తమ్ముడి పెళ్ళి ఘనంగా చెయ్యాలని రాఘవరావు హడావుడి పడుతున్నాడు.
వెంకటేశ్వర్లు వూరులో లేడు.
వీరభద్రం పరీక్షలు దగ్గర పడడంతో తెగ చదివేస్తూన్నాడు. ప్రతి సాయంత్రం క్రమం తప్పకుమ్డా వాసు మాలకీ, వీరభద్రానికీ పాఠాలు చెప్తూనే వున్నాడు.
విశ్వం వుత్తరాలు రాస్తూనే వున్నాడు.
వాసు రాసే ఉత్తరాల నిండా మాల సంగతులే నింపుతున్నాడు.
మాలకి ఓ శ్రీమంతుల ఇంట్లో పని దొరికింది.
పగలంతా ఎంతో కష్టపడి పనిచేసి రాత్రి పరీక్షకి చదవాలంటే మాలకి విసుగ్గా వుంది. అయినా చదువుతూనే వుంది.
వాసు ప్రతిరోజూ మాల భవిష్యత్తులో యెలా పైకి వెళ్ళాలో అలా వెళ్ళాలంటే ఎంత కష్టపడి చదవాలో లెక్చరిస్తూ వుంటాడు.
మాలకి ఓర్పు తగ్గిపోయి చికాకుగా అంది.
"యేముంది వాసుబబూ పైన ఆకాశం కింద భూమీ. మాలాంటి వాళ్ళకి ఇటు అటు కాక త్రిశంకుస్వర్గంలో వూగుతూ వుంటాం. క్రిందకి రాలేక పైకి యెగబ్రాకలేక సతమత మవుతూండగానే జీవితం పూర్తి అవుతుంది.
చెప్పే పాఠం ఆపి పుస్తకం మూసేశాడు వళ్ళు మండిపోయి.
"ఇంత నిస్పృహ అయితే యెలా. జీవితంలో స్థిరంగా నిలబడగలగాలంటే సహనం చాలా అవుసరం."
"మాల పుస్తకాలు దూరంగా తోసేసి విరక్తిగా చూసింది.
ఇదంతా చూస్తుంటే తన ప్రయత్నం అంతా విఫలమయిపోతుందేమో అనే అనుమానం వచ్చింది వాసుకి. నీరుకారిపోయాడు.
"ఈ వుద్యోగం నేనింక చెయ్యలేను వాసు బాబూ, యెలాగో కష్టపడి చేసినా ఆ ఇంటావిడ వుంది చూశావూ.... ఒట్టి అనుమానం మనిషి. ఆవిడని చూస్తూంటే వళ్ళంతా కంపరం పెడుతూ వుంటుంది. ఇంక పిల్లలు సోమరి పోతులే అనుకో. ప్రాణం తీసేస్తారు. ఆఖరు పిల్ల మరీ బ్రహ్మరాక్షసి.... అబ్బ.... వద్దు....వెధవ పని"
"నేను మొదటే చెప్పలేదూ........ఇలా ఇళ్ళలో పని చాలా దరిద్రమని"
"నిజమే మీరు ముందే చెప్పారు. ఏ పనీ చెయ్యకుండా మీరు ఇచ్చే డబ్బుతో తింటూ యెన్ని రోజులు కూర్చోను. ఆవిడా, పిల్లలూ అలాగ, ఇంక ఆ ఇంటాయన తమ్ముడొకడు వున్నాడు జంబుకంలాగ......వాడు నన్ను మహా విసిగిస్తున్నాడు. పొట్టకోసం పని చేసేవాళ్ళకి మాన మర్యాదలు వుండవని వాళ్ళ వుద్దేశ్యం. ఒట్టి దౌర్భాగ్యుడూ తాగుబోతూ..."
ముఖం వంచుకుని వచ్చే దుఃఖాన్ని దిగ మింగుతోంది మాల.
అర్ధమయింది వాసుకి.
బ్రతుకు తెరువు కోసం ఇల్లు దాటి బయటికి వచ్చిన ఆడపిల్లలకి అడుగడుక్కీ అవరోధ మేనా మంచితనం చచ్చి, వంచన అధికమవుతోంది సమాజంలో.
మాల కళ్ళు తుడిచేసుకుని అన్నది "పాపిష్టి దాన్ని నా బాధలతో మీకు శాంతి లేకుండా చేస్తున్నాను. వీరభద్రం చూపించిన ఇంట్లో ట్యూషన్ చెప్పనని ఇంటివరకూ వెళ్ళి తిరిగి వచ్చేశారుట ఎందుకు ?-
మాలకి ఎలా చెప్పటం? ఆ ఇంటికి అల్లుడు కావల్సి తప్పించుకుని వాళ్ళ పిల్లలకే ప్రయివేటు చెప్పాలంటే నావల్ల అయే పనేనా? ఈ విషయం వీరభద్రానికి తెలియనీయకుండా నా కిష్టం లేదు అంటూ వెనక్కి వచ్చేశాడు వాసు. అందుకే మాల అడిగిన దానికి మౌనంగా వూరుకున్నాడు.
"అనేక రకాల్లో సంపాదించుకోవచ్చు. అందుకు" అంటూ తన జవాబు తనకే తృప్తి నివ్వక నవ్వేస్తూ.
"ఇదిగో ఇరవై రూపాయలు. కొన్నిరోజుల కాలం దొర్లించు, ఆ తర్వాత మళ్ళీ చూస్తాను" అంటూ డబ్బు అందిస్తూంటే మాల తీసుకోవటానికి యెంతో బాధపడింది.
"వీలైనంత త్వరలో ఆ ఇంట్లో పని మానేసెయ్యి" అంటూ వెళ్ళిపోయాడు వాసు.
వాసు ఇచ్చే డబ్బు తండ్రి మందులకే చాలటం లేదు. "చాలటం లేదు" అని యే ముఖం పెట్టుకుని చెప్పగలదు" అందుకే ఎంత కష్టం అన్నా భరించి ఆ ఇంట్లో పని చేస్తోనే వుంది.
* * *
వాసు రాత్రి సమయాల్లో ఆటోరిక్షా నడుపుతూ దాని యజమానికిచ్చే బాడుగ పోను కాస్త సంపాదిస్తూనే వున్నాడు.
కాని అన్నా వదినలకి సమాధానం చెప్పటం కష్టమయిపోతోంది.
"ఎక్కడ తిరుగుతున్నావ్?"
"ఏం చేస్తున్నావ్?"
లక్ష ప్రశ్నలు, కోటి అనుమానాలు, పాడై పోతున్నాడేమో అనే భయం.
చివరకు అన్నగారు ఆర్డరు వేశాడు. సాయంత్రం ఆరుగంటలు దాటితే ఇల్లు కదలటానికి వీలులేదు. అని.
ఈ అర్ధంలేని కట్టుబాట్లని భరించటం కష్టమయిపోతుంది. మాలతి మెట్రిక్ పర్మిషన్ కి కట్టాలంటే దాదాపు వందరూపాయలు కావాలి. ఎవరు ఇస్తారు? ఎలా వస్తాయి?
"ఏది ఏమైనా సెప్టెంబర్ పరీక్షకి పంపాలనే కృతనిశ్చయంతో వున్న వాసు ఆలోచనలని చెల్లా చెదరు చేస్తోంది మాల.
"లాభంలేదు వాసుబాబూ.....హిష్టరీ చదువు దామని పుస్తకం తెరిస్తే చాలు ఆ అక్షరాల్లో మా ఇంటాయన తమ్ముడు కన్పిస్తుంటాడు. ఇకిలిస్తూ. అసభ్యంగా ప్రవర్తించే వాడిని....గొంతు పిసికి చంపేయా లనిపిస్తోంది. యేదో వంకన నా చెయ్యి పట్టుకోవాలని మహా ప్రయాస పడతాడు దరిద్రుడు." కోపం, వుక్రోషం అన్నీ కలగా పులగంగా కన్పిస్తాయి మాల ముఖంలో.
వాసుకి అప్పటికే కళ్ళు యెర్రబడిపోయాయి.
మాలని యెవరైనా సరే ఓ చిన్నమాట అన్నారని తెలిసినా వాసుకి విపరీతమైన కోపంవచ్చే స్తుంది. యేమాత్రం అందుబాటుగా వున్నా వాళ్ళ రక్తం కళ్ళ చూడటమే."
పాత ఇల్లు ఖాళీచేసి వీరభద్రం ఇంటిదగ్గిర ఒక గదిలోకి మారిం తర్వాత ఖాన్ మనుష్యులు మాలని బలవంతంగా యెత్తుకుపోవటానికి ప్రయత్నించారు.
