
తను ఈవిధంగా వచ్చెయ్యటంచేతనే ఇంతమంది విమర్శలకు గురికావల్సొచ్చింది. విమర్శలు చెయ్యటానికి ఆత్మపరిశోధన అక్కర్లేదు. బాధ పడేవాళ్ళకే ఆత్మపరిశోధన కావాలి. వాళ్ళు ఆవేశాలూ, ఆశ నిరాశలూ, వ్యక్తావ్యక్త వేదనలూ అన్నీ మానసికంగా, శారీరకంగా, హృదయాను గతంగా అనుభవిస్తారు. విమర్శకుల మనస్సు తెగిన గాలిపటం లాంటిది. వారు మాట్లాడే మాటలనే ప్రపంచవాయువులో ఆ గాలిపటం రెపరెపలాడుతూ ఉవ్వెత్తుగా తోకాడిస్తూ ఎగిరిపోతుంది.
తననూ. భర్తనూ విమర్శిస్తూ ఆయన కర్మకు సానుభూతి చూపుతూ, తన గీతను నిందిస్తూ, తను వారిని చేపట్టటం నుంచే ఆయన ఎందుకూ కొరగాకుండా పోయారనే బంధువర్గ వితండవాదాల్ని వింటూ, అన్ని అవమానాల్నీ, అన్ని చివాట్లన్నీ భరిస్తూ, కొంతకాలం గడిపి, ఇంతమంది అనే మాటల బాధను పడలేక ఏ ఒకసారో తన అభిప్రాయాల్ని నలుగురిలోనూ వ్యక్తపరిస్తే ఇంగిత జ్ఞానం లేని ఇల్లాలుగా, భర్తను తీర్చిదిద్దుకో లేని గృహిణిగా తన ముఖాన సంఘపు ముద్ర పడింది, దాంతో సరిపోక అత్త ఆడబిడ్డల ఈసడింపు మాటలు, ఎగతాళిగా మాట్లాడి తన మనస్సును గాయపరిచే భావాలు, తనేదయినా సమాధానం చెబితే వింత వింత అర్ధాలు ఆపాదిస్తూ ఒకటికి నాలుగు అనే ఆడబిడ్డ. ఈ వాతావరణం నుంచి కాస్త విశ్రాంతి తీసుకొందామని తనువస్తే పోట్లాడి వచ్చినట్లుగా, తన సంసారం పాడుచేసుకు వచ్చినట్లుగా పుట్టింట్లో తల్లి దండ్రుల భావన. ఈ స్థితిలో తను ఎవరితో ఏమని చెప్పుకోవాలి? ఎవరికి నచ్చచెప్పాలి? ఒక్కగా నొక్క కూతురు తల్లిదండ్రుల్ని చూసి పోవటానికి ఆపేక్షగా తనంతట తానుగా వచ్చిందనే సంతోషంకన్నా, ఎందుకొచ్చిందా అనే విచారమూ, కోపమూ తల్లిదండ్రుల్లోనూ, అన్నగారి లోనూ తను చూడగలిగింది. ఒక అయ్యచేతిలో పెట్టి కాపురానికి పంపింతరువాత ఇలాంటి పరిస్థితుల్లో పుట్టింటికి వస్తే, కన్నవారు చేసే ఆదరణ ఇదే కావాలనుకుని బాధపడింది గౌతమి.
ఆలోచిస్తూ పడుకున్న గౌతమికి తెల్లవారు ఝామునగాని నిద్రపట్టలేదు.
ఉదయం గౌతమి లేచేసరికి ఏడుగంటలయింది. అప్పటికి ఇంట్లో అందరికి కాఫీలూ అయినవి. అంత పొద్దెక్కి లేచినందుకు చాలా బాధపడ్డది గౌతమి. త్వరత్వరగా ముఖం కడుక్కుని వంటింట్లోకి వెళ్ళింది. కాఫీ గిన్నెలు, గ్లాసులూ పనిమనిషికి తోమటానికి వేసింది ధాన్యలక్ష్మి.
"మా రాణిగారు కాఫీ తాగటానికో గ్లాసు తోమియ్యవే సీతమ్మా" అని పనిమనిషిని పురమాయించింది తల్లి.
గౌతమి మనస్సు చివుక్కుమన్నది.
"కాస్త పెంద్రాళె లేవకూడదుటే అమ్మాయ్, నీ కోసం మళ్ళీ కాఫీ వెచ్చబెట్టాలి. ఇట్లా తలోసారీ కాఫీకొస్తే వంటకు ఆలస్యంకాదూ" అన్నది తల్లి.
గౌతమికి కాఫీ తాగాలనిపించలేదు. తనకు పుట్టింట్లో ఎంత గౌరవం ఉన్నదీ తెల్సుకుంటున్నది. తను కాపురానికి వెళ్ళిన కొత్త రోజుల్లో ఒకసారి ఏదో పండక్కి ఇక్కడికి తండ్రి తీసుకొచ్చినప్పుడు, అర్ధరాత్రి దాటేవరకూ ఏదో నవల చదువుతూ రాత్రి రెండు గంటలు దాటాక నిద్రపోయి తెల్లవారి ఎనిమిది గంటలకు లేస్తే ఈ తల్లే "మామ్మాయి పొద్దుపోయి నిద్రపోయింది. దాన్ని లేపకండి" అన్నది ఎవరితోనో మరి ఈనాడు ఆ తల్లి నోటివెంటే ఇలాంటి మాటలు వినవల్సొస్తున్నది.
వారం రోజులు గడిచాయి. గౌతమి కాలేజీ స్నేహితురాలు నగేంద్రబాల తలవనితలంపుగా తన ఇంటి ముందునుంచే రిక్షాలో వెళ్ళటం చూసింది. వరండాలో నిల్చుని పిల్చింది. కేక వినబడి రిక్షాలో నుంచి వెనక్కు తిరిగిచూసి విప్పారిన ముఖంతో మందహాసం చేసి రిక్షా దిగి వచ్చింది నగేంద్రబాల.
"ఏమే గౌతమీ, నేను గుర్తున్నానన్నమాట. ఏమిటి విశేషాలు. ఎంతకాలానికి కల్సుకున్నాం. కాలేజీ వదిలాక ఈ రెండేళ్ళల్లో మళ్ళా ఇదే కల్సుకోడం. ఎక్కడుంటున్నావ్. మీ శ్రీవారిది ఏఊరు. ఏమిటి. సంగతులు. అన్నీ వివరంగా చెప్పవే" అన్నది గుక్క తిప్పుకోకుండా నగేంద్రబాల.
వరండాలోనే చెరో కుర్చీలో కూర్చున్నారు. ఇంతకాలానికి కనబడ్డ స్నేహితురాలికి కాఫీ ఇద్దామని మనస్సులో ఉన్నా 'నీకే కాకుండా నీ స్నేహితురాలి క్కూడానా' అని తల్లి అనుకుంటుందేమోనని సందేహించి మనస్సులో బాధపడ్డది గౌతమి.
"ఏమె ముంగిలా అట్లా కూచున్నావ్ మాట్లాడవేం" అన్నది మళ్ళీ నగేంద్రబాల.
"ముందు నీ సంగతి చెప్పు" అన్నది గౌతమి.
"నా సంగతి కేముంది చెప్పు" అన్నది గౌతమి మూడు ముక్కల్లో చెప్పేస్తాను నాకూ పెళ్ళయింది. మావారు గెజిటెడ్ ఆఫీసర్. ఒక సంవత్సరం మా కాపురం బానే ఉంది. మూడు పూలూ, ఆరు కాయలులా. జీవిత సమరంలో ఏవో లోటు బాట్లు దిద్దుకోలేక, మనస్పర్ధలు పెరిగి కోర్టు ద్వారా విడాకులు పుచ్చుకున్నాం. ఇది జరిగి మూడేళ్ళయింది. నేను ఉద్యోగంలో చేరాను. ఇన్ కం టాక్సు ఆఫీసులో యు. డి. సి. ని. నా సంపాదనతో నా జీవితం సుఖంగానే వెళ్ళిపోతున్నది. కాలేజీ చదువు అక్కర కొచ్చింది. నా పొట్ట నే పోసుకోవటమే గాకుండా మా అమ్మ నా దగ్గరనే ఉంటం చేత ఆవిడనూ నేనే పోషిస్తున్నాను. ఇదీ విషయం. మూడు ముక్కల్లో చెప్తానని ఇలా చెప్పేశానే" అన్నది నగేంద్ర బాల నవ్వుతూ.
గౌతమి ఆశ్చర్యపడ్డది. విచార పడ్డది. సంతోషపడ్డది. స్నేహితురాలివైపు చూస్తూ కూర్చుంది మాట్లాడకుండా.
"ఏం మాట్లాడవేమే. భర్తకు విడాకులిచ్చావంటే ఆశ్చర్యపడుతున్నావా. నా పరిస్థితుల్లో ఎవరయినా అయితే నుయ్యో, గొయ్యో చూసుకునే వారే. మొండి ఘటాన్ని కనక, గుండె బండబారి పోయి, నలుగురిలో తలెత్తుకు తిరుగుతున్నాను. సరే, దానికేం గాని ఆఫీసుకు టైమైంది. ఎల్లుండి ఆదివారం మా ఇంటికి రా. అడ్రసు రాసిస్తాను" అన్నది నగేంద్రబాల. అడ్రసు కాగితం ఇచ్చింది. రిక్షా ఎక్కి వెళ్ళిపోయింది నగేంద్రబాల.
