Previous Page Next Page 
జీవనకలశం పేజి 10


    "నాకేం తెలుసు తల్లీ.... మీ చిన్నాన్న నే అడుగు," అంటూ బెండకాయలు ముందు పోసుకుఇ తరుగుతూ కూర్చుంది శ్రీలక్ష్మి.
    "చిన్నాన్నా పెళ్ళెప్పుడూ" ఇడ్లీ ముక్క నోట్లో పెట్టుకొని మింగబోతూ అడిగింది.
    "నాకేం తెలుసమ్మా- అమ్మనే అడుగు" మంచినీళ్ళు తాగుతూ వీణని అడగమని కళ్ళతోనే సౌంజ్ఞ చేశాడు.
    వీణ ప్రశ్నకి విసుక్కుంటూ మరీ స్పీడుగా తరిగేస్తూంది బెండకాయలు.
    "కళ్ళలో పెళ్ళి పందిరి కదుల్తోంది గానీ పెళ్ళి యెందుకూ. మీ చిన్నాన్న ఆజన్మ బ్రహ్మ చారిగా ఉంటాడుట. యేదో వాళ్ళ పోరు పడలేక ఒక పూట టిఫిన్ ఖర్చన్నా తప్పుతుందనీ పెళ్ళికూతుర్ని చూశామేగానీ ఖాయం చేసుకోవాలనా? అందుకే మీ పిల్ల మా మరిదికి నచ్చలే దుటా అని చెప్పేశాను..... ఇంక మళ్ళీ ఎక్కరు మన గడప" వీణకి చెప్తున్నట్లే చెప్పేసి అన్నం వార్చుకుంటోంది శ్రీలక్ష్మి.
    "నేనా మాట అన్నానా?" తినేది ఆపి అడిగాడు.
    "అనలేదే అనుకో.... నీ అంతట నువ్వు రాలేదుగా ఈ పెళ్ళి చూపులకి. అయినా బలవంతపు బ్రాహ్మణార్ధం యెందుకు. నాకు పెళ్ళి కావాలి" అని వాడు అడిగినప్పుడే చేద్దాం అన్నారు మీ అన్నయ్య.
    వాసు కోపంతో ముందు గదిలోకి వెళ్ళిపో యాడు. క్షణక్షణం ప్రసన్నలక్ష్మి కదులుతూంటే కళ్ళలో పెళ్ళిపందిరి కదలడం మానేసింది.
    ఏమిటి వదిన ఇలా చేసింది. మరోసారి అడగాలంటే అభిమానం అడ్డు వస్తూంటే పిచ్చెక్కిన వాడిలాగా ఇటూ అటూ. పచార్లు చేస్తున్నాడు.
    "చిన్నాన్నా.....పెళ్ళి కూతురి ఫోటో ఆ పుస్తకంలో వుంది ఓసారి చూపించవూ.... వీణ చిన్నాన్నని పట్టుకు లాగింది.
    పెళ్ళికూతురు ఫోటో ఎక్కడిది? అంటూ వీణ చూపించిన పుస్తకాలన్నీ తిరగేశాడు. దొరకలేదు. వదిన నన్ను యేడిపించేందుకు ఇలా చేస్తోందా అన్న అనుమానం కూడా కలక్కపోలేదు. వాసు ఓర్పుని పరీక్షించి ఎలాగైతేనేం ప్రసన్నలక్ష్మి ఫోటో బయటపడింది. దాన్నే తదేకంగా చూస్తూ వుండిపోయాడు.
    ఇలా ఇవ్వు చిన్నాన్నా.....ఆండాళ్ళు చూస్తానందిట అమ్మ తెమ్మన్నది. చేతిలోది లాక్కుని తుర్రుమంది వీణ.
    "చూపగా చూపగా ఆండాళ్ళకే చూపాలీ. వదినకి యేం తెలియదు." చెప్పలేనంత విసుగు వచ్చేసింది వాసుకి.
    వాసు బూటు లేసుకుంటూంటే వదిన చెప్పింది.
    "మనం వద్దు మొర్రో అంటున్నా ఆ వైదేహి వాళ్ళు మనలని వదిలేలా లేరు. నలభై వేలు యిస్తారుట. ఆ అమ్మాయి మీ అన్నయ్యకి కబురుచేసి తనే మాట్లాడిందట. పాపం తల్లీ. తండ్రీ లేరుగా. పినతండ్రి ఆస్తి వ్యవహారాలు చూస్తున్నా బాధ్యత యెందుకుంటుందీ....
    వాసుకి వళ్ళంతా కారం రాచుకున్నట్లయింది.
    శ్రీలక్ష్మి మళ్ళీ మొదలుపెట్టింది.
    "ఆ వైదేహి నిన్ను చేసుకోకపోతే ఆజన్మాంతం కన్యగానే వుండిపోతుందిట. ఆస్తి అంతా ముందే నీ పేరన రాసేయమన్నా రాసేస్తుందిట. యేమంటాడో కనుక్కో" అని చెప్పారు అన్నయ్య. మళ్ళీ వైదేహి మీ అన్నయ్యకోసం కారు పంపిస్తానని చెప్పింది."
    విషయం చాలా దూరం వచ్చిందని అర్ధమైంది వాసుకి.
    అన్నయ్య దబ్బు కక్కుర్తి మనిషి అని బాగా తెలుసు అందుకే ఖచ్చితంగా చెప్పేశాడు తన వుద్దేశ్యాన్ని.
    "వదినా నలభై వేలుకాదు. నలభై లక్షలిచ్చినా నేను చేసుకోనని చెప్పు. కట్నం ఎక్కువ ఇవ్వలేకపోయినా సరే ఆ తాసీల్దారుగారి అమ్మాయినే చేసుకుంటాను. ఇందుకు ఇష్టమైతే అన్నయ్యని రమ్మను. లేకుంటే లేకుంటే.."
    "లేకుంటే రిజిష్టర్ పెళ్ళి చేసుకుంటావా?" రెండు చేతులూ నడుం మీద పెట్టుకుని మరిది తెగువకి బోలెడంత ఆశ్చర్యపడి అన్నది. అంతే....సాక్షి సంతకం ముందు నువ్వే చెయ్యాలి." ఇలా చెప్పానని అన్నయ్య రాగానే చెప్పేయి" అంటూ అద్దంలో మరోసారి చూసుకుంటున్నాడు వాసు.
    "నేచెప్పటం యెందుకూ అరుగో మీ అన్నయ్య రానే వచ్చారు. నువ్వే ఆ కాస్త ముక్కా చెవిన వేసి వెళ్ళు. మధ్యనే నెందుకూ ఆపైన అన్న ఇష్టం తమ్ముడి ఇష్టం...
    "ఏమిటా చెప్పేది.... చేతిలోని హార్లిక్స్ బాటిల్. మరో రెండు పాకెట్లూ టేబుల్ మీద పెడుతూ అన్నాడు రాఘవరావు.
    "ఏమిటీ చిత్రం ఈ రోజు అన్నయ్య ఇంత ప్రసన్నంగా మాట్లాడుతున్నాడు..... అనుకుని ఇంక ఒక్కక్షణం వుండకుండా వాకిట్లోకి వస్తూంటే వీణ పెళ్ళికూతురు ఫోటో తీసుకు లోపలికి వస్తోంది.        
    "తల్లీ నీకుబోలెడన్ని చాక్ లెట్లు తెస్తానమ్మా" అంటూ ఆ ఫోటో లాక్కుని పాంటు జేబులో దూర్చేసి స్కూటర్ ఎక్కాడు వాసు.

                                   *    *    *

    వాసుకి టైపు మిషను ఇచ్చిన అతనికి జ్వరం నయం అయింది. ఆ కాస్త సంపాదనా పోయింది.
    డబ్బుని సంపాదించే అవకాశాలు ఏవి. అని తీక్షణంగా ఆలోచించటమే గాని అవకాశం దొరకటం లేదు.
    పోస్టాఫీసు దగ్గర యెవరన్నా వుత్తరాలు రాయించుకుని యేకాస్త అయినా ఇవ్వరా అని నాలుగు రోజులుగా తిష్ఠవేశాడు.    
    ఇతని వాలకం చూసి చూసి పోస్టు మాన్ వీరభద్రం విరగబడి నవ్వాడు. "సార్ ఇది ఆమె రికా కాదు. ఇండియా.
    ఇంతకీ మీరు చూస్తే ఈ డబ్బుతో బ్రతకాలనే స్థితిలో లేనట్లు కన్పిస్తున్నారు. ఇంట్లో అమ్మ మీద అలిగివచ్సిన బాపతులాగా వుంది." అనుమానంగా వాసుని చూస్తూ అన్నాడు.
    "నా పాంటూ షర్టూ ఈ వాచ్ చూసి ఈ అభిప్రాయం ఏర్పరచుకున్నావులా వుంది. ఇవన్నీ.... అన్నయ్య..."
    "అవేకాదు. ఆ స్కూటర్ లో వచ్చిన మిమ్మల్ని యే వెధవకి నాలుగు అణాలిస్తాను వుత్తరం రాసిపెట్టు అనగల ధైర్యం వుంటుందండీ.
    "నిజమే....పొరపాటే....... ఇంక రేపటి నించీ ఇలారాను. అసలు నాకీ ఆలోచనే తట్టలేదు సుమా." తల గోక్కున్నాడు వాసు.
    "మాలాంటి వాళ్ళకు కష్టాలు తప్పవు. మీ రెందుకు అవస్తపడతారు. బుద్దిగా ఇంటికి వెళ్ళి అమ్మో వొదినో వాళ్ళు చెప్పినట్లు వినండి."
    వాసు తల అడ్డంగా తిప్పాడు.
    "చూడు వీరభద్రం యెంత చిన్న వుద్యోగ మైనాసరే నాకు అర్జెంటుగా కావాలి. నీకెవరన్నా తెలిసినవాళ్ళు వుంటే......"
    వీరభద్రం నవ్వుతూ అన్నాడు.
    "బాబూ..... మేమెంత? మా బ్రతుకెంత. మీ లాంటివారికి రికమెండ్ చేయగల శక్తి మాకు వుంటుందా..... వుద్యోగం యేదీ ఇప్పించలేను గాని మీరు ఇష్టపడితే ఓ కుర్రాడుకి ప్రయివేటు కావాలిట. ఇరవై రూపాయలు ఇస్తారుట. మీకు ఇష్టమైతే వాళ్ళ ఇల్లు చూపిస్తాను, ముందే చెప్తున్నా ను సార్ వాళ్ళు చాలా ధనవంతులే అనుకోండి. వాళ్ళ అబ్బాయి కాడు యితను. దయతలచి చెప్పిస్తున్న చదువు. మార్కులు చాలా తక్కువ అని కొన్నాళ్ళు కావాలని చెప్పారు. ఆ కుర్రాడు కాస్త మొద్దురకం. మీ కష్టానికి ప్రతిఫలం కాదనుకోండి. సాయంత్రం అయిదు తర్వాత వస్తే ఆ ఇల్లు చూపిస్తాను.
    "ఇరవై చాలా తక్కువ."
    "ఆలోచించకండి సార్. అలా మొదలు పెడితే మరో ఇద్దరు కుదరకపోరు అయినా మీ యిష్టం? నా సలహా చెప్పాను ఆలోచించుకోండి ఇంతకీ మీరెంత వరకు చదువుకున్నారూ!"
    "యం, ఎ" వాసు చాలా వుదాశీనంగా చెప్పాడు.
    "అమ్మ బాబోయ్...యం.ఎ. చదివిన మీకా నేను సలహాలు చెప్పేది! యే సి. యు. సి. నో అనుకున్నా సార్ క్షమించాలి."
    వీరభద్రానికి వాసుమీద గౌరవం మరీ ఎక్కువయింది.
    "మరేం ఫరవాలేదు. ఆఫీసులో ప్రయత్నిస్తూనే వున్నాను. ఎప్పటికో వస్తుందనుకో. అంతవరకూ అవుసరం గడవాలిగా..."
    వీరభద్రానికి వాసు ఎమ్. ఎ. అన్న దగ్గర్నుంచీ ఓ ఆశ మనస్సులో మెదులుతోంది. ఎప్పుడో విడిచేసిన పీ. యు. సి. పూర్తి చెయ్యాలని. అది అయి బి.ఏ. ఎలాగో కష్టపడి చదివి డిగ్రీ తగిలించుకోవాలని పాపం కలలు కనే వాడు. వాసుని చూస్తూనే ఆ ఆశ చిగురించింది.
    "కాస్త నాకు తెలియనివి చెప్తానంటే..." ఎంతో ఆశగా అడిగాడు వీరభద్రం. తన స్థితి గతులు వివరిస్తూ.
    "తప్పకుండా చెబుతాను మీ ఇల్లెక్కడ?"
    "మా ఇల్లెందుకులెండి.... మీరెక్కడికి రమ్మంటే అక్కడికే వస్తాను."
    తల గోక్కున్నాడు వాసు. ఎక్కడికి రమ్మని చెప్పడం.
    "సరే చీకటి పడకుండా వస్తే పార్కులో కూర్చుందాం."
    "పార్కులోనా.......సరే......నాకేం అభ్యంతరం లేదు. అలాగే వస్తాను. రండి సార్ కాఫీ తాగుదాం. అంటూ అపరిమితమైన సంతోషంతో పొంగిపోతూ హోటల్ వైపు దారితీశాడు.
    "మరోసారి తప్పకుండా వస్తాను. సరేనా? అంటూ గబగబా వెళ్ళిపోయాడు వాసు.
    ప్రపంచంలో మంచితనం చచ్చిపోలేదు ఇది నిజం.....వాసు వెళ్ళినవైపే చూస్తూ అనుకున్నాడు వీరభద్రం తృప్తిగా.

                                *    *    *

    మాల చాలా రోజులుగా కన్పించలేదు. ఎలావుందో! వెంకటేశ్వర్లు దగ్గరికి కూడా రాలేదు ఏమైనట్లు? వాసు మనసులో ఏదో తెలియని ఆరాటం. మాల కన్పించే ప్రతిచోటా వెతికాడు. లాభంలేక పోయింది. ఏం జరిగినా సరే వాళ్ళ ఇంటికి వెడతాను అనుకుని సందులూ గొందులూ దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడేగాని ఆ ఇల్లు కన్పించటం లేదు.
    దారి తప్పావా? అనుమానం వచ్చింది.
    కాదు. ఆరోజు ఇక్కడివరకూ వచ్చాను. ఇంకాస్త ముందుకి వెళ్ళిచూస్తే .... యెగుడు దిగుడు ఇరుకు గల్లీల్లోనించి ప్రాణం బిగపట్టుకుని నడవాల్సి వస్తోంది. ఇద్దరు ముగ్గురు మగాళ్ళు తాగి నిషాలో వాసుమీదే పడబోయారు. ఓ ఇంట్లోనించి ఇద్దరు ఆడవాళ్ళు బూతులు తిట్టుకోవడం శ్రవణానందకరంగా వింటూ ఖుషీగా నవ్వుతున్నారు కొందరు. వయస్సులో వున్న అమ్మాయిని బరబరా లాక్కువెడుతున్నాడు ఓ రౌడీ.
    ఆ దృశ్యాలని చూడటానికే జుగుప్స కలిగి స్తూంటే అనుభవించేవాళ్ళు ఎంత బాధపడతారు. కాదు వాళ్ళు గర్వంగా నవ్వుతున్నారు.
    ఇదే నీళ్ళకి స్వర్గమా, ఇంత ఆనందంగా యెలా వుండగలుగుతున్నారు. అసలు వీళ్ళు అనుభవించేది అసలైన ఆనందం అనే అనుకుంటున్నారా!
    ఎటు చూసినా కుళ్ళుకంపు.
    ఇంక ముందుకు పోయే శక్తి లేక వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పులకి యేదో అంటినట్లు అనుమానం వేసి చీదరించుకుంటూ మరో మలుపు తిరిగాడు చూపులు క్రిందనే కేంద్రీకరించి.
    వెనక నించి బలమైన చెయ్యి వాసు కాలర్ ని చిక్కించుకుంది. రివ్వున వెనక్కి తిరగబోయాడు వీలుకాలేదు.
    "రాస్కెల్ విడువు" ఆ చెయ్యిని గుంజాడు బలంగా.
    నీ కోసమేరా బద్మాష్ నే కాపేసింది. నా యాల యెప్పుడో ఓ సారి దానికోసం వస్తావని తెలుసులే......నీ లాంటోడు దానెంటబడితే ఇంక నా మాట ఇంటుందా! డాని బాబే సైతానులా గున్నాడు. ఎప్పుడు గుటుక్కుమంటాడా దాన్ని చిక్కించుకుందాం అని నే జూస్తుంటే. మధ్యన నీ ఓడివా రేయ్... ఒళ్ళు తిమ్మిరిగా వుంటే చెప్పు అణిచిపారేస్తా. లేదో వచ్చిన దారింట తిరిగి చూడకుండా యెళ్ళు. తెలిసిందా. నేనెవర్నో ఈ బస్తీలో అడుగు తెలస్తది." మీసం మెలేశాడు ఆ రౌడీ.
    వాసు ఇదే అదను అని ఒక్క తోపుతోశాడు
    వాడు బోర్ల పడబోయి నిలదొక్కుకున్నాడు. వాడి నోటినుంచి వచ్చే దుర్వాసనకి వాసుకి ముక్కు బ్రద్దలయిపోతోంది.
    తనని అకారణంగా ఈ వెధవ అడ్డగిస్తూంటే వళ్ళంతా మండిపోతోంది.
    "ఎవరనుకున్నావ్ మీదకి వచ్చావా జాగ్రత్త విసురుగా మరోసారి తోశాడు. ఈ గల్లంతుకి మరో నలుగురు రావడం పసిగట్టిన వాసు ఇంక లాభం లేదు. అనుకుంటూ తనని అడ్డగిస్తున్న వాళ్ళని వడ్డించి మెరుపులా తప్పించుకుని ఆ గొందులు దాటి రోడ్డుమీద పోయె ఆటో రిక్షా యెక్కేశాడు.    
    తన షర్టు అంతా చిరిగి వాలికలయింది. వెనక నలుగురు రౌడీలు పరుగెత్తుకు వచ్చి ఇంక లాభం లేదనుకొని వెనక్కి వెళ్ళిపోయారు. ఆ వెధవ తోసినప్పుడు గోడమీద పడటం వల్ల చేతులు గీసుకుపోయి రక్తం చిమ్ముతున్నాయి.
    వెంకటేశ్వర్లు దగ్గరకే వెళ్ళాడు.
    వాసుని చూస్తూనే వెంకటేశ్వర్లు హడిలి పోయాడు.
    "ఏంటి గురూ....?"
    "ఏం లేదుగాని మాల కన్పించిందా!
    "నాలుగు రోజుల క్రితం కన్పించింది"
    "ఏం చేస్తోందిట. ఈ రోజు నేను ఎంత వెతికినా కన్పించలేదు.
    "నువ్వేమో పెళ్ళిచూపులు చూస్తూ ప్రపంచమె మరిస్తివి. రెక్కాడితేగాని డొక్కాడని పేదవాళ్ళకి నాలుగురోజులు గడవటం అంటే మాటలా! ఆ సినీమా హాల్లో వుద్యోగం పోయిం తర్వాత సరైన పనే దొరకలేదు,"
    "పనిమనిషి గానైనా సరే చేస్తానని ఎందరిళ్ళకో వెళ్ళి అడిగిందట. కొందరు ఖాళీల్లేవంటే మరికొందరు మాలని చూస్తూ మూతి తిప్పేస్తూ-
    "సోకులాడివి నువ్వేం పనిచేస్తావ్. పో పో" అన్నారుట. మరికొందరు. "మా ఆవిడ పురిటి కెళ్ళింది. వచ్చేవరకూ అన్ని పనులూ చేసి పెట్టు తిండీ, బట్టా ఇస్తాను. సినిమాలు కూడా చూపిస్తాను." అన్నారుట. అందమైన ఆడపిల్లకి అంట్లు తోమే పనైనా సరే తేలికగా దొరకదు.
    వింటూ కూర్చున్నాడు వాసు.
    "తండ్రి అవిటివాడైనా "గాండ్రు గాండ్రు" మంటాడు. ఇరుగూ పొరుగూ దరిద్రులు. తమటా సైకిల్ నేర్చుకుని రిక్షాలాగి సంపాదిస్తుందట. విన్నావా మాల ఆలోచనలు. అది మాత్రం తేలిగ్గా వున్నదా! లైసెన్సు కావద్దూ.
    "ఆడోళ్ళకి రిక్షా లైసెన్సు ఇచ్చే రూలు మాకు లేదు" పై ఆఫీసర్ కి చెప్పుకో అన్నాడుట. అయినా తాటాకు బొమ్మలాగా వూగిపోయె ఈ అమ్మాయి రిక్షా లాగ్గలదా? నువ్వు చెప్పు....నేను ఆ పని చెయ్యకమ్మా మరోటి చూస్తాం. వాసుబాబు కొంత డబ్బు తెస్తాడు. దానితో కాలక్షేపం చెయ్యి ఈ లోపల యేదో ఒకటి దొరక్క పోదు. అన్నాను.
    "నాకెవ్వరి డబ్బూ అక్కరలేదు. సంపాదించుకుంటే తింటా. లేకుంటే పస్తులుంటా వాసు బాబుని నా కోసం కష్టపడవద్దని చెప్పండి." అంది.
    వెంకటేశ్వర్లు చెప్పేది వింటూ నల్లరాయిలా కూర్చుని ముందున్న స్టూలుమీద పిచ్చిగీతలు గీస్తున్నాడు వాసు.

                               *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS