
7
ఇందిరకు ఆడపిల్ల పుట్టి ఆనాటికీ వారంరోజులయింది. ఇందిర ప్రత్యేకంగ కోరుతూ ఉత్తరం రాసింది సుందరికి- "నీకెంత అసహ్యం ఉన్నా ఆప్యాయత ఉన్నా, తప్పకుండా రా! వచ్చి ఈ గండంనుంచి నన్ను తప్పించు! బతుకుతాననే ఆశకన్నా చచ్చిపోతాననే నమ్మకమే నాలో చాల ఎక్కువగ ఉంది. బహుశా అలాగే జరుగుతుందేమో! అలా జరిగితే.....మంచిదేగాని, నిన్ను చూడకుండా చావను, చావలేను. అందుకోసం తప్పక రా!' అంటూ.
తిరుగు టపాలో సుందరే వచ్చింది.
తనూ ఉత్త మనిషి కాకపోయినా, ఇందిరకు సాయపడాలనే కాంక్ష తనలో అణువణువూ ఆక్రమించి ఉంటే, గత్యంతరం లేక వచ్చింది సుందరి.
"నీకు అనవసరమైన శ్రమ తల్లీ-' అన్నాడు రామచంద్రయ్య సుందరి రాగానే.
'అదేమిటి బాబాయ్ గారూ, మీకు నేను వేరు, ఇందూ వేరన్నమాట! ఈమాట నాకు తెలిసి ఉంటే రాకేపోదును.... పోనీ లెండి. ఇప్పుడు మాత్రం ఏం? రేపు వెళ్ళిపోతాను.'
రామచంద్రయ్య బాధపడుతూ అన్నాడు. 'కాదు తళ్ళీ, అలా అనికాదు, నీకెందుకీ శ్రమ అని! అంతేగానీ, నాకు ఇందూ కన్న నీవే ఎక్కువ అన్న సంగతి నీకు తెలీందిగాదు."
సుందరి నవ్వింది 'అలా అన్నారంటేనే సరిపోదు. ఇపుడు - రేపు మీరు నన్ను 'పో' అని అన్నాగానీ పోతానా?'
'పో అని నేనంటానా? నీవు రావటమే నాకు మహద్భాగ్యం' అన్నాడు రామ చంద్రయ్య.
ఎన్నాళ్ళ తర్వాతనో తండ్రి అంత సంతోషంగ ఉండడం ఇందిరకు సంతోషాన్నే కలుగ జేసింది. అయినా సంతోషం కల కాలం ఉండేది కాదు. సుందరి వెళ్ళి పోగానే...?
తను దురదృష్టవంతురాలు.
ఈ విషయం పచ్చి నిజం!!
ఆరోజు రాత్రే సుందరి రామచంద్ర య్యతో మాట్లాడింది - అసలు అలా అనటం కన్నా సుందరితో రామచంద్రయ్యో మాట్లాడాడంటే సబబు. సుందరి తనకు రాంబాబు కనిపించినట్టు రామచంద్రయ్యకు చెప్పలేదు ఇందిర, అన్నది గ్రహించింది అప్పుడు. ఆ విషయం చెప్పాలో, లేదో నిర్ణయించుకొనేలోపునే, నోరుజారి పోయింది సుందరికి. రామచంద్రయ్య ముఖంలో కోపం. ద్వేషం కొంతసేపు తాండవిన్చినా, క్షణంలో అంతా తనూ యించుకొని అడిగాడు. 'రాంబాబా తల్లీ?' అని.
'ఔనండీ రాంబాబే!'
'ఏమోనండీ తెలీదు. పక్కనే మావారున్నారక్కడ. పలకరించటం బాగుండదని అనుకొన్నానుగానీ లేకపోతే....అయినా రాంబాబే పలకరిస్తాడనుకున్నా కానీ, అతను నన్ను చూసినట్లు లేదు.'
'బహుశా చూసే పలకరించలేదేమో? ఎవరు చెప్పగలరు?'
'లేదండీ, రాంబాబుగురించి నాకు బాగ తెలుసు. అతను నన్ను చూసి ఉంటే తప్పక పలకరించి ఉండేవాడు.'
'అలా అనుకోకు తల్లీ - ఇందు సంగతి తెలిసాక, ఆమాట అనుకోవడానికి కొంత ధైర్యం కావాలి.'
"మీరలా అనకండి, ఇందిరా సంగతి ... అదె, ఆ సంగతి అతని కసలు తెలీదు. మీరు నమ్మండి. అతనికి అది తెలిస్తే రెక్కలుగట్టుకొని వాలతాడు ఆ క్షణంలోనే' సుందరికి రామచంద్రయ్య పరిస్థితి చూస్తోంటే జాలివేస్తోంది-ఒక్కగా నొక్క కూతురు. కని అపురూపంగ పెంచుకొన్న దానికి ఇదా శిక్ష? కోరిందల్లా ఇచ్చి, అమూల్యమైన స్వాతంత్ర్యాన్ని కూడ ఇచ్చి కంటిలో పాపలా చూసుకొన్నందుకు కన్నకూతురు ప్రసాదించిన బహుమతి అవమానం అయితే, ఆ ముసలి ప్రాణం వింతలా విలవిలలాడిపోయి వుంటుందో ఊహించుకొంది సుందరి.
చాలసేపు మౌనంగ ఉండిపోయారు ఇద్దరూ.
నిశ్శబ్ధాన్ని చీలుస్తూ అంది సుందరి 'బాబాయ్ గారూ పోనీ ఒక పనిచేస్తే.....?'
'చెప్పు తల్లీ!'
'మీరొకసారి హైదరాబాద్ వెళ్ళొస్తా రేమిటి?'
'ఎందుకమ్మా?'
'రాంబాబు కనిపిస్తాడేమోనని!'
'అంటే .... నిదిపిచ్చి! అంతేగానీ, ఏదో ఒకరోజున చాల యాదృచ్ఛికంగ కనబడ్డ రాంబాబు మళ్ళీ నాకాపట్నంలో కనిపిస్తాడనే నీ వూహ?'
'అలా అని కొట్టిపారెయ్యకండి! మానవ ప్రయత్నం మనం చెయ్యకుండా ఉండి పోవటం సైతం తప్పే అంటాను. మీరు ఊ అనండి, రేపే వెళుదురుగాని - వెళ్ళి ఆ చిక్కడపల్లిలో రెండురోజులు నిలబడితే, అతనే కనిపించకపోడు...... నాకా నమ్మకం ఉంది.'
రామచంద్రయ్య ఏమీ మాట్లాడలేదు- అది ఏదీ నిర్ణయించుకోలేని స్థితి, వెళ్ళి వెతికితే దొరుకుతాడా అనే సందేహం. దొర కాకపోతాడా అన్న నమ్మకం ..... వీటి మధ్య త్రిశంకుని స్వర్గంలా ఉంది అతని మనసు.
కొంతసేపు ఊరుకొని అంది సుందరి- 'నామాట వినండి బాబాయ్ గారూ-మీరొక సారి వెళ్ళిరాండ్. కనిపించి తీరుతాడనే నా నమ్మకం వృధా అయిపోదు.... నాకోసం వెళ్ళండి.'
రామచంద్రయ్య ఏమీ అనలేదు. ఈ సారి కూడా- ఆశ నిరాశల మధ్య ఊగిసలాడు తోంది అతని మనసు.
'మౌనం అంగీకార సూచకం, మీరు వెళ్ళ డానికి ఒప్పుకొన్నట్లే గదా?"
రామచంద్రయ్య నిర్లిప్తంగా ఉండి పోయాడు.
'అయితే రేపు రాత్రికే మీ ప్రయాణం!'
క్షణం ఆలోచించి అడిగాడు సుందరిని ఇందిరకీ సంగతి చెబుతామనే అంటావా?'
'వద్దండీ, వద్దు-మీరు వెళ్ళిరండి. మీరు వెడతానంటే ఒప్పుకోకపోవచ్చు ఇందిర. వెళ్ళి వచ్చాక ఫలితాన్ని బట్ట్టి ఆలోచిద్దాం.'
'ఏమో, తల్లీ! అంతా నీ మంచితనం వల్ల జరగాల్సిందే-'
రామచంద్రయ్యను నుర్రోజు సాయంత్రం నుంచి తొందర చేస్తోంది సుందరి. ఇందిర అడిగితే, సుందరి కొచ్చింది కనుక ఒకసారి ఇంటికి వెళ్ళొస్తానన్నాడు. ఇందిర వద్దని కనలేకపోయింది,
తనకోసం తండ్రి కెందుకు శిక్ష?
రాత్రి పదింటికి ఇంటినుంచి బయలు చేరిన రామచంద్రయ్య అరగంటలో తిరిగి వచ్చేశాడు- ఒక దుర్వార్త మోసుకొంటూ!
- శారద ఇల్లు కాలిపోయిందట! ఆ పిచ్చి తండ్రి వల్ల!! - రాత్రి పదింటికి పైన అటక మీదున్న కాగితాలు తీసి చూద్దామనే ఊహతో అటకెక్కి కిరసనాయిలు దీపంతో తిరుగుతూ, కిందబెట్టిన కాగితాల మీద కీరసనాయిలు ఒలికి, అంటుకొంది ఆ ఇల్లు-భయంతో కిందికి కూడా దూక లేకపోయాడు అతడు-సజీవదహనం అరిగిపోయింది ఆ పిచ్చివాడికి బాగా కాలిపోయి హాస్పిటల్ లో చేరింది శారద.
-ఇదీ జరిగిన సంగతి.
ఆ కాలుతున్న ఇల్లు! కాలిపోయిన మనిషి శవం, సగం కాలిపోయిన శారదను చూసి ఇక వెళ్ళలేకపోయాడు రామచంద్రయ్య.
స్నేహితురాలి తండ్రి దహనం, స్నేహితురాలికి జరిగిన ఆ ఘోరం విని బాగా చలించిపోయింది ఇందిర. ఆరోజే వెళతానంది, శారదను చూడటానికి, సుందరి, రామచంద్రయ్య బాగ పట్టుపట్టటంతో వెళ్ళలేదు, అంత రాత్రివేళ.
-మరునాడు-
ఇందిర, సుందరి ఇద్దరూ హాస్పిటల్ కు వెళ్ళారు-రామచంద్రయ్య వద్దు ళ్ళద్దని ఎంత చెప్పినా వినకుండా - 'మీరు ఉత్త మనుషులుకారు, ఇంత దారుణంగ కాలిపోయిన దృశ్యం మీరు చూడటం క్షేమం కాదు, వినండి నామాట- అని అన్నా వినకుండా వెళ్ళిపోయారు.
హాస్పిటల్లోకి నీళ్ళు వెళ్ళేసరికి స్పుహ తప్పిపోయిన శారద కనిపించింది వీళ్ళకు. వళ్ళంతా బాగ కాలిపోయింది. పచ్చగ పసిమి ఛాయతో ఆకర్షణీయంగా వుండే ఆ యువతి, నల్లగా మాడిపాయి, కమిలిపోయి, బొబ్బలతో, చాల అసహ్యంగ ఉంది. ఎక్కువ సేపు కూర్చుందామనుకున్నా అసహ్యంవల్ల కూర్చోలేని స్థితి ఏర్పడుతోంది.
కొంతసేపట్లోనే డాక్టర్లు, నర్సులు, ఒకటే కంగారుపడటం ప్రారంబించారు. మందులు, మెడిసన్లు, డాక్టర్లు, సర్జన్లు అతనికి ఆక్సిజన్లా! హైడ్రోజన్లా ...... అంతా వేస్ట్ -
చావాల్సిన శారదకు ప్రాణం పొయ్యలేక పోయాయి ఇవేవీ!
ఇంతమంది ఉన్నా ఇంత దారుణంగ చావాల్సి ఉంది శారద!! అందరూ చూస్తూ ఉండగానే చచ్చిపోయింది శారద.
కన్నీరు మున్నీరుగా ఏడ్చింది ఇందిర.
సుందరికి సారధ ఎవరో తెలియకపోయినా తనువచ్చిన రోజునే ఈ దారుణ సంఘటన జరగటంతో మనసంతా బాగా కలతపడి పోయింది. ఇందిరను ఓదార్చాలో, సుందరి తన్నుతా ఓదార్చుకోవాలో అర్ధం కాక బాధ పడింది-
ఇంటికి వచ్చి రామచంద్రయ్యతో- 'మీరీ వేళ వెళ్తారా బాబాయ్ గారూ?' అని అడిగితే పేలవంగా నవ్వేశాడు-
'చూడు తల్లీ-బయలు దేరాలని లేక పోయినా నీ మాట కొట్టివేయ లేక కదిలాను. కదలగనే దారుణ దృశ్యం చూశాను. రెండు చావులూ చూశాను, ఇంత జరిగాక ఇంకా మంచి జరుగుతుందనే ఆశ వల్లో చచ్చిపోయింది తల్లీ- ఇక నేను వెళ్ళను, జరిగేదేదో జరుగుతుంది-'
సుందరి ఏమీ అనలేక పోయింది.
ఇందిరకు ఆడపిల్ల పుట్టి, ఆ పిల్ల నెలరోజులు నిండేదాక ఉండి వెళ్ళింది సుందరి.
బారసాలరోజున ఆ ఆడపిల్లకు ఇందిర 'శారద' అని నామకరణం చేసిందని విని ఆశ్చర్యపోవటం మినహా ఇంకేమి చేయలేక పోయింది సుందరి.
* * *
చివరిదాకా చదవలేక ఆపేసింది శారద.
-ఎన్నెన్నో ప్రశ్నలు!!
అసలు ఇదంతా ఏమిటి??
అమ్మ జీవితం కాదుగదా?- ఉలికిపడింది శారద.
అయిఉండచ్చు. అయి ఉండచ్చు కాదు, అవును-
తనకు తనెవరి కూతురో తెలీదు. తన తండ్రి తను పుట్ట కమునుపే విదేశాలకు చదువుకోసం వెళ్ళాడుట. చదువనేది ఎంత కాలం? విద్యకు అంతం లేదు నిజమే! కానీ చివరిదాకా, అంటే జీవితం అంతమయే దాకా చదవటమనేది నాన్సెన్స్-అంటే....?
-విదేశాల్లో జీవితాంతం చదువనేది అర్ధంకాదు.
అసలు చదువని విదేశాల్లో ఉంటే? -
పోనీ, చదవటానికి విదేశాలే వెళ్ళి ఉంటే, తిరిగి రావటమో?- నో, నో-ఇదంతా ఊహిస్తున్నదే-
నిజం వేరు-
ఆ నిజం ఇప్పుడర్ధమౌతోనే ఉంది-
అమ్మ చేసింది పొరబాటు.
ఖచ్చితంగా చెప్పాలంటే కాలు జారింది. అలా అనకూడదు, అమ్మగనుక. అదె మరో స్త్రీ అయి ఉంటే, స్పష్టంగ చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడో అమ్మ!
కానీ -
అమ్మకి ఇప్పటికి దాదాపు నలభై ఏళ్ళుంటాయ్. ఇరవై ఏళ్ల కిందట అమ్మ కింతటి స్వాతంత్రం, స్వేచ్చా.....అయి ఉండదు. అపుడెపుడో జరిగినవాటికి అమ్మ రంగులు పూసి రాసిన గాధ ఇది. అందుకే జీవితం అంది !
-ఔను, ఇదంతా అమ్మ జీవితం!!
క్షణం సేపు ఆవేశంలో ఓలలాడి జీవితానికి సరిపడ్డ విషాదాన్ని కొని తెచ్చుకొంది అమ్మ-'అమ్మా, ఇదంతా నీ తప్పు కాదమ్మా-' అంటే - 'తప్పు నిలా ఉన్నా తప్పే!-' అనేది అమ్మ.
మరిన్నాళ్ళూ తనతో ఈ సంగతి ఎందుకు చెప్పకపోయింది? - అంతా కధ లాగే ఉంది. ఎన్నో అడగాలని ఉంది. అడగలేక పోయింది. మౌనంగానూ ఉండలేక పోయింది. అదో స్థితి.
-ఇంత కష్టపడి పెంచిన అమ్మను అమ్మా' అనాలంటే గర్వంగ ఉంది శారదకు. మౌనంగా, మునిపత్నిలాగ గడిపే అమ్మ వెనుక! ఆ తల్లి మనసులో నిండిన మమతానురాగాల వెనుక ఇంతటి అగ్ని పర్వతాలు ఉన్నాయని అయినా ఊహించుకోలేకపోయింది శారద.
మౌనంగ ఉండిపోయింది శారద.
కూతురు మౌనం ఏవిధంగ అర్ధం చేసుకోవాలో తల్లి - ఇందిరకూ అర్ధం కాలేదు. కానీ కానున్నది కాక మావదని మొండిగనే ఉండిపోయింది ఇందిర,
తెల్లగ తెల్లవారిపోయింది.
రోజుకన్న ముందు లేచింది శారద. తల్లి చూస్తుండగనే ముఖం కడుక్కొని తలంటుకొని, తనకెంతో ఇష్టమైన నీలం రంగు, మామిడిపిందెల అంచుపట్టుచీర కట్టుకొంది. తల్లి దగ్గరగ చేరింది. మెల్లగవంగి తల్లి పాదాలకు నమస్కరించింది.
ఇందిర కేమని దీవించాలో పాలుపోలేదు. తను చెప్పిన 'జీవితం'లోని నీఁ ని కూతురు తెలుసుకొందో, ఆ కధను కాల క్షేపానికే విందో అర్ధం గాలేదు.మనసు అడగమని అంటున్నా బలవంతాన మౌనం వహించింది.
శారద వెళ్ళిపోయింది. ఎన్నికలలో ప్రచారానికే అనుకొంది ఇందిర. అరగంటైనా కాలేదు. శారద తిరిగి రానే వచ్చింది.
'అమ్మా, సాయంత్రం ఇంటికి చాల మంది రావచ్చునే!-'
ఇందిర నెమ్మదిగ అంది-'రానీ!-'
'రానీ అని నెమ్మదిగా అనేస్తే సరిపోదు, స్వీటు, హాటు కావాలి. తప్పకుండా!'
ఇందిర చేస్తానని తల ఊపగనే శారద వెళ్ళిపోయింది.
ఈ ఎన్నికలు మంచికే వచ్చాయో, చెడ్డకే వచ్చాయో అని దీర్ఘంగా నిట్టూర్చుకొంది ఇందిర. శారద వచ్చేసరికి నింగి చుక్కలు బైట పడుతున్నాయి.
'అమ్మా-అమ్మా!-'
శారదకోసం బయటకొచ్చింది ఇందిర.
ఎందరినో తెస్తుందనుకొన్న శారద తెచ్చిందొకరినే!-
'అమ్మా ఈ య న పేరు మురళీ మోహన్. మేమిద్దరం ఎల్లుండే పెళ్ళి చేసుకుంటున్నాం మమ్మల్ని దీవించు-" అంది క్లుప్తంగ శారద.
తన కధ చదివి ఇంత చేస్తుందని అనుకోలేదు. అలాగని ఊరికే ఉండలేదు ఇందిర.
తన కాళ్ళకు నమస్కరిస్తున్న ఆ దంపతుల నేలా దీవించాలో ఆలోచిస్తోంది. ఇందిర.
ఆలోచిస్తున్న ఇందిర కళ్ళకు దూరంలో ఎక్కడో ఆకాశం నేలకేసి వంగుతున్నట్లు కనిపించింది. ఆ ఆకాశం నిండా లెక్కలేనన్ని నక్షత్రాలు అప్పుడే తలయెత్త ప్రయత్నిస్తున్నాయి.
ఔను, అవన్నీ ఆకాశ దీపాలు!!
(అయిపోయింది)
