"ఏ క్షణాన నీ పాలబడిందోగాని అప్పటికి ఛీ మంచిగా బ్రతకాలి. ఎంత కష్టాన్నయినా సరే సహించాలి అని పట్టుదలపట్టింది. పాపం చాలా ఇబ్బందులు యెదురవుతున్నాయి వాసూ" మాల అన్నది.
"నేను తెలియక అలా దొంగతనం చేస్తూంటే యెప్పుడో ఓసారి పట్టుబడే దాన్ని. పోలీసులకి చిక్కితే నా జీవితం ఎంత అధ్వాన్నంగా మారేదో వూహించుకుంటే ఎంతో యేడు పొస్తుంది. వాసుబాబు దేవుడి లాగా అడ్డంపడి నన్ను చక్కదిద్దాడు. ఆయన మేలు ఈ జన్మలో కాదు వచ్చే జన్మలో కూడా తీర్చుకోలేను" అంటుంది.
దీర్ఘమైన నిట్టూర్పు విడిచాడు.
"ఆ అమ్మాయికి ఎంతో సహాయపడాలని మనస్సులో వున్నా భగవంతుడు అవకాశాన్ని ఇవ్వటం లేదు"
"వాసూ అదోలా వున్నావు. ఈ కోకోకోలా తాగు" అంటూ అందిస్తూంటే.
"వద్దు వెంకటేశ్వర్లు అసలు మాలతిని ఆ పరిసరాల్లోంచి బైటికి తీసుకురావాలి. దరిద్రపు పొరుగు. ఓ ఇరవై రూపాయల్లో గది చూడు. అద్దె నేనిచ్చేస్తాను, ప్రయివేటు ఒకటి చూసుకున్నాను. మరోటివీరభద్రం ఇప్పిస్తానన్నాడు. రెండూ కలిపి యాభైకి తక్కువరావు వాళ్ళిద్దరికీ సరిపోతాయి. అలాంటి పొరుగులో ఏ ఆడపిల్లా పరువుగా బ్రతకలేదు ఈ రోజు వాళ్ళ రక్తం కళ్ళజూసే వాడిని. కాని మాలకి ఇబ్బంది అవుతుందని ఆ వెధవల్ని వదిలేశాను. ఒక డబ్బుకే కాదు, మాల చాలా వాటికి కష్టపడుతోంది."
"ఇంతకీ ఈ రోజు యేం జరిగిందీ"
జరిగింది చెప్పేశాడు వాసు,
వెంకటేశ్వర్లు కళ్ళు తేలేశాడు. మిత్రుడిని గట్టిగా పట్టుకుని అన్నాడు వాసూ. అక్కడికి మరెప్పుడూ వెళ్ళబోకు. నీలాంటి వాళ్ళు వెళ్ళ తగ్గ స్థలం కాదు. చాలా అదృష్టవంతుడివి. వాడు చాలా పచ్చిరౌడీ తెలుసా? వాళ్ళతో చేతులు కలిపితే ఎంత ప్రమాదమో తెలుసా?"
మరీ మరీ హెచ్చరించాడు వెంకటేశ్వర్లు.
"పాపం మాల. ఎలా వేగుతున్నదో. కోపిష్టి తండ్రి ఒకవైపు. ఈ రౌడీ మూక మరోవైపు. " వాసు ఆవేదన చెందాడు.
మొన్న మొన్నటివరకూ తండ్రి పెద్దపులి లాగా బిడ్డని రక్షించుకున్నాడు ఈ పక్షవాతం వచ్చిం తర్వాత పాపం.........ఆ ముసలాయనకి సంపాదనా పోయింది. కూతురు సంపాదన మీద బ్రతకాలంటే యమబాధ పడుతున్నాడు.
వెంకటేశ్వర్లు కి బేరం రావడంతో తన పని చూసుకుంటున్నాడు.
మాల యెప్పుడు వచ్చిందో ప్రక్కన నిల్చివుంది.
వాసూ, మాలా ఒక్కక్షణం ఒకర్ని ఒకరు చూసుకున్నారు.