ఒకరోజు మాల పని పూర్తి చేసుకుని తన ఇంటికి వస్తూవుండగా కాపుకాశారు. ఇలాంటిది యేదో తప్పకుండా జరుగుతుందని ముందే వూహించిన వాసు ప్రతిరోజూ తనుగాని వీరభద్రంగాని ఆ సమయానికి మాలని అనుసరించి దూరంగా వుండే చూస్తూ వుండేవారు గనుక. సమయానికి వచ్చి రక్షించ గలిగాడు.
ఆ తర్వాత ఖానుని పోలీసులు అరెస్టు చేశారని తెలిసి అమ్మయ్య ఇప్పట్లో ఫర్వాలేదని. అనుకున్నారు ముగ్గురూ. కాని మధ్యలో ఈ గౌరయ్య ఒకడు శనిలాగా దాపరించి వాసుకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు.
వాసు కోసం చూసి మాల అంత బాధలోనూ నవ్వింది.
"మీకు భలేవారు వాసుబాబూ.....కయ్యానికి కాలు దువ్వితే యెలా? జాగ్రత్తగానే కాలం వెళ్ళదీస్తున్నాను కదూ. ఇంక నాన్నకి మందు ఇచ్చే సమయం అయింది. మరి సెలవు "అంటూ వెళ్ళి పోయింది.
రానురాను మాలతి సమస్య ఎలా పరిష్కరించగలనో అనే ఆలోచనలతోనే ఇల్లు చేరుకున్నాడు వాసు. తన టేబుల్ మీద ఓ ఆహ్వాన పత్రిక తనకోసం ఎదురు చూస్తోందని తెలుసు కుని తీసి చూశాడు ఆశ్చర్యంగా.
వైదేహి పుట్టిన రోజు ఆహ్వానం అది.
చిత్రంగా వుంది వైదేహి ప్రవర్తన, "కాదు" అని దూరంగా వచ్చేసినా ఎందుకంత కుతూహలం చూసిస్తోందో అర్ధం కాలేదు.
పార్టీకి ఎలా వెళ్ళటం!
వెళ్ళకుంటే సభ్యత కాదేమో?
పోనీ ఫోనులో శుభాకాంక్షలు చేస్తే .........
ఆలోచిస్తూనే భోజనం పూర్తిచేశాడు.
* * *
ఈ రోజే వైదేహి పుట్టిన రోజు. లేస్తూనే గుర్తువచ్చిన విషయం మర్చిపోవాలని ప్రయత్నిస్తూంటే గమ్మత్తుగా యెక్కువగా ఆమె విష యమే గుర్తువస్తోంది. పుట్టినరోజు శ్రీమంతులు యెంత ఆర్భాటంగానైనా జరుపుకుంటారు? అదే పేదవాళ్ళయితే ఆ రోజుకి కడుపునిండా అన్నమైనా దొరకదు. అసలు పుట్టినరోజు యెప్పుడో వాళ్ళకి గుర్తు వుంటుందా?
తన ఆలోచనలకి తనకే నవ్వువచ్చింది. వాసుకి
వాళ్ళ ఇంటికి వెళ్ళటం అసంభవం. ఓ గ్రీటింగ్ పంపించేస్తాను. అని పోస్టాఫీసుకి వెళ్ళాడు.
వీర భద్రానికి పాఠం చెప్పాలని పార్కుకి వెళ్ళేసరికి అప్పటికే వీరభద్రం తనకోసం ఎదురు చూస్తున్నాడు కాస్త ఆలస్యం చేసినా చదువు చెప్పించుకునేందుకు సమయం యెక్కడ సరి పోదో అని "డ్యూటీ" ముగించుకుని వురుకులూ పరుగుల్తో వస్తాడు అక్కడికి.
చదువు మీద వీరభద్రానికున్న శ్రద్దకి వాసుకి యెంతో సంతోషం అయి వీలున్నంత వరకూ ఒక్కరోజైనా అక్కడికి రావటం మానడు.
పాఠం పూర్తి అయి పుస్తకాలు సర్దుకుంటూ వీరభద్రం మెల్లగా అన్నాడు. ఒకరోజు మా ఇంటికి "టీ" కి రావాలి యెప్పుడు వీలు వుంటుంది!"
"ఏం గొప్పగాయేర్పాట్లూ చేస్తావా!" నవ్వుతూ అన్నాడు వాసు.
"కాదండీ.... మా అమ్మ మీ కిష్టమైనది యేమిటో చేస్తే.....చేస్తానని అన్నది...
"ఓ........అదా సంగతీ....నా కిష్టమైంది యేమిటో నాకేం తెలియదే.....ఆ....మా వదిన్ని అడిగి చెప్తానని చెప్పు."
"మీ కిష్టమైంది ఏమిటో మీకే తెలియదూ. భలేవారే" అంటూ బిగ్గరగా నవ్వాడు.
"పోనీ ఈ రోజు వస్తాను పద మీ ఇంటికి అంటూ లేచాడు వాసు వీరభద్రం గుండె కొట్టుకుంది. అసలే నెలాఖరు ఇల్లు ఎలా వుంటుందో తనకి తెలుసు. ఈయన నిజంగానే వస్తే....యేం చెయ్యాలి."
జేబూ తడుముకున్నాడు. పది పైసలబిళ్ళ పకపకమంది.
"నేనే ఇంకా నీ జేబులో వున్నది" అన్నట్లు జీతంరాగానే ఓ 'తీపీ' 'కారం' చేసి పిలిచి పెడదామని తల్లి చెప్పింది. ఎలాగూ వాసు డబ్బు తీసుకోకుండానే చదువు చెప్తున్నాడు. అతని ఋణం ఎలా తీర్చుకోవటం అని తల్లీ. తండ్రీ. తనూ ఆలోచిస్తూనే వున్నారు." ఇప్పుడే వస్తా అంటే" పచ్చి వెలక్కాయ వీరభద్రం గొంతులో అడ్డుపడింది. కాని యేం చేయాలి.
"సరే పదండి" అంటూ దారి చూపించాడు.
మాల ఇంకా రాలేదనే కోపంతో వస్తానని అన్నాడేగాని అప్పుడే మర్చిపోయి మాల ఇంకా యెందుచేత రాలేదు వాళ్ళనాన్న యెలా వున్నాడో అనే అనుమానం పీకుతుంటే 'ఎక్కడికి' అన్నాడు వాసు పరధ్యాసగా ఆలోచిస్తూ మాల ప్రతిరోజూ వచ్చే వారివైపు చూస్తూ.
అసలు ఆడపిల్లలకి చదువంటే శ్రద్దేలేదు. ఒట్టి మొద్దు రాచ్చిప్ప.. ఇంకా ఇంకా కసిగా అనేసుకుంటున్నాడు వాసు తనలో తనే.
"రండి మాష్టారూ" వీరభద్రం గత్యంతరం లేక మరోసారి హెచ్చరించాడు.
"ఓ అవును కదూ మీ ఇంటికి వస్తానన్నాను కదూ.... నాకేం తోచటం లేదు పద మీ నాన్న గార్నీ అమ్మగార్నీ ఓ సారి చూడాలనుకున్నాను ఎలాగూ."
ముందుకు సాగాడు వాసు.
దేవుడి మీద భారం వేసి ముందుకి నాలుగు అడుగులువేసి. వస్తూన్న మాలని చూశాడు.
"అమ్మయ్య దేవుడు నా యందున్నాడు" మనస్సులోనే నమస్కరించాడు.
మాల పుస్తకాలు పట్టుకుని కట్టుకున్న చీరె చిరుగుని యెవరన్నా చూస్తారేమో అని దాన్ని కప్పుకుంటూ త్వరత్వరగా వచ్చేస్తూ ఆ హడావుడిలో వీరభద్రాన్ని ఢీ కొనబోయి అంతలోనే తప్పుకుని వాసుని చూస్తూనే భయంగా చేతులు జోడించి.
"గురుదేవులకి నమస్కారం" అంది ఎంతో వినమ్రురాలై.
ఈ మధ్య వీరభద్రాన్నించి ఈ అంటువ్యాధి మాలకి వ్యాపించింది ఇలా అన్నప్పుడల్లా వాసుకి తగని చికాకు.
"నేను గురుదేవున్ని కాను..... కానూ.... అంటాడు వెంటనే.
"అదేమిటి - కాదంటే పోతుందా! విద్యా దానం చేసేవారు గురువులు కాక మరెవరు" అంది గడుసుగా.
* * *
