Previous Page Next Page 
ఆకాశ దీపాలు పేజి 11


    'ఉండేటట్లయితే పరిష్కారమయిపోయి నట్లేనా?-'
    'పరిష్కారమవుతుందని కాదు, ఒక విధంగ పరిష్కరిద్దామని, పదిమంది నోళ్ళల్లో నా పేరు, రాంబాబు పేరు నలగ కుండా ఉండాలనీ, మా బిడ్డకు చెడ్డపేరు రాకూడదనే సదభిప్రాయంతో.....'
    "చాల్లే - బోడి సలహా ఇచ్చారు.'
    'అలా తీసిపారెయ్యకు మరి! అయన చెప్పింది నిజం. అదె ఉత్తమ పరిష్కారం కూడా అనే అనిపిస్తోంది నాకు.'
    'అయితే ఇంకేం? మామగారి మాట జవదాటమని నేనెవర్ని చెప్పటానికి?'        'అలగకు - ఎ సలహా లేనిదే ఏపనీ చెయ్యను-'    
    'మరి ఇదెవ్వరు చెయ్యమన్నారు?-
    "ఏది?-'
    'అదే, రాంబాబుతో....'
    'నువ్వు కొత్త పెళ్ళికూతురువు. నీకు సిగ్గు ఆమె పదార్ధం గురించి కొంచెం అయినా తెలుసా?-'
    'నువ్వు సిగ్గుపడేకాబోలు - ఈ పని చేసింది....'
    'షటప్- ఇంతకూ..."
    'కొంచెం ఆలోచించుకొని చెబుతాను. సరేనా?-'
    'కానీ ఒకటే! మీ అన్నయ్యను ఈ విషయంలో ఏమీ అడగకు-'
    సుందరి ఏమనుకుందోగానీ 'సరే' నంది!
    వారంరోజుల తర్వాత ఇందిర ఆ ఊరు వెదిలింది- ఉద్యోగం వచ్చిందనే మిషతో,
    
                                  *    *    *

    'డియర్ సుందరీ-
    ఆరునెలల తదనంతరం రాస్తున్న ఉత్తరం ఇది. ఖచ్చితంగా మూడునెలల కిందటొక ఉత్తరం రాశాను, దానికి జవాబు అందుకొన్నాను. అలాగే దీనికీ జవాబు అందుకొంటే చాలనే నా కోరిక.
    క్షణం ఆలోచించి, వెనుదిరిగి చూసు పోవడమే కొంటే, విన్నో విశేషాలు కనిపిస్తున్నాయి నాకు. ఈ మూడు నెలలలోనే - ఉద్యోగం అనే పేరుతోనే ఈ ఊరు చేరినా ఉద్యోగం సద్యోగం ఏమీలేకనే మూడునెలలు గడిపాక, అనుకోకుండా ఉద్యోగం వచ్చింది నాకు-ఉద్యోగం రాగానే తెలియపర్చాలనే అను కొన్నాను కానీ బద్ధకం-అంతే, బద్దకం వల్లనే రాయలేక్ పోయాను - అయినా ఉద్యోగం ఎలా వచ్చిందో చెప్పనేలేదుగదూ! -మా మామగారు, ఔను, రాంబాబు నాన్నగారి ప్రయత్నంవల్ల. ఇంటర్వ్యూలో నన్నడిగినవి రెండే ప్రశ్నలు - మొదటిది నీ పేరేమిటని! రెండోది వెంకటేశ్వర్లుగారు నీకు చుట్టమా? అని రెండో ప్రశ్నకు జవాబు సరిగా నాకే తెలీదు. ఇంక వాళ్ళకేమని చెబుతాను?- అయినా విందుకో 'ఊ' అన్నాను. 'అయితే రేపొచ్చి ఉద్యోగంలో చేరండి' అన్నారు!
