నా ఆమెలో భారతీయత ఉంది. ఆరోజు ఎంత తెలుగుతనం ఉట్టిపడలేదు ఆమెలో?
* * *
మేడమీద గదిలో డైరీ రాసుకుంటూంది శశి రేఖ.
విన్న అతని ఉత్తరం వొచ్చింది. అతను వొస్తాడని ఆశించిన తనకి పెద్ద నిరాశ ఐంది- కనీసం అతనే ఇక్కడికివొస్తే, రెండు ప్రపంచాల మధ్య ఊగులాడుతూన్న మనస్సుని స్థిరం చేసి తనవేపు తీసుకోగలిగేవాడేమో!
అతనిలో నిర్లిప్తత కొంతకాలం నించి ఆందోళన కలిగిస్తోంది. కేవలం అతని ఆర్ధిక పరిస్థితి అని సరిపెట్టుకున్నా, క్రమంగా నాదే తప్పు అని తెలిపింది. లలితతో, చివరికి, చెప్పేక గాని అతను నన్ను చూడడానికైనా రాలేదు.
వొచ్చేక అతన్ని మళ్ళీ పూర్వపు మా లోకాల్లోకి తీసికెళ్ళడానికి మనసారా ప్రయత్నించాను అతను ఏం చెప్పినా, ఏం అడిగినా ఒప్పుకుందామనే నిశ్చయించాను. మా గుండెలు ఒకదాని కొకటి ఆనాడు అత్యంత సమీపంగా వొచ్చినా అతని హృదయం ఎక్కడో ఉందని అనిపించింది.... కాదు. తెలిసింది. రెండేళ్ళనించి అతని ప్రతీ విషయం నాకు తెలుసును. అంత ఋజు ప్రవర్తనగల మనిషిని కాని. అంత ఆప్యాయత ఉన్న మనిషినిగాని చూడలేదని నాకు తెలుసును. కాని, అతనూ మారిపోయాడు.
అతని మొదటి ఉత్తరంలో కనీసం హృదయం విప్పి రాశాడనే ఆశతో చూశాను.... ఎంత నిరాశ! అతని రెండో ఉత్తరంలో నాలో ఏమూలనో మిగిలిన అతనిమీది ఆశ ఒక్కసారి ఎండి పోయింది. మర్నాడు రామానంద్ ఏమీ చెప్పక పోయినా, నేనే అడిగాను వసంత గురించి...