చాలాసేపు అక్కడే కూర్చొంది గౌతమి. మనస్సులో అనేక భావాలు, అనేక రకాలయిన ఆలోచనలు. వేటికీ సమాధానం దొరకదు. నగేంద్ర బాల ఇప్పుడు స్వేచ్చా జీవి. దాని కాళ్ళమీద అది నిలబడగలిగింది. ఎంతో మనో నిబ్బరమూ, ధైర్యమూ లేందే అది అట్లా మాట్లాడదు. సంసార జీవితంలో ఎన్ని సుడిగుండాల్లో పడి ఉక్కిరి బిక్కిరయి వడ్డుకు చేరగలిగిందో నగేంద్రబాల అనుకుంది గౌతమి.
8
గోపాలశాస్త్రి నెల రోజులు పైగా పెద్ద కూతురుగారింట్లో ఉండి ఆ పల్లెటూళ్ళో విశ్రాంతి తీసుకుని ఇంటికి వచ్చాడు. తండ్రి రాగానే జానకిరాం, శ్రీలక్ష్మి, గోపాలశాస్త్రి భార్య ప్రభావతమ్మ అంతా ఎదురేగినట్లుగా వెళ్ళి ఆయన్ని ఇంట్లోకి తీసుకొచ్చారు. కాస్త విశ్రాంతి తీసుకోటానికి ఆయన పడక్కుర్చీలో కూర్చోగానే జానకిరాం, శ్రీలక్ష్మి ఆయనకు దగ్గరగా కుర్చీ పక్కన కూర్చున్నారు. ప్రభావతమ్మ వంట పనిమీద నిమగ్నురాలైంది.
"అక్కయ్యగారింట్లో అంతా కులాసాగా ఉన్నారా. బావ ఆరోగ్యం ఎట్లా ఉంది. పెద్దాడు రామం బాగా చదువుకుంటున్నాడా, వేణుకి సంబంధాలు చూస్తున్నారా" అని తండ్రిని అడిగింది శ్రీలక్ష్మి.
"పొలాలు బాగా పండుతున్నయ్యా నాన్నా, బావకు పొలమన్నా, పశువులన్నా ఎంతో యిష్టం. నిజంగా బావగారిల్లు పాడిపంటలకు నిలయమే. కష్టపడి వ్యవసాయం చేయిస్తున్నాడేమో కమ్మగా తింటున్నారు" అన్నాడు జానకిరాం.
కూతురు ప్రశ్నలకు సమాధానం చెప్పాడు తండ్రి. కొడుకు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పదల్చుకోలేరు. జానకిరాం పరిస్థితి తల్చుకుంటే ఆయనకు విచారమూ, కోపమూ, మనస్తాపమూ, ప్రేమ, జాలి అన్నీ ఒక్కసారిగా కలుగుతయ్యి. శ్రీలక్ష్మిని చూచినప్పుడు ఆయనకు జాలి కలిగినా ఏదో ఒక రకంగా మనస్సుకు సమాధానం చెప్పుకుని తనకు తానే నచ్చచెప్పుకునేవాడు. పసుపుకుంకాలకు నోచుకోలేని శ్రీలక్ష్మి జీవితం ఒక రీతిగా, ఒక పరిధిలో వెళ్ళిపోతున్నది. అల్లుని ఆయుర్దాయానికి తను కర్త కాదు. కూతురు నుదుట ఆ గీత రాసిఉందని తనకేం తెలుస్తుంది.? జానకిరాం ను చూసినప్పుడే ఆయనకు కడుపులో దేవినట్లవుతుంది. నరనరాల్లో జీవించిన పుత్రప్రేమ జానకిరాం విషయంలో ఆయన ఎక్కువగా చూపెట్టలేక పోతున్నాడు. జానకిరాం ను చూడగానే ఆయన మనస్సు పదేళ్ళు వెనక్కు వెళ్ళుతుంది. తండ్రికి పెద్ద కొడుకు మీద ఆపేక్ష జాస్తి. అట్లాగే తల్లికి పెద్ద కూతురు మీద తనకు పెద్ద కొడుకు ఉండి కూడా లేనట్లే అయింది. ఆ సంఘటనలన్నీ తల్చుకుంటే ఆయనకు పుండుమీద కారం చల్లినట్లుగా ఉన్నా, కన్న మమకారంచేత ఆ మనఃక్లేశాన్ని బయటకు కనబర్చకుండా లోలోపలనే జీర్ణింప చేసుకుంటున్నాడు. పెద్దకొడుకు ఆ తీరుగా బ్రతికుండి కూడా తమకు కాకుండా పోవటంచేత జానకిరాం విషయంలో ఆయనేమీ కలుగజేసుకోటంలేదు. అల్లుడు పోయినా, శ్రీలక్ష్మిని తన నెత్తిన పడేసి వెళ్ళిపోయినా ఆ కడుపులోని చిచ్చు ఆయన్ని అంతగా బాధపెట్టటం లేదు. కారణం అది ఒక్కసారి తేలిపోయిన సమస్య.