"వాసు బాబూ.... ఈరోజు ఎంత అపాయం నించి బయటపడ్డారూ! మీరు అసలు అక్కడికి యెందుకు వచ్చారు."
"చాకలెట్లు పాన్ లు" అంటూ వచ్చినవాళ్ళు ఆ ఇద్దరినీ వింతగా చూస్తుంటే వాసుకి చికాకుగా అన్పించి.
"మాలా నీతో మాట్లాడాలి అలా వెడదాంరా" అంటూ వెంకటేశ్వర్లుతో చెప్పి అక్కడ దగ్గర లోనే వున్న పార్కులోకి వెళ్ళి పచ్చగడ్డిలో కూర్చున్నాడు.
మాల ముడుచుకు కూర్చుంది.

"మాలా ముందు నువ్వు ఆ ఇల్లు మార్చేయాలి. వెంకటేశ్వర్లు తో చెప్తాను మీ నాన్న అభ్యంతర పెడతాడా ఇల్లు మారేందుకు అసలు నేనువచ్చి ఆయన్ని వప్పిద్దామని అనుకునే అక్కడికి వచ్చాను. కాని మధ్యలోనే....
ముఖం కప్పుకుని వెక్కివెక్కి యేడ్చింది మాల.
వాసు ఖంగారుపడ్డాడు.
"ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావ్....నే వచ్చే సిన తర్వాత ఆ వెధవలు నిన్నే మయినా అన్నారా."
"లేదు. అన్నట్లు తల అడ్డంగా వూపింది.
"మరి."
"ఈ పాపిష్టి దానిమూలంగా మీలాంటి మంచివారికి..."
తేలిగ్గా నవ్వేశాడు వాసు.
"మరేమో అనుకున్నాను. ఫర్వాలేదు. నువ్వు బాధపడకు. నువ్వు సంపాదనకంటూ బయటికి రావద్దు. నీకు ప్రవేట్లుతో నెలకి 50 రూపాయలు వస్తాయి. దానితో జాగ్రత్తగా గడుపుకోండి మీరి ద్దరూ ఆ తర్వాత నాకు మరో మంచి ఉద్యోగం యెలా నూ దొరుకుతుంది. నేను మెట్రిక్ పుస్తకాలు కొన్నాను. నువ్వింక చదువు మొదలుపెట్టాలి. మెట్రిక్ పాసై టైపు నేర్చుకుంటే వుద్యోగం అదే దొరుకుతుంది. ఆ తర్వాత నీబ్రతుకు నువ్వు బ్రతగ్గలవు. అప్పుడు నిన్ను అందరూ యెంత గౌరవంగా చూస్తారో తెలుసా?"
మాలకి ధైర్యాన్ని నూరిపోస్తూ అన్నాడు. వాసు.
"ఎంతమంచివారు" అనుకుంది మనస్సులో.
"మాట్లాడవేం.....నీకు కష్టం కల్గించే మాట లేమైనా మాట్లాడానా మాలా ఒక్కటి గుర్తుంచుకో. నాకు కాస్త ఆవేశం ఎక్కువ. యేదైనా త్వరపడి మాట్లాడినా ఆ తర్వాత చాలా బాధ పడతాను. నువ్వు అపార్ధం చేసుకోవు కదూ."
"వాసు బాబూ ఇప్పటికే మీకు చాలా రుణపడి వున్నాను. ఇంకా మీమీద బాధ్యత మోపడం నావల్ల కాదు. ఏదో ఒక పని చూసుకుని నా బ్రతుకు సాగించుకుంటాను. సమాజంలో గౌరవంగా బ్రతకలేని పరిస్థితే వస్తే చావటమే మేలు. ఇది నా కెప్పుడూ గుర్తు వుంటుంది. ఆత్మగౌరవం కాపాడుకోవటానికి......
"మాలా నిన్ను గాయపర్చాయా నామాటలు" ఆతురత ధ్వనించింది అతని కంఠంలో.
"లేదు వాసు బాబూ సమాజంలో బ్రతుకు తెరువు వెతుక్కునే దృష్టిలో ఒకమెట్టు క్రిందికి జారబోయే నన్ను, మీ చేయూతతో నిలదొక్కుకునేలా చేశారు. అందరూ చేతులు కాలిన తర్వాత ఆకుల కోసం వెతుక్కుంటారు. నాకా స్థితి కలగకుండా రక్షించిన మీకు ఏం చెప్పి నా కృతజ్ఞత తెల్సుకోను."
"ఇంక ఆపేసెయ్యి. మరోమాట మాట్లాడవద్దు. మన పరిచయం మంచికో చెడుకో ఇప్పుడు నాకు తెలియదు. ఇంకా స్థిరత్వం పొందని నువ్వు ఇప్పుడే నన్ను దూరంగా పొమ్మని శాసించకు. నేను చెయ్యగల సహాయం చేశాననే సంతృప్తి నాకు మిగలనీయి. చూశావా నేను యెంత స్వార్ధ పరుడినో..... ఇంకా పొగడ్తలు కట్టిపెట్టి నాన్నకి ఎలావుందో ఏం మందు వేస్తున్నావో చెప్పు....
తండ్రి స్థితి గుర్తు వస్తూనే మాల కళ్ళు అశ్రుపూరితా లయినాయి.
"నాన్న ఎంత మంచివాడో అంత కఠినుడు. మీస్థితి యేమిటో మేం ఎవరమో కూడా తెల్సు కోవాలనే ఆసక్తి అయినా లేకుండా సహాయ పడుతున్న మీ మంచితనం..."
"అబ్బ ప్రతిసారీ ఎందుకు అలా కృతజ్ఞతలతో నన్ను దూరం చేస్తావ్. మరోమారు అలా అన్నా వంటే ఈ చుట్టుపట్ల కన్పించను."
మాల ఆదుర్దాగా అన్నది. "మరెప్పుడూ అననులెండి" అని.
"నీ గతం నాకు అవసరం. భవిష్యత్తులో మాత్రం వేసే ప్రతి అడుగూ జాగ్రత్తగా ముందుకు సాగిపోతే? నాకంటే సంతోషించే వాళ్ళు మరొకరు వుండరు."
"వాసు బాబూ అందరూ మీలాంటి వాళ్ళే వుంటే యెంత బాగుండు. కాని వుండరు. భగవంతుడి సృష్టి చాలా విచిత్రం. ఇక్కడ గడ్డిలో కూర్చున్న మన ఇద్దరిలో అంతస్తుల్లో యెంత వ్యత్యాసం కాని మీ దృష్టిలో నాకేదో విలువ! ఎందుకో తెలియదు! నా ప్రాణప్రదంగా కాపాడుకుంటాను ఈ విలువను.
నన్ను గురించి నాకు తెలిసినదంతా మీకు చెప్పేస్తాను. వింటారా" "తప్పకుండా" నిర్మలంగా నవ్వుతున్నట్లువున్న ఆ కళ్ళనే చూస్తూ చెప్పుకుపోతోంది మాల. వాసు కుతూహలంగా వింటున్నాడు.
మాది ఓ పల్లె టూరు.
ఎక్కడో సరీగ్గా తెలియదు.
అమ్మా నాన్నా నేనూ ఓ అన్నయ్యా వున్నట్లు కాస్త గుర్తు. చిన్న ఇల్లుకూడా వుండేది. అమ్మ ఒకరోజు నాన్న వూరికి వెళ్ళి రాక ముందే తను ఎక్కడికో వెళ్ళిపోయింది. తిరిగి యెప్పటికీ రాలేదు. అమ్మ వున్నప్పటి నాన్న కాదు. చాలా మారిపోయాడు. చెరువులో ఈత కొడుతూ అన్నయ్య మునిగి చచ్చిపోయాడు.
నాన్న అమ్మని తీసుకువస్తానని వెళ్ళి ఒక పదిరోజులవరకూ తిరిగి రాలేదు. నేను మా పని మనిషి దగ్గర వున్నాను, ఒక రోజు రాత్రి దొంగ లాగా వచ్చి నన్నూ, చిన్నమూటనీ తీసుకుని దూరంగా చాలాదూరంగా తీసుకువచ్చేశాడు. ఆ రైలుప్రయాణం ఇప్పటికీ నాకు గుర్తువుంది.
అప్పటినించీ నాన్న చాలా మారిపోయాడు. ఏదో "ప్రెస్" లో పనిచేసేవాడు. నా సంరక్షణలో మాత్రం యే లోటూ వుండేది కాదు. స్కూల్లో చేరిం తర్వాత నాకో స్నేహితుడు దొరికాడు. అతనే గిరి. ఇద్దరం కలిసి చదువుకున్నాం. గిరీ వాళ్ళ అమ్మ నన్ను చాలా అభిమానంగా చూసేది. "నీకు అమ్మలేదూ" అని అడిగితే "తెలియదని" చెప్పి వచ్చి నాన్నని అడిగాను. చెంప పగిలేటట్లు కొట్టి "మీ అమ్మ చచ్చిందని చెప్పు" అని కోపంతో వూగిపోయాడు. అంతే మరేనాడూ అమ్మ సంగతి అడగలేదు.
నేను రజస్వల కాగానే "ఇంక చదువువద్దు" అని మాన్పించేశాడు. ఫోర్తు ఫారంతోనే చదువు సున్నా చుట్టాను. నాన్నకి అందమైన మగవాళ్ళంటే తగని కోపం. చిన్నప్పటి చనువు పురస్కరించుకుని గిరి రాకపోకలు సాగిస్తున్నా డని నాన్న గిరిమీద చెయ్యి చేసుకున్నాడు. అదో పెద్ద గొడవయింది. గిరి నాన్న మీద యెదురు తిరిగి
"మాలతిని నేను పెళ్ళి చేసుకుంటాను" అన్నాడు.
నాన్న యేమనుకున్నాడో ఆ రాత్రి రాత్రి ఎవ్వరికీ తెలియకుండా ఈ వూరు తీసుకు వచ్చేశాడు. ఇక్కడికి వచ్చిన కొన్నిరోజులకే నాన్నకి పక్షవాతం వచ్చింది.
నేను పర్సులు ఎలా కొట్టేయాలో గిరి దగ్గర నేర్చుకున్నాను. గిరి మంచివాడు కాదని నాన్నకే కాదు. నాకూ తెల్సు. కాని యేం చెయ్యను. అంతకు మించి ఆత్మీయులు మరొకడు లేరు. స్కూలో ఆటగా నేర్చుకున్న ఈ విద్య జీవితానికి వుపయోగించుకోవాల్సిన పరిస్థితులు ప్రాప్తమవుతాయని.
యే పోలీసులూ పట్టుకోకుండానే మీ కళ్ళ బడటం వల్ల నా కీవితం మరో కొత్త మలుపు తిరిగింది. నాన్నకి సంపాదన పోయింతర్వాత చాలా పొదుపుగా బ్రతకవలసి వచ్చింది. ఈ వూరు వచ్చిన కొత్తలో యేమీ తెలియక "అద్దె" తక్కువ అని ఆ చిన్న గది తీసుకున్నామే గాని ఆ తర్వాత చాలా బాధలు వున్నాయి అని తెలిసింది. ఆ ఇంటి యజమాని పచ్చిగూండా. వాడి కళ్ళు నా మీద పడ్డాయి. వాడిని యెలా తప్పించుకోవటమో అర్ధం కావటం లేదు. నా వెంట మీరు యింటికి వచ్చినందుకు మండిపడ్డాడు.
యెదురు తిరిగి జవాబిచ్చానని యెంత యెగిరి పడ్డాడనీ.....ఆ పద్మవ్యూహం లోనించి తొందర లోనే బయటపడకుంటే లాభం లేదు.
వాడి మీద యేవో కేసులు వున్నట్లున్నాయి. అప్పుడప్పుడూ పోలీసులు వచ్చి ఇంటిమీద దాడిచేస్తూ వుంటారు. వాళ్ళకి దొరక్కుండా తప్పించుకుంటున్నాడు."
"మాలా ఇంత బాధని గుండెలో వుంచుకుని ఎంత మామూలుగా తిరగ్గలుగుతున్నావ్. అలాంటి అపాయకరమైన చోట మరొక్క క్షణం వుండద్దు, ఇప్పటికైనా పరిస్థితి చెప్పావు...ఇంక దీనికి పరిష్కారం ఆ ఇల్లు మార్చేసి వీరభద్రం ఇంటికి దగ్గరగా ఓ గది చూడమంటాను యెవ్వరికీ తెలియకుండా మీ నాన్నని తీసుకువచ్చేసే యేర్పాటు చేస్తాను. ఆ ఇంట్లో కూడా విలువయిన సామాన్లు ఏమయినా వుంటే వెంట తీసుకురా లేకుంటే అక్కడే వదిలేసెయ్యి. నీకు కావల్సినవి ఒక్కొక్కటీ కొంటాను. చాలా సమయం అయిపోయింది. జాగ్రత్తగా వెళ్ళు. ఇల్లు మార్చిన తర్వాత మీ నాన్న తో నేను మాట్లాడతాను.- లేచాడు వాసు.
"వాసు బాబూ ఈ మాటల్లో మరిచిపోయాను. పెళ్ళిచూపులకి వెళ్ళారుట. పిల్ల యెలా వుంది." మాల తన బాధని మర్చిపోయి నవ్వుతూ అడిగింది.
నవ్వుతున్న మాలనే చూస్తుంటే సోఫాలో తన కెదురుగా కూర్చున్న ప్రసన్నలక్ష్మి గుర్తు వచ్చింది.
"అదృష్టం బాగుండి అందరూ వుంటే తండ్రి స్థితి సరీగా వుంటే ఈ మాల కూడా అలాగే కూర్చునేది కదూ"
"ఇదిగో చూసి నువ్వే చెప్పు" ప్రసన్న ఫోటో అందించి మాల ముఖంలో మారే రంగు లని చూస్తూ వుండిపోయాడు.
కన్నార్పకుండా మళ్ళీ మళ్ళీ చూసింది.
"చాలా బాగుంది వాసు బాబూ. పేరేమిటీ" తృప్తినిండిన కళ్ళతో ప్రశ్నిస్తున్న మాలవైపు చిలిపిగా చూస్తూ.
"ఆ అమ్మాయికి నేను నచ్చలేదుట" అన్నాడు.
"అబద్ధం సర్వాబద్ధం" పరిసరాలని మర్చిపోయి బిగ్గరగా అనేస్తూ అంతలోనే తెప్పరిల్లి "మగవాళ్ళకి అబద్ధం ఆడటం చేతకాదు"
"వూ...?"
"అవును"
నమ్మేశాడు వాసు.
"చాలా పొద్దుపోయింది. ఈ రోజు నాన్నకి యేం బాగా లేదు "సెలవు" అంటూ నమస్కరించింది మాల.
ఏమిటి ఈ రోజు ఈ నమస్కారాలు.
"వాసు బాబూ జీవితాంతం మీకు నమస్కరిస్తూనే వుంటాను.
నాకే కష్టం వచ్చినా నా అండన మీరొకరు వున్నారనే సంతృప్తి నాగుండె కెంత దైర్యాన్ని ఇస్తోందనుకున్నారూ! మీకు తెలియదు" కృతజ్ఞత నిండిన కళ్ళతో అంది.
నిరుద్యోగం నన్ను సంకెళ్ళు వేసి బంధించకుంటే "ఏం చేసేవాడినో నాకే తెలియదు. నీవేం అధైర్యపడకు. నే చెప్పినట్లు చేస్తావు కదూ పోనీ నీవెంట రానా.
"వద్దు....వద్దు నేను వెళ్ళిపోగలను" అంటూ చకచకా వెళ్ళిపోయింది.
వాసు మాలనే చూస్తూ వుండిపోయాడు. ఎన్నో ఆలోచనలు మెదడులో సుళ్ళు తిరుగుతూంటే.
* * *
ప్రసన్నలక్ష్మి "మనసు పాడింది సన్నాయి పాటా" అంటూ కూనిరాగాలు తీస్తోంది. నిశ్చయ తాంబూలాలు పుచ్చుకున్నారు. ఇంక లగ్నం పెట్టుకోవాలి.