    చేరిపోయాను-ఇపుడు నాకు నెలకు రెండు వందల యాభై రూపాయ లొస్తున్నాయి. కష్టార్జితం! చాల తృప్తిగ ఉంది నాకు ఇలా బతుకుతోంటే! నాకు, నాన్నగారికి బాగ సరిపోతాయి. అమ్మకు ఇక్కడనుంచి నెలనెలా యాభై రూపాయలు పంపిస్తున్నాము. అమ్మా అంటే కంట్లోంచి నీళ్ళొస్తున్నాయ్!- నాలాటి కూతురు ఏతల్లికి వద్దు!!
    -అయినా నాగురించి రాంబాబు మర్చిపోయినా, రాంబాబు తండ్రి మర్చిపోలేక పోవడమే ఆశ్చర్యంగ ఉందిగదూ!-అయినా రాంబాబుది ఉద్రేకం. ఉద్రేకంతో ఆవేశంతో ఏం చేస్తున్నాడో సైతం గ్రహించగలిగే స్థోమత అతనిలో లేదు. వెంకటేశ్వర్లో? -అలాకాదు. అతను రిటైర్డ్ జడ్జీ, తను చేసేపనివల్ల మంచి జరుగుతుందో, చెడు జరుగుతుందో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకొనే స్వభావం అతనిది-అది అతనికి వృత్తి నేర్పన విద్య, అందుకే నన్నంత త్వరలో మర్చిపోలేక పోయాడు-కృతఘ్నురాలిని-కనీసం ఉత్తరం అయినా రాయలేదు నేను. రాయాలి!
    ఇంక ఆఫీసు విశేషాలు! మొదట వారంరోజులూ కొంచెం కొత్తగా ఉన్నా, ఇపుడు కొంచెం ఫర్వాలేదనిపిస్తోంది. శారద అనే కొలీగ్ తో మంచిస్నేహం ఏర్పడింది. నాకు, నీవు లేనిలోటు ఆవిడవల్ల తీరుతోందనుకో! చాల సున్నితమైన మనిషి. ఏదైనా ఒకటి అంటే, అది ఎంత తేలికయిన విషయంగ మనకు కనిపించినా, ఆమెను కొంచెం బాధిస్తే చాలు, కళ్ళమ్మట నీళ్ళు నిండుకొంటాయి. బహుశా ఇలాటివాళ్ళను చూసే, ఆడవాళ్ళ నెత్తిమీద నీటికుండ ఉందన్నది!!- తర్వాత. పాపం, శారద నాన్నగారికి పిచ్చి. ఆ పిచ్చితండ్రితో ఎలా వేగుతుందో ఏమొ అర్ధంగాదు నాకు!!
    శారదకు పూర్తి వ్యతిరేకమైన మన స్తత్వం ఉన్నవ్యక్తి రామారావు. ఉట్టి భోళామనిషి, మొదటిరోజునే నాదగ్గరలొచ్చి ఏమడిగాడో తెలుసా?- 'మీరేమీ అనుకో కండి, మీరు మిస్ ఇందీరా? మిసెస్ ఇందిరా?' అని. భయపడ్డాను నేను ఇతనికేమైనా తెలుసానని. అయినా జవాబిచ్చాను-౦ 'మిసెస్ ఇందిరే'నని! 'విందు కడిగానంటే అటెండన్స్ లో మీపేరు రాయాలి, అందుకోసం-పైగా మీమెళ్ళో మంగళసూత్రం ఉన్నట్లు లేదు-'అతనన్నది నిజమే, నామెడలో మంగళసూత్రం లేదు, నేను కుమారీనా? శ్రీమతినా?-
    క్షణం ఆలోచించి, గోడకట్టినట్లు చెప్పాను-'అవును', మాది రిజిస్టర్ద్ మారేజీ! వారికిలాటివన్నీ నచ్చవు, ఈ సనాతన ధర్మాలూ, ఈ మాంగల్యం, పెళ్ళి అంటూ అనవసరపు ఖర్చు అంటారు. సింపుల్ గా రిజిష్టర్డ్ మారేజీ-' ఇంత ఎందుకు మాట్లాడనో ఈవేళ ఆలోచిస్తోంటే తెలుస్తోంది. నాది గిల్టీ కాన్షన్! చేసిన తప్పును కప్పిపుచ్చుకొనేందుకు విఫల ప్రయత్నం. అంతే!! మొత్తానికా భోళా శంకరం నమ్మేశాడు.
    తర్వాత పడిపడి నవ్వుకొన్నాను - నా భర్త కట్టని తాళీ గురించీ, నా భర్త కున్న ఆదర్శ భావాల గురించి తలుచుకొని.
    ఇంకొక ప్రశ్నకు జవాబు కూడా ఆలోచించుకొన్నాను ఆరోజు రాత్రే - 'మీ ఆయన ఏరి?' అంటే- 'హయ్యర్ ఎడ్యుకేషన్ కి స్టేట్స్ వెళ్ళారు' అయినా ఆ ప్రశ్న ఇంకా ఎవరూ వేయలేదు.
    చివర్న రాస్తున్నా చాల ముఖ్యమైనది ఇదే- నీ దాంపత్య జీవితం ఎలా ఉంది? పూవులో తావిలా, చంద్రునిలో వెన్నెలలా మీ ఆయనలో నువ్వు కలిసిపోయావా? లేదా?- లేదా అని అడగకూడదూ?- ఏదైనా విశేషముంటే రాయి, రాయడం కాదు, ఇక్కడకే వచ్చెయ్ పురుడుకు ఇంత సిగ్గులేకుండా ఎలా రాస్తున్నా ననుకుంటున్నావా? అదంతే!!
    అమ్మకు ఈమధ్య ఒంట్లో బాగుండటం లేదు. ఎందుకని అడగకు. కారణం ఊహించుకో. చేతికి అంది రావాల్సిన కూతురు తలవంచుకొనేపని చేయటమే!- అఫ్ కోర్సు, ఇది అమ్మ ఊహమాత్రమే, నేనుమాత్రం తలవంచుకొనేపని చేసానని అనుకోను.
    విశేషాలు ఇంకేమీ లేవు.
    అమ్మను చూడాలని ఉంది. కానీ వీలవదని తెలుసు.
    వెంటనే ఉత్తరం రాస్తావు గదూ సుందరీ!-
    నాన్నగారు దగ్గరే ఉన్నా, ఎంతో దూరంలో ఉన్నట్లుగ ఉంది నా ప్రాణానికి. ఏ కష్టమైనా నష్టమైనా కూడా చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది మా ఇద్దరి మధ్య. ఈ నీలితెరలు, కాదుకాదు, ఈ ఇనుప తెరలు ఏనాడు తొలగిపోయి మా ఇద్దరి మధ్య తండ్రీ కూతుళ్ళ అనుబంధం ఏర్పడుతుందో ఊహించలేకపోతున్నాను- బహుశా మా ఇద్దరి మధ్య కొంత బాంధవ్య పునరుద్దరణ జరిగేది నాకు పుట్టబోయే పాప వలనే అనుకుంటా! - పుట్టబోయే పాప నాకేదో మేలు చేయాలనుకోవడం స్వార్ధమే, కాదనను!!
    క్షమించు, మనసెంతో బాధపడుతున్నా ఈ విషయం రాయక తప్పటంలేదు - మొన్న నువ్వు రాసిన ఉత్తరంలో రాంబాబు కనిపించాడని రాశావు. ఏ స్థితిలో? ఎక్కడ? ఎలా ఉన్నాడు? - నా గురించి వివరాలు ఏమైనా అడిగాడా? లేదా? వీలైతే విశేషాలన్నీ రాయి. వీలైతే కాహ్డు, తప్పకుండా రాయి. వెళ్ళి కలుసు కోవాలి. ఈ అరణ్యవాసం తప్పి, అంత! పురనివాసం కాకపోయినా, కనీసం తల్లీ దండ్రుల దగ్గరగ నివసించే అవకాశం లభిస్తుంది. అందుకోసం అతని సహకారం తప్పనిసరి.        
    ఉంటా మరి, శ్రమ అయినా సరే, రాంబాబు గురించి తెలుసుకో.
                                                                                                              -నీ
                                                                                                            ఇందిర.'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS